ఆంధ్రప్రదేశ్‌లో కులాల మధ్య చిచ్చు పెట్టిన విధంగానే, అర్చకుల కుటుంబాల మధ్య చంద్రబాబు నాయుడు చిచ్చు పెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వారసత్వ అర్చకత్వం ఎన్నో ఏళ్ల నుంచి అమలవుతోందని తెలిపారు. నాలుగు వారసత్వ కుటుంబాలకు ఎంతో విశిష్టత ఉందని.. ఈ కుటుంబాలు వేలాది ఏళ్లుగా శ్రీవారికి సేవ చేస్తున్నాయన్నారు. తరతరాల సంప్రదాయాలపై ఎవ్వరికీ పెత్తనం ఉండొద్దని పేర్కొన్నారు. అన్యమతస్థుల పాలనకాలంలో కూడా స్వామివారి ఆచార వ్యవహారాల్లో తలదూర్చలేదని గుర్తు చేశారు. అమరావతిలో బౌద్ధ మతానికి ప్రాధాన్యత ఇస్తున్న చంద్రబాబు స్వామివారి ఆచారాల్లో తలదూరుస్తున్నారన్నారు.