
నేటి నుంచి ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్
అమలాపురం రూరల్: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – 2025 ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి బీఎల్ ఎన్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం, బుధవారం జరిగే ఈ పరీక్షలకు సన్నద్ధతపై అధికారులతో కలెక్టరేట్‌లో ఆమె సమీక్షించారు. పాలిటెక్నిక్ డిప్లమా పూర్తిచేసిన విద్యార్థులు ఈ కామన్ ప్రవేశ పరీక్షకు అర్హులని అన్నారు. జిల్లాలో సుమారు 800 మంది ఈ పరీక్షకు హాజరుకానున్నారన్నారు. అర్హత సాధించినవారు నేరుగా ఇంజనీరింగ్ రెండవ సంవత్సరంలో ప్రవేశం పొందవచ్చునన్నారు. ఈ ప్రవేశ పరీక్ష నిర్వహణకు రెండు పరీక్షా కేంద్రాలను కాట్రేనికోన మండలం చెయ్యేరు శ్రీనివాస ఇంజినీరింగ్ కాలేజీ, అమలాపురం భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం రెండు నుంచి 5 గంటల వరకు రెండు బ్యాచ్‌లుగా నిర్వహిస్తారని తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి శాంత లక్ష్మి ఛ, మున్సిపల్ కమిషనర్ కేవీఆర్ రాజు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రామకృష్ణరాజు, ఏ కుమార్ జేఎన్టీయూ తరఫున పరిశీలకురాలు విజయ కుమారి పాల్గొన్నారు.
రత్నగిరిపై భక్తుల సందడి
అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి సోమవారం కిటకిటలాడింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు సత్యదేవుని ఆలయానికి చేరుకున్నారు. ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని 30 వేల మంది దర్శించుకున్నారు. వ్రతాలు 1,400 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి, శంకరులు సోమవారం ముత్యాల కవచాల అలంకరణలో (ముత్తంగి సేవ) భక్తులకు దర్శనమిచ్చారు.

నేటి నుంచి ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్