
రాష్ట్రంలో తెలుగుదేశం..కాంగ్రెస్.. ఎవరు అధికారంలో ఉన్నా మంత్రిగా హోదా నిలబెట్టుకునే స్థాయి నాయకుడైన గంటా శ్రీనివాస్‌కు ఇప్పుడు వట్టి ఎమ్మెల్యేగా ఉండడం ఇబ్బందికరంగా మారింది. గతంలో మంత్రి హోదాలో కలెక్టర్లు.పెద్ద పెద్ద అధికారులతో హడావుడి చేసే గంటా ఇప్పుడు భీమిలి వరకే పరిమితం అవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే తన ఉనికిని చాటుకునేందుకు అప్పుడప్పుడూ అత్యుత్సాహం చూపిస్తున్నారు. అయితే ఈ ఓవర్ యాక్షన్ని ప్రభుత్వం..పెద్దలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆయన చర్యలు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారడంతో చీవాట్లు పెడుతూ.. కాస్త హద్దుల్లో ఉండాలని స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు.
విజయవాడలో మంగళవారం జరిగిన ఓ ముఖ్య సమావేశానికి విశాఖ నుంచి బయల్దేరిన గంటా నేరుగా విజయవాడ వెళ్లాల్సి ఉండగా సదరు విమానం ఆయన్ను ముందుగా హైదరాబాద్ తీసుకెళ్లి..అక్కణ్ణుంచి విజయవాడ డ్రాప్ చేసింది.. ఎందుకూ అంటే విశాఖ నుంచి బెజవాడకు డైరెక్ట్ విమాన సర్వీస్ లేదు.. రద్దు చేశారని తెలిసింది. దీంతో ఉదయం వెళ్లాల్సిన గంటా మధ్యాహ్నానికి విజయవాడ చేరుకున్నారు.
దీంతో ఆయన ‘ఆంధ్ర టూ ఆంధ్ర వయా తెలంగాణ’ అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్టు మీద టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని లేనిపక్షంలో విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మన వారే కదా ఆయనకు చెబితే సరిపోయేది కానీ ఇలా ట్విటర్లోకి ఎక్కి రచ్చ చేయాలా అని చీవాట్లు పెట్టింది. సీనియర్ ఎమ్మెల్యే అయినా ఇలా బాధ్యత లేకుండా ఉంటే ఎలా అని అడిగింది.
ఇదిలా ఉండగా.. వతిలో 5 వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తామని గంటా వియ్యంకుడు, పురపాలక మంత్రి నారాయణ ప్రకటన చేసిన తరుణంలోనే రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖపట్నం నుంచి విజయవాడకు విమానమే లేదంటూ గంటా శ్రీనివాసరావు ట్విట్టర్లో సెటైర్ వేశారు. అధికార పార్టీ నాయకుడివైన నువ్వు ప్రభుత్వం పరువు తీయడం ఏమిటని అధిష్టానం ప్రశ్నించింది.
వాస్తవానికి గంటా శ్రీనివాస్ గతంలో కూడా ప్రభుత్వానికి ఋషికొండ భవనాల తలుపులు తెరిచి హడావుడి చేశారు. ఫోటోలు విడుదల చేశారు. ఆ సందర్భంలో కూడా ఆయనకు పార్టీ నుంచి అక్షింతలు పడ్డాయి. డిప్యూటీ సీఎం పవన్.. ప్రభుత్వంలో నంబర్ టూ అయిన లోకేష్..ఇంకా మంత్రులు ఉండగా కేవలం ఒక ఎమ్మెల్యే అయిన మీరు రుషికొండ భవనాలను చూడడానికి ఎందుకు వెళ్ళారు..మీకు అంత అత్యుత్సాహం ఎందుకు అని అప్పట్లోనే టిడిపి పెద్దలు ప్రశ్నించారు. ఇక ఇప్పుడు కూడా ఈ ట్వీట్ దెబ్బతో చీవాట్లు పడ్డాయి. మొత్తానికి గంటాకు ఈ టర్మ్ బాలేనట్లుంది.
::సిమ్మాదిరప్పన్న