breaking news
-
ఇంత అరాచకమా?.. ‘కూటమి’ మితిమీరిపోతుంది: భూమన
సాక్షి, తిరుపతి: చంద్రబాబు సర్కార్ అరాచకాలు పెరిగిపోతున్నాయని టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. శేఖర్‌రెడ్డి భవనం కూల్చి లోబరుచుకున్నారు. కార్పొరేటర్ డాక్టర్ అనీష్ రాయల్‌ను కూటమి నేతలు బెదిరిస్తున్నారు. 8వ డివిజన్ కార్పొరేటర్ మునిరామిరెడ్డిని బిల్డింగ్ కూల్చి వేస్తామని కూటమి నేతలు బెదిరిస్తున్నారు.‘‘మంత్రి అనగాని సత్య ప్రసాద్ నీచ రాజకీయాలు చేస్తున్నారు. లోకేష్ రాజ్యాంగం రాష్ట్రంలో నడుస్తోందంటూ మంత్రి అనగాని కార్పొరేటర్లను బెదిరిస్తున్నారు. సనాతన ధర్మం కాపాడతానని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ ఎక్కడ ఉన్నారు?. తిరుపతి రాజకీయాలు పవిత్రంగా ఉండటం మీకు ఇష్టం లేదా?. మీ కూటమి నాయకులే మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు పాలన ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు...చంపడం ఒక్కటే మిగిలింది.. కార్పొరేటర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. పోలీసులను కూడా బెదిరిస్తున్నారు. విప్ జారీ చేశాం. విప్ ధిక్కరిస్తే పదవులు కూడా కోల్పోతారు. ఆర్థికపరంగా దెబ్బతీస్తూ.. కార్పొరేటర్లను బెదిరిస్తున్నారు. విప్‌ను ధిక్కరిస్తే కచ్చితంగా కార్పొరేటర్లు పదవులు కోల్పోతారు. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వెళ్తాం. హౌస్ మోషన్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేశాం. డిప్యూటీ మేయర్ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా..వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు పోలీసు భద్రత కల్పించాలని కోరాం’’ అని భూమన తెలిపారు. -
ముద్రగడ నివాసంపై దాడి ఘటన.. పోలీసుల తీరు వివాదాస్పదం
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి నివాసంపై దాడి ఘటనపై పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. ఆయన నివాసంపై దాడి జనసేనకు సంబంధం లేదని ఆ పార్టీ నేతల ప్రకటించారు. అదే ప్రకటనను మీడియా గ్రూపులకు పోలీసు అధికారులు షేర్ చేశారు. దాడి అనంతరం ముద్రగడ నివాసం వద్ద జనసేన కార్యకర్త గంగాధర్ హల్ చల్ చేశాడు.తాను జనసేన పార్టీ అని.. పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా అంటూ ఓవర్ యాక్షన్ చేశాడు. ట్రాక్టర్‌తో ముద్రగడ ఇంటిని దున్నేశానని గంగాధర్ చెప్పాడు. పోలీసుల తీరును జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు తప్పుబట్టారు. జనసేన పార్టీ తరుపున పోలీసులే ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా మారితే భాధితులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? అంటూ కన్నబాబు ప్రశ్నించారు.కాగా, వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటిపై దాడి సంచలనం కలిగించింది. జనసేన కార్యకర్త ట్రాక్టర్‌తో వచ్చి ఆయన ఇంటి వద్ద హల్చల్ చేశాడు. బీభత్సం సృష్టించి ఆయన కారును ధ్వంసం చేశాడు. సదరు యువకుడు ఆదివారం ఉదయం ముద్రగడ నివాసం వద్దకు ట్రాక్టర్ తీసుకుని వచ్చాడు. ఇంటి ముందు ర్యాంప్‌పై పార్క్ చేసిన కారును ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. ఈ క్రమంలో కారు ధ్వంసమైంది. తర్వాత, జై జనసేన అంటూ నినాదాలు చేసుకుంటూ ఓవరాక్షన్ చేశాడు.కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి చేరుకున్న వైఎస్సార్సీపీ నేతలు.. దాడి ఘటనపై ఆరా తీశారు. ముద్రగడను మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పరామర్శించారు. ముద్రగడ నివాసంపై జరిగిన దాడిని వైఎస్సార్సీపీ, కాపు నాయకులు ఖండించారు.ఇదీ చదవండి: నిందితుడిది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటా.. పవన్ నోరు మెదపరేం? -
‘చంద్రబాబు పాలనలో రాయలసీమకు ప్రతిసారీ అన్యాయం’
సాక్షి, అన్నమయ్య జిల్లా: ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలనలో ప్రతిసారీ రాయలసీమకు అన్యాయమే జరుగుతోందని మాజీ చీఫ్ విప్, వైఎస్సార్సీపీ సీనియర్ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. రాయచోటి ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్ట్ ల నుంచి విద్యాసంస్థల ఏర్పాటు వరకు చంద్రబాబు ఏనాడు ఈ ప్రాంత అభివృద్దిపైన చిత్తశుద్దితో వ్యవహరించలేదని ధ్వజమెత్తారు. తాజాగా రాయచోటి పర్యటన సందర్భంగా సీఎం హోదాలో కొత్త విద్యాసంస్థలు, రాయచోటి నీటికష్టాలకు పరిష్కారంను ప్రకటిస్తారని ఆశించిన ప్రజలకు చంద్రబాబు తీవ్ర నిరాశను మిగిల్చారని అన్నారు.శ్రీకాంత్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:చంద్రబాబు నిస్సిగ్గు అబద్ధాలు:చంద్రబాబు అంటేనే చేయాల్సింది చేయడు.. ఇతరులు చేసిందంతా తానే చేసినట్లు ప్రచారం చేసుకోవడం అని అందరికీ తెలుసు. ఈ దేశంలో ఐటీకి తానే మూల పురుషుడుగా, హైదరాబాద్‌కు ఐటీని పరిచయం చేసిన విజనరీగా తనను తాను సిగ్గు లేకుండా పరిచయం చేసుకోవడం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుంది. వాస్తవానికి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తరువాత హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ది చెందింది. గణనీయమైన ఆదాయాన్ని సాధించింది. కానీ చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టేలా తానే ఐటీని కనిపెట్టినట్లు చెప్పుకుంటున్నాడు. చివరికి హైదరాబాద్‌ను సైతం తానే అభివృద్ధి చేసినట్లు చెప్పాడు. నిన్న (శనివారం) ఐటీ ఉద్యోగులను పక్కన పెట్టుకుని రాయచోటిలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు స్ఫూర్తిదాయకంగా మాట్లాడతారని అందరూ ఆశించారు.కానీ చంద్రబాబు చెంత ఉన్న ఐటీ ఉద్యోగులు ‘‘మేం తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డాం, మేం సంపాదించినది పార్టీ కోసం ఖర్చు చేశాం, ఎన్నికల్లో పార్టీ ఏజెంట్లుగా కూర్చున్నాం. గ్రామాల్లో మేమే పార్టీ బాధ్యత తీసుకున్నాం’’ చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. ఈ ప్రాంతానికి సీఎం వచ్చినప్పుడు ఆయన సమక్షంలో ఒక ఐటీ ఉద్యోగి మాట్లాడే అవకాశం లభించినప్పుడు యువతకు స్పూర్తిదాయకమైన మాటలు చెబుతారని అందరూ భావించారు. కానీ దానిని కూడా పార్టీ ప్రచారానికి వాడుకోవడం విడ్డూరంగా ఉంది. దానికి తగినట్లుగా చంద్రబాబు మండల స్థాయిలోనే ఐటీ టవర్స్ నిర్మిస్తాను, వర్క్ ఫ్రం హోంను కూడా తానే కనిపెట్టినట్లు చంద్రబాబు చెప్పే మాటలు వింటే మరింత ఆశ్చర్యం కలిగించింది.స్థానిక సమస్యలపైన ఎందుకు మాట్లాడలేదు?:వైఎస్ జగన్ హయాంలో రాయచోటి ప్రజలకు నీటి కష్టాలు తప్పించేందుకు శ్రీశైలం రిజర్వాయర్ లో నీరు తగ్గిపోయినా కూడా ప్రత్యామ్నాయంగా గండికోటలో నిల్వ చేసిన నీటిని వాడుకునేందుకు ప్రణాళిక సిద్దం చేశాం. కాలేటివాగును ఒక టీఎంసీకి అభివధ్ధి చేసి, అక్కడి నుంచి వెలిగల్లుకు నీటిని పంపించేందుకు వీలుగా పనులకు శ్రీకారం చుట్టాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే డెబ్బై శాతం పనులు కూడా పూర్తి చేశాం. దాని మిగిలిన పనులను పూర్తి చేస్తామని చంద్రబాబు తన పర్యటనలో ఒక్క మాట కూడా చెప్పలేదు.రాయచోటి ప్రాంతానికి వచ్చిన సందర్భంగా ఒక్క విద్యాసంస్థను కూడా ప్రకటించలేదు. మహిళా జూనియర్ కాలేజీ, మహిళా డిగ్రీ కాలేజీ, రెండో ఇంజనీరింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీలను వైఎస్సార్, వైఎస్ జగన్ హయాంలో సాధించుకున్నాం. రాయచోటిలో కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం ఇప్పటికే 80 ఎకరాలు భూమిని కూడా సేకరించి సిద్దంగా ఉంచాం. ఈ కాలేజీని ప్రైవేటీకరించ వద్దంటూ విద్యార్ధులు ప్రశ్నిస్తే, వారిని సంఘ విద్రోహశక్తులు అంటూ నిందిస్తారా? యూనివర్సిటీకి నిధులు, కొత్త కలెక్టరేట్ భవనాలు, గండికోట నుంచి నీటని అందించే ప్రాజెక్ట్ వంటి వాటిపై చంద్రబాబు మాట్లాడతారని అందరూ అనుకున్నారు.కానీ ఎప్పటిలాగానే చంద్రబాబు తన నిజస్వరూపాన్ని చాటుకున్నారు. ఈ ప్రాంత ప్రజలను మోసగించారు. మభ్యపెట్టే మాటలతో ప్రజలను వంచించారు. కర్నూలులో శాశ్వత హైకోర్ట్ కావాలంటే, దానికి బదులుగా బెంచ్ తో సరిపెట్టారు. కొప్పర్తి పారిశ్రామికవాడను ఆనాడు వైయస్ఆర్, ఆ తరువాత వైఎస్ జగన్ ప్రత్యేక సెచ్గా అభివద్ధి చేశారు. దీనిని మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు చంద్రబాబు చొరవ చూపాలి. చేసింది చెప్పాలే కానీ.. జరిగిందంతా తానే చేసినట్లు చెప్పుకోవడం సరికాదు.గ్రామాల్లోనూ నాడు ఐటీకి ప్రాధాన్యం:సీఎంగా వైఎస్ జగన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు పనులు చేసుకోవాలనే ఆలోచనతో గ్రామ స్థాయిలో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దానిని కొనసాగించకుండా చంద్రబాబు ఆ నిర్మాణాలను అర్థాంతరంగా నిలిపివేశారు. ఇప్పుడు మండల స్థాయిలో ఐటీ టవర్స్ నిర్మిస్తానని చెప్పడం చంద్రబాబు రెండు నాలుకల ధోరణికి, ద్వంద వైఖరికి నిదర్శనం.సంపద సృష్టించడం గురించి ప్రజలకు చెప్పడం కాదు, వారు సంపద సృష్టించుకునేలా ప్రభుత్వం పని చేయాలి. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి. కరోనా సమయంలో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ముఖ్యమంత్రిగా ఆదుకున్నది వైఎస్ జగన్. ఈ రోజు అన్ని అవకాశాలు ఉన్నా, కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. ఈ ఎనిమిది నెలల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కోటిన్నర మందికి పైగా అర్హులైన మహిళలు చంద్రబాబు ఇచ్చిన హామీని ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నిస్తున్నారు. యాబై ఏళ్ళు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెన్షన్ ఇస్తామన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు ఇస్తామన్నారు. ఈ ఏడాది రైతుభరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు.సాగునీటి ప్రాజెక్ట్‌లపై అడుగడుగునా నిర్లక్ష్యం:చంద్రబాబు ఏనాడూ తన హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు సీఎంగా ఉన్నా, ఆయన ఏ ప్రాజెక్టూ చేపట్టలేదు. హంద్రీనీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులకు ఎన్టీఆర్ శంకుస్థాపన చేస్తే, తరువాత దానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఆ ప్రాజెక్టులు వృథా అని మాట్లాడారు. హంద్రీనీవా నుంచి 40 టీఎంసీలు రావు. కేవలం 5 టీఎంసీల నీరే వస్తాయని ఏకంగా జీఓ ఇచ్చారు. అలాగే గండికోటను 20 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు కుదించి జీఓ ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తరువాత జలయజ్ఞంలో హంద్రీనీవా ప్రాజెక్ట్‌ను ఐదేళ్లలో అడివిపల్లి వరకు 90 శాతం కాలువ పనులు పూర్తి చేశారు. 27 టీఎంసీల సామర్థ్యంతో కూడిన గండికోట ప్రాజెక్ట్, దానిలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసిన ఘనత వైఎస్ జగన్‌ది. చంద్రబాబు పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా కృష్ణా బ్యారేజీ వద్ద టీడీపీ వారితో ధర్నాలు చేయించారు.ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యం వల్లే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీరు అందుతోంది. ఏడు నెలలు ఇన్ ఫ్లో ఉన్న కష్ణానదిలో ఈ రోజు డెడ్ స్టోరేజీ స్థాయికి నీటిని తోడేశారు. రాయలసమీకు ఎలా నీరు ఇస్తారో చంద్రబాబు చెప్పాలి. గతంలో పట్టిసీమ నుంచి రాయలసీమకు నీరు ఇస్తానంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఎలా ఇస్తారో చెప్పండి అంటే దానిపై మాట్లాడరు.ఇదీ చదవండి: నిందితుడిది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటా.. పవన్ నోరు మెదపరేం?ఇప్పుడు కొత్తగా బనకచర్ల అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. బనకచర్ల క్రాస్ నుంచి సరైన అవగాహన చంద్రబాబుకు లేదు. దీనిని ఎలా పూర్తి చేస్తారో చంద్రబాబు చెప్పగలరా? రాష్ట్ర ప్రజలకు కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు కుదిస్తున్నా చంద్రబాబు మాట్లడటం లేదు. పోలవరం నుంచి కష్ణా బ్యారేజీకి, అక్కడి నుంచి ప్రకాశం జిల్లాకు, అక్కడి నుంచి వెలుగొండ ద్వారా బనకచర్ల క్రాస్ కు నీటిని తరలిస్తారో సరైన ప్రణాళిక ఉందా?ఫీజు పోరు పోస్టర్ ఆవిష్కరణ:మీడియా సమావేశం అనంతరం ఈనెల 5న పార్టీ తలపెట్టిన ఫీజు పోరు పోస్టర్‌ను పార్టీ సీనియర్ నేత ఆకెపాటి అమర్నాథ్రెడ్డితో కలిసి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆకెపాటి అమర్నాధ్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఎనిమిది నెలల పాలనలో ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారు. రైతుసమస్యలు, పెంచిన విద్యుత్ చార్జీలపై వైఎస్సార్సీపీ ఇప్పటికే ఆందోళనలు చేసింది.తాజాగా విద్యార్ధులకు సకాలంలో చెల్లించాల్సిన ఫీజు, స్కాలర్ షిప్ బకాయిలను కూడా చెల్లించకుండా విద్యార్ధుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రతి పేద విద్యార్ధి చదువుకోవాలని ఆనాడు స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి గారు ఫీజు రీయింబర్స్ మెంట్ ను ప్రవేశపెట్టారు. దీనితో ఎందరో ఐటీ నిపుణులుగా, ప్రోఫెషనల్ కోర్స్ లతో తమ జీవితాలను మెరుగుపరుచుకున్నారు. నేడు చంద్రబాబు పేద, మధ్యతరగతి విద్యార్ధుల ఆశలపై నీళ్ళు చల్లుతున్నారు. విద్యార్ధులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్ బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల పక్షాన ఈ నెల అయిదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళలను చేపడుతున్నాం. -
బెదిరించి.. భయపెట్టి.. ‘కూటమి’ ప్రలోభాలు: వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రలోభాలకు గురిచేస్తోందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రలోభాలకు లొంగకపోతే అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుపతిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇంటిని కూల్చేందుకు యత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఎన్నికలు పారదర్శకంగా జరగాలి. ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఎన్నికలు జరగాలి. రాజీనామా చేసి వచ్చిన వారినే పార్టీలో చేర్చుకుంటానని చంద్రబాబు చెబుతున్నాడు. స్థానిక సంస్థలకు ఆ సిద్ధాంతాలు వర్తించవా చంద్రబాబు?. ఎందుకు దొడ్డిదారిన వైఎస్సార్సీపీ పార్టీ నేతలను లాక్కుంటున్నారు. కూటమి నేతలకు అధికార దాహం తీరలేదు. ప్రజల గొంతును వినిపించకుండా చేసేందుకే ఇలా చేస్తున్నారు. మీకు బలం లేనప్పుడు ఎందుకు పోటీ చేస్తున్నారు?’’ అని వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు.బలం లేకపోయినా గెలవాలని చూస్తున్నారు: మల్లాది విష్ణుబలం లేకపోయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దుయ్యబట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి కూటమి దౌర్జన్యాలపై ఫిర్యాదు చేశాం. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదలుపెట్టిన ప్రలోభాలను నేటికీ టీడీపీ కొనసాగిస్తోంది. బలం లేకపోయినా గెలవాలని చూస్తున్నారు. ప్రతీ ఒక్కరికీ ఓటేసే అవకాశం ఇవ్వాలని.. భద్రత కల్పించాలని ఎన్నికల కమిషనర్‌ను కోరాం. పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మా కార్పొరేటర్లు,కౌన్సిలర్లకు భద్రత లేకుండా పోయింది. కూటమి దుష్ట ఆలోచనకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని వెల్లంపల్లి డిమాండ్ చేశారు.భయపెట్టి దాడులు.. ఎన్నికల్లో లబ్ధి పొందాలని టీడీపీ చూస్తోంది: అవినాష్ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు భయపెడుతున్నారు. భయపెట్టి దాడులు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని టీడీపీ చూస్తోంది. పార్టీ మారకపోతే రాత్రికి రాత్రి అభ్యర్థుల ఇళ్ల పై జేసీబీలతో దాడులు చేస్తున్నారు.ఇదీ చదవండి: టీడీపీ ప్రయోజనాలు వేరు.. ఏపీ అవసరాలు వేరు: బొత్సఅలాంటి వారికి త్వరలోనే ప్రజలు బుద్ధిచెబుతారు: మేయర్ రాయన భాగ్యలక్ష్మిరాజకీయ భిక్ష పెట్టిన నాయకులను కాదని కొందరు పార్టీలు మారుతున్నారు. అలాంటి వారికి త్వరలోనే ప్రజలు బుద్ధిచెబుతారు. కూటమి ప్రభుత్వం భయపెట్టి.. ప్రలోభపెట్టి వైసీపీ కార్పొరేటర్లను చేర్చుకుంటున్నారు. ఒక సింబల్ మీద గెలిచిన వారు మరో పార్టీలోకి వెళ్లడం సరికాదునిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలి: ఎమ్మెల్సీ,లేళ్ల అప్పిరెడ్డిరేపు 10 చోట్ల స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం. సంఖ్యా పరంగా ఎక్కడా టీడీపీ గెలిచే అవకాశం లేదు. సంఖ్యాపరంగా బలం లేనప్పుడు ప్రలోభాలు పెట్టడం దేనికి. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో బుల్డోజర్ సంస్కృతి వచ్చింది. మీపార్టీ వైపు లొంగకపోతే ఇళ్లు కూలగొడతారా.. దాడులు చేస్తారా?. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అంటే ఇదేనా చంద్రబాబు?. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలిమీరు చెప్పిన మాట మీకు వర్తించదా చంద్రబాబు?: అంబటి రాంబాబుతిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన అక్రమాల పై ఎన్నికల కమిషన్‌ను కలిశాం. శేఖర్ రెడ్డిని మేం డిప్యూటీ మేయర్‌గా ప్రకటించాం. శేఖర్ రెడ్డిని కూటమి నేతలు బెదిరించారు. శేఖర్ రెడ్డి బిల్డింగ్‌ను దుర్మార్గంగా కూల్చేశారు. రాజీనామా చేసి వస్తేనే పార్టీలో చేర్చుకుంటామని చంద్రబాబు అనేక మార్లు చెప్పారు. కార్పొరేటర్ల విషయంలో మీరు చెప్పిన మాట మీకు వర్తించదా చంద్రబాబు?. మా పార్టీలో గెలిచి పక్కపార్టీలోకి వెళ్లిన వారికి విప్ జారీ చేశాం. -
ఎస్సై ఆత్మహత్యకు ఆ ఫ్యాక్టరీయే కారణం: కారుమూరి
సాక్షి,పశ్చిమగోదావరిజిల్లా:తణుకు రూరల్ ఎస్సై మూర్తి తుపాకీతో కాల్చుకొని చనిపోవడం చాలా బాధాకరమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి అన్నారు. ఈ విషయమై కారుమూరి ఆదివారం(ఫిబ్రవరి2) మీడియాతో మాట్లాడారు. ‘ఆ ఎస్సై చాలా మంచివాడు ధైర్యవంతుడు..కానీ అలా చేసుకోవడం బాధాకరం. దీనంతటికీ మూలకారణం తేతలిలో ఉన్న పశువధ ఫ్యాక్టరీనే అన్నది నూరు శాతం నిజం. కొన్ని నెలల క్రితం గేదెలు దొంగతనం జరిగిన ఘటనలో దొంగను పట్టుకొన్నారు ఎస్సై మూర్తి. గతంలో గేదెలు దొంగిలించినా గానీ దొరికేవి. ఇప్పుడు గేదెలు దొంగిలించిన ఐదు నిముషాల్లోనే తేతలి ఫ్యాక్టరీలో అమ్మేస్తున్నారు. ఫ్యాక్టరీ లోపలికెళ్లిన రెండునిముషాల్లో మాంసానికి మాంసం ఎముకలకు ఎముకలు చర్మానికి చర్మం వేరు చేసేస్తున్నారు.అలా గేదెలు దొంగను పట్టుకొన్నా కానీ అప్పటికే వాటిని ఫ్యాక్టరీలో అమ్మేశాడు. ఆ దొంగ నుంచి ఎమౌంట్ రికవరీ చేసి గేదెలు యజమానికి న్యాయం చేశారు ఎస్సై మూర్తి. గతంలో ఆ ఆరోపణలతో సస్పెండ్ అయినా ఎస్సై మూర్తి మనస్తాపంతో ఇలా బలవన్మరణం చెంది ఉండచ్చు. ఎస్సై ఆత్మహత్యకు కారణమైన పశువధ ఫ్యాక్టరీని ఇప్పటికైనా ఇక్కడి కూటమి ఎమ్మెల్యే మూయించాలి.ఇంకా ఎన్ని ప్రాణాలు బలికొంటారు. అక్కడ ప్రజలు అన్నం కూడా తినలేని పరిస్థితిలో అల్లాడిపోతున్నారు. కానీ ఇక్కడి కూటమి ఎమ్మెల్యే రాధాకృష్ణ ఉత్తర్ ప్రదేశ్ నుంచి వచ్చిన కసాయి వ్యాపారికి కొమ్ముకాస్తున్నాడు. పర్మిషన్లు లేని పశువధ శాలకు పోలీసులతో కాపలాకాయిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాడు.ఆ ఫ్యాక్టరీకి ఎటువంటి పర్మిషన్లు లేవని మేం ఎన్నిసార్లు నిరూపించాలి. ఇక్కడి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు డబ్బే ప్రధానమా ప్రజలు అక్కర్లేదా’అని కారుమూరి ప్రశ్నించారు. -
నిందితుడిది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటా.. పవన్ నోరు మెదపరేం?
సాక్షి,గుంటూరు : ‘వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి చేసిన వ్యక్తి ‘నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా’ అని చెప్పుకుంటున్నాడు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నోరు మెదపాలి’ అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు.ముద్రగడ ఇంటిపై దాడి ఘటన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి చేశారు. ముద్రగడ ఇంటి గేటును ట్రాక్టర్లో ఢీకొట్టి.. పోర్టికోలో ఉన్న కారును ఢీకొట్టారు. ముద్రగడ, ఆయన కుమారుడి ఫ్లెక్సీలు ధ్వంసం చేసి అరాచకం సృష్టించారు.‘‘ఆ వ్యక్తి నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పుకుంటున్నాడు. ఇలాంటి ఘటనలను ప్రోత్సహించడం పిఠాపురం తాలూకా ఎమ్మెల్యేకి సరికాదు. తక్షణం ఈ ఘటనపై పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరువిప్పాలి. ఈ దాడిని ఖండించకపోతే మీరు ఇలాంటి దౌర్జన్యాలను ప్రోత్సహించినవారవుతారు. నివాసాలపైకి వెళ్లి దాడులు చేయడాన్ని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్ చేస్తున్నాం’ అని అంబటి అన్నారు. -
టీడీపీ ప్రయోజనాలు వేరు.. ఏపీ అవసరాలు వేరు: బొత్స
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో టీడీపీ ప్రయోజనాలు వేరు, రాష్ట్ర అవసరాలు వేరు అనేది స్పష్టమైందన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. బడ్జెట్ సందర్భంగా గురజాడ పేరు ప్రస్తావించడం తప్ప రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌తో బీహార్ ప్రయోజనం పొందిందని తెలిపారు. బడ్జెట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూసిన ఏపీ ప్రజలకు ఆత్మ ఘోష మిగిలింది అంటూ ఆవేదన వ్యకం చేశారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘బడ్జెట్లో రాష్ట్రానికి ఏదో కేటాయిస్తారని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూశారు. మహాకవి గురజాడ పేరును తలుచుకోవడం మనందరికీ గర్వకారణం. గురజాడ పేరు ప్రస్తావించడం తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. బడ్జెట్లో రాష్ట్రానికి నిరాశ, నిస్పృహ కనిపించాయి. బడ్జెట్ ద్వారా ప్రత్యేక ప్రయోజనమేమీ రాష్ట్రానికి కనిపించలేదు. బడ్జెట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూసిన ప్రజలకు ఆత్మ ఘోష మిగిలింది.కేంద్రంలో 12 మంది నితీష్ కుమార్ ఎంపీలు, 16 మంది టీడీపీ ఎంపీల సహకారంతో ప్రభుత్వం నడుస్తోంది. బడ్జెట్‌తో బీహార్ రాష్ట్రం ప్రయోజనం పొందింది. ఏపీకి ఎటువంటి ప్రయోజనం పొందలేదు. రాష్ట్రంలో టీడీపీ ప్రయోజనాలు వేరు, రాష్ట్ర అవసరాల వేరు అనేది స్పష్టమైంది. 45.72 మీటర్లు నుంచి 41.15 మీటర్ల ఎత్తుకు కుదిస్తూ నిధులు కేటాయించడం బాధాకరం. పోలవరం ఎత్తు తగ్గించడం వలన ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుంది.మేధావులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాము. పోలవరం ఎత్తు తగ్గించడం తీవ్ర అభ్యంతరకరం. ప్రత్యేక హోదాను కాదని ప్యాకేజీని చంద్రబాబు తీసుకున్నారు. నేడు అవకతవకలు జరిగితే చర్యలు తీసుకోవాలి. ప్రజలకు నష్టం జరిగేలా చర్యలు ఉండకూడదు. కూటమి పాలనలో కంటే వైఎస్ జగన్ పాలనలో జీడీపీ, వృద్ధిరేటు అభివృద్ధి ఎక్కువగా జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం అడగాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా?. ఎన్నికలకు ముందు సంపద సృష్టించడం తెలుసు అన్నారు. ఎన్నికల తర్వాత డబ్బు సంపాదించడం ఎలాగో నా చెవిలో చెప్పాలని చంద్రబాబు చెప్పడం ధర్మమా.?స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చంద్రబాబు ఎందుకు చెప్పలేక పోయారు. ప్లాంట్‌పై బడ్జెట్లో ఎందుకు మాట్లాడలేదు. రైతుభరోసా, అమ్మఒడి ఇవ్వలేదు. రాజకీయాల్లో విశ్వసనీయత అవసరం. చంద్రబాబు ఇచ్చే హామీలు సాధ్యం కాదని ముందే వైఎస్ జగన్ చెప్పారు. వైఎస్ జగన్ సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తోంది. వైఎస్సార్సీపీ హయాంలో గ్రీన్ ఎనర్జీ, బల్క్ డ్రగ్ పార్క్ వచ్చింది. వైఎస్ జగన్ పాలనలో ఒప్పందం కుదుర్చుకున్నారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, బల్క్ డ్రగ్ పార్క్ కోసం అనేక సార్లు సంప్రదింపులు జరిపాము. వైఎస్ జగన్ వలనే ప్రైవేటీకరణ అగిందని కేంద్ర మంత్రి కుమార స్వామి స్వయంగా చెప్పారు అని గుర్తు చేశారు. -
పవన్‌ను ప్రశ్నిస్తున్నా.. కూటమి ఎంపీలకు సిగ్గులేదా?: చలసాని
సాక్షి, విజయవాడ: ఆంధ్రుల జీవ నాడి పోలవరాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్. గతంలో ఎంపీలంతా ఏం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇప్పుడు పవన్‌ను మేము ప్రశ్నిస్తున్నాం.. కూటమి ఎంపీలకు సిగ్గు, శరం లేదా?. కూటమి ఎంపీలు కేంద్రానికి చిడతల భజన చేసుకోండి అంటూ ఘాటు విమర్శలు చేశారు.ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..‘తెలుగు వారి ఆత్మగౌరవం మరో మారు ఢిల్లీలో తాకట్టుపెట్టారు. ఆంధ్రుల జీవ నాడి పోలవరాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోంది. 41.5 ఎత్తులో మీటర్లకు నీటిని పరిమితం చేయడం అన్యాయం. 155 అడుగుల ఎత్తున నీటి నిల్వ ఉంటేనే ప్రాజెక్టు ప్రయోజనం ఉంటుంది. ఎంపీలంతా ఏం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గతంలో ప్రశ్నించారు. పవన్‌ను మేం ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం.. కూటమి ఎంపీలకు సిగ్గు, శరం లేదా?.వైఎస్ జగన్ కేంద్రం ఒత్తిడికి తలొంచి ఉంటే 12,500 కోట్లు పోలవరానికి ఎప్పుడో వచ్చేవి. కానీ, పోలవరానికి అన్యాయం జరగకూడదని జగన్ ఒప్పుకోలేదు. కేంద్రంలో చంద్రబాబు ప్రభావమేమీ లేదు. కూటమి ఎంపీలు కేంద్రానికి చిడతల భజన చేసుకోండి. దమ్ముంటే కేంద్రాన్ని ప్రశ్నించేందుకు మాతో కలిసి రండి. పోలవరం హక్కులను సాధించుకోలేకపోతే మీరంతా ఆంధ్రా ద్రోహులుగా మిగిలిపోతారు. అమరావతి విషయంలో కూటమి నేతలు ఎందుకు స్వీట్లు పంచుకుంటున్నారో అర్ధం కావడం లేదు. అమరావతికి 15వేల కోట్లు ముష్టివేశారు. ప్రపంచబ్యాంకు షరతులకు తలొగ్గి అమరావతికి అప్పు తెచ్చారు.ఉత్తర భారత అహంకారం నశించాలన్న మాటలు పవన్ కళ్యాణ్ మర్చిపోయారా?. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ పవన్ గొంతు చించుకున్నారు. యువతకు అన్యాయం జరుగుతుంటే పవన్ ఎందుకు మాట్లాడటం లేదు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్నవాళ్లు ఆంధ్రా ద్రోహులే. ఉత్తర భారత బీజేపీ పార్టీ మనకు తీరని ద్రోహం చేస్తోంది. తెలుగు జాతి ఇప్పటికైనా మేలుకోవాలి’ అంటూ కామెంట్స్ చేశారు. -
కార్పోరేటర్లు, కౌన్సిలర్లకు వైఎస్సార్సీపీ విప్ జారీ
విజయవాడ: ఏపీలో పలుచోట్ల వివిధ కారణాలతో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టీడీపీ(TDP) ప్రలోభాలకు తెరలేపింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన వైఎస్సార్సీపీ(YSRCP).. పార్టీకి చెందిన కార్పోరేటర్లు, కౌన్సిలర్లకు విప్ జారీ చేసింది. రేపు(సోమవారం) రాష్ట్రంలోని పలు చోట్ల డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగునున్నాయి .ఈ తరుణంలో ఓటుకు నోటు వ్యవహారానికి తెరలేపింది టీడీపీ. కార్పోరేటర్లు, కౌన్సిలర్లకు డబ్బులిచ్చి లోబర్చుకుంటుంది టీడీపీ. కొన్ని చోట్ల బెదిరింపులకు సైతం ాపాల్పడుతోంది టీడీపీ. ఈ ేనేపథ్యంలో వైఎస్సార్ీపీ విప్ జారీ చేసింది. సోమవారం(03-02-2025) తిరుపతి, ెనెల్లూరు, ఏలూరు కార్పోరేషన్లకు డిప్యూటీ మేయర్ ఎన్నికలతో పాటు, నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ల ఎంపిక కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్ల మున్సిపాలిటీలకు వైస్ చైర్పర్సన్ కోసం ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో వీటిని ఎలాగైనా చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో టీడీపీ ప్రలోభాలకు తెరలేపింది. -
కూటమి కార్యకర్త హల్చల్.. ముద్రగడ ఇంటిపై దాడి
సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి పాలనలో పచ్చ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. ఓ వ్యక్తి ట్రాక్టర్‌తో వచ్చి ఆయన ఇంటి వద్ద హల్చల్ చేశాడు. బీభత్సం సృష్టించి ఆయన కారును ధ్వంసం చేశాడు.వివరాల ప్రకారం.. వైఎస్సార్సీపీ ముద్రగడ పద్మనాభ రెడ్డి నివాసం వద్ద జనసేన కార్యకర్త హల్చల్ చేశాడు. సదరు యువకుడు ఆదివారం ఉదయం ముద్రగడ నివాసం వద్దకు ట్రాక్టర్ తీసుకుని వచ్చాడు. అనంతరం, అక్కడ బీభత్సం సృష్టించాడు. ఇంటి ముందు ర్యాంప్‌పై పార్క్ చేసిన కారును ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. ఈ క్రమంలో కారు ధ్వంసమైంది. తర్వాత, జై జనసేన అంటూ నినాదాలు చేసుకుంటూ ఓవరాక్షన్ చేశాడు.అనంతరం, ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన దాడిని పరిశీలించారు. ఈ క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు, ముద్రగడ అభిమానులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
టీడీపీ నేతల దందా.. ఐదు కోట్ల స్థలం హాంఫట్!
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంలో కూటమి ప్రభుత్వానికి చెందిన టీడీపీ నాయకుల తీరు అడ్డగోలుగా ఉంది. చోటామోటా నాయకుని మొదలు పెద్ద స్థాయి నాయకుని వరకు తమకు ఎదురులేదన్నట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం అవినీతి అక్రమాలకు పాల్పడే పనిలోనే ఉంటున్నారు. తాజాగా కలెక్టర్ బంగ్లాకు కిలోమీటరు దూరంలోనే కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టారు. టీడీపీ నాయకులే కొలతలు వేసుకుని ప్లాట్లుగా విభజించుకొని కర్రలు పాతారు. ఆ తర్వాత శాశ్వతంగా ఉండే విధంగా సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేశారు.ప్రస్తుతం ఏకంగా బేరం పెట్టి విక్రయించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పనులన్నీ చకచకా చేసుకుంటూ పోతున్నారు. ఇంత జరుగుతున్నా ఒంగోలు రెవెన్యూ అధికారులు మాత్రం ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అంటే.. టీడీపీ నాయకులకు భయపడి పట్టించుకోవడం లేదా.? లేకుంటే ఇప్పటికే జేబులు నింపుకుని నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మార్కెట్ విలువ 10 కోట్ల పైనే..ఒంగోలు నగరంలో అగ్రహారం రైల్వే గేటు దాటగానే బాలాజీనగర్, ఆ తర్వాత దత్తాత్రేయకాలనీ వస్తుంది. దత్తాత్రేయకాలనీ ఎదురుగా సర్వే నంబర్–81లో ప్రభుత్వానికి చెందిన 1.36 ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది. ఈ భూమి విలువ ప్రైవేటుకు చెందిన రిజిస్ట్రేషన్ స్థలమైతే మార్కెట్లో దాదాపు రూ.10 కోట్లకుపైనే ఉంది. ప్రభుత్వానికి చెందిన అసైన్మెంట్ స్థలం కావడంతో ప్రస్తుత మార్కెట్లో ఒక్కో గది రూ.55 వేల నుంచి రూ.70 వేల వరకు ఉంది. దాదాపు 816 గదుల స్థలం కావడంతో సరాసరిన ఒక్కో గదికి రూ.60 వేలు వేసుకున్నా.. సుమారు రూ.5 కోట్లు ఉంటుంది. ఇంత ఖరీదైన ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా టీడీపీ నేతలు కబ్జా చేసి మూడునాలుగు రోజులుగా ప్లాట్లు వేసుకుని ఏకంగా పిల్లర్లు వేసి నిర్మాణాలు చేపడుతున్నారంటే.. తెరవెనుక పెద్ద తతంగమే నడిచి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.స్థానిక ఎమ్మెల్యే దామచర్ల హస్తం?కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని టీడీపీ నాయకులు కబ్జా చేయడం వెనుక ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనే ప్లాట్లు వేసుకోమన్నాడంటూ ఒంగోలు నగర పాలక సంస్థలోని 16వ డివిజన్‌కు చెందిన టీడీపీ నాయకుడు, స్థానిక కార్పొరేటర్ శ్రీరామ్ నాగభూషణం అండతో తెలుగు తమ్ముళ్లు ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసి నేరుగా ప్లాట్లు వేసుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే ప్రమేయం ఉండటంతోనే రెవెన్యూ అధికారులుగానీ, మండల సర్వేయర్గానీ, ఒంగోలు నగర పాలక సంస్థ సర్వేయర్గానీ కనీసం ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదని తెలుస్తోంది. స్థానికంగా ఉన్న టీడీపీ డివిజన్ అధ్యక్షుడు ఉంగరాల రమణయ్య, ఆ పార్టీ నాయకులు పాదర్తి శింగయ్య, మాదాసు చంద్ర, కర్రి వాసు, సీహెచ్ సురేష్‌తో పాటు మరికొంతమంది కలిసి ప్లాట్లు వేసుకుని అమ్ముకుంటున్నట్లు సమాచారం. మామిడిపాలేనికి చెందిన ఒక పాస్టర్కు 50 గదులను ఒక్కో గదిని రూ.60 వేల చొప్పున విక్రయించినట్లు కూడా తెలిసింది. స్థలం కొనుగోలు చేసిన పాస్టర్ ఆగమేఘాలపై పిల్లర్లు వేసేందుకు అవసరమైన బాక్సులు తెప్పించి ఏకంగా స్థలం చుట్టూ ప్రహరీ గోడకు పిల్లర్లు కూడా పూర్తి చేసుకున్నాడు. ఆ పిల్లర్ల మధ్యలో పునాధులు తీసి ప్రహరీ నిర్మించడమే తరువాయి.టీడీపీ వస్తే ఇలానే.. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా సర్వే నంబర్–81లో స్థలాన్ని కబ్జా చేసి గుడిసెలు కూడా వేశారు. అప్పట్లో ఒంగోలు తహసీల్దార్ చిరంజీవి రంగంలోకి దిగి అక్రమంగా వేసిన గుడిసెలను పూర్తిగా తొలగించారు. ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు కూడా పెట్టారు. ఆ తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎవరూ ఆ స్థలం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం రాగానే ఆ పార్టీ నాయకుల కళ్లు ఖరీదైన ప్రభుత్వ స్థలంపై పడ్డాయి. ఇంకేముంది.. అనుకున్నదే తడవుగా పాగా వేసేశారు. జేబుల్లో కోట్ల రూపాయలు నింపుకుంటున్నారు. విచారించి చర్యలు తీసుకుంటాం.. నున్నా సురేష్, వీఆర్ఓ, బాలాజీ నగర్ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని సమాచారం అందడంతో కట్టడాలు చేస్తున్న వారిని ప్రశ్నించాను. ప్రభుత్వం నలుగురికి పట్టాలు మంజూరు చేసిందని, ఆ నాలుగు పట్టాలకు సంబంధించిన స్థలంలో చర్చి నిర్మిస్తున్నామని తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారించి ఉన్నతాధికారులకు తెలియజేస్తా. -
పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే ఎందుకు పరిమితమైంది?: బుగ్గన
కర్నూలు (టౌన్): పోలవరం ప్రాజెక్టుకు తీరని నష్టం చేకూరడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం కాదా అని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. గతంలోనూ ఆయన చేతగానితనం, పొరపాట్ల కారణంగా ఈ ప్రాజెక్టుకు ఎంతో నష్టం జరిగిందని.. ఇప్పుడు మళ్లీ ఆయన నిర్లక్ష్యంతో ప్రాజెక్టుకు పెనుముప్పు ఏర్పడుతోందన్నది నిజం కాదా అని నిలదీశారు. 2025–26 కేంద్ర బడ్జెట్‌ను శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో బుగ్గన కర్నూలులో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ అనేక ప్రశ్నలు సంధించారు. ఆయన ఏమన్నారంటే.. పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుతోనే పూర్తిచేసేందుకు రూ.5,936 కోట్లు ఇస్తామని కేంద్ర బడ్జెట్లో చెప్పారు. వాస్తవానికి.. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిoచాల్సి ఉంది. ఆ విధంగా నిరి్మస్తేనే పోలవరం ద్వారా 200 టీఎంసీల నీరు లభిస్తుంది. దీనివల్ల కృష్ణా, గోదావరి జిల్లాల్లోని లక్షలాది ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, కొత్త ఆయకట్టుకు నీరు లభిస్తుంది. అలాగే, 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి, విశాఖ నగరానికి, 600 గ్రామాలకు తాగునీరు అందుతుంది. ఈ ప్రయోజనాలు చేకూరాలంటే 150 అడుగుల మేర నిర్మిస్తేనే సాధ్యపడుతుంది. అయితే, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకే ఎందుకు పరిమితం చేస్తున్నారు. దీనిని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి తెలీకుండానే కేంద్రం పోలవరం ఎత్తును 41.15 అడుగులకు ఖరారు చేస్తుందా? నిజానికి.. 2017–18లో చంద్రబాబు ప్రభుత్వం అలాంటి పొరపాటే చేస్తే దానిని సరిదిద్దుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి నాలుగేళ్లు పట్టిన విషయం నిజం కాదా? ఇక రూ.12,500 కోట్లు సాధించామని చంద్రబాబు చెబుతున్నారు. ఇది మా ప్రభుత్వం సాధించింది కాదా!? ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా పోలవరం ఎత్తుపై వివరణ ఇచ్చాం. తొలి ఏడాది 41.15 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేపట్టి నీటిని నిల్వచేస్తామని చెప్పాం కదా.. తర్వాత రెండేళ్లలో నీటినిల్వ పెరుగుతున్న కొద్దీ ముంపు ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టి ప్రాజెక్టు ఎత్తున 45.72 మీటర్లకు పెంచుతామని చెప్పాం. ఇది ప్రాజెక్టు మాన్యువల్‌లోనూ ఉందా లేదా!? కానీ, ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం అవేమీ లేకుండానే పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుతోనే పూర్తిచేస్తామని బడ్జెట్లో రాయించుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తక్షణం దీనిపై కేంద్రానికి క్లారిటీ ఇవ్వకపోతే పోలవరం ప్రాజెక్టుకు, రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం జరుగుతుంది. ఇదిలా ఉంటే.. బడ్జెట్ కాపీలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి.. ‘నిర్మాణం’ అన్న పదానికి బదులు ప్రాజెక్టు పూర్తి (కంప్లీషన్)కి అని ఎందుకు పేర్కొన్నారు? దీని వెనకున్న మతలబు ఏంటి? ఇకపోతే.. రాష్ట్రంలో నాలుగు పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి. వాటికీ ఎందుకు నిధులు కోరలేదు? 16 మంది టీడీపీ ఎంపీలున్నా బాబు ఎందుకు విఫలమయ్యారు? ఇక ఎన్డీఏ కూటమిలో 16 మంది టీడీపీ ఎంపీలున్నా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో.. నిధులు రాబట్టడంలో సీఎం చంద్రబాబు ఎందుకు ఘోరంగా విఫలమయ్యారు? ఈ విషయంలో ఆయన ఏమాత్రం చొరవ చూపలేదన్నది నిజం కాదా? వాస్తవానికి.. టీడీపీ మద్దతుతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోంది. ఆ పార్టీకి 16 మంది ఎంపీలూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలోనూ టీడీపీ కొనసాగుతోంది కదా! అయినా కేంద్ర బడ్జెట్ నుంచి ఏపీకి చంద్రబాబు ఎందుకు నిధులు సాధించలేకపోయారు? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడంలో చంద్రబాబు అసమర్థుడిగా నిలిచారా లేదా? ఇక గతంలో వైఎస్సార్సీపీకి 23 మంది ఎంపీలున్నారని, కేంద్రం నుంచి ఎక్కువ నిధులు దక్కించుకోవడంలో విఫలమవుతున్నారంటూ చంద్రబాబు పదేపదే విమర్శించారు కదా! నిజానికి.. అప్పుడు కేంద్రానికి వైఎస్సార్సీపీ మద్దతు అవసరంలేదు. కానీ, ప్రస్తుతం టీడీపీ మద్దతుపై కేంద్రం ఆధారపడి ఉంది. దీనిని వినియోగించుకుని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పెద్దఎత్తున నిధులు తెచ్చుకునే స్థితిలో చంద్రబాబు ఉన్నా ఇప్పుడాయన ఎందుకు విఫలమయ్యారు? అదే కేవలం 12 మంది ఎంపీలతోనే బిహార్ రాష్ట్రం ఎక్కువ నిధులు సాధించి బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత ఎలా దక్కించుకుంది? ఇటీవల నీతి ఆయోగ్ నివేదికపై మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. తలసరి ఆదాయంపై ఆయన విశ్లేషణను చూసి ఒక ఎన్ఆర్ఐ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. సీఎం లెక్కల్లోని తప్పులను ఎత్తిచూపారు. 2018–19లో ఏపీలో తలసరి ఆదాయం రూ.1.54 లక్షలు ఉంటే 2022–23లో రూ.2.20 లక్షలకు చేరింది. చంద్రబాబు హయాం కంటే జగన్ హయాంలో తలసరి ఆదాయం పెరిగింది నిజమా కాదా? సీఎంగా ఉన్న వ్యక్తే తప్పుడు లెక్కలు చెబితే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారా? వైఎస్సార్సీపీ విధానాలే కేంద్రంలోనూఇక వైఎస్ జగన్ హయాంలో అమలుచేసిన విద్యా ప్రమాణాల పెంపు విధానాలనే నేడు కేంద్రం అనుసరిస్తోంది. సెకండరీ, ప్రైమరీ పాఠశాలలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ రాబోతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటుచేసి బ్రాడ్‌బాండ్ సర్విస్ అందించాం. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశాం. టీడీపీ, ఎల్లో మీడియా దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి. రాబోయే ఐదేళ్లలో దేశంలో 75 వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తున్నట్లు బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది కదా.. అందులో భాగంగా ఈ ఏడాది 10 వేల సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు కదా.. ఆనాడు మెడికల్ సీట్ల ఆవశ్యకతను మాజీ సీఎం జగన్ గుర్తించి రాష్ట్రంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టి గత ఏడాది ఐదింటిని ప్రారంభించారు. దీనివల్ల 750 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయా లేదా? అన్ని కళాశాలలు పూర్తయితే 2,450 సీట్లు దక్కేవి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ సీట్ల సాధనలో ఎందుకు చొరవ చూపట్లేదు? రాష్ట్ర విద్యార్థులకు ఎందుకు ఇంతలా నష్టం చేకూరుస్తున్నారు?. -
కూటమి ప్రభుత్వ అరాచకాలకు అవధుల్లేవు: భూమన
సాక్షి,తిరుపతి:కూటమి సర్కార్ ఆదేశాలతో అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. శనివారం(ఫిబ్రవరి1) తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో భూమన మాట్లాడారు. ‘అధికారులు కూటమి నేతల డైరెక్షన్లో పనిచేస్తున్నారు. సుప్రీం నిబంధనలను అధికారులు పాటించాలి. తిరుపతి పట్టణంలో కూటమి ప్రభుత్వ అరాచకాలకు అవధులు లేకుండా పోతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ తరపున డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా శేఖర్‌రెడ్డిని ప్రకటిస్తే అతడి ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలు సైతం ధిక్కరిస్తూ మేయర్ చూస్తుండగానే కట్టడాలు కూల్చి వేశారు. డిప్యూటి మేయర్ అభ్యర్థి శేఖర్‌రెడ్డిని లొంగి పోయేలా చేశారు. మీకు సత్తా లేక, మెజారిటీ లేక, మా పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కొనుగోలు చేశారు. గపూర్, లక్ష్మన్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఇళ్లు ధ్వంసం చేశారు. తిరుమలలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల వ్యాపార సముదాయాలు బెదిరింపులకు పాల్పడ్డారు. మా పాలనలో ఏ రోజు విధ్వంసం చేయలేదు. ప్రత్యర్థుల ఆస్తులు విధ్వంసానికి పాల్పడటం అనే సంస్కృతి కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన అదేశాలు సైతం ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కూల్చివేతలకు 45 రోజుల ముందు షోకాజ్ నోటీసులు ఇవ్వాలి, కలెక్టర్‌కు మెయిల్ చేయాలి.కూల్చివేతలకు మూడు నెలల ముందు నోటీసులు ఇవ్వాలి. 15 రోజుల ముందు అప్పీలు నోటీసులు ఇవ్వాలి. కూల్చివేతల వీడియో, ఫొటోలు తీయాలి. నగర ప్రథమ మహిళ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ఆస్తులు ధ్వంసం చేశారు. ఈ అంశంపై మేయర్ సుప్రీంకోర్టుకు వెళ్తారు, కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై పోరాటం చేస్తాం. బీజేపీ నాయకులు, టీడీపీ నేతల అక్రమ కట్టడాల జోలికి వెళ్లకుండా వైఎస్సార్సీపీ నాయకుల ఆస్తుల విధ్వంసానికి దిగారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శేఖర్ రెడ్డి పోటీ నుంచి విరమించుకుంటే లడ్డు భాస్కర్‌రెడ్డి డిప్యూటి మేయర్ అభ్యర్థిగా పోటీలో ఉంటారు. తిరుపతి వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలు 70 మందిని ఇప్పటివరకు అరెస్టు చేశారు. ఇలాంటి దుశ్చర్యలు చేస్తే మీకు తగిన బుద్ధి చెబుతాం. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే దీనికి పదింతలు బదులు తీర్చుకుంటాం. గత పదేళ్ళలో ఏ రోజు మేం కూటమి నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేయలేదు. చంద్రబాబు దాష్టిక పాలనపై ప్రజలు తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారు. సూపర్ సిక్స్ హామీలు గాలికి వదిలేశారు. ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీని పాతాళానికి తొక్కివేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’అని భూమన అన్నారు. -
బడ్జెట్లో అన్యాయం.. ఏపీకి చంద్రబాబు ఏం తీసుకొచ్చారు?: బుగ్గన
సాక్షి, కర్నూలు: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు నిధులు రాబట్టడంలో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆక్షేపించారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 12 మంది ఎంపీలతోనే బీహార్ కేంద్ర బడ్జెట్లో సింహభాగం నిధులను సాధించగలిగిందని, 16 మంది ఎంపీలు ఉన్నా, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడంలో సీఎం చంద్రబాబు అసమర్థుడిగా నిల్చారని గుర్తు చేశారు. చివరకు రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవం ప్రాజెక్టు ఎత్తుపైనా సీఎం రాజీపడుతున్నారని, దీని వల్ల చాలా నష్టం జరుగుతుందని కర్నూలులో మీడియాతో మాట్లాడిన బుగ్గన ధ్వజమెత్తారు.బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:చంద్రబాబు దారుణ వైఫల్యం:ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో సీఎం చంద్రబాబు దారుణంగా విఫలమయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఆయన ఏ మాత్రం చొరవ చూపలేకపోయారు. ఫలితంగా ఈ బడ్జెట్లో కేంద్రం మన రాష్ట్రానికి దాదాపు మొండిచేయి చూపింది. నిజానికి టీడీపీ మద్దతులో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోంది. ఆ పార్టీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. ప్రభుత్వంలోనూ టీడీపీ కొనసాగుతోంది. అయినా కేంద్ర బడ్జెట్ నుంచి ఏపీకి ఏ మాత్రం నిధులు దక్కించుకుందని చూస్తే తీవ్ర నిరాశే కనిపిస్తోంది.నాడు వైఎస్సార్సీపీపై నిందలు:గతంలో కేంద్ర బడ్జెట్ సందర్భాల్లో.. వైయస్సార్సీపీకి 23 మంది ఎంపీలు ఉన్నారు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు దక్కించుకోవడంలో విఫలమవుతున్నారంటూ చంద్రబాబు పలుసార్లు పెద్ద ఎత్తున విమర్శించారు. అయితే అప్పుడు కేంద్రానికి మా సీట్లతో, మా మద్దతుతో ఏ మాత్రం అవసరం లేని పరిస్థితి ఉంది. కానీ నేడు కేంద్రానికి ఎపీకి చెందిన ఎంపీల మద్దతు చాలా కీలకం. దీన్ని వినియోగించుకుని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకునే స్థితిలో టీడీపీ ఉంది. కేవలం 12 మంది ఎంపీలు ఉన్న జేడీయూ బీహార్ రాష్ట్రానికి ఎన్నో సాధించగలిగితే, 16 సీట్లు ఉన్న తెలుగుదేశం పార్టీ ఇంకెంత సాధించాలి? కానీ ఈ విషయంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు.పోలవరం ప్రాజెక్టుకూ నష్టం:పోలవరం ప్రాజెక్ట్‌ను 41.15 మీటర్ల ఎత్తుతోనే పూర్తి చేసేందుకు రూ.5,936 కోట్లు ఇస్తామని కేంద్ర బడ్జెట్లో చెప్పారు. వాస్తవానికి పోలవరం ప్రాజెక్ట్‌ను 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించాల్సి ఉంది. అలా నిర్మిస్తేనే పోలవరం ద్వారా 200 టిఎంసీల నీరు లభిస్తుంది. ఈ నీటి వల్ల కృష్ణా, గోదావరి జిల్లాల్లోని కొన్ని లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ, కొత్త ఆయకట్టుకు నీరు లభిస్తుంది. అలాగే 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, విశాఖ నగరానికి తాగునీరు, 600 గ్రామాలకు నీరు అందుతుంది.ఇన్ని ఉపయోగాలు అందాలంటే 150 అడుగుల మేర నిర్మిస్తేనే సాధ్యపడుతుంది. కానీ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నారు. దీన్ని కూటమి ప్రభుత్వం అంగీకరిస్తోందా? కూటమి ప్రభుత్వానికి తెలియకుండానే పోలవరం ఎత్తు 41.15 అడుగులే అని కేంద్రం ఎలా ఖరారు చేస్తుంది? నాడు 2017–18లో చంద్రబాబు ప్రభుత్వం అలాంటి పొరపాటే చేస్తే, దాన్ని సరిదిద్దేందుకు మా ప్రభుత్వానికి నాలుగేళ్ళు పట్టింది. ఈరోజు గొప్పగా రూ.12,500 కోట్లు కేంద్రం ద్వారా వచ్చిందని చంద్రబాబు చెబుతున్నారు. అది మా ప్రభుత్వం సాధించినదే. ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా పోలవరం ఎత్తుపై వివరణ ఇచ్చాం. తొలి ఏడాది 41.15 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేపట్టి నీటిని నిల్వ చేస్తాం, తరువాత రెండేళ్లలో నీటి నిల్వ పెరుగుతున్న కొద్దీ ముంపు ప్రాంతాల్లో భూసేకరణ చేసుకుంటూ పోయి, ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్లకు పెంచుతామని చెప్పాం. అంటే పోలవరం ప్రాజెక్టు పనులను రెండు దశల్లో.. ఒకటి 41.15 మీటర్లు, రెండో దశలో 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని నిర్ణయించడం జరిగింది.అది ప్రాజెక్టు మాన్యువల్‌లోనూ ఉంది. కాగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అవేమీ లేకుండా పోలవరం ప్రాజెక్ట్‌ను 41.15 మీటర్ల ఎత్తుతోనే నిర్మాణం పూర్తి కోసం అంటూ బడ్జెట్లో రాయించుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తక్షణం దీనిపై కేంద్రానికి క్లారిటీ ఇవ్వకపోతే పోలవరం ప్రాజెక్ట్‌కు, రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం జరుగుతుంది. రాష్ట్రంలో నాలుగు పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి. వాటికి కూడా నిధులు కోరలేదు? ఈ విషయంలోనూ కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారు.బీహార్‌కు అత్యధిక ప్రాధాన్యం:టీడీపీ కంటే తక్కువగా 12 మంది ఎంపీలు మాత్రమే ఉన్న జేడీయూ, తమ రాష్ట్రం బీహార్‌కు ఈ బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యం దక్కించుకుంది. బీహార్‌లో మఖనా బోర్డ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లు, పాత పాట్నా ఎయిర్పోర్ట్ విస్తరణ, మిథులాంచల్కు చెందిన కోషీ కెనాల్ అభివృద్ధి, పాట్నా ఐఐటీ అభివృద్ధికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు. బీహార్‌కు సంబంధించి గత బడ్జెట్లో పూర్వోదయ ప్రాంతంలోని గయలో అమృత్సర్–కోల్కత్తా పారిశ్రామికవాడ, పాట్నా పూర్ణియా ఎక్స్‌ప్రెస్‌వే, బక్సర్–బగల్పూర్ ఎక్స్‌ప్రెస్ వే, బోద్ గయా–రాజ్ ఘీర్–వైశాలీ–దర్భాంగ, బక్సర్‌లో గంగానదిపై రూ.26 వేల కోట్లతో రెండు లైన్ల వంతెన సాధించుకున్నారు. అలాగే 2400 మెగావాట్ల పీర్ పాంటీ పవర్ ప్రాజెక్ట్స్‌కు రూ.21,400 కోట్లు సాధించుకున్నారు. కొత్త మెడికల్ కాలేజీలు, ఎయిర్ పోర్ట్స్, బీహార్‌లో శాశ్వతమైన నిర్మాణ పనులకు క్యాపిటల్ వ్యయం కోసం కేంద్రం నుంచి సాయం దక్కించుకున్నారు. టీడీపీ మాదిరిగా జేడీయూ కూడా ఎన్డీఏలో భాగస్వామి. టీడీపీ కంటే ఆ పార్టీకి తక్కువ మంది ఎంపీలు. అయినా బడ్జెట్లో అధిక శాతం నిధులు దక్కించుకుంది.తలసరి ఆదాయంపైనా చంద్రబాబు తప్పుడు లెక్కలు:ఇటీవల నీతి అయోగ్ నివేదికపై మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు తలసరి ఆదాయంపై చెప్పిన విశ్లేషణను విన్న ఒక ఎన్ఆర్ఐ.. చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన సీఎం లెక్కల్లోని తప్పులను ఎత్తి చూపారు. 2018–19లో ఏపీలో తలసరి ఆదాయం రూ.1.54 లక్షలు ఉంటే 2022–23 నాటికి రూ.2.20 లక్షలు అయ్యింది. అంటే చంద్రబాబు హయాం కంటే వైయస్ జగన్ గారి హయాంలో తలసరి ఆదాయం పెరిగింది.సీఎంగా ఉన్న వ్యక్తే ఇలా తప్పుడు లెక్కలు చెబితే, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ పారిశ్రామికవేత్త అయినా వస్తారా? నీతి అయోగ్ నివేదికను చూస్తే 2014–19 వరకు చంద్రబాబు ప్రభుత్వ పాలన, 2019–24 వైయస్ జగన్ పాలనను పోల్చడం అనేది హేతుబద్దంగా ఉంటుంది. కానీ చంద్రబాబు మాత్రం తన పాలనలో ఒక ఏడాదిని ఎంచుకుని, జగన్ గారి పాలనలో ఒక ఏడాదిని ఎంచుకుని వాటిని పోల్చడం చూస్తుంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వారు ఇలా కూడా చేస్తారా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.వైఎస్సార్సీపీ విధానాలే కేంద్రంలోనూ..:వైఎస్ జగన్ హయాంలో అమలు చేసిన విద్యా ప్రమాణాల పెంపు విధానాలనే నేడు కేంద్రం అనుసరించబోతోంది. బడ్జెట్ కేటాయింపులు, విధానాలు చూస్తే అది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. విదేశీ భాగస్వామ్యంతో దేశంలో 5 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. సెకండరీ, ప్రైమరీ పాఠశాలలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ ఇవ్వబోతున్నారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేసి, బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ అందించాం. 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌లు పంపిణీ చేశాం. దాన్ని నాడు టీడీపీతో పాటు, ఎల్లో మీడియా తీవ్రంగా తప్పు పట్టాయి, ట్యాబ్‌ల వల్ల విద్యార్థులు చెడిపోతున్నారంటూ ఎల్లో మీడియా కథనాలు వండి వార్చింది. ఇప్పుడు సరిగ్గా కేంద్ర ప్రభుత్వం అవే విధానాలు అమలు చేస్తోంది. విద్యార్ధులకు బ్రాడ్‌బ్యాండ్ అందుబాటులోకి తెస్తున్నారు. మరి దీన్ని కూటమి పార్టీలు ఎలా చూస్తున్నాయి? ఇది కూడా తప్పేనని ఇప్పుడు విమర్శించగలరా?మెడికల్ కాలేజీలు.. సీట్లు:రాబోయే 5 ఏళ్లలో దేశంలో 75 వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి తేవాలన్న నిర్ణయాన్ని కేంద్ర బడ్జెట్లో వెల్లడించారు. అందులో భాగంగా ఈ ఏడాది 10 వేల సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు. నిజానికి రాష్ట్రంలో మెడికల్ సీట్ల ఆవశ్యకత గుర్తించిన నాటి సీఎం శ్రీ వైయస్ జగన్, ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టి, వాటిలో 5 కాలేజీలను గత విద్యా సంవత్సరంలోనే పూర్తి చేశారు. వాటి వల్ల రాష్ట్రంలో కొత్తగా 750 మెడికల్ సీట్లు అందుబాటులోకి రాగా, అన్ని కాలేజీలు పూరై్త ఉంటే, మొత్తం 2450 మెడికల్ సీట్లు రాష్ట్రానికి దక్కేవి.అయితే ఆ కాలేజీల నిర్మాణం పూరై్తతే జగన్‌గారికి మంచి పేరొస్తుందని కుట్ర చేసిన చంద్రబాబు, ఇప్పుడు వాటన్నింటిని ప్రైవేటీకరించాలని నిర్ణయించారు. గత విద్యా సంవత్సరంలో పులివెందుల మెడికల్ కాలేజీలో అనుమతి ఇచ్చిన సీట్లు కూడా వద్దని చెప్పడంతో పాటు, కొత్త కాలేజీలకు అనుమతి కోరుతూ, ఈ ఏడాది జాతీయ వైద్య మండలికి లేఖ రాయొద్దని నిర్ణయించారు. ఆ వి«ధంగా వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలు, సీట్లకు కేంద్రం ఒకవైపు ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. ఇవే కాలేజీలను పూర్తి చేసుకుంటూ పోతే కేంద్రం ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న 10 వేల సీట్లలో నాలుగో భాగం ఆంధ్రప్రదేశ్ నుంచే సమకూరేవి.ఆదాయపన్నుతో మధ్య తరగతికి ఊరట:మధ్యతరగతి వారికి మేలు చేసేలా పన్ను విధానాలను తీసుకువచ్చారు. ఆదాయపన్నుకు సంబంధించి గత ఏడాది రూ.3 లక్షల ఆదాయం వరకు పన్ను లేదు. ఈ ఏడాది రూ.4 లక్షల వరకు పన్ను లేకుండా నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రూ.12 లక్షల ఆదాయం వరకు రిబేట్ రూపంలో ఆదాయపన్ను నుంచి ఉపశమనం లభించేలా నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల వేతన జీవులకు, మధ్యతరగతి వారికి మేలు జరుగుతుంది.కేంద్ర బడ్జెట్ కేటాయింపులు చూస్తే..:దేశంలో తొలిసారి రూ.50,65,365 కోట్లు కేంద్ర బడ్జెట్ దాటింది. దీనిలో రెవెన్యూ రిసీట్స్ రూ.34,20,409 కోట్లు కాగా, క్యాపిటల్ రిసీట్స్ రూ.16,44,936 కోట్లు. రెవెన్యూ రాబడి, అప్పు రెండూ కలిపితే రూ.50 లక్షల కోట్లు దాటింది. దీనిలో క్యాపిటల్ వ్యయం రూ.11,21,090 కోట్లుగా చూపించారు. రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కలుపుకుంటే రూ.15,48,282 కోట్లు. అదే గత ఏడాది రివైజ్డ్ అంచనాలను చూస్తే ఖర్చు రూ.47,16,487 కోట్లుగా ఉంది. మరోవైపు రెవెన్యూ రాబడి రూ.30,00,087 కోట్లుగా చూపించారు. అప్పు మాత్రం దాదాపు రూ.16,28,527 కోట్లు ఉంది. అంటే అప్పులు య«థాతథంగా కొనసాగిస్తున్నారు. వాస్తవాలు చూస్తే కేంద్ర బడ్జెట్లో అప్పులు పెద్దగా పెరగలేదు. ఇది మంచి పరిణామం.గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రాబడి, ఖర్చులు మాత్రం దాదాపు మూడు లక్షల కోట్లు పెరిగింది. గత ఏడాది పెట్టుబడి వ్యయం రూ.10.18,000 కోట్లు అయితే, ఈ ఏడాది రూ.11,21,090 కోట్లుగా చూపించారు. అంటే దాదాపు లక్ష కోట్లు ఎక్కువ ఖర్చు చేయనున్నారు. అలాగే రాష్ట్రాలకు సహయం అందించే దాన్ని కూడా కలుపుకుంటే ఈ బడ్జెట్లో గత ఏడాదితో పోలిస్తే మూడు లక్షల కోట్లు పెరిగింది. గత ఏడాది ఆ మొత్తం రూ.15,69,527 కోట్లు కాగా, ఈ ఏడాది అది రూ.15,68,000 కోట్లుగా ఉంది. అంటే ద్రవ్యలోటు, స్థూల ఉత్పత్తిని నిష్పత్తిగా చూస్తూ.. గత ఏడాది అది 4.8 ఉంటే ఈ ఏడాది 4.4 గా బడ్జెట్లో ప్రతిపాదించడం మంచి పరిణామం. కోవిడ్ నుంచి ఇది తగ్గుతూ వచ్చింది.బడ్జెట్లో నాలుగు విభాగాలకు ప్రాధాన్యత:కేంద్ర బడ్జెట్ లో నాలుగు భాగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవసాయం, ఎంఎస్ఎంఇ, పెట్టుబడి, ఎగుమతులకు ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవసాయ పరంగా ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అనే కొత్త స్కీం ప్రారంభించబోతున్నారు. 1.70 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా దీన్ని అమలు చేయబోతున్నారు. స్వల్పకాలిక రుణాలను రూ.5 లక్షలకు పెంచనున్నారు. చిన్న పరిశ్రమలు పెట్టేవారికి క్రెడిట్‌కార్డును రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచనున్నారు.తొలిసారిగా పరిశ్రమను పెట్టే వారికి దీర్ఘకాలిక అప్పుగా టర్మ్‌లోన్‌ను రూ.2 కోట్ల వరకు ఇవ్వడం జరుగుతుంది. గ్యారెంటీ లేకుండా ఇచ్చే అప్పును ఎంఎస్ఎంఈ లకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పెంచారు. స్టార్టప్‌లకు కూడా రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచారు. ఇది మంచి నిర్ణయం. ఎంఎస్ఎంఈగా క్లాసిఫై చేసే పరిమితిని కూడా పెంచబోతున్నారు. భారతీయ భాషా పుస్తక్ స్కీం కింద ఇంగ్లిష్ నుంచి వారి స్థానిక భాషల్లో అర్థం చేసుకునే విధంగా ఒక పథకం అమలు చేయబోతున్నారు.దేశంలో శాశ్వత అభివృద్ధి కార్యక్రమాల కోసం స్పెషల్ అసిస్టెంట్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద రాష్ట్రాలకు రూ.1.50 లక్షల కోట్లు మంజూరు చేయడం మంచిది. రాబోయే 10 ఏళ్లలో కొత్తగా 120 విమానాశ్రయాలు ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. భారత ట్రేడ్‌నెట్ కింద ఎగుమతిదార్లకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తున్నారు. ఇంకా36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌కు పన్ను మినహాయింపు ఇవ్వడం సంతోషకరమని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. -
ఇప్పుడు అదే మాట పవన్ ఎందుకు చెప్పలేకపోతున్నాడు?: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి ఆర్కే రోజా ట్వీట్ చేశారు. ‘‘గతంలో వైఎస్సార్సీపీ ఎంపీలను ఉద్దేశించి పవన్ చెప్పిన మాటలను ఒకసారి మనం గుర్తు చేసుకుందాం.. రెండు కారం ముద్దలు తినండి, మరో రెండు కారం ముద్దలను ఒంటికి పూసుకుని పౌరుషం తెచ్చుకుని కేంద్రాన్ని నిలదీయండి అని పవన్ అన్నారు. అప్పట్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఉంది...అయినా సరే ఎప్పటికప్పుడు వైఎస్సార్సీపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటాలు చేశారు. పోలవరం, ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, విభజన చట్టంలో గల అంశాలు... మొదలైన వాటిపై డిమాండ్ చేస్తూనే వచ్చారు. అయితే... ఇప్పుడు ఏపీకి చెందిన టీడీపీ, జనసేన ఎంపీల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఊత కర్రల సాయంతో నడుస్తుంది.. ఇప్పుడు అదే మాటలను ఏపీ ఎంపీలకు పవన్ ఎందుకు చెప్పలేకపోతున్నాడు...?’ అంటూ ఎక్స్ వేదికగా రోజా ప్రశ్నించారు. గతంలో... వైసిపి ఎంపీలను ఉద్దేశించి పవన్ చెప్పిన మాటలను ఒకసారి మనం గుర్తు చేసుకుందాం..రెండు కారం ముద్దలు తినండి , మరో రెండు కారం ముద్దలను ఒంటికి పూసుకుని పౌరుషం తెచ్చుకుని కేంద్రాన్ని నిలదీయండి అని @PawanKalyan అన్నారు.అప్పట్లో ... కేంద్రంలో @BJP4India ప్రభుత్వం పూర్తి…— Roja Selvamani (@RojaSelvamaniRK) February 1, 2025 -
ఎమ్మెల్యే అఖిలప్రియకు భూమా కిషోర్‌రెడ్డి సవాల్
సాక్షి, కర్నూలు: ఆళ్లగడ్డలో కూటమి ప్రభుత్వం అరాచకాలపై వైఎస్సార్సీపీ నేత భూమా కిషోర్ రెడ్డి మండిపడ్డారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. చర్చకు సిద్ధంగా ఉన్నామని.. అన్ని ఆధారాలతో నిరూపిస్తామని సవాల్ విసిరారు. వైఎస్ జగన్‌పై అఖిల ప్రియ ఆరోపణలు చేయడం అవివేకం. విజయ పాల డైరీలో బకాయిలు, మేము ఎత్తిచూపించాము. అఖిల ప్రియా, ఆమె సోదరుడు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతున్నారు. కొత్తూరు కోట కొండల్లో మైనింగ్ చేసి ఇటుక బట్టిలకు మట్టిని అమ్ముకుంటున్నారు.. ఆళ్లగడ్డలో బెదిరింపులు పాల్పడుతూ.. రాజకీయాలు చేస్తున్నారు. విజయ డెయిరీ చైర్మన్, డైరెక్టర్‌ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అడ్డదారులో చైర్మన్ కావాలని చూస్తున్నారు’’ అని కిషోర్ రెడ్డి మండిపడ్డారు.జగత్ విఖ్యాతరెడ్డి విజయ డెయిరీ ఎన్నికలకు అర్హుడు కాదు. ప్రజల కోసం ఆళ్లగడ్డ అభివృద్ధి కోసం తాము కృషి చేస్తున్నాం. వారి వ్యవహార శైలి నచ్చకపోవడంతో కార్యకర్తల, ప్రజలు వ్యతి రేకిస్తున్నారు’’ అని కిషోర్‌రెడ్డి అన్నారు. -
‘కూటమి సర్కార్‌ను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధం’
సాక్షి, కర్నూలు: పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలపై పోరాటం చేయాలన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్న 46 శాతం ఓటింగ్ వచ్చిందని.. పార్టీ భయపడాల్సిన పరిస్థితి లేదన్నారు.‘‘అన్ని వర్గాలతో కలిసి ఐక్యంగా ముందుకెళ్లాలి. త్వరలోనే వైఎస్ జగన్ ప్రజల్లోకి వస్తారు. మీ సమస్యలను పార్టీ దృష్టికి తీసుకురావాలి. కూటమి ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అందించింది. రెండు సంవత్సరాల పాటు తూచ తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్న చెప్పిన మాట ప్రకారం అమలు చేశారు. కరోనా కాలంలో చంద్రబాబు, నారా లోకేష్ హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఏ ఎన్నికలు వచ్చినా కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అని పెద్దిరెడ్డి చెప్పారు. ఇదీ చదవండి: బడ్జెట్లో ఏపీకి నిల్! -
పవన్‌కు సిద్ధాంతం,భావజాలం లేదు: కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
సాక్షి,సత్యసాయిజిల్లా: చంద్రబాబు చేతిలో పవన్ కళ్యాణ్ కీలుబొమ్మగా మారారని, ఆయనకు పవన్ కళ్యాణ్‌కు సొంత సిద్ధాంతం, సొంత భావజాలం లేదని వైఎస్సార్సీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. శనివారం(ఫిబ్రవరి1) కేతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘వైఎస్ జగన్‌తో ఉన్నంతవరకే విజయసాయిరెడ్డికి విలువ.నాకు వైఎస్ జగన్ సిద్ధాంతాలు నచ్చే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. వైఎస్సార్,వైఎస్ జగన్ విప్లవాత్మక పరిపాలన అందించారు. ఆరోగ్యశ్రీ,ఫీజు రీయింబర్స్మెంట్, సచివాలయాలు ఇందుకు ఉదాహరణలు.చంద్రబాబు,పవన్ కల్యాణ్‌లకు విజన్ ఎక్కడుంది? చరిత్రలో నిలిచిపోయేలా చంద్రబాబు ఒక్క పథకమైనా ప్రవేశపెట్టారా? బాలకృష్ణ గుడివాడ నుంచి పోటీ చేస్తే వరుసగా గెలవగలరా? రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగవ్వాలి.పదోతరగతి దాకా ప్రైవేటు స్కూళ్లు ఉండొద్దు.అప్పుడే అందరు ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే చదువుతారు. అమరావతిని మాత్రమే అభివృద్ధి చేయాలనుకోవడం దుర్మార్గం’అని కేతిరెడ్డి మండిపడ్డారు. -
బాబుకు ఆ ఛాన్సే లేకుండా చేసిన రేవంత్!
ముఖ్యమంత్రిగా పదిహేనేళ్ల రికార్డు ఉన్న చంద్రబాబు ఇప్పటికే చాలాసార్లు దావోస్‌కు వెళ్లివచ్చారు. ఇంకోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి దావోస్ వెళ్లి వచ్చారు. ముఖ్యమంత్రిగా రేవంత్ అనుభవం 15 నెలలు మాత్రమే. అయినా రేవంత్ తెలంగాణకు పెద్ద స్థాయిలో పెట్టుబడులు వచ్చేలా ఎలా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు? చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారు? ఇది ఆసక్తికరమైన పరిశీలన. 👉దావోస్ లో రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడం అతి పెద్ద విజయం: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 👉దావోస్తోనే పెట్టుబడులు వస్తాయన్నది ఒక మిథ్య: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపైగా చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను గురుశిష్యులుగా చూస్తూంటారు. ఈ విషయాన్ని రేవంత్ అంగీకరించకపోయినా జనం దృష్టిలో వారిది బాగా దగ్గరి అనుబంధమే. ఓటుకు నోటు కేసు తర్వాత అది మరింత బలపడిందని భావిస్తూంటారు. రేవంత్ టీడీపీని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్లినప్పుడు కూడా చంద్రబాబుకు చెప్పే వెళ్లారు. తన తెలివితోపాటు కాలం కలిసి వచ్చి రేవంత్ తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే చంద్రబాబును మరోసారి అదృష్టం వరించి ముఖ్యమంత్రి అయ్యారు. అంతవరకు ఓకే. ఇప్పుడు వీరిద్దరి మాటలలో ఎవరిది ప్రామాణికంగా తీసుకోవాలి అనేది ప్రశ్న. రేవంత్ చెప్పినదాని ప్రకారం 25 సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. వాటిలో ఒక్క అమెజాన్ సంస్థే రూ.20 వేల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. అలాగే సన్ పెట్రో కెమికల్స్ సంస్థ రూ.45 వేల కోట్లు వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు. మహారాష్ట్రకు వచ్చిన రూ. 15 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌తో పోల్చితే తెలంగాణకు వచ్చింది తక్కువే కావచ్చు. కాని అసలు ఒక్క రూపాయి పెట్టుబడి రాని ఏపీతో కనుక పోల్చుకుంటే తెలంగాణ బాగానే సాధించినట్లు ఒప్పుకోవాలి. అందుకే రేవంత్ ధైర్యంగా.. ‘‘ఇది మా ప్రభుత్వ విజయం’’ అని చెప్పుకోగలిగారు. చంద్రబాబు మాత్రం దావోస్ ఒక మిథ్య అంటూ వేదాంతం చెప్పారు. తెలిసేట్టు చెప్పేది సిద్దాంతం.. తెలియకపోతేనే వేదాంతం అని ఒక కవి వ్యాక్యం. చంద్రబాబు పద్దతికి ఇది సరిపోతుంది. తనకు అనుకూలంగా ఉంటే అంతా బ్రహ్మాండం అని చెబుతారు. తను విఫలం అయితే వేదాంతంతో మాట్లాడి అంతా మిథ్య అని అంటారు. చంద్రబాబు వ్యాఖ్యలపై మామూలుగా అయితే రేవంత్ మండి పడాలి. కాని ఎంతైనా గురువు కదా! దానిపై నేరుగా స్పందించలేదు. కాకపోతే పెట్టుబడులే కాకుండా.. ప్రపంచం పోకడ తెలుసుకోవడానికి కూడా దావోస్ వెళతామని రేవంత్ అన్నారు. చంద్రబాబు చేసిన కామెంట్లను తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వం చేసుకున్నవి కూడా ఉత్తుత్తి అగ్రిమెంట్లుగా కనిపించాలి. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోస్ సదస్సుకు వెళ్లి సుమారు రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించుకు వచ్చారు. అప్పుడు ఇదే తెలుగుదేశం దేశంలోని పారిశ్రామికవేత్తలతో అక్కడకు వెళ్లి పెట్టుబడులు తెచ్చామంటే సరిపోతుందా? అని ప్రశ్నించింది. ఈసారి చంద్రబాబు వెళ్లి ఆ మేరకైనా దేశీయ కంపెనీలతో కూడా అవగాహన కుదుర్చుకోలేకపోవడం పెద్ద వైఫల్యం. అందువల్లే రేవంత్ తమ ప్రగతిశీల విధానాల వల్లే పెట్టుబడులు వచ్చాయని గర్వంగా చెప్పుకున్నారు. అయితే.. చంద్రబాబుకు అలా చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. చంద్రబాబు,మంత్రిగా ఉన్న ఆయన కుమారుడు లోకేష్‌లు కలిసి అభివృద్ది విధానాలు కాకుండా, రెడ్ బుక్ పాలసీని అమలు చేస్తుండడం, రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తుండడంతో పారిశ్రామిక వేత్తలు భయపడిపోతున్నారన్న అభిప్రాయం సహజంగానే వస్తుంది. దానికి తోడు ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ పై తప్పుడు కేసు పెట్టడానికి ఒక మోసకారి నటిని ఉపయోగించుకున్న వైనం కూడా ఏపీకు అప్రతిష్ట తెచ్చిపెట్టింది. జిందాల్‌ను కూటమి ప్రభుత్వం తరిమేసిందని వార్తలు వచ్చాయి. ఆయన వెళ్లి మహారాష్ట్రలో రూ.మూడు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నారు. ఇటు.. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టిన దాఖలాలు పెద్దగా లేవని చెప్పాలి. అయితే తెలంగాణలో ఉండే మెఘా కంపెనీ రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి దావోస్‌లో ఒప్పందం అవడాన్ని బీఆర్ఎస్ ఎద్దేవా చేసింది. దానికి రేవంత్ సమాధానం ఇస్తూ పెట్టుబడులు వస్తుంటే బీఆర్ఎస్కు అక్కసని ధ్వజమెత్తారు. అమీర్పేట్లోనే ఒప్పందం చేసుకోవాలా? అని మండిపడ్డారు. రిలయన్స్ సంస్థ మహారాష్ట్ర ప్రభుత్వంతో దావోస్‌లో అగ్రిమెంట్ చేసుకుంటే ఎందుకు తప్పు పట్టడం లేదు? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌పై అపోహలు సృష్టించే యత్నం చేశారని, ఆర్థిక మూలాలు దెబ్బతీసే కుట్రలు జరిగాయని రేవంత్ అన్నారు. ఈ-ఫార్ములా రేస్ ద్వారా విదేశాలకు డబ్బులు తరలించారని ఆయన బీఆర్ఎస్పై ఆరోపించారు. నిజానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ.. ఇలాంటి ఆరోపణలవల్లే దెబ్బతింటుందని రేవంత్ గుర్తించాలి. అచ్చం చంద్రబాబు భాషలో కాకుండా రాష్ట్రానికి, కాంగ్రెస్‌కు ఉపయోగపడేలా మాట్లాడితే బాగుంటుంది. చంద్రబాబు అక్కడ పెట్టుబడులకు అవకాశం ఉన్న విశాఖ, రాయలసీమ ప్రాంతాలను పక్కనబెట్టి మూడు పంటలు పండే, వరద ముంపు అవకాశం ఉన్న భూములలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. ఇందు కోసం వేల కోట్ల వ్యయం చేస్తున్నారు. దాని వల్ల కూడా ఏపీకి నష్టం జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఆచరణాత్మకంగా వ్యవహరించకుండా ఎంతసేపు ఏపీ పేద రాష్ట్రం అయిపోయిందని, ఐదేళ్లుగా ఏదో జరిగిపోయిందని అంతర్జాతీయంగా కూడా అసత్యాలు ప్రచారం చేస్తే పెట్టుబడిదారులు ఎందుకు ముందుకు వస్తారన్నది చాలా మంది ప్రశ్నగా ఉంది. ఇక.. ఏపీలో స్థానిక కంపెనీలు కూడా ఎవరూ పెట్టుబడుల ఎంఓయూలు కుదుర్చుకోవడానికి ముందుకు రాకపోవడం బాధాకరమే. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ దావోస్ వెళ్లి లోకేష్‌ను కలిసి ఏపీలో గోల్ఫ్ సిటీ పెడతామని చెప్పిందని వార్తలు వచ్చాయి. అది కూడా కార్యరూపం దాల్చినట్లు కనిపించ లేదు. చంద్రబాబు, లోకేష్‌ల దావోస్ పర్యటనకు ముందు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా వెళుతున్నారని వార్తలు రాసిన ఎల్లో జాకీ మీడియా, టూర్ ముగిశాక పెట్టుబడుల ఆకర్షణ కోసం నెట్ వర్క్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా వెళ్లారని మాట మార్చేసింది. పైగా ఏపీ బ్రాండ్ అంటూ కహానీలు ప్రచారం చేసింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని టీడీపీ నేతలు చెబుతుంటారు. కాని ఆయన కూడా ఏపీలో మైక్రోసాఫ్ట్ సెంటర్ నెలకొల్పడానికి హామీ ఇవ్వలేదట. పదేళ్ల క్రితమే చంద్రబాబు దాని గురించి మాట్లాడినా ఫలితం దక్కలేదు. చంద్రబాబు 1995 నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత పలుమార్లు దావోస్వెళ్లి వచ్చారు. ఆ సందర్భాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చామని చెప్పేవారు. కాని ఈసారి పెట్టుబడి రాకపోవడంతో అదంతా ‘మిథ్య’ అని అన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక విషయం చెప్పారు. మహారాష్ట్రకు ముంబై ఉండవచ్చు. కాని ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ఉన్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అన్నారట. మరి చంద్రబాబును చూసి పెట్టుబడులు ఎందుకు రాలేదు? ఫడ్నవీస్ రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు ఎలా తీసుకు వెళ్లగలిగారు? ఏది ఏమైనా చంద్రబాబువి కబుర్లు అయితే.. ఫడ్నవీస్, రేవంత్ లు పెట్టుబడులు తెచ్చుకున్నారన్నమాట. అందని ద్రాక్ష పులుపు అన్నట్లు ఇతర రాష్ట్రాలు పెట్టుబడులు తెచ్చుకున్నా, దావోస్ వెళితే పరిశ్రమలు వస్తాయనుకోవడం మిథ్య అని చంద్రబాబు చెప్పుకుని తనను తాను మోసం చేసుకుంటూ.. ప్రజలను కూడా మోసం చేస్తున్నారా?.::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కూటమి కవ్వింపు.. వైఎస్సార్సీపీ నేత భవనం కూల్చివేతకు ప్లాన్
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేయడమే లక్ష్యంగా కూటమి సర్కార్ ముందుకు సాగుతోంది. తాజాగా తిరుపతిలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డికి చెందిన ఆస్తులకు ధ్వంసం చేసేందకు అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే తిరుపతిలోని డీబీఆర్ ఆసుపత్రి రోడ్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.కూటమి సర్కార్ అండతో ఏపీలో అధికారులు ఓవరాక్షన్‌కు దిగారు. తాజాగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డి డీబీఆర్ రోడ్డులో నిర్మిస్తున్న ఐదు అంతస్థుల భవనంలో మూడో అంతస్థులో కూల్చివేతకు దిగారు మున్సిపల్ అధికారులు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు కూల్చివేతలకు రావడంతో స్థానిక వైఎస్సార్సీపీ నేత భూమన అభినయ్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రికత్త చోటుచేసుకుంది.అనంతరం, భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ.. డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తిరుపతి నగరం కార్పొరేషన్ పరిధిలో కక్ష్య సాధింపు చర్యలకు దిగుతోంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డికి చెందిన ఆస్తులు ధ్వంసం చేసేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ టీడీపీ కుట్రలు చేస్తోంది. డీబీఆర్ ఆసుపత్రి రోడ్లో శేఖర్ రెడ్డి ఐదు అంతస్థుల భవనం నిర్మాణంలో ఉండగా మూడవ అంతస్తులో కూల్చివేతలు చేపట్టారు.ఇక, కూల్చివేతకు సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం నోటీసులు ఇవ్వాలి. 15 రోజులు సమయం ఇవ్వాలని స్పష్టంగా ఉంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికార బలంతో కూల్చివేతకు దిగుతున్నారు. కూటమి నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అని ఘాటు విమర్శలు చేశారు. తిరుపతిలో @JanaSenaParty కక్ష సాధింపు రాజకీయాలు వైయస్ఆర్సీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్ రెడ్డికి చెందిన భవనాన్ని కూల్చేసేందుకు కూటమి నేతలు పన్నాగం శేఖర్ రెడ్డికి మద్దతుగా నిలుస్తూ.. లీగల్ టీమ్‌తో కలిసి ఆ భవనం వద్దకు వెళ్లిన తిరుపతి వైయస్ఆర్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్… pic.twitter.com/rfB5G03b6F— YSR Congress Party (@YSRCParty) February 1, 2025 -
’బాబు’ ష్యూరిటీ.. ప్రజలపై బాదుడు గ్యారెంటీ: కన్నబాబు
సాక్షి, కాకినాడ జిల్లా: సంపద సృష్టి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో ప్రజలపై పెను భారాలను మోపడమేనని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ(YSRCP) కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు (Kurasala Kannababu) మండిపడ్డారు. కాకినాడ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచడం ద్వారా ప్రజల నుంచి ఏటా రూ.13000 కోట్లు ముక్కుపిండి వసూలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతంలో మాత్రం తన బినామీలపై భారం పడకూడదని రిజిస్ట్రేషన్ చార్జీల పెంపును మినహాయించారని ఆరోపించారు.కన్నబాబు ఇంకా ఏమన్నారంటే..‘‘రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచుతున్నారు. సంపద సృష్టించడం అంటే ప్రజలపై బాదుడే బాదుడు కార్యక్రమాన్ని అమలు చేయడం అని చంద్రబాబు అనుకుంటున్నారు. చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే ఇదేనా? ఒక వస్తువుకు ఎలా మార్కెటింగ్ చేస్తారో అలాగే తనను తాను మార్కెటింగ్ చేసుకునేలా సంపద సృష్టి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. దానిని నమ్మిన ప్రజలు ఈ రోజు అవస్థలకు గురవుతున్నారు. స్థిరాస్థి విలువలను అడ్డగోలుగా పెంచడం, భూములు, నిర్మాణాలు, చివరికి తాత్కలిక నివాసం ఉండే షెడ్లు, పూరిళ్ళను కూడా ఈ చార్జీల పెంపు కిందకు తీసుకువచ్చారు. రాష్ట్రంలో చంద్రబాబుకు తనకు కావాల్సిన వారికి అనుకూలంగా ఈ రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచారు.చంద్రబాబు, ఆయన బినామీల చేతుల్లో అమరావతి ప్రాంతంలో వేలాది ఎకరాల భూములు వున్నాయి. ఈ చార్జీల పెంపుదల నుంచి వీటికి మినహాయింపు కల్పించారు. రాష్ట్రమంతా పెంచిన చార్జీలు ఇక్కడ మాత్రం పెరగవు. అంటే తన వారికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ మినహాయింపులు కల్పించారు. అమరావతిలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచితే, కొనుగోళ్ళు ఇబ్బంది కలుగుతాయని అక్కడ మార్కెటింగ్ పెరిగేందుకు వీలుగా, భూములను అమ్ముకుని తన బినామీలు లాభం పొందేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుదల నుంచి మినహాయింపు ఇచ్చారు. చాలా చిత్రంగా లేయర్లు, గ్రిడ్స్ పేరుతో తమకు అనుకూలమైన ప్రాంతంలో చార్జీలను పెంచడం, మినహాయించడం పై నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఒక మధ్యతరగతి వ్యక్తి ఒక అపార్ట్ మెంట్ కొనుగోలుచేస్తే లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ చార్జీలును చెల్లించాల్సిన పరిస్థితిని కల్పించారు.అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని దివాలా తీయించారు:గత ఎనిమిది నెలల పాలన చూస్తూ చంద్రబాబు అసమర్థత, వైఫల్యం కనిపిస్తోంది. నీతిఅయోగ్ పై చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ఖజానా దివాలా తీసింది, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కుదరదు అంటూ మాట్లాడారు. అభివృద్ది ద్వారా సంపద సృష్టిస్తాం, దానితో సంక్షేమం చేస్తానంటూ ఒక కొత్త వాదనను వినిపించారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ’పూర్ టు రిచ్’ అనే ఒక నినాదం ఇచ్చారు. పేదలన కుబేరులను చేస్తానంటూ మభ్యపెట్టారు. సూపర్ సిక్స్ ఏమయ్యాయి? వాగ్దానాల అమలు ఏదీ అంటూ ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అధికారాన్ని వినియోగించుకుని కేసులు నమోదు చేస్తున్నారు.చివరికి సోషల్ మీడియా యాక్టివీస్ట్ లపైన కూడా కేసులు నమోదు చేసి తమ నిరంకుశత్వాన్ని చాటుకుంటున్నారు. ఎన్నికలకు మందు మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కగలదు అంటూ గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. మరి ఇప్పుడు మీరు ఇచ్చిన హామీల అమలుపై ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నాం. ఆనాడు మా పార్టీ అధినేత వైఎస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పారు.చంద్రబాబు ఇచ్చిన హామీలను నిజంగా అమలు చేయాలంటే ఏడాదికి రూ.1.65 లక్షల కోట్లు అవసరం అవుతాయని. మేం అమలు చేస్తున్న పథకాలకే ఏడాదికి రూ.70వేల కోట్లు ఖర్చు అవుతోంది, ఇంతకు మించి ఇచ్చే సామర్థ్యం ఈ రాష్ట్ర ఖజానాకు లేదు అని చాలా క్లియర్ గా వాస్తవాలను వెల్లడించారు. చంద్రబాబులా అబద్దాలు చెప్పి, తరువాత ప్రజలను మోసం చేయలేను అని కూడా చెప్పారు. కానీ ప్రజలు దీనిని అర్థం చేసుకోలేదు. నిజం కంటే అబద్దం అందంగా కనిపించింది. చంద్రబాబు అబద్దాలను నమ్మారు. నడిచి వచ్చే అబద్దంగా చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు.8 నెలల్లో తెచ్చిన అప్పులను ఎలా ఖర్చు చేశారు?అమిత్ షా ఇటీవల రాష్ట్ర పర్యటన సందర్భంగా ఏపీకి రూ.3 లక్షల కోట్లు కేంద్రం ద్వారా సాయం అందించామని ప్రకటించారు. చంద్రబాబు ఇప్పటివరకు రూ.1.19 లక్షల కోట్లు అప్పు చేశామని చెప్పారు. అంటే ఈ ఎనిమిది నెలల్లో రాష్ట్రానికి అందిన నిధులు మొత్తం రూ.4.19 లక్షల కోట్లు. నెలకు దాదాపు రూ.50 వేల కోట్లు. ఈ నిధులు ఏం చేశారు? ఏ పథకం కింద ప్రజలకు ఎంత సొమ్ము అందించారు? వీటికి సంబంధించిన లెక్కలు వెల్లడించండి.ఆర్థిక అరాచకత్వం ఈ రాష్ట్రంలో నడుస్తోంది. ఒకవైపు అభివద్ధి లేదు, మరోవైపు సంక్షేమం కనిపించడం లేదు. నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతూ కాలం గడుపుతున్నారు. చివరికి జగన్ సీఎంగా ఉండగా వాట్సాప్ లో గవర్నెన్స్ ను తీసుకువచ్చారు. పదిహేను రోజుల కాలంలో కోటి సర్టిఫికేట్ లను ఇంటింటికీ తీసుకువెళ్ళి అందించారు. దానిని కాపీ చేసి నేడు లోకేష్ వాట్సప్ గవర్నెన్స్ ను తానే కనిపెట్టినట్లు, ఈ రాష్ట్రానికి పరిచయం చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు.ఇదీ చదవండి: అప్పులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి జగన్ పాలన సింప్లిసిటీ అయితే చంద్రబాబు పాలన పబ్లిసిటీ. 2022లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విపరీతమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం శ్రీలంక అవుతోంది, అప్పుల ఊబిలోకి వెడుతోందంటూ గుండెలు బాదుకున్నారు. ఎన్నికలకు ముందు నారా లోకేష్ మాట్లాడుతూ మేం ప్రజలకు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేయకపోతే చొక్కా పట్టుకుని అడగాలని అన్నారు. ఇప్పుడు హామీలను అమలు చేయడం కుదరదంటున్న మీ ప్రభుత్వాన్ని ఈ ప్రజలు ఏం చేయాలి? ఏం చేస్తే హామీలను అమలు చేయడానికి సిద్దమవుతారు?కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతలను వెల్లడించాలిజగన్ పాలనలో సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. విద్య, వైద్యం, వ్యవసాయం నా ప్రాధాన్యతలు అని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యతలు ఏమిటీ? ఏ రంగాన్ని తమ ప్రయారిటీలో పెట్టారో వెల్లడించాలి. దావోస్ వెళ్ళడమే అద్భుతమైన ఘట్టంగా ప్రచారం చేసుకున్నారు. ఒక్క ఎంఓయు చేసుకోకుండా రాష్ట్రానికి తిరిగి వచ్చి, దావోస్‌లో ఎంఓయులు గొప్పకాదు అంటూ మాట మార్చేశారు. జగన్ ఆర్థిక విధ్వంసం సష్టించారు, అప్పుల పాలు చేశారంటూ దుష్ప్రచారం చేశారు. పారిశ్రామికవేత్తలు రావాలంటే జగన్ గారు మళ్లీ అధికారంలోకి రారు అని రాసివ్వమని అడుగుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారు.పరిశ్రమలు పెట్టేందుకు రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను కేసులతో భయపెట్టి పారిపోయేలా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తలు ఏ ధైర్యంతో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు? ప్రతి సందర్భంలోనూ వైయస్ జగన్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నామనే భ్రమతో చంద్రబాబు, లోకేష్ లు చేసిన వ్యాఖ్యల వల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్ బ్రాండింగ్ దెబ్బతిన్నది. తమ రాజకీయం కోసం ఏపీ ఇమేజ్ ను దెబ్బతీయడం వల్ల కొత్త పెట్టుబడులు రాని పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా పరిశ్రమ పెడదామని భూముల కోసం సర్వే చేస్తుంటేనే గద్దాల వారిపై పడి వేధిస్తున్నారు. లోకేష్ పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ రెడ్ బుక్‌ను అమలు చేస్తామని చెప్పారు. దావోస్ కు వెళ్ళి వేధింపులు కొనసాగిస్తామని, రాష్ట్రంలో శాంతిభద్రతలు మా చేతుల్లో ఉన్నాయని చెబుతుంటే, ఐఎఎస్, ఐపీఎస్ లపై తప్పుడు కేసులు పెట్టి పాలనను దిగాజారుస్తుంటే ఏ నమ్మకంతో పెట్టుబడులు పెడతారు?కాకినాడ బియ్యం నివేదికపైనా ఒత్తిళ్ళు సిగ్గుచేటు:కాకినాడ పోర్ట్‌లో బియ్యం మాఫియాకు సంబంధించి వాస్తవంగా ఉన్న పరిస్థితికి భిన్నంగా తాము చెప్పిన వారి పేర్లను ఇరికించి, వారికి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలని ఒక ఐపీఎస్ అధికారిని బెదరించిన ఘటనపై పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇటువంటి తప్పుడు పనులు చేయను, అవసరమైతే రాజీనామా చేస్తానంటూ సదరు ఐపీఎస్ అధికారి తెగించి చెప్పడంతో ఆయనతో సెలవు పెట్టించారు.ఒక సీనియర్ ఐపీఎస్ అధికారికే ఇటువంటి పరిస్థితి ఉంటే, ఇక మిగిలిన అధికారులు ఎలా నిస్పక్షపాతంగా పనిచేయగలరు? ఐఎఎస్, ఐపీఎస్ లు తమ ఉద్యోగాలనే వదులుకునే స్థాయిలో వారితో తప్పులు చేయించాలనే విధంగా పాలన సాగుతోంది. రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందనేందుకు ఇంతకంటే నిదర్శనం కావాలా? ఈ రాష్ట్రంలో లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగానే ప్రజలు జీవించాలని, అధికార యంత్రాంగం పనిచేయాలని నిర్ధేశిస్తున్నారు.చంద్రబాబుకు ఉపయోగపడే వాటికే ప్రాధాన్యతచంద్రబాబుకు తన బినామీల ప్రయోజనాల కోసం అమరావతి, తన సంపాధనకు ఏటీఎంగా ఉన్న పోలవరం, స్పెషల్ ప్యాకేజీ కోసం విశాఖ ఉక్కు. ఇవే చంద్రబాబు ప్రాధన్యతలు. కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేసినట్లు పత్రికల్లో చూశాం. కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని ఆనాడు సీఎంగా వైయస్ జగన్ గారు చెబితే జ్యుడీషియల్ క్యాపిటల్ వల్ల ఏం వస్తుందీ, నాలుగు జిరాక్స్ షాప్ వస్తుందని చంద్రబాబు ఎద్దేవా చేశాడు.మరి ఈరోజు హైకోర్ట్ బెంచ్ పెడితే ఏం వస్తుందో చంద్రబాబు చెప్పాలి? జగన్ గారు చేస్తే అది తప్పు, చంద్రబాబు చేస్తే చాలా గొప్ప కార్యక్రమం. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తున్నారంటే దానికి మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలే కారణం అంటూ కేంద్రమంత్రి కుమారస్వామితో మాట్లాడించడం చూస్తుంటే వ్యవస్థలను ఏ స్థాయిలో మేనేజ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నారా లోకేష్ ను జాకీలు పెట్టి మరీ పైకి లేపుతున్నారు. పోలవరం ఎత్తు తగ్గించారంటే దీనిపై ఎవరూ నోరు విప్పరు.విద్యా వ్యవస్థ నివేదికలను వక్రీకరిస్తున్నారు:ఈ రాష్ట్రంలో విద్యావ్యవస్థ బాగుపడిందీ అంటే దానికి కారణం వైఎస్ జగన్. కానీ మొన్న అసర్ నివేదికలో జగన్ గారి హయాంలో విద్యారంగ స్థాయి పడిపోయిందంటూ ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరి హాయాంలో ప్రభుత్వ స్కూళ్ళు బాగుపడ్డాయో తేల్చుకునేందుకు ఏ గ్రామానికైనా వెళ్ళి పరిశీలించేందుకు సిద్దం. జగన్ గారు రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని సమూలంగా మారుస్తూ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. 2023 డిసెంబర్ 1వ తేదీన కేంద్రం ఇచ్చిన నివేదికలో స్వచ్చా విద్యాలయం ఇనిషియేటీవ్ కింద ఏపీలో ప్రతి పాఠశాలకు రక్షిత మంచినీటి వసతిని కల్పించారని చాలా స్పష్టంగా చెప్పింది. 49,293 టాయిలెట్లను నిర్మించినట్లు పేర్కొంది.దీనిలో బాలురకు 83.55శాతం, బాలికలకు 96.9 శాతం ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ఈ నివేదిక తప్పేనని చెబుతారా? వైయస్ జగన్ గారి ప్రభుత్వం జరిగిన ప్రగతిపై కేంద్ర నివేదికలను కూడా వక్రీకరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్రంలో జరిగిన మంచిని కూడా అంగీకరించ లేకపోతున్నారు. రాష్ట్రంలో పెన్షన్లు కూడా భారీ ఎత్తున తొలగించే ప్రయత్నం ప్రారంభించారు. ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు రూ.3900 కోట్లు చెల్లించకుండా విద్యార్ధుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని కురసాల కన్నబాబు ఆక్షేపించారు. -
‘హామీలు అమలు చేయలేకపోతే కాలర్ పట్టుకోమన్నావ్ కదా లోకేష్’
సాక్షి, తిరుపతి : సూపర్ సిక్స్ అమలు చేయకపోతే నారా లోకేష్ కాలర్ పట్టుకోవాలన్నారు? ఏ కాలర్ పట్టుకోవాలో చెప్పాలని నారా లోకేష్‌ను మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. ఫీజ్ రియింబర్స్‌మెంట్‌తో పాటు అన్ని పథకాలు ఆపేశారు. ఆరోగ్యశ్రీని నిలిపివేశారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారు. ఎన్నికలకు ముందు.. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ.. అధికారంలోకి వచ్చాక.. బాబు ష్యూరిటీ చీటింగ్ గ్యారెంటీ’ అని మండిపడ్డారు. శుక్రవారం ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. విద్యార్థులకు చెల్లించాల్సిన 3900 కోట్లు చెల్లించలేదు, విద్యార్థుల భవిష్యత్తు రోడ్డున పడెస్తున్నారు చంద్రబాబు,ఆయన ప్రభుత్వం. విద్యా దీవెన 2800 కోట్లు, వసతి దివెన 1100 కోట్లు బకాయిలు చెల్లించలేదు. విద్య తోనే భవిష్యత్తు అభివృద్ధి. పేద విద్యార్థుల విద్యకు దూరం చేస్తున్నారు.దీనిపై మంత్రులు వితండంగా మాట్లాడుతారు.చంద్రబాబు దిగిపోయేనాటి రూ.2800 కోట్లు బకాయిలు వైఎస్ జగన్ చెల్లించుకుంటూ వచ్చారు. పెదవాళ్లంటే చంద్రబాబుకు చిరాకు. వైఎస్సార్ తెచ్చిన ఫీజు రియంబర్సమెంట్కు తూట్లు పొడుస్తున్నారు. ఏడు నెలల్లో చేయూత, అమ్మవడి, నాడు నేడు , ఆరోగ్యశ్రీ,, వాలంటీర్ వ్యవస్థలంటికి మంగళం పాడారు. జగన్‌పై విమర్శలు చెయ్యడానికే ప్రయత్నిస్తున్నారు. కానీ అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదు. సూపర్ సిక్స్ అమలు చెయ్యకుంటే కాలర్ పట్టుకోమన్నారు నారా లోకేష్. ఏ కాలర్ పట్టుకోవాలి ఇప్పుడు.చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. ఎన్నికలకు ముందు తెలియదా ఇదంతా. బటన్ నొక్కడం పెద్ద విషయమా అన్న చంద్రబాబు ఇప్పుడు ఎందుకు హామీలు అమలు చెయ్యడం లేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు హామీలకు గ్యారంటీ ఇచ్చారు. నేడు పవన్ కళ్యాణ్ ఏమైయ్యారు. ఎందుకు నిలదియడంలేదు. నేను, నా కుమారుడు అధికారంలోకి వచ్చామ్ చాలు అన్నట్లుగా ఉంది చంద్రబాబు ప్రవర్తన. బాబు స్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు.. ఇప్పుడు దేనికి గ్యారంటీ లేదు. కూటమి ఓటు వేస్తే ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇస్తామని అన్నారు. ఈ రోజు ఇచ్చిన బాండ్ల కూడా పనికిరావు. రామానాయుడు సైకిల్ మీద ఇంటింటికి తిరిగి నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అన్నారు. నేడు ప్రజలను ఇబ్బందులలో నెట్టారు. చావు కబురు చల్లగా చెప్పినట్లు హామీలు అభివృద్ధి తర్వాతే అంటారు. జగన్ వల్లే హామీలు అమలు చెయ్యలేమని చేతకానీ మాటలు మాట్లాడుతున్నారు. మ్యానిఫెస్టో రూ.14 లక్షల కోట్లు అప్పు అన్నారు. రూ.6.5 లక్షల కోట్లు మాత్రమే అప్పుఅని అసెంబ్లీ సాక్షిగా మీరే చెప్పారు.. అబద్దాలతో అధికారంలోకి వచ్చింది కూటమీ ప్రభుత్వం.ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. విద్యార్థుల విద్యాదీవెన, వసతి దీవెన చెల్లించకుంటే వారి తల్లిదండ్రులతో మీ మెడలు వంచుతాము. అభివృద్ధి అంటే వల్గర్ పోస్టులు పెట్టడం కాదు. మీకు చేతకాకపోతే జగన్ దగ్గర కోర్సు తీసుకొండి . పవన్ కళ్యాణ్ మీకే చెప్తున్నా... హామీలు అమలు చెయ్యకపోతే ప్రశ్నించరా? మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే సహించేది లేదు. వడ్డీతో సహా తిరిగి ఇస్తాం..తప్పు చేస్తే ప్రశ్నిస్తాం. ట్రోల్స్ చేస్తే వెనక్కి తగ్గుతామనుకున్నారేమో.. తగ్గేదేలే. పవన్ కూడా విద్యార్థుల బకాయిలు చెల్లించాలని సీఎం చంద్రబాబును ప్రశ్నించాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు. -
అప్పులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: కాకుమాను రాజశేఖర్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడు నెలల్లో చేసిన రూ.1.19 కోట్ల అప్పులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి, ఆ అప్పు ఎలా ఖర్చు చేశారో చెప్పాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఆ బాధ్యత కచ్చితంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై ఉందని ఆయన తేల్చి చెప్పారు. రాజకీయాల్లో తనంత అనుభవజ్ఞుడు లేడని చెప్పే చంద్రబాబు, ఎన్నికల ముందు గొప్పగా ప్రచారం చేసిన సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయకుండా, సాకులు చెప్పడం సరికాదని స్పష్టం చేశారు.కరోనా సంక్షోభంలో ఎలాగైతే వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను కొనసాగించారో.. అదే స్ఫూర్తితో సీఎం చంద్రబాబు పని చేయాలని సూచించారు. పథకాలు అమలు చేయబోమని చంద్రబాబు చెబుతున్నా.. పవన్‌కళ్యాణ్ తేలు కుట్టినా దొంగలా సైలెంట్‌గా ఉండటానికి కారణమేంటని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కాకుమాను రాజశేఖర్ ప్రశ్నించారు.ఆత్మవిమర్శ చేసుకోవాలి:కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలవుతోంది. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను కూటమి పార్టీలు ఏ మేరకు నెరవేర్చారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. కూటమి పాలనలో ప్రజలకు జరిగిన మేలు గుండు సున్నా. ఎన్నికల మేనిఫెస్టోలో అమలు కాని వాగ్ధానాలు చేర్చడం, తీరా అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చకుండా మోసం చేయడం చంద్రబాబుకి పరిపాటిగా మారింది. ప్రజలను మోసం చేసి చంద్రబాబు ఇప్పటికి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు మోసాలపై బీజేపీకి క్లారిటీ ఉంది కాబట్టే ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసే సమయంలో దాన్ని ముట్టుకోవడానికి కూడా బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ ఇష్టపడలేదు.ప్రజలతో మూడు ముక్కలాట:పాలనపై చంద్రబాబు పట్టుకోల్పోయారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన జరగడం లేదు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు ప్రజల ఆశలతో మూడు ముక్కలాట ఆడుకుంటున్నారు. వైయస్సార్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడం, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం మినహా 8 నెలల్లో జరిగింది శూన్యం. గత వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో విద్య, వైద్యం, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగిందని పలు గణాంకాలు రుజువు చేస్తున్నాయి. కోవిడ్ సమయంలో జగన్ చేసిన పాలనకు దేశమే బ్రహ్మరథం పట్టింది. అయినా కరోనా సాకు చూపించి సంక్షేమ పథకాలను అమలు చేయకుండా తప్పించుకోవాలని చూడకపోవడం ఆయన గొప్పతనం. నేడు పరిస్దితులన్నీ బాగానే ఉన్నా, అనుభవశాలినని చెప్పుకునే చంద్రబాబు సూపర్ సిక్స్ అమలు చేయలేక పిల్లి మొగ్గలేస్తున్నాడు.ఆయన ఏనాడూ సాకులు చెప్పలేదు:జగన్ మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి అమలు చేస్తే చంద్రబాబు మాత్రం ప్రజల్ని వంచించడానికి ఆయుధంగా వాడుకుంటున్నారు. 2019లో వైఎస్ జగన్ సీఎం అయ్యేనాటికి టీడీపీ ప్రభుత్వం ఖజానాలో కేవలం రూ.100 కోట్లు మాత్రమే ఉంచి దిగిపోయింది. అయినా చంద్రబాబులా జగన్ సాకులు వెతుక్కోకుండా నవరత్నాలను అమలు చేసి చూపించారు. ఈ 8 నెలల్లో దాదాపు 1.19 లక్షల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ప్రజలకు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేకపోయారు. పైగా గత ప్రభుత్వ అప్పులంటూ సాకులు వెతుకుతూ వైఎస్ జగన్ పాలనపై బురదజల్లాలని చూస్తున్నారు. ఈ ఎనిమిది కాలంలో చంద్రబాబు చేసిన అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.కరోనా లాంటి సంక్షోభ పరిస్థితులున్నా వైఎస్ జగన్ ఎలాగైతే సంక్షేమ పథకాలు అమలు చేశారో.. చంద్రబాబు కూడా కారణాలు వెతకడం మానేసి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే. అమలు చేయలేకపోతే ప్రజలకు క్షమాపణలు చెప్పి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలి. అవసరమున్నా లేకపోయినా ప్రతి సందర్భంలో ఐయామ్ ప్రజెంట్ అంటూ తలదూర్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇప్పుడు తేలు కుట్టిన దొంగలా దాక్కోవడం సరైన పద్ధతి కాదు. సూపర్ సిక్స్ హామీలపై గ్యారంటీ ఇస్తూ సంతకం చేసిన ఆ పెద్ద మనిషి తక్షణం స్పందించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ మీద కాకుండా మేనిఫెస్టో అమలుపై చిత్తశుద్ధితో పని చేయాలని కాకుమాను రాజశేఖర్ కోరారు. -
ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది బాబూ?: కొట్టు సత్యనారాయణ
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనపై మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. తాడేపల్లిగూడెం వైఎస్సార్సీపీ క్యాంప్ కార్యాలయం ఆయన మాట్లాడుతూ, డిగ్రీ చదివే 9 లక్షల మందికి గత ఏడాదిగా ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఏడిపిస్తుందని మండిపడ్డారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఎన్నికల కోడ్ రావడంతో నిలిచిపోయిన, ట్రెజరీలో సిద్ధంగా ఉన్న డబ్బు విద్యార్థులకు ఈ కూటమి ప్రభుత్వం జమ చేయలేదు. రేపటి భవిష్యత్తు విద్యార్థులది. వారికి ప్రోత్సహాం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం సరికాదు. తల్లిదండ్రులు అప్పులు చేసి వారి పిల్లలను చదివిస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్లు కూడా లేదు. అందుకే ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఫిబ్రవరి 5న రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ తరపున నిరసన చేపడుతున్నాం’’ అని కొట్టు సత్యనారాయణ తెలిపారు...పవన్ కల్యాణ్ ఎన్నికల ముందు రాష్ట్రం శ్రీలంకలా అవుతుందని గగ్గోలు పెట్టి.. ఇప్పుడు లక్షల కోట్లు ప్రభుత్వం అప్పులు చేస్తుంటే నోరుమెదపట్లేదు. సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని సినీఫక్కిలో డైలాగులు చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేశారు. ఆర్బీకె ల ద్వారా రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చేవాళ్ళం. అన్నదాత సుఖీభవ అని 20వేలు ఇస్తామని చెప్పారు దాని ఊసే లేదు. ఇచ్చిన ఏ ఒక్క హామీ గురించి కూడా ఇంతవరకు మాట్లాడే పరిస్థితి లేదు. యువగళంలో లోకేష్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు 3000 నెలకి ఇస్తానని నమ్మపలికారు.ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, గోరుముద్ద, సంపూర్ణ పోషణ లాంటి పథకాలు కొనసాగిస్తామని ప్రక్కన పెట్టేసిన వ్యక్తి చంద్రబాబు. స్వలాభం, స్వార్థం, చేతకానితనంతో విజయవాడను ముంచేశారు. దాతలు ఇచ్చిన సొమ్మును కూడా వందల కోట్లు కాజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి 1 లక్షా 19 వేల కోట్లు ఇప్పటివరకు అప్పులు చేశామని చెబుతున్నారు. దీంతో పాటు మామూలుగా రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఒక్క హామీ ప్రజలకు ఇవ్వకుండా ఇదంతా ఎవరి ఖాతాల్లోకి వెళ్తుందో చెప్పాలి’’ అని కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు.‘‘సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను ఏవిధంగా మోసం చేశారో ప్రజలకు అర్థమవుతుంది. పొంతన లేని మాటలు, పొంతన లేని పనులు చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్. సీజ్ ద షిప్ అంటారు అది కేంద్ర ప్రభుత్వ పరిధి అని కూడా ఆయనకు తెలియదు. ప్రజలు ప్రస్తుతం ఎంత తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ఈ ప్రభుత్వానికి తెలుసా?. చంద్రబాబు 40 సంవత్సరాల అనుభవం ఏమైంది. మీరు ఆడుతున్న డ్రామాలు ప్రజలకు అర్ధమవుతుంది. తాడేపల్లిగూడెంను ఒక పేకాట హబ్ గా మార్చేశారు. ఏ మాత్రం భయం లేకుండా ప్రజాప్రతినిధులే అందులో పాల్గొనడం దారుణం’’ అని కొట్టు సత్యనారాయణ ధ్వజమెత్తారు. -
Amaravati: సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ.. అది దా మ్యాటరు!
అమరావతికి కొత్త కళ! ఇక అమరావతి రయ్, రయ్..!! ఇవి ఎల్లో మీడియాలో తరచూ వచ్చే శీర్షికలు కొన్ని. అమరావతిలో అది జరగబోతోంది..ఇది జరగబోతోంది అంటూ రియల్ ఎస్టేట్ హైప్ కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ జాకీ మీడియా ఊదరగొట్టేస్తోంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపడితే ఎవరూ కాదనరు. కాని అది ఏపీ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి చేస్తేనే అభ్యంతరం అవుతుంది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని కల్లబొల్లి కబుర్లు చెప్పిన పెద్దలు.. దీనికోసం వేల కోట్ల అప్పులు తెస్తున్న వైనం ఆయా వర్గాలను కలవరపరుస్తోంది. అమరావతి కోసం ప్రస్తుతానికి రూ. 50వేల కోట్ల అప్పు చేయాలని తలపెట్టి.. రూ. 31 వేల కోట్ల అప్పును సమీకరించడం.. అందులో రూ.11,467 కోట్ల పనులను చేపట్టే యత్నం చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్దిక సంక్షోభంలో ఉందని చెబుతున్నారు. 'తనకు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలని ఉన్నా, ఖజానా చూస్తే భయం వేస్తోందని’ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తారు. ప్రజలు ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకోవాలని.. సూపర్ సిక్స్ అమలులో ఉన్న కష్టాలను గమనించాలని ఆయన పరోక్షంగానో.. ప్రత్యక్షంగానో చెబుతూ వస్తున్నారు. కాని అప్పుచేసి అమరావతి మాత్రం నిర్మిస్తామని అంటున్నారు. తద్వరా కొన్నేళ్ల తర్వాత వచ్చే ఆదాయంతో ప్రజలకు స్కీములు అమలు చేస్తారట..! ఇది చెబితే నమ్మడానికి జనం మరీ అంత వెర్రివాళ్లా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధుల్లేవని, రోడ్ల మరమ్మతులకు డబ్బులు లేవని అంటున్నారు. అదే టైంలో ఏకంగా విద్యుత్ చార్జీలు.. పదిహేనువేల కోట్ల రూపాయల మేర పెంచుకున్నారు. గ్రామీన రోడ్లకు కూడా టోల్ గేట్లు పెడతామని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలు, భూముల విలువలు పెంచారు. ఆర్దికంగా ఇంత క్లిష్ట పరిస్థితి ఉంటే.. కేవలం అమరావతిలో అంత భారీ ఎత్తున వ్యయం చేయడం ఏమిటి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాజధానికి అవసరమైన భవనాలు నిర్మించుకుంటే సరిపోయేదానికి.. ఏకంగా కొత్త నగరం నిర్మిస్తామంటూ 33 వేల ఎకరాల మూడు పంటలు పండే భూమిని సేకరించారు. అదికాకుండా ప్రభుత్వ అటవీ భూమి మరో ఇరవై వేల ఎకరాలు ఉంది. దీనిని అభివృద్ది చేయడానికి, కేవలం మౌలిక వసతులు కల్పించడానికి లక్షల కోట్ల వ్యయం అవుతుందని చంద్రబాబే గతంలో చెప్పేవారు. తొలి దశకుగాను లక్షాతొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు కావాలని గత టరమ్ లోనే చంద్రబాబు కోరారు. ఈ విడత అధికారంలోకి వచ్చాక అమరావతిలో సుమారు 48 వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచారు. ఇక్కడ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, విద్యుత్,రిజర్వాయర్ల తదితర నిర్మాణాల కోసమే వేల కోట్లు వ్యయం చేయవలసి ఉంటుంది. ఇక భవనాల సంగతి సరేసరి. రకరకాల గ్రాఫిక్స్‌లో భవనాలను, డిజైన్ లను గతంలో ప్రచారం చేశారు. ఆ రకంగా వాటిని నిర్మించడానికి ఇంకెన్ని వేల కోట్లు అవసరం అవుతాయో తెలియదు!. ఈ ఖర్చుల నిమిత్తం కేంద్రం ద్వారా ప్రపంచ బ్యాంకు నుంచి 15వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నారు. ఇది కాకుండా ఇతర మార్గాల ద్వారా మరో పదహారువేల కోట్ల రూపాయలు సేకరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు విపక్షనేతగా ఉన్న సమయంలో పలుమార్లు ఈ ప్రాంతంలో పర్యటించి.. రాజధాని నిర్మాణానికి ఒక్క రూపాయి అవసరం లేదని, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించడానికి సిద్దం అవుతున్నారు. ప్రభుత్వం వద్ద డబ్బు ఉంటే ఎన్నివేల కోట్లు అయినా ఖర్చు చేయవచ్చు. ఈ స్థాయిలో డబ్బును కేవలం 29 గ్రామాలలోనే వ్యయం చేయడం ద్వారా కొన్నివేల మందికి మాత్రం ప్రయోజనం కలగవచ్చు. తనవర్గంవారికి, రియల్ఎస్టేట్ వ్యాపారులు కొందరికి లాభం రావొచ్చు. మరి ఏపీలో ఉన్న మిగిలిన కోట్ల మంది ప్రజల సంగతేమిటి?.అమరావతి ప్రాంత గ్రామాల రైతులకు ఇప్పటికే ప్రతి ఏటా కౌలు చెల్లిస్తున్నారు. వారికి పూలింగ్‌లో భాగంగా ప్యాకేజీ కూడా ఇచ్చారు. నిజానికి ఈ రకంగా ప్రభుత్వ డబ్బు భారీగా వినియోగించవలసిన అవసరం లేదని, రాజధానికి నాగార్జున యూనివర్శిటీ సమీపంలో అందుబాటులో ఉన్న సుమారు రెండు వేల ఎకరాలను వాడుకుంటే సరిపోతుందని చాలామంది సూచించారు. అయినా చంద్రబాబు మొండిగా ముందుకు వెళ్లారు. అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతుందని టీడీపీ వర్గాలు భావించాయి. తొలుత కొంత హైప్ వచ్చినా, ఆ తర్వాత కాలంలో అది అంతగా కనిపించడం లేదని అంటున్నారు. దీంతో అక్కడ పెట్టుబడి పెట్టి భూములు కొన్నవారికి ఆశించిన స్థాయిలో ప్రయోజనం దక్కడం లేదు. పైగా రియల్ ఎస్టేట్ మందగించిందన్న భావన ఏర్పడింది. హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కొంత తగ్గడం కూడా ప్రభావం చూపుతోంది. పైగా ఈసారి చంద్రబాబు ప్రభుత్వ ప్రచారాన్ని నమ్మి భూములు కొంటే ఉపయోగం ఉంటుందో, ఉండదో అనే సంశయం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మళ్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు. అయితే.. ఇది సాధారణ పద్దతిలో అయితే అభ్యంతరం లేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కట్టే పన్నులను ఇక్కడ ఖర్చు చేయడంపై ఇతర ప్రాంతాలలో సంశయాలు వస్తాయి. అప్పులు తెచ్చినా , ఆ రుణభారం రాష్ట్ర ప్రజలందరిపై పడుతుంది. ఒక్కచోటే కేంద్రీకృత అభివృద్ది జరిగితే ప్రాంతీయ అసమానతలు ఏర్పడే ప్రమాదం ఉంది. దానికి తోడు ఇతరప్రాంతాలలో ఉన్న కార్యాలయాలను తరలిస్తున్న తీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇదే టైంలో సూపర్ సిక్స్ హామీల గురించి మాట్లాడడం లేదు.టీడీపీ, జనసేనలు ఇచ్చిన సంయుక్త ఎన్నికల ప్రణాళికలో సూపర్ సిక్స్ గురించి ప్రముఖంగా ప్రకటించారు. ఆ సూపర్ సిక్స్ లోని అంశాలలో అమరావతి పాయింట్ లేదు. ఎన్నికల ప్రణాళికలో అమరావతిని అభివృద్ది చేస్తామని చెప్పినప్పటికీ.. సూపర్ సిక్స్‌లో లేకపోవడం గమనార్హమే. అలాంటప్పుడు చంద్రబాబు,పవన్‌లు దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి. సూపర్ సిక్స్‌లోని నిరుద్యోగ భృతి కింద రూ.3,000, మహిళా శక్తిలో ప్రతి మహిళకు రూ.1,500, తల్లికి వందనం పేరిట బడికి వెళ్లే ప్రతి బిడ్డకు రూ.15,000, రైతు భరోసా కింద రూ.20,000 ఇవ్వాల్సి ఉంది. ఆడవారికి ఉచిత బస్ ఊసే లేదు. గ్యాస్ సిలిండర్ల స్కీమ్‌ను అరకొరగానే అమలుచేశారు. వృద్దుల పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచారు. సూపర్ సిక్స్ కాకుండా ఎన్నికల ప్రణాళికలో సుమారు 175 వాగ్దానాలు ఉన్నాయి. వాటిలో బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్.. తదితర హామీలు ఉన్నాయి. ఈ హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే అమరావతికి ఎలా వస్తుందని ప్రజలు నిలదీయరంటారా?. ఇప్పటికే ఏడు నెలల్లో రూ.70,000 కోట్ల అప్పులు చేశారు. తొలుత సూపర్ సిక్స్ ,తదితర హామీలను నెరవేర్చిన తదుపరి ఎన్నివేల కోట్ల నిధులను అమరావతిలో ఖర్చు చేసినా ఎవరూ కాదనరు. ఒకవైపు విద్యుత్ ఛార్జీల పేరుతో అదనపు బాదుడు బాదుతూ, ఇంకో వైపు హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, పైగా తగ్గిస్తామని చంద్రబాబు ఒకటికి రెండుసార్లు చెప్పేవారు. ఇప్పుడేమో అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు.అయితే వైఎస్ జగన్ మాత్రం తన పాలనలో ప్రకటించిన ప్రకారం దాదాపు అన్ని హామీలు నేరవేర్చారు. ఆ పథకాల అమలుతో.. ప్రజల వద్ద డబ్బు ఉండేది. ఫలితంగా వ్యాపారాలు కూడా సాగేవి. కానీ అవన్నీ నిలిచిపోవడంతో మార్కెట్లో మనీ సర్క్యులేషన్ కూడా బాగా తగ్గింది. వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగడం లేదు. దాని ఫలితంగానే జీఎస్టీ నెలసరి ఆదాయం దాదాపు రూ. 500 కోట్లు తగ్గినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అమరావతిలో పనులు ప్రారంబిస్తే, ఆ ప్రాంతం వరకు కొంత ఆర్ధిక లావాదేవీలు జరగవచ్చు. కాని రాష్ట్రవ్యాప్తంగా ఏమీ చేయకుండా రాజదానిలో మాత్రం విలాసవంతమైన భవనాలు నిర్మించితే సరిపోతుందా?. జగన్ విశాఖలో రూ.400 కోట్లతో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే.. వృధా అని ప్రచారం చేసిన కూటమి నేతలు, ఇప్పుడు వేలు.. లక్షల కోట్లతో అమరావతిలో భవనాలు నిర్మిస్తామని చెబుతున్నారు. ఏది ఏమైనా అమరావతికి చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తే ఇచ్చుకోవచ్చు. కాని సూపర్ సిక్స్‌ను త్యాగం చేసి ఆ డబ్బంతటిని అమరావతి ప్రాంతానికి మళ్లీస్తే.. మిగిలిన ప్రాంతాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరగవచ్చు. ఒకప్పుడు అమరావతిని ఒక్క రూపాయి ప్రభుత్వ ధనం వెచ్చించకుండా నిర్మించవచ్చని గ్యాస్ కొట్టిన కూటమి పెద్దలు.. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం వేల కోట్ల ప్రజా ధనాన్ని మంచినీళ్ల మాదిరి ఖర్చు చేయడానికి సిద్దం అవుతున్నారు. అమరావతిలో పలు స్కాములు జరిగాయని గత ప్రభుత్వం పలు కేసులు పెట్టింది. వాటి పరిస్థితి ఏమైందో కూడా తెలియదు. కొత్తగా ఎన్ని స్కాములు జరుగుతాయో అనే సందేహం ఉంది. దానికి తగినట్లుగానే అమరావతిలో ఆయా నిర్మాణాల అంచనాలను సుమారు 30 శాతం వరకు పెంచారని వార్తలు వచ్చాయి. ఇది కూడా భవిష్యత్తులో పెను భారం కావచ్చు. ప్రజలు నిజంగా అధికారం కట్టబెట్టారో లేదంటే ఈవీఎంల మేనేజ్ మెంట్ జరిగిందో తెలియదుగాని.. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపట్ల బాధ్యతగా వ్యవహరించడం లేదని చెప్పొచ్చు. దానికి అమరావతి నిర్మాణ తీరు తెన్నులు, అందుకు పెడుతున్న వేల కోట్ల వ్యయమే నిదర్శనం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.