
లండన్: యూకేలో ప్రస్తుతం అమలవుతున్న కోవిడ్ లాక్‌డౌన్ ఆంక్షలను నాలుగు దశల్లో ఎత్తి వేసేందుకు ఉద్దేశించిన రోడ్ మ్యాప్‌ను ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ సోమవారం పార్లమెంట్ ముందుంచారు. కరోనా కేసులు నియంత్రణలో ఉంటే, ముందుగా ప్రకటించిన జూన్ 21వ తేదీకి చాలా వరకు ఆంక్షలను కనీసం 5 వారాల వ్యవధితో సడలించేందుకు అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుత ‘స్టే ఎట్ హోం’పిలుపును మార్చి 29వ తేదీ నుంచి ‘స్టే లోకల్’కు మారుస్తామని చెప్పారు. అవసరమైతే మళ్లీ కోవిడ్ ఆంక్షలను విధించే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
ప్రధాని తెలిపిన ప్రకారం..
► మొదటి దశ మార్చి 8వ తేదీ నుంచి అన్ని వయస్సుల విద్యార్థులకు స్కూళ్లు, యూనివర్సిటీలు ప్రారంభం.
► రెండో దశ..ఏప్రిల్ 12 నుంచి అత్యవసరం కాని దుకాణాలు, ఔట్‌డోర్ డైనింగ్, బీర్ గార్డెన్స్‌కు ఓకే.
► మూడో దశ.. మే 17వ తేదీ నుంచి పబ్‌లు, సినిమా హాళ్లు, జిమ్‌లను తెరిచేందుకు అనుమతి.
► నాలుగో దశ.. జూన్ 21వ తేదీతో నైట్ క్లబ్బులు, ఉత్సవాలు, సమావేశాలు, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు సహా అన్ని ఆంక్షల ఎత్తివేత. కరోనా వైరస్ ప్రమాదం నుంచి బయటపడినట్లు గణాంకాలతో రుజువైతేనే ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అమల్లోకి వస్తాయని బోరిస్ స్పష్టం చేశారు.