breaking news
-
హిజ్రాతో ప్రేమ.. నంద్యాలలో విషాదం
బొమ్మలసత్రం (నంద్యాల): హిజ్రాల చర్యలతో ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దంపతులు కోలుకోలేక మంగళవారం మృతిచెందారు. నంద్యాల ఎస్బీఐ కాలనీకి చెందిన సుబ్బరాయుడు(43), సరస్వతి(37) దంపతుల కుమారుడు సునీల్ బీటెక్ మొదటి సంవత్సరం ఫెయిలై ఆటో డ్రైవర్ల జత కట్టాడు. ఈనేపథ్యంలో హిజ్రాలతో తిరుగుతూ ఓ హిజ్రాతో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సునీల్‌ను తీసుకొచ్చి బంధువుల వద్దకు పంపారు. అప్పటి నుంచి హిజ్రాల బృందం సుబ్బరాయుడు దంపతులు నడుపుతున్న దుకాణం వద్దకు వచ్చి వికృత చేష్టలతో వేధించడం, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురై పురుగు మందు తాగారు. స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో బంధువులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి్పంచినా కోలుకోలేక దంపతులిద్దరూ మృతి చెందారు. ఏరియా ఆస్పత్రిలో గర్భిణి మృతి -
ఏరియా ఆస్పత్రిలో గర్భిణి మృతి
నర్సీపట్నం: నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో మంగళవారం పురిటి నొప్పులతో ఓ గర్భిణి ప్రాణాలు విడిచింది. దీనికి వైద్యులు, వైద్య సిబ్బందే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. సయ్యద్ మహాగున్నిషా అలియాస్ దేవి(30), నానాజీది ఎస్.రాయవరం మండలంలోని చిన్నగుమ్ములూరు. వీరిద్దరిది మతాంతర వివాహం. వీరికి మూడేళ్ల పాప ఉంది. దేవికి మొదటి కాన్పు సాధారణంగానే జరిగింది. రెండో కాన్పు కోసం ఏరియా ఆస్పత్రిలో సోమవారం మధ్యాహ్నం చేరింది. రాత్రి 8 గంటలకు డాక్టర్ వచ్చి పరీక్షించి వెళ్లారు. రాత్రి 12 గంటల సమయంలో వైద్య సిబ్బంది వచ్చి టాబ్లెట్ ఇచ్చారు. విపరీతమైన నొప్పులు రావడంతో ఆపరేషన్ చేయాలని గర్భిణీ ఎంత మొత్తుకున్నా వైద్యులు కానీ, సిబ్బంది కానీ పట్టించుకోలేదని మృతురాలి అత్త లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రిపరేషన్ వార్డులో నైట్ డ్యూటీ సిబ్బంది లేరని, మూడు గంటల సమయంలో లేపి తీసుకొచి్చనా.. ఏం పర్లేదు.. డెలివరీ అయిపోతుందని చెప్పి వెళ్లిపోయారని అత్త, బంధువులు కన్నీళ్లపర్యంతమయ్యారు. ఉదయం 7 గంటల సమయంలో కడుపులో బిడ్డతో సహా గర్భిణి మరణించింది. దీంతో భర్త నానాజీ సొమ్మసిల్లి పడిపోయాడు. గర్భిణి మరణానికి వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఇన్చార్జి సూపరింటెండెంట్ సత్యనారాయణ, స్త్రీ వైద్య నిపుణులు లక్ష్మణ్‌రావు బంధువులకు నచ్చజెప్పేందుకు యత్నిoచారు. అయినా ఫలితం లేదు. దీంతో వైద్యులు, బంధువుల మధ్య వాగ్వాదం జరిగింది.ఎస్ఐ ఉమామహేశ్వరరావు, సిబ్బందితో ఆస్పత్రికి చేరుకుని మృతురాలి బంధువులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీనిపై ఇన్చార్జి సూపరింటెండెంట్ సత్యనారాయణను వివరణ కోరగా వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని చెప్పారు. -
పార్శిల్లో మృతదేహం కేసులో పురోగతి
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో పార్శిల్లో మృతదేహం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. గత గురువారం తులసికి చెక్క పెట్టెలో ఓ పార్శిల్ వచి్చంది. విద్యుత్ సామాన్లనుకుని దానిని తెరచి చూడగా దానిలో గుర్తు తెలియని మృతదేహం ఉంది. రూ.1.30 కోట్లు ఇవ్వకుంటే ఇబ్బంది పడతారని హెచ్చరిస్తూ ఆ పెట్టెకు ఓ లెటర్ కూడా అంటించి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న తులసి మరిది(సోదరి భర్త) శ్రీధరవర్మ అలియాస్ సిద్ధార్థవర్మ ఫొటోను, నేరం జరిగాక అతడు ప్రయాణించిన ఎరుపు రంగు కారు ఫొటోలను జిల్లా పోలీసు శాఖ సోమవారం విడుదల చేసింది. ఎవరైనా నిందితుడిని గానీ, కారునుగానీ గుర్తిస్తే జిల్లా పోలీసు శాఖ వారికి సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో పోలీసులు కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో ఉన్న నిందితుడు శ్రీధరవర్మను, మరో మహిళను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అలాగే పార్శిల్లో వచ్చిన మృతదేహం పశి్చమగోదావరి జిల్లా కాళ్ల మండలం గాం«దీనగర్‌కు చెందిన బర్రే పర్లయ్యదిగా గుర్తించారు. పర్లయ్య చనిపోవడానికి రెండు రోజుల ముందు శ్రీధరవర్మ దగ్గరకు పనికోసం వెళ్లినట్టు చెబుతున్నారు. -
ప.గో.: పార్శిల్ మృతదేహాం కేసులో వీడిన మిస్టరీ!
పశ్చిమ గోదావరి: ఉండి మండలం యండగండి గ్రామంలో మృతదేహం పార్శిల్ కేసు మిస్టరీ దాదాపుగా వీడినట్లే కనిపిస్తోంది. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. అలాగే ఆస్తి తగాదాల కోణంలోనూ ఈ కేసును విచారణ జరుపుతున్నారు.మృతదేహాన్ని కాళ్ల మండలం గాంధీనగర్‌కు బర్ల పర్లయ్యదిగా గుర్తించారు. అలాగే.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సిద్ధార్థ్ వర్మ కోసం గాలింపు ముమ్మరం చేశారు.సాగి తులసి అనే మహిళకు ప్రభుత్వం నుంచి స్థలం మంజూరు కాగా ఇల్లు నిర్మిస్తోంది.. ప్రస్తుతం ఆ ఇల్లు ప్లాస్టింగ్ స్టేజ్‌లో ఉంది. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం క్షత్రియ సేవా సమితికి ఆమె దరఖాస్తు చేసుకుంది. మొదటి విడతలో సేవా సమితి టైల్స్ అందజేసింది. మరోసారి ఆర్థిక సాయం కోసం మహిళ దరఖాస్తు చేసుకోగా.. పార్శిల్లో విద్యుత్ సామగ్రికి బదులు మృతదేహం వచ్చింది. పార్శిల్లో ఒక ఉత్తరం కూడా ఉన్నట్లు గుర్తించారు. అందులో రూ.1.30 కోట్లు చెల్లించాలని, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. దీంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పార్శిల్ పెట్టెలో సుమారు 45 సంవత్సరాల వయసున్న గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం సగ భాగం ఉన్నట్లు గుర్తించారు.ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జిల్లా ఎస్పీ నయీం అస్మి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా.. అందులో హత్య జరిగిందని తేలింది. దీంతో.. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. విచారణలో కృష్ణాజిల్లా మల్లంపూడి గ్రామానికి చెందిన సిద్థార్థ వర్మపైకి అనుమానం మళ్లింది.మూడు పేర్లు.. ముగ్గురు భార్యలుఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నవ్యక్తికి ఏకంగా మూడు పేర్లు.. ముగ్గురు భార్యలు ఉన్నట్టు తెలిసింది. కృష్ణాజిల్లా మల్లంపూడి గ్రామానికి చెందిన తిరుమాని సుధీర్ వర్మకు ముందుగా కాళ్ల మండలం ఎస్సీ బోస్ కాలనీ ఇస్కులంక గ్రామానికి చెందిన మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. సుధీర్ వర్మ తన పేరును శ్రీధర్ వర్మగా మార్చుకుని యండగండికి చెందిన రేవతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం సిద్ధార్థవర్మగా పేరు మార్చుకుని మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరికి పదేళ్ల వయసున్న కుమార్తె ఉంది.ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్న శ్రీధర్‌వర్మకి రెండో భార్య రేవతికి అక్క అయిన సాగి తులసితో ఆస్తి కోసం తగాదా ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమెకు మృతదేహాన్ని పంపించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. బర్ల పర్లయ్య ఎందుకు చంపాడు?.. ఎలా చంపాడు? ఆ మృతదేహాన్ని తులసికి ఎందుకు పంపాడనే విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
మద్యం మత్తు.. ప్రాణాలు చిత్తు
ఓబులవారిపల్లె : మద్యం మత్తు, అతి వేగం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. మద్యం తాగి ఆటోను నడుపుతూ ఎదురుగా వస్తున్న బైకును ఢీ కొనడంతో రాజంపేట మండలం, భువనగిరిపల్లి గ్రామానికి చెందిన కోలాటం నరసింహులు (42), భార్య సుజాత (38) దుర్మరణం చెందారు. వారి కుమారుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాలు ఇలా.. భువనగిరిపల్లికి చెందిన కోలాటం నరసింహులు తన అత్తగారి ఊరైన ఓబులవారిపల్లి మండలం, వై.కోట గ్రామానికి వచ్చి తన భార్య, కుమారుడు చరణ్, తమ్ముడి కుమార్తె త్రిషాన్వీతో కలిసి పల్సర్ బైకుపై ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో వై.కోట నుంచి బయల్దేరారు. రెడ్డిపల్లి చెరువుకట్ట వద్దకు రాగానే టాటా ఏస్ లగేజీ ఆటో వేగంగా వచ్చి బైకును ఢీ కొంది. దీంతో బైకు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. నరసింహులు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన భార్య సుజాతను రాజంపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. కుమారుడు చరణ్ తేజ్ (12) పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. నరసింహులు తమ్ముడి కుమార్తె త్రిషాన్వీ చికిత్స పొందుతోంది. మద్యం మత్తులో బైకును వేగంగా ఢీ కొని టాటా ఏస్ వాహనం వెళ్లిపోయింది. ఆటో కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంటి నుంచి బయల్దేరిన అరగంటలోనే కుమార్తె చనిపోయిందన్న చేదు వార్తను విని సుజాత తల్లిదండ్రులు, బంధువులు గుండెలు పగిలేలా రోదించారు. భువనగిరిపల్లిలో బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నరసింహులుకు భార్య సుజాత, కుమారుడు చరణ్ తేజ్ ఉన్నారు. గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్న నరసింహులు ఇటీవల అయ్యప్పస్వామి మాల ధరించి శబరిమలైకు వెళ్లి వచ్చి అత్తగారింటికి వెళ్లి వస్తుండగా ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో వై.కోట, భువనగిరిపల్లి గ్రామాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ పి.మహేష్ తెలిపారు. -
ఇంటి ముందు లెటర్..యమడేంజర్
పలమనేరు: ఇప్పటిదాకా స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌కు లింకులు, ఫేస్బుక్ హ్యాకింగ్స్, బ్యాంకు అధికారుల పేరిట ఫేక్ కాల్స్, ఓటీపీలు, మన ఫోన్ ఎవరికైనా కాల్ కోసం ఇస్తే దాంట్లో సెట్టింగ్స్ మార్చేయడం, ఫేక్ వెడ్డింగ్ ఇన్విటేషన్స్, ఫోన్ హ్యాకింగ్, ఏటీఎం సెంటర్ల వద్ద మోసాలు, తాజాగా బయటి ప్రాంతాల్లో విద్యనభ్యసిస్తున్న లేదా ఉద్యోగాల చేస్తున్న వారి నంబర్ల ఆధారంగా వారి కుటుంబీకులకు డిజిటల్ అరెస్ట్‌లు సర్వసాధారణంగా మారాయి. ఈ సైబర్ నేరాలకు సంబంధించి పోలీసులు, వారు ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్లు సైతం బాధితులను రక్షించలేకపోతున్నాయి. తాజాగా మరోకొత్త మోసం వెలుగులోకి వచ్చింది. దీన్ని ఎలాంటి వారైనా నమ్మి మోసపోవాల్సిందే. మీ ఇంటి ముందు ఓ లెటర్‌ను పడేసి.. ఇంటిముందు ఓ లెటర్ లేదా కొరియర్ ఫామ్ పడి ఉంటుంది. దానిపై డేట్, వేబిల్ నంబరు, కొరియర్ లేదా పార్సిల్ కంపెనీ పేరు ఉంటుంది. అందులోని స్కానర్‌ను స్కాన్ చేసి చేంజ్ యువర్ డెలివరీ డేట్, ఆల్టర్నేట్ అడ్రస్ తదితర వివరాలు ఉంటాయి. దీన్ని నమ్మి మనకేమైనా పార్సిల్ లేదా లెటర్, వస్తువులు వచ్చాయేమోనని భావించి మన స్మార్ట్‌ఫోన్ ద్వారా దానిపై ఉన్న క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేశామో ఇక అంతే సంగతులు. వెంటనే మన ఫోన్ హ్యాకర్ల గుప్పెట్లోకి పోతుంది. మనఫోన్‌లో జరిగే అన్ని లావాదేవీలను హ్యాకర్స్ డార్క్‌నెట్ ద్వారా గమనిస్తుంటారు. ఇందుకోసం పెద్ద నెట్వర్క్ ఉంటుంది. చాలామంది సాఫ్ట్వేర్లు ఇందులో పనిచేస్తూ మనం సెల్లో చేసే పనులను గమనిస్తుంటారు. బహుశా మనం ఫోన్‌పే, గూగుల్‌పే నుంచి ఎవరికైనా డబ్బు పంపి మన పిన్ను ఎంటర్ చేశామంటే ఆ పిన్ను వారు గుర్తిస్తారు. ఆపై మన ఖాతాలో ఉన్న డబ్బును మనకు తెలియకుండానే కాజేస్తారు. మన సెల్‌కు డబ్బులు కట్ అయినట్లు ఓ ఎస్ఎంఎస్ మాత్రం వస్తుంది. ఆపై మనం ఏమీ చేయాలన్నా మన సెల్ హ్యాకర్ల అదుపులో ఉన్నందున మనం ఏం చేసినా లాభం ఉండదు. నెల రోజులుగా ఈ మోసాలు.. బెంగళూరులో గత నెల రోజులుగా ఇలాంటి ఫేక్ లెటర్లు ఇంటి ముందు పడి ఉండడం, వాటిని స్మార్ట్‌ఫోన్‌లో స్కాన్ చేసిన వారి ఖాతాల్లో డబ్బు మాయం కావడం ఎక్కువగా జరుగుతోంది. దీంతో ఈ విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. మెట్రోపాలిటన్ సిటీలో ఇప్పుడు జరుగుతున్న ఇలాంటి సైబర్ మోసాలు మన చెంతకు చేరడం ఎన్నో రోజులు పట్టదు. మన ఇళ్ల వద్ద ఏదైనా స్కానింగ్ ఉన్న లెటర్ వస్తే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
గుంటూరులో టీడీపీ నేత దాష్టీకం
లక్ష్మీపురం: టీడీపీ దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి. గుంటూరు డిప్యూటీ మేయర్, తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి వనమాల వజ్రబాబు (డైమండ్ బాబు) సోదరి నివాసం ఉంటున్న ఇంటిని ఆక్రమించేందుకు యత్నించిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయిబాబారోడ్డు శాంతినగర్ 2వ లైన్లో డైమండ్ బాబు సోదరి పతకమూరి వజ్రకుమారి 2008 నుంచి నివాసం ఉంటున్నారు. ఆమె భర్త సీతారామయ్య 2012లో అనారోగ్యంతో మృతి చెందారు. వజ్రకుమారి పక్షవాతం బారినపడి చికిత్స పొందుతోంది. ఆమె ఉంటున్న ఇంటి స్థలానికి సంబంధించి పాములూరి రామయ్య, పత్రి ఆనంద్‌మోహన్ అనే వారిమధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. కాగా.. యనమల విజయ్‌కిరణ్ అనే వ్యక్తి అధికార పార్టీ అండదండలతో పేరం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద ఆ స్థలాన్ని కొనుగోలు చేశానంటూ నకిలీ దస్తావేజులను సృష్టించి ఆదివారం మధ్యాహ్నం వజ్రకుమారి, కొడుకు కిరణ్‌కుమార్, కుమార్తె రాణి, కోడలు రమ్య భోజనం చేస్తున్న సమయంలో మాస్క్‌లు ధరించిన మహిళలు నాలుగు ఆటోల్లో వచ్చి ఆ ఇంట్లోకి చొరబడ్డారు. వజ్రకుమారి కుటుంబ సభ్యుల నుంచి తినే కంచాలను లాగేసుకుని అందరినీ ఇంటినుంచి లాక్కొచ్చి బయటకు గెంటేశారు. గృహోపకరణాలు సైతం బయట పడేసి దాడిచేసి గాయపరిచారు. దీంతో బాధితురాలు వజ్రమ్మ, కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం టీడీపీ నేత విజయ్‌కిరణ్ అనుచరులైన ఇద్దరు మహిళలు, ముగ్గురు యువకులు ఆ ఇంట్లోకి చొరబడి తలుపులు వేసుకున్నారు. ఈవిషయం తెలుసుకున్న నగర డిప్యూటీ మేయర్ డైమండ్‌బాబు పట్టాభిపురం సీఐ, వెస్ట్ డీఎస్పీ, జిల్లా ఎస్పీలకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి బాధితురాలు కుటుంబ సభ్యులు రోడ్డుపై కన్నీటి పర్యంతమై జరిగిన విషయాన్ని చెప్పారు. దీంతో పోలీసులు విజయ్‌కిరణ్ అనుచరులను అక్కడినుంచి పంపించేశారు. అనంతరం అక్కడకు చేరుకున్న డిప్యూటీ మేయర్ డైమండ్‌బాబును సీఐ వీరేంద్ర వెళ్లిపోవాలని బలవంతం చేశారు. దీంతో డైమండ్‌బాబు తన సోదరి ఇంటిని కబ్జా చేసిన వారికి పోలీసులు బందోబస్తు కల్పించడం సరికాదని, వారందరినీ బయటకు పంపించాలని సీఐ వీరేంద్రను కోరా>రు. తామే ఆ ఇంటిని ఖాళీ చేయించామని, మీరు ఇక్కడ ఉండటం కుదరదన్నారు. తన సోదరి కుటుంబాన్ని రోడ్డుపై కూర్చోబెట్టడం సరికాదని డైమండ్‌బాబు అనటంతో సీఐ వీరేంద్ర ఆయనను బలవంతంగా జీప్ ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. సమాచారం తెలుసుకున్న మేయర్ కావటి మనోహర్‌నాయుడు, ఈస్ట్ ఇన్చార్జి నూరిఫాతిమా, పొన్నూరు నియోజకవర్గ ఇన్చార్జి అంబటి మురళీకృష్ణ, పలువురు కార్పొరేటర్లు పట్టాభిపురం స్టేషన్‌కు చేరుకున్నారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ జోక్యంతో డైమండ్‌బాబును విడిచి పెట్టారు. కబ్జాదారుడికి పోలీసులు వత్తాసు పలకడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం
రాయచోటి/కడప అర్బన్: అన్నమయ్య జిల్లా రాయచోటి రూరల్ మండలం మాధవరం–కాటిమాయకుంట గ్రామాల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. పేల్చిన తుపాకీ గుళ్లు పూసలు, చిక్కు వెంట్రుకల వ్యాపారుల కడుపుల్లో దూసుకుపోయాయి. ఈ ఘటనలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరొకరు మృత్యువాత పడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో అటవీ ప్రాంత ప్రదేశంలో తుపాకీని పేలచ్చారు. అసలు ఆ సమయంలో గ్రామాలు తిరిగి పూసలు అమ్ముకునే వారికి ఆ అటవీ ప్రాంతంలో పనేముంది.. వీరినే తుపాకులతో మూడు సార్లు ఎందుకు కాల్చారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివరాలలోకి వెళ్లితే... సంబేపల్లె మండల కేంద్రంలో సల్ల రమణ (30), నీలకంఠ హనుమంతు(45) కుటుంబంతో కలిసి చుట్టుపక్కల గ్రామాలలో పూసలు, చిక్కు వెంట్రుకలు, డబ్బా రేకులతో తయారుచేసిన కొన్ని పరికరాలను అమ్ముకుని జీవనం సాగించేవారు. అలాగే వారికి కొన్ని మేకలు కూడా ఉన్నాయి. స్థానికంగా మేకలకు తగిన ఆహారం లేకపోవడంతో రాయచోటి రూరల్ మండల పరిధిలోని కాటిమాయకుంట అటవీ ప్రాంత పరిధిలో వాటిని మేపుకుంటూ అక్కడే జీవనం సాగిస్తున్నారు. ఇదే క్రమంలో సమీప గ్రామాల్లో పర్యటిస్తూ చిరు వ్యాపారం ద్వారా బియ్యం, డబ్బులు పొంది కుటుంబాన్ని పోషించుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు కొండ అవతల ఉన్న మాధవరం గ్రామ పరిధిలోని మద్దెలకుంట గ్రామానికి బయలు దేరినట్లు ప్రమాదంలో గాయపడిన రమణ తెలిపారు. ఐదు గంటల సమయంలో రెండు గ్రామాల మధ్యలో ఉన్న అటవీ ప్రాంతంలో ఇద్దరం నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా తుపాకీ తూటాలు మా పొట్టల్లోకి దూసుకు వెళ్లాయన్నారు. ఈ దాడిలో సల్ల రమణ(30) కడుపులోకి తూటాలు చొచ్చుకెళ్లాయి. అలాగే పక్కన ఉన్న నీలకంఠ హనుమంతు(45) కడుపులోకి మరో తూటా దూసుకు వచ్చిందని బాధితుల నోట వినిపించాయి. తూటాలకు గాయపడి రక్తం పారుతున్నా వాటిని బిగ పట్టుకుని అక్కడ నుంచి కేకలు వేస్తూ కాటిమాయకుంట సమీపంలో తామున్న ప్రదేశాలకు (గుడారాల వద్దకు) చేరుకున్నామన్నారు. అక్కడ నుంచి ఆటోలో రక్తంతో తడిచిపోయిన వారిద్దరు చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. ఇరువురికీ కడుపులో తూటాలు ఉండటంతో మెరుగైన అత్యవసర చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నీలకంఠ హనుమంత మృతిచెందాడు. రమణ పరిస్థితి విష మంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే తుపాకులతో కాల్చిన ప్రదేశంలో ఎవరున్నది చూడలేదని, సమీపంలో స్కూటర్ ఉన్నట్లు గుర్తించామని వారు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.సంఘటనా స్థలాన్ని సందర్శించిన డీఎస్పీతుపాకులతో కాల్చిన ప్రదేశాన్ని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, సీఐ చంద్రశేఖర్ సందర్శించారు. సంఘటన జరిగిన ప్రదేశాన్ని పూర్తిగా పరిశీలించడంతో పాటు గ్రామ పరిధిలో నాటు తుపాకులు ఉపయోగించే వారి వివరాలను సేకరించాలని కింది స్థాయి సిబ్బందిని డీఎస్పీ ఆదేశించారు. అలాగే జాగిలాలతో ఆ ప్రాంతంలోని ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తుపాకులతో కాల్చిన వారు అడవి జంతువుల కోసం వచ్చారా? లేక మరేదైనా కుట్ర కోణం దాగి ఉందా అన్న అనుమానాలపై విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. జరిగిన సంఘటనపై రాయచోటి అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. మూడు బృందాలుగా ఏర్పడి సంఘటనకు దారి తీసిన పరిస్థితులపై విచారణ సాగిస్తున్నట్లు ఆయన వివరించారు.భిక్షమెత్తుకుని జీవనం సాగిస్తున్నాంమా జీవనం ఊరూరూ తిరిగి చిక్కు వెంట్రుకలు సేకరించుకుంటూ, పూసలు అమ్మడం, డబ్బా రేకులతో తయారు చేసిన చాటలు అమ్ముకోవడం, వారిచ్చిన చిల్లర, బియ్యంతో కుటుంబాన్ని పోషించుకోవడం మా వృత్తి అని బాధితుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వీటికి తోడు కొన్ని మేకలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తుపాకీ తూటాలకు గాయపడ్డ మా బిడ్డలను రక్షించుకోవడానికి మా దగ్గర ఆర్థికస్తోమత లేదంటూ ఆ మహిళలు ఆసుపత్రి ఆవరణంలో బోరున విలపించారు. మా బిడ్డలపై ఎందుకు కాల్పులు జరిపారో తెలియదని వాపోయారు.వ్యాపారులే టార్గెట్‌గా దుండగులు రెచ్చిపోయారు. ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సరిహద్దున ఉన్న అటవీ ప్రాంతంలో తుపాకుల కాల్పులకు అక్కడి వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో కలకలం సృష్టించింది. -
అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం..
సాక్షి, అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లాలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కొందరు గుర్తు తెలియని దుండగులు వ్యాపారులను టార్గెట్ చేసి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వ్యాపారులు హనుమంతు, రమణకు గాయాలయ్యాయి.వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలోని రాయచోటి మండలం మాధవరం గ్రామం మద్దెలకుంట దగ్గర గుర్తు తెలియని దుండగులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. పాత సామాగ్రి వ్యాపారులపై నాటు తుపాకితో కాల్పులు జరిపారు. వీరి కాల్పుల్లో హనుమంతు (50), రమణ (30) తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం, వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారిని కడపలోని రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హనుమంతు మృతిచెందగా.. రమణి ప్రాణాల కోసం పోరాడుతున్నట్టు వైద్యులు వెల్లడించారు.ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలానికి రాయచోటి డీఎస్పీ కృష్ణ మోహన్ సహా సీఐలు చేరుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరికాసేపట్లో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా చేరుకుంటుందని తెలిపారు. ఘటన నేపథ్యంలో అక్కడ పోలీసు బలగాలు మోహరించాయి. -
చిన్నారిని చిదిమేసిన సర్కారు నిర్లక్ష్యం
కొత్తపల్లి: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖపై టీడీపీ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీవ్ర నిర్లక్ష్యానికి ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారి బలైంది. 108 అంబులెన్సుల నిర్వహణలో ప్రభుత్వం చేస్తున్న అనవసర రాజకీయాలు ఈ దారుణానికి పరోక్ష కారణం. అందుబాటులో 108 అంబులెన్స్ లేకపోవడంతో జరిగిన జాప్యంవల్ల సకాలంలో సరైన చికిత్స అందక తమ కుమార్తె మరణించిందని చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాకినాడ జిల్లాలో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన వివరాలు ఏమిటంటే.. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో ప్రముఖ ప్రార్థనాలయానికి చెందిన పాస్టర్ కుమార్తె రత్నప్రకాశకు పిఠాపురం మండలం చిత్రాడకు చెందిన జోగి షారోన్కుమార్తో వివాహమైంది. వీరు ప్రస్తుతం కృష్టా జిల్లా పామర్రు నియోజకవర్గం వీరంకిలాకు గ్రామంలో ఉంటున్నారు. వీరి కుమార్తె బెట్సీ జయకీర్తన (3) కొద్దిరోజులుగా ఉప్పాడలోని తన అమ్మమ్మ ఇంటి వద్ద తల్లితో కలిసి ఉంటోంది. క్రిస్మస్ వేడుకలు సమీపించడంతో శనివారం ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మేడపై ఉన్న పాత చెక్క బీరువాను కిందకు దింపి, పైన గదులు శుభ్రపరుస్తున్నారు. కింద ఆడుకుంటున్న జయకీర్తన చెక్క బీరువా గెడను పట్టుకుని వేలాడింది. అంతే.. ఒక్కసారిగా బీరువా ఆమె మీద పడింది. చిన్నారి ఏడుపు విని పరుగున వెళ్లిన కుటుంబ సభ్యులు ఆమెను బయటకుతీసి కొత్తపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించడంతో 108 అంబులెన్సుకు ఫోన్‌చేశారు. అయితే, అది అందుబాటులో లేకపోవడంతో కొత్తపల్లి ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఆ చిన్నారిని బతికించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ 108 రాకపోవడంతో చావుబతుకుల్లో ఉన్న చిన్నారిని కుటుంబ సభ్యులు ప్రైవేటు అంబులెన్సులో కాకినాడకు తరలించారు. మార్గంమధ్యలోనే జయకీర్తన ప్రాణాలు విడిచింది. అప్పటివరకూ ఆడుకుంటూ కేరింతలు కొట్టిన ఆ చిన్నారి అంతలోనే మరణించడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆనందంగా పండగ జరుపుకోవాల్సిన సమయంలో పండంటి బిడ్డను పోగొట్టుకున్నామంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్నారి మృతదేహాన్ని వీరంకిలాకులకు తరలించారు. సకాలంలో 108 అంబులెన్సు వచ్చి ఉంటే తమ పాప బతికేదని తల్లి రత్నప్రకాశ విలపించింది. -
విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు
సాక్షి,విశాఖ : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. కిరండోల్-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బాలికల అక్రమణ రవాణా జరుగుతుందనే సమాచారంతో రైల్వే పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 11మంది మైనర్లను రక్షించారు. బాలికల్ని తమిళనాడుకు తరలిస్తున్న ముఠాను నిందితుడు రవి బిసోయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఈ దర్యాప్తులో ఒరిస్సాలోని నవరంగ్ పూర్ ప్రాంతానికి చెందిన చిన్నారులుగా గుర్తించారు. పూర్తి స్థాయి దర్యాప్తు కోసం విశాఖ రైల్వే పోలీసులు కేసును ఒరిస్సా పోలీసులకు అప్పగించారు. -
ఆటోను ఢీకొన్న మోటార్ బైక్.. ఇద్దరు విద్యార్థులు మృత్యువాత
తవణంపల్లె: చిత్తూరు, కాణిపాకం రోడ్డు సత్తారు బావి సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. తవణంపల్లె ఎస్ఐ చిరంజీవి కథనం మేరకు.. మండలంలోని ముత్తరపల్లె గ్రామానికి చెందిన గోవిందు కుమారుడు సాయితేజ (19), మైనగుండ్లపల్లెకు చెందిన ప్రసాద్‌రెడ్డి కుమారుడు హర్ష (19) ఇద్దరు స్నేహితులు. వీరిద్దరూ చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. శుక్రవారం సాయితేజ తన మోటార్ సైకిల్లో తన స్నేహితుడు హర్షను వెనుక కూర్చోబెట్టుకుని పరీక్ష రాయడానికి కాలేజ్‌కు బయలుదేరారు. ఈ తరుణంలో సత్తారు బావి సమీపంలో ముందు వెళ్తున్న బస్సును అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను వేగంగా ఢీకొన్నారు. ప్రమాదంలో సాయితేజ, హర్షకు బలమైన గాయాలు కావడంతో తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. దీంతో క్షతగాత్రులను 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం చిత్తూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు నిర్థారించారు. తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు, గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. -
విస్తుగొలిపే ఘటన: పార్శిల్లో మృతదేహం
ఉండి: పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో డెడ్‌బాడీ పార్శిల్‌గా రావడం తీవ్ర కలకలం రేపింది. ఓ మహిళకు వచ్చిన పార్శిల్‌ను తెరిచి చూడగా అందులో మృతదేహం కనిపించింది. దీంతో గుండె జారినంత పనైన సదరు మహిళ.. ఇరుగు పొరుగు వారికి చెప్పడంతో పాటు పోలీసులకు సమాచారం అందించింది.ఉండి మండలం యండగండికి చెందిన తులసి సాగి అనే మహిళకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది. అయితే ఆ ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయంలో భాగంగా రాజమండ్రి(రాజమహేంద్రవరం) క్షత్రియ సేవా సమితికి దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తువుల్ని పార్శిల్ ద్వారి ఆ సంస్థ పంపిస్తోంది. దీనిలో భాగంగా తొలి విడతో టైల్స్ పంపించగా, రెండో విడతలో విద్యుత్ సామాగ్రి పంపిస్తున్నామని చెప్పారు. అయితే ఇక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. రెండో విడతలో రావాల్సిన విద్యుత్ సామాగ్రి స్థానంలో ఒక మృతదేహం పార్శిల్‌గా వచ్చింది.ఒక ఆటో డ్రైవర్ తీసుకొచ్చిన ఆ పార్శిల్‌ను ఓపెన్ చేసి చూడగా అందులో గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. దాంతో పాటు కోటి రూపాయలకు పైగా తమకు చెల్లించాలనే లెటర్ కూడా ఆ పార్శిల్లో ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పార్శిల్ ప్యాకింగ్ దగ్గర్నుంచి పార్శిల్ తీసుకొచ్చిన వ్యక్తి వరకూ అందర్నీ పిలిచి ఆరా తీస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయిని మృతి
చక్కటి ప్రభుత్వ ఉద్యోగం. ఇష్టమైన వ్యక్తితో వివాహం. బంగారం లాంటి ఇద్దరు సంతానం. అన్నీ సాఫీగా సాగుతున్న ఆమె జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. వేరే వాహనం చేసిన తప్పునకు ఆమె జీవితం బలైపోయింది. ఏడాది కిందటి వరకు చిత్తూరులో టీచర్‌గా పనిచేసిన ఆమె ఇంటికి దగ్గరగా ఉండాలని కోరి మరీ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. కానీ అంతలోనే విధి వెక్కిరించి ఆమెను తీసుకెళ్లిపోయింది. టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం పాకివలస గ్రామ సమీప జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కలి మండలం సన్యాసిపేట ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు సంపతిరావు త్రివేణి(30) మృతి చెందా రు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆమదాలవలస మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన త్రివేణి చిత్తూరు జిల్లాలో పనిచేస్తుండేవారే. ఏడాది కిందటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకుని టెక్కలి మండలం సన్యాసిపేట గ్రామ ప్రభుత్వ పాఠశాలకు వచ్చారు. ఆమె స్వగ్రామం నుంచి పాఠశాలకు రోజూ రాకపోకలు సాగిస్తున్నారు. తిమ్మాపురం నుంచి కోటబొమ్మాళి వరకు బస్సులో వచ్చి.. అక్కడ ఉంచిన తన స్కూటీపై బడికి వెళ్లేవారు. బుధవారం కూడా కోటబొమ్మాళి నుంచి తన పాఠశాలకు వెళ్లేందుకు గాను టెక్కలి వైపుగా స్కూటీపై బయల్దేరారు. అదే సందర్భంలో పలాస నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న ఏపీ 39 జేక్యూ5568 నంబర్ గల కారు జాతీయ రహదారిపై అతివేగంగా దూసుకెళ్తూ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలి రోడ్డులో వెళ్తున్న త్రివేణి బండిని ఢీకొని అప్రోచ్ రోడ్డులోకి వెళ్లి బోల్తా కొట్టింది. ప్రమాదంలో టీచర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు. కారులో ఉన్న ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు.విషయం తెలుసుకున్న టెక్కలి మండల ఎంఈఓలు తులసీరావు, చిన్నారావు మృతదేహాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయురాలి మృతిపై పలు ఉపాధ్యాయ సంఘాలు విచారం వ్యక్తం చేశాయి. త్రివేణి ఏడేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. టీచర్ చనిపోయారని తెలిసి సన్యాసిపేట వాసులు ఘట నా స్థలానికి చేరుకుని రోదించారు. కోటబొమ్మాళి ఎస్ఐ బి.సత్యనారాయణ కేసు నమోదు చేశారు. పిల్లలను అంగన్వాడీలో ఉంచి..ఆమదాలవలస: మున్సిపాలిటీ ఒకటో వార్డు తిమ్మాపురం గ్రామానికి చెందిన ఉపాధ్యాయిని సంపతిరావు త్రివేణి (30) రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పెద్ద కుమార్తె చైత్ర, చిన్న కుమార్తె ఇషికలను అంగన్వాడీ కేంద్రంలో విడిచిపెట్టి ఆమె స్కూల్‌కు బయల్దేరారు. అంతలోనే ఆమె చనిపోయారన్న వార్త తెలియడంతో భర్త సింహాచలంతో పాటు స్థానికులు నిశ్చేషు్టలయ్యారు. సాయంత్రానికి అమ్మ వచ్చేస్తుందని ఎదురు చూస్తున్న ఆ చిన్న పిల్లలను చూసి కంట తడి పెట్టారు. వడ్డీ ఆశచూపి.. నట్టేట ముంచి.. -
యువతి ఆత్మహత్య.. ఆమెను రక్షించబోయి స్నేహితురాలి దుర్మరణం
పెనుకొండ: ఓ యువతి ఆత్మహత్యచేసుకుంటుంటే.. ఆమెను కాపాడుకునే క్రమంలో మరో యువతి దుర్మరణం పాలైంది. మృతులిద్దరూ ఒడిశాకు చెందిన యువతులు. ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన సంధ్యారాణి మహారాజ్(24), సుల్లుబుల్లు బెహరా(28)లు స్నేహితులు. బతుకు తెరువు కోసం ఇద్దరూ బెంగళూరులోని ఓ గార్మెంట్స్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. 3 రోజుల కిందట సంధ్యారాణి తండ్రి కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడు.విషయం తెలుసుకున్న సంధ్యారాణి సొంతూరికి పయనమైంది. ఆమెకు తోడుగా సుల్లుబుల్లు బెహరా కూడా బయలుదేరింది. ఆదివారం బెంగళూరు నుంచి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో వీరు బయలుదేరారు. తానూ నాన్న దగ్గరికే వెళతానంటూ స్నేహితురాలితో సంధ్యారాణి చెప్పింది. పెనుకొండ రైల్వేస్టేషన్‌కు రైలు చేరగానే సంధ్యారాణి రైలు దిగేసింది. బెహరా కూడా రైలు దిగి ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించింది. ఈ లోపు సంధ్యారాణి ప్లాట్ఫారం దాటి ముందుకు వెళుతుండడంతో వెనుకనే బెహరా అనుసరించింది. అటుగా వచి్చన గూడ్స్ రైలును గమనించగానే సంధ్యారాణి పట్టాల మీదికి దూకేసింది. ఆమెను పట్టుకునే క్రమంలో బెహరా సైతం అడుగు ముందుకేయడంతో.. రైలు ఇంజన్ ఢీకొట్టి బెహరా ఎగిరి పట్టాలు పక్కనే పడి ప్రాణాలు విడిచింది. రైలు కిందపడిన సంధ్యారాణి శరీరం ఛిద్రమై ప్రాణాలు కోల్పోయింది. -
విశాఖలో డాక్‌యార్డు ఉద్యోగాల పేరిట భారీ మోసం
సాక్షి,విశాఖపట్నం: విశాఖలో నయా మోసం వెలుగు చూసింది. ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల వద్ద నుంచి లక్షల రూపాయలను ఏకంగా ఓ పోలీసే కాజేయడం సంచలనం రేపింది. ఈ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ చర్యలు మాత్రం తీసుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.విశాఖ నావెల్ డాక్ యార్డ్‌లో ఉద్యోగాలు పేరుతో కంచరపాలెం పీఎస్ కానిస్టేబుల్ రమణమూర్తి, డాక్‌యార్డు ఉద్యోగి మోహన్‌బాబుతో కలిసి భారీ మోసానికి పాల్పడ్డాడు.ఒక్కొక్క నిరుద్యోగి వద్ద నుంచి రూ.8 లక్షలు వసూలు చేశాడు. రమణమూర్తి,మోహన్‌బాబులపై బాధితులు ఫిర్యాదు చేశారు.సుమారు 20 మందికి ఉద్యోగాల ఆశచూపి రూ.80 లక్షల దాకా వసూలు చేసినట్లు చెబుతున్నారు. -
AP: కిల్లర్ లేడీ.. క్రైమ్ సినిమా రేంజ్లో అన్నదమ్ముల హత్య!
సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి కిరాతకం పోలీసులనే నివ్వెరపోయేలా చేసింది. కుటుంబ ఆస్తితో పాటు తండ్రి పెన్షన్‌కు అడ్డు తగులుతున్నారనే అక్కసుతో ఓ యువతి తన అన్న, తమ్ముడిని ప్లాన్ ప్రకారం హత్య చేసింది. అనంతరం, శవాలను కూడా మాయం చేసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం..‘పల్నాడు జిల్లాలోని నకరికల్లు యానాది కాలనీకి చెందిన పౌలు రాజు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. నకరికల్లు గిరిజన సంక్షేమ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సమయంలోనే ఆయన పక్షవాతంతో కొద్ది నెలల క్రితమే చనిపోయారు. పౌలు రాజు భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయారు. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.పౌలురాజు పెద్ద కుమారుడు గోపీకృష్ణ, బొల్లాపల్లి మండలు, బండ్లమోటు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. రెండో సంతానమైన కుమార్తె కృష్ణవేణి పెళ్లైన తర్వాత కుటుంబ కలహాలతో భర్తను వదిలి పుట్టింట్లో ఉంటోంది. మూడో సంతానం దుర్గా రామకృష్ణకు వివాహమైనా కుటుంబ కలహాలతో భార్య విడిచి పెట్టింది. పెద్ద కొడుకు గోపికృష్ణ భార్య కూడా అతడిని విడిచిపెట్టడంతో ముగ్గురు తండ్రి దగ్గరే ఉంటున్నారు. ఈ క్రమంలో తండ్రి చనిపోయిన తర్వాత అతని ఆస్తికోసం ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆస్తితో పాటు ఆర్థిక ప్రయోజనాల కోసం ముగ్గురు సంతానం ఘర్షణ పడుతున్నారు. అనారోగ్యంతో ఉన్న తండ్రిని తానే చూసుకున్నందున తండ్రి డబ్బు మొత్తం తనకే దక్కాలని కుమార్తె గొడవ పడుతోంది.అయితే, ఆస్తిని తన సోదరికి ఇచ్చేందుకు అన్నదమ్ములిద్దరూ అంగీకరించలేదు. ఈ విషయంలో కూడా వారి మధ్య పలుమార్లు గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. దీన్ని మనసులో పెట్టుకున్న కృష్ణవేణి.. ఆస్తిని దక్కించుకోవాలన్న దురుద్దేశంతో అన్నదమ్ములను హత్య చేయాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే వారిని కిరాకతంగా హతమార్చింది. గోపీకృష్ణకు మద్యం తాగే అలవాటు ఉండంటంతో డిసెంబర్ 10న అన్నకు అతిగా మద్యం తాగించి మెడకు చున్నీ బిగించి హత్యచేయగా.. తమ్ముడిని నవంబరు 26న కాల్వలో తోసేసి చంపేసింది. వీరి మృతదేహాలు ఇప్పటి వరకు దొరకలేదు. ఇదిలా ఉండగా.. నకరికల్లులో మరో వ్యక్తితో కృష్ణవేణికి సంబంధం ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. అతడితో సాయంతో వారిని హత మార్చినట్టు తెలుస్తోంది. ఇక, కానిస్టేబుల్ గోపీకృష్ణ బండ్లమోటు పీఎస్‌కు విధులకు హాజరు కాకపోవడంతో వారి హత్య వ్యవహారం బయటకు వచ్చింది. వారి మృతదేహాలను ఏం చేసిందనేది తెలియాల్సి ఉంది. పోలీసులు.. కృష్ణవేణిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
వ్యభిచార గృహంపై దాడి
తిరుపతి క్రైం: నగరంలోని భవానీనగర్‌లో ఓ నివాసంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో ఈస్ట్ పోలీసులు మెరుపు దాడులు చేసి అరెస్ట్ చేసిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈస్ట్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు... భవానీనగర్‌లోని ఓ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం వచ్చి దాడులు చేశారు. బుజ్జమ్మ, శారద, సుబ్రహ్మణ్యం ముగ్గురూ కలిసి వ్యభిచార గృహం నిర్వహిస్తూ కోస్తా నుంచి అమ్మాయిలను పిలిపించేవారు. వీరిని యువకులకు ఎరవేసి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవారు. ఈ మేరకు నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1000 రూపాయల నగదును స్వాదీనం చేసుకున్నామన్నారు. ఓ మహిళను గుర్తించి ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామన్నారు. అమ్మానాన్నకు అబద్ధం చెప్పానంటూ.. -
నీటి కుంటలో పడి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థి మృతి
సాక్షి, పల్నాడు జిల్లా: రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఓ మహిళ, శ్రీచైతన్య స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. గురజాల మండలం పులిపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో పడి ఐదవ తరగతి విద్యార్థి కుంచె సుభాష్ (11) ప్రాణాలు కోల్పోయాడు. స్కూల్ బస్సు పులిపాడు గ్రామం నుండి స్కూల్ విద్యార్థులతో దాచేపల్లికి వెళ్తుంది. ఆ సమయంలో స్కూల్ బస్ రేడియేటర్లో మంటలు చెలరేగాయి. దీంతో మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు బస్సు క్లీనర్ పప్పుల కోటేశ్వరరావు ప్రయత్నించాడు. ఇందుకోసం కుంటలో ఉన్న నీటిని తోడేందుకు ప్రయత్నించాడు. సాయం కోసం సుభాష్‌ను వెంట తీసుకెళ్లాడు. అయితే నీటి కుంటలో నుంచి నీటిని తోడేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవ శాత్తూ కాలు జారి నీటి కుంటలో జారి ఇద్దరూ పడిపోయారు. ఈ దుర్ఘటనలో బస్సు క్లీనర్ పప్పుల కోటేశ్వరరావు, ఐదవ తరగతి విద్యార్థి కుంచె సుభాష్ మృతి చెందారు.మరో దుర్ఘటనలో తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న మరో దుర్ఘటనలో బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు స్కూటీపై వెళ్తున్న మహిళను ఓ కారు ఢీకొంది. రూరల్ ఎస్ఐ ఎస్కే మూర్తి తెలిపిన వివరాల మేరకు.. నగరి మండలం మాంగాడుకు చెందిన గోవిందమ్మ(48), తన కుమారుడు భానుప్రకాష్ సమీప బంధువు కిరణ్‌తో కలిసి చంద్రగిరి మండలం పిచ్చినాయుడుపల్లిలో బంధువుల ఇంట్లో పురుడు ఫంక్షన్‌కు స్కూటర్లో వెళ్తున్నారు.పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై వకుళామాత ఆలయం సర్కిల్ వద్ద పేరూరు పంచాయతీలో నుంచి వేగంగా బైపాస్ పైకి దూసుకొచ్చిన గుర్తు తెలియని కారు గోవిందమ్మ ప్రయాణిస్తున్న స్కూటర్‌ను ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో గోవిందమ్మ స్కూటర్‌పై నుంచి కింద పడి తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది.స్కూటర్ నడుపుతున్న కిరణ్, మృతురాలి కుమారుడు భానుప్రకాష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని తిరుపతి రూరల్ ఎస్ఐ ఎస్కే మూర్తి పరిశీలించారు. కేసు నమోదు విచారిస్తున్నట్లు ఎస్ఐ మూర్తి తెలిపారు. -
అక్కా.. వెళ్లిపోయావా..
అనకాపల్లి: మరికొద్ది సేపట్లో ఆనందం పంచుకోవాల్సిన ఆ ఇంట్లో దుర్వార్త వినడంతో కశింకోట మండలం వెదురుపర్తి గ్రామం ఒక్కసారిగా శోకసముద్రంలో మునిగిపోయింది. తమ్ముడు భార్య గర్భిణి కావడంతో శనివారం సాయంత్రం ఆమెను పుట్టింటికి పంపించేందుకు కావాల్సిన సరంజామా అంతా తెచ్చేందుకు అతడితో ద్విచక్ర వాహనంపై బయలుదేరిన అక్క వి. విజయలక్ష్మి(40) దుర్మరణం చెందగా, తమ్ముడు మళ్ల గిరిబాబు (35)కు గాయాలయ్యాయి. అనకాపల్లి మండలం పిసినికాడ గ్రామంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరు తమ ద్విచక్ర వాహనంపై కశింకోట నుంచి అనకాపల్లి వెళ్తున్నారు. అదే సమయంలో తుని నుంచి విశాఖ వెళ్తున్న లారీ వెనుక నుంచి వచ్చి బైక్ సైడ్ మిర్రర్‌ను స్పీడ్‌గా తాకడంతో ఒక్కసారిగా పడిపోయారు. దాంతో లారీ వెనుక చక్రం విజయలక్ష్మి తలపై నుంచి వెళ్లిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, గిరిబాబుకు స్వల్ప గాయాలయ్యాయి. కళ్ల ముందే తన అక్క చనిపోవడంతో అతడు జీర్ణించుకోలేకపోయాడు. అక్కా వెళ్లిపోయావా అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. గాయపడిన అతడిని హైవే అంబులెన్స్‌లో ఎన్టీఆర్ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. గిరిబాబు భార్య ఝాన్సీలక్ష్మి గర్భిణి కావడంతో పుట్టింటికి పంపించేందుకు పూలు, ఇతర సామగ్రి కొనుగోలు నిమిత్తం వారిద్దరూ ద్విచక్ర వాహనంపై బయలు దేరిన సమయంలో ఈ ప్రమాదానికి గురయ్యారు. గిరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ అశోక్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. విజయలక్ష్మి తన భర్త, కుమారుడుతో విశాఖ నగరంలోని అక్కయ్యపాలెంలో ఉంటున్నట్టు తెలిసింది. -
కాకినాడ జిల్లా: రెండు కుటుంబాల మధ్య ఘర్షణ.. ముగ్గురి మృతి
సాక్షి, కాకినాడ జిల్లా: సామర్లకోట మండలం వేట్లపాలెంలో దారుణం జరిగింది. ఇంటి స్థలం విషయంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిపై మరో కుటుంబం దాడి చేసింది. ఘర్షణలో కత్తులతో దాడి చేసుకోవడంతో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.ఏం జరిగిందంటే?గ్రామంలోని ఎస్సీపేట చెరువు సమీపంలో పండు అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టారు. అదే ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు బచ్చల చక్రయ్య కుటుంబం ప్రయత్నించింది దీంతో ఇరువురి కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. కత్తులతో పరస్పరం దాడి చేసుకోవడంతో ప్రకాశ్‌రావు అక్కడికక్కడే మృతి చెందగా.. చంద్రరావు, ఏసు ఆసుపత్రిలో మృతి చెందారు. తీవ్ర గాయాలైన సంజీవ్, పండు, దావీదు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సినిమా చూసొస్తూ విద్యార్థి దుర్మరణం
యలమంచిలి రూరల్: స్నేహితులతో సరదాగా సినిమాకి వెళ్లి ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ రాయవరం మండలం రేవుపోలవరం గ్రామానికి చెందిన దారబోయిన దుర్గాప్రసాద్(14) శనివారం రాత్రి దుర్మరణం పొందాడు. దీనికి సంబంధించి మృతుని బంధువులు, యలమంచిలి ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. రేవుపోలవరంకు చెందిన సుమారు 15 మంది విద్యార్థులు ద్విచక్రవాహనాలపై యలమంచిలి పట్టణంలో పుష్ప సినిమా చూసి తిరిగి తమ గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. వీరిలో ఇద్దరు పదో తరగతి విద్యార్థులు దుర్గాప్రసాద్, ప్రవీణ్ మినహా మిగిలిన వారంతా యలమంచిలి సమీపంలో ఒక పెట్రోల్ బంక్ వద్ద ఆగారు. ఇద్దరు విద్యార్థులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం లైనుకొత్తూరు వద్ద పాల క్యారేజితో రైతు నడుపుతున్న మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. వేగంగా ప్రయాణిస్తున్న బైకు పక్కనే ఉన్న భవనం గోడను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గాప్రసాద్ ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మరో విద్యార్థి ప్రవీణ్, రైతు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దర్నీ యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
దొంగనోట్ల ముఠా ఆటకట్టు
మెళియాపుట్టి: దొంగనోట్లు ముద్రించి అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. టెక్కలి డీఎస్పీ ఆర్వీఎస్ఎన్ మూర్తి వివరాలను శుక్రవారం స్థానిక స్టేషన్ వద్ద వెల్లడించారు. తక్కువ సొమ్ముకు అధిక మొత్తంలో దొంగనోట్లు ఇస్తామని ఆశ చూపించే ఆరుగురిని అరెస్టు చేశామన్నారు. పలాస మండలం నర్సింపురం గ్రామానికి చెందిన తమ్మిరెడ్డి రవి, పెదంచల గ్రామానికి చెందిన కుసిరెడ్డి దూర్వాసులు, మెళాయపుట్టి మండలం సంతలక్ష్మీపురానికి చెందిన తమ్మిరెడ్డి ఢిల్లీరావు, దాసరి కుమారస్వామి, కరజాడ గ్రామానికి చెందిన దాసరి రవికుమార్, వజ్రపుకొత్తూరు మండలం డోకులపాడు గ్రామానికి చెందిన దుమ్ము ధర్మారావులను అరెస్టు చేశామని, వీరి వద్ద నుంచి కెనాన్ కలర్ ప్రింటింగ్ మిషన్, కలర్ ఇంక్ బాటిల్స్, బ్లేడ్, గమ్ బాటిల్, పేపర్ కట్టలు, రూ.57.25 లక్షలు విలువైన దొంగనోట్లు, 4 సెల్ ఫోన్లు, ఒక ద్విచక్రవాహనం (స్కూటీ) స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎలా పట్టుకున్నారంటే..? కేసులో ఎ1 గా ఉన్న తమ్మిరెడ్డి రవి అనే వ్యక్తి గురువారం మెళియాపుట్టి మండలం పట్టుపురం కూడలిలో కొంతమేర దొంగనోట్లు పట్టుకుని తిరుగుతున్నాడు. పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఐ రమేష్ బాబు సిబ్బందితో వెళ్లి అతడిని పట్టుకుని దొంగ నోట్లను స్వా«దీనం చేసుకున్నారు. అతడిని స్టేషన్‌కు తరలించి విచారణ చేయగా మిగిలిన వారి పేర్లు చెప్పాడు. దీంతో వారందరినీ అరెస్టు చేశారు. వారి వద్దనున్న మొత్తం నకిలీ నోట్లు అయిన రూ.27.25 లక్షలు స్వా«దీనం చేసుకున్నారు. నేరం చేయడంలో వీరి స్టైలే వేరు వీరంతా ఒక్కో ప్రాంతాలకు చెందిన వ్యక్తులు. ఒడిశాలో ఎక్కడి నుంచో కొన్ని దొంగనోట్లు సంపాదించి, నకిలీనోట్లు తయారు చేసే విధానాన్ని యూట్యూబ్‌లో చూసేవారు. సంతలక్ష్మీ పురం గ్రామంలోని అందరూ నివాసముండే ప్రదేశంలోనే ఇళ్ల మధ్య ఒక ఇంటిని ఎంచుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రింటర్, ఇతర సామగ్రి అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఇక వ్యాపారం మొదలెట్టే ప్రక్రియలో భాగంగా రూ.5లక్షలు ఇస్తే రూ.25 లక్షల నకిలీ నోట్లు ఇవ్వడానికి ఓ వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుని నోట్ల తయారీ ప్రారంభించారు. అందులో భాగంగానే మచ్చుకు కొన్ని నోట్లు చూపించే క్రమంలోనే పట్టుబడ్డారు. ఇద్దరు పాత నేరస్తులే.. నేరానికి పాల్పడిన వారిలో ఎ2 గా ఉన్న కుసిరెడ్డి దూర్వాసులుపై కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు, ఎ6 దుమ్ము ధర్మారావు పై పలాస, మందస పోలీస్ స్టేషన్లలో పలు మార్లు దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయి. మరికొందరిపై ఇతర జిల్లాల్లోనూ కేసులు ఉన్నాయి. అయితే నకిలీ నోట్ల కేసు లో మరికొందరు ముద్దాయిలను పట్టుకోవాల్సి ఉందని, వారిని త్వరలోనే పట్టుకుని వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. స్వా«దీనం చేసుకున్న నకి లీ నోట్లలో 500,200 నోట్లు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతానికి దొంగ నోట్లు చేతులు మారలేదని, దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామన్నారు. ముద్దాయిలను టెక్కలి కోర్టులో హాజరుపరిచారు. పాతపట్న ం సీఐ రామారావు, మెళియాపుట్టి ఎస్సై రమేష్ బా బు, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
ప్రియుడి మోజులో భర్తను దారుణంగా చంపిన భార్య
గిద్దలూరు రూరల్: ఓ మహిళ కట్టుకున్న భర్తను పథకం ప్రకారం హత్య చేసి, ఆపై ఆ ప్రియుడి చేతిలోనే హతమైందని మార్కాపురం డీఎస్పీ యు.నాగారాజు పేర్కొన్నారు. అక్రమ సంబంధం రెండు నిండు ప్రాణాలను బలిగొనడమే కాకుండా మరొకరి జీవితం జైలు పాలయ్యేలా చేసిందని చెప్పారు. ఈ నెల 6వ తేదీన గిద్దలూరులోని చాకలివీధిలో పాకి సుభాషిణి అనే మహిళ ఆమె ప్రియుడు అంబడిదాసు శ్రీకర్ అలియాస్ నాని చేతిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. నిందితుడు శ్రీకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా మరుగునపడిన మరో హత్య కేసు వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు.కంభం మండలం నర్సిరెడ్డిపల్లెకు చెందిన పాకి బాలక్రిష్ణ(31)కు రాచర్లకు చెందిన సుభాషిణిని ఇచ్చి పెద్దలు వివాహం చేశారు. వీరికి లోకిత, రోహిత్ అనే ఇద్దరు చిన్నపిల్లలున్నారు. బాలకృష్ణ కుటుంబంతో సహా గిద్దలూరులోని రాచర్ల రోడ్డులో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో సుభాషిణికి తనతో కలిసి పదో తరగతి వరకు చదువుకున్న రాచర్లకు చెందిన నాని తారసపడ్డాడు. గిద్దలూరులో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న నాని.. సుభాషిణి ఫోన్ నంబర్ తీసుకుని తరుచూ మాట్లాడేవాడు. ఈ క్రమంలో పాత పరిచయం కాస్తా అక్రమ సంబంధంగా మార్చుకున్నారు. ఈ వ్యవహారం బాలకృష్ణకు తెలియడంతో సుభాషిణిని మందలించాడు. భార్య చేస్తున్న మోసాన్ని జీర్ణించుకోలేక మద్యం తాగి చిత్రహింసలకు గురిచేస్తుండేవాడు. దీంతో భర్తను అడ్డుతొలగించాలని భావించిన సుభాషిణి తన స్నేహితుడు నానితో కలిసి పథకం రచించింది. 2023 ఏప్రిల్ 4వ తేదీన మజ్జిగలో నిద్ర మాత్రలు కలిపి భర్తతో తాగించింది. మత్తులోకి జారుకున్నట్లు నిర్ధారించుకున్న తర్వాత నానితో కలిసి బాలకృష్ణ ముఖానికి గుడ్డకట్టి, గొంతుకు తాడు బిగించి చంపారు. ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించిన సుభాషిణి బంధువులను నమ్మించి దహన సంస్కారాలు పూర్తి చేసింది. బాలకృష్ణ మద్యానికి బానిసై ఉరివేసుకుని చనిపోయి ఉంటాడని అంతా భావించారు. బాలకృష్ణ పెద్ద కర్మ అయిన వెంటనే సుభాషిణి తన ప్రియుడు నానితో కలిసి హైదరబాద్‌కు మకాం మార్చింది. అక్కడ సహజీవనం సాగిస్తున్న క్రమంలో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో సుభాషిణి తిరిగి గిద్దలూరు చేరుకుని ఓ రెడీమెడ్ షాపులో పనిచేసుకుంటూ జీవిస్తోంది. అయితే నాని తనతో మళ్లీ మాట్లాడాలంటూ తరుచూ సుభాషిణిపై ఒత్తిడి చేస్తున్నాడు. ఆమె పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టడంతో నానిని మందలించారు. ప్రియురాలు దూరం పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయిన నాని ఆమైపె కక్ష పెంచుకుని కత్తితో గాయపరచగా ఆమె మార్కాపురం వైద్యశాలలో మృతి చెందిందని డీఎస్పీ వివరించారు. కేసును చేధించిన సీఐలు కె.సురేష్, రామకోటయ్య, ఎస్సై ఇమ్మానియేల్‌ను ప్రత్యేకంగా ఆభినందించారు. -
AP: పోలీసులు బకరా.. సినీ ఫక్కీలో దొంగ నోట్ల ముఠా డాన్ పరారీ
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో సినీ ఫక్కీలో దొంగ నోట్ల ముఠా సభ్యులు పోలీసుల నుంచి తప్పించుకున్నారు. ముఠా సభ్యులు పోలీసుల అదుపులోకి ఉన్న నిందితుడి తప్పించారు. దీంతో, నడిరోడ్డుపై అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది.వివరాల ప్రకారం..దొంగ నోట్ల కేసులో భీమవరంలో ఉన్న ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు శుక్రవారం రాత్రి శ్రీకాకుళం బయలుదేరారు. అదే సమయంలో పోలీసు వాహనాన్ని రెండు కార్లు, నాలుగు బైకులు వెంబడించాయి. కొంత దూరం వరకు వెళ్లిన తర్వాత అర్ధరాత్రి సమయంలో రాజమండ్రిలోని వీఎల్‌పురం వద్ద నిందితుడిని తీసుకెళ్తున్న శ్రీకాకుళం పోలీసుల వాహనాన్ని వారు అడ్డుకున్నారు. సినిమా ఫక్కీలో ఈకేసులో ఉన్న నిందితుడిని వారు తప్పించి.. తమ కారులో తీసుకెళ్లారు.అనంతరం, సదరు పోలీసులు.. 100కు కాల్ చేసి ఈ విషయాన్ని రాజమండ్రి పోలీసులకు చెప్పారు. దీంతో, కేసు నమోదు చేసిన రాజమండ్రి పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులను వెంబండించిన కార్ల నెంబర్లను సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇక, దొంగ నోట్ల ముఠా డాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.