
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన వనరులపై కేంద్ర ఎన్నికల సంఘం అంచనాలు వేస్తోంది. ఒకే విడతలో లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరపాల్సి వస్తే కొత్త ఈవీఎంల కొనుగోలుకు ప్రతి 15 ఏళ్లకు రూ.10 వేల కోట్లు అవసరమవుతాయని లెక్కలు కట్టింది. ఒక్కో ఈవీఎం జీవిత కాలం 15 ఏళ్లు కాగా, ఒక్కో మెషీన్‌ను మూడు సార్లు వాడుకోవచ్చని తెలిపింది.
ఏకకాలంలో జరిపే ఎన్నికలకు దేశవ్యాప్తంగా 11.80 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక్కో పోలింగ్ బూత్‌లో జత ఈవీఎంలు.. ఒకటి లోక్‌సభకు, మరోటి శాసనసభ నియోజకవర్గానికి అవసరమవుతాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బ్యాలెట్ యూనిట్(బీయూ)లు 46,75,100, కంట్రోల్ యూనిట్(సీయూ)లు 33,62,300, వీవీప్యాట్‌లు 36,62,600 అవసరమవుతాయని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే తెలిపింది.
కనీసం ఒక బీయూ, ఒక సీయూ, ఒక వీవీప్యాట్‌లను కలిపి ఒక ఈవీఎంగా పరిగణిస్తారు. ఒక బీయూ ఖరీదు రూ.7,900, ఒక సీయూ ఖరీదు రూ.9,800, ఒక వీవీప్యాట్ ఖరీదు రూ.16,000గా తాజాగా నిర్ణయించింది. అదనంగా పోలింగ్, భద్రతా సిబ్బంది, ఈవీఎంల నిర్వహణ కేంద్రాలు, మరిన్ని వాహనాలు అవసరమవుతాయని కూడా ఎన్నికల సంఘం పేర్కొంది. కొత్తగా ఈవీఎల తయారీ, ఇతర సౌకర్యాలను సమకూర్చుకున్నాక 2029లో మాత్రమే మొదటి జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు అవకాశం ఉందని స్పష్టం చేసింది.