ఏపీలో ప్రమాదకర పరిణామం

Declining female population in Andhra Pradesh - Sakshi

అంతకంతకూ తగ్గిపోతున్న అమ్మాయిలు

రాష్ట్రంలో 13 జిల్లాల్లో అబ్బాయిలే ఎక్కువ

ఏ జిల్లాలోనూ అధికంగా లేని అమ్మాయిలు

గత మూడు సెన్సస్‌ల్లోనూ ఇదే పరిస్థితి

సాక్షి, అమరావతి: ‘ఐఐటీల్లో సీట్లు సాధిస్తున్నాం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా మేమే ముందంజలో ఉన్నాం.. ఎంబీబీఎస్‌లోనూ అధిక సంఖ్యలో ప్రవేశాలు పొందుతున్నాం.. ఇవన్నీ బాగానే ఉన్నా జననాల సంఖ్యలో మేమెందుకు 30 ఏళ్లుగా వెనుకబడి ఉన్నాం’.. ఇదీ అమ్మాయిల్లో కలుగుతోన్న మనోవేదన. గత మూడు దశాబ్దాల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఏ జిల్లాలోనూ ఒక్క ఏడాది కూడా అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా లేదు. పైగా కొన్ని జిల్లాల్లో ఏటా అమ్మాయిల సంఖ్య మరీ తగ్గుతున్నట్టు తేలింది. లింగనిర్ధారణ కారణంగా అమ్మాయిల సంఖ్య పడిపోతుండగా, అబ్బాయిల సంఖ్య పెరుగుతున్నట్టు వెల్లడైంది. జాతీయ కుటుంబ ఆరోగ్య శాఖ సర్వే ప్రకారం కొన్ని జిల్లాల్లో ప్రతి వేయి మంది అబ్బాయిలకు 920 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. 1991, 2001, 2011 సంవత్సరాల్లో ప్రతి సర్వేలోనూ ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ఒక్క జిల్లాలోనూ అబ్బాయిలను అమ్మాయిలు అధిగమించలేకపోయారు.

యధేచ్ఛగా లింగ నిర్ధారణ..
బాలికలపై సమాజంలో ఇప్పటికీ ఉన్న వివక్షత, ఆడపిల్ల పుడితే ఖర్చు పెరుగుతుందని తల్లిదండ్రులు భావించడం, కుమారుడు ఉంటేనే వంశం నిలుస్తుందనే నమ్మకం.. ఇవన్నీ ఆడపిల్ల గర్భంలో ఉండగానే ఉసురుతీస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో డయాగ్నస్టిక్స్‌ సెంటర్లలో యధేచ్ఛగా లింగనిర్ధారణ జరుగుతోంది. ఇది ఒక వ్యాపారంగా కొనసాగుతోంది. కొంతమంది గైనకాలజిస్టులు, మరికొంతమంది డయాగ్నస్టిక్‌ సెంటర్ల యజమానులు అత్యంత గోప్యంగా ఏజెంట్ల ద్వారా దీన్ని నిర్వహిస్తున్నారు. కడుపులో ఉంది ఆడపిల్ల అని తెలిస్తే గర్భస్రావం చేస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో గుంటూరు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం కేంద్రాలుగా లింగనిర్ధారణ జరుగుతోంది. దీన్ని నియంత్రించడానికి ప్రత్యేక చట్టం పీసీపీఎన్‌డీటీ (లింగనిర్ధారణ నిరోధక చట్టం) ఉన్నా సరే ఇది అంతగా అమలు కావడం లేదు.  

అమ్మాయిల సంఖ్య తగ్గడానికి కారణాలివే

  • లింగనిర్ధారణ నిరోధక చట్టం సరిగా అమలు కాకపోవడం
  • డయాగ్నస్టిక్‌ సెంటర్ల రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్‌ సరిగా చేయకపోవడం
  • ఈ సెంటర్లపై సర్వే, విచారణ లేకపోవడం
  • ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పట్టించుకోకపోవడం
  • కేసులు నమోదవుతున్నా కఠిన చర్యలు తీసుకోకపోవడం
  • జిల్లా, రాష్ట్రస్థాయిలో నియమించిన కమిటీల పర్యవేక్షణ లేకపోవడం
  • బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమాన్ని సరిగా అమలు చేయకపోవడం
  • లింగనిర్ధారణ నిరోధక చట్టం అమలుకు సరిగా నిధులు ఇవ్వకపోవడం
Read latest Amaravati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top