Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

India attacks terror camps in Pakistan1
ఫ్లాష్‌ ఫ్లాష్‌: పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్‌ దాడి..30 మంది ఉగ్రవాదుల హతం

పహల్గాం దాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరిట పీవోకేతో పాటు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ వైమానిక దాడులు జరిపింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. ఈ దాడిలో దాదాపు 30 మంది ఉగ్రవాదులు మృతి చెందారని భారత సైన్యం చెప్తున్నారు. కానీ కేవలం 8 మంది మాత్రమే మృతి చెందారని పాకిస్తాన్‌ అంటుంది. మొత్తం 55 మందికి పైగా గాయపడ్డారు.పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని కోట్లి, ముజఫరాబాద్, పంజాబ్‌లోని బహవల్‌పూర్‌తో పాటు లాహోర్‌ లోని ఒక ప్రదేశంపై భారత్‌ క్షిపణి దాడులు జరిపింది. ఈ సందర్భంగా ‘ఎయిర్‌ టు సర్ఫేస్‌’ మిసైళ్లను ప్రయోగించారు. దాడి అనంతరం ‘న్యాయం జరిగింది.. జైహింద్‌’ అంటూ భారత్‌ సైన్యం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఇవి సర్జికల్‌ స్ట్రైక్స్‌ కాదు. భారత భూభాగంనుంచే అత్యంత కచ్చితత్వంతో చేసిన దాడులని వెల్లడించింది. పహల్గాందాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సిందూరం తుడిచేసిన కారణంగానే ఆపరేషన్‌కు ‘సిందూర్‌’ అని నామకరణం చేశారు. మసూద్‌ అజర్, హఫీజ్‌ సయీద్‌ ప్రధాన స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. భారత దాడి అనంతరం పాకిస్తాన్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానాశ్రయాలు మూసివేశారు. కాగా దాడులను ధృవీకరించిన పాకిస్తాన్‌ ప్రతీకార దాడులు చేస్తామంటూ ప్రకటించింది. అర్ధరాత్రి 1:44కు ఈ దాడులు జరిగినట్టు ఎక్స్‌లో అధికారికంగా పోస్ట్‌ చేసిన భారత సైన్యం. దాడి అనంతరం భారత్‌ మాతాకీ జై అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టిన రాజ్‌నాద్‌ సింగ్‌. అయితే దాడుల పై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాక పేర్కొంది. ఈ దాడులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.भारत माता की जय!— Rajnath Singh (@rajnathsingh) May 6, 2025కాగా భారత్‌ దాడుల అనంతరం పాకిస్తాన్‌ ఎదురు దాడులు చేయగా వాటిని భారత సైన్యం తిప్పి కొడుతుంది.

Chandrababu Coalition govt fails to respond to 50 percent marks in degree2
మెగా పేరుతో ఎందుకీ దగా?

సాక్షి, అమరావతి: డీఎస్సీ అభ్యర్థులను కూటమి ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతోంది. అర్హత మార్కుల నిబంధన పేరుతో దరఖాస్తు దశలోనే ఎంతో మందిని అనర్హులను చేసింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నిబంధనలను సైతం పరిగణనలోకి తీసుకోకుండా సగం మంది అభ్యర్థులపై ప్రాథమిక దశలోనే వేటు వేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు రిజర్వుడు కేటగిరీలో ఉన్న అభ్యర్థుల అర్హత మార్కులు తగ్గించినా, జనరల్‌ అభ్యర్థుల మార్కుల నిబంధనను సడలించలేదు. డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఇంకా తొమ్మిది రోజులే మిగిలి ఉండడంతో లక్షల మంది జనరల్‌ అభ్యర్థులు తమనూ పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వాస్తవానికి టెట్‌ అర్హత సాధించిన అందరికీ డీఎస్సీ రాసేందుకు అర్హత కల్పించాల్సి ఉన్నా, ప్రభుత్వం ఆ దిశగా కనీసం ఆలోచించక పోవడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెగా డీఎస్సీ–2025 పేరుతో గత నెల 20న 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 10 నెలల పాటు ఊరించి ఇచ్చిన ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలు అభ్యర్థులకు తీరని నష్టం కలిగించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్జీటీ పోస్టులకు ఇంటర్మీడియట్‌లో, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి చేసింది. వాస్తవానికి 2011 జూలై 29కి ముందు బీఈడీ, డీఈడీ చేసిన వారికి ఈ నిబంధన వర్తించదని 2019 నవంబర్‌లో భారత ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసినా.. ఇవేమీ పట్టించుకోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో డీఎస్సీ అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటోంది. కనీస మార్కుల అంశంలో భిన్న వైఖరి అభ్యర్థుల అర్హత మార్కుల అంశంలో అటు ప్రభుత్వం, ఇటు పాఠశాల విద్యాశాఖలు భిన్నంగా వ్యవహరించడం విస్తుగొలుపుతోంది. తొలుత ఇంటర్, గ్రాడ్యుయేషన్‌లో జనరల్‌ అభ్యర్థులకు 50 శాతం, రిజర్వుడు అభ్యర్థులకు 45 శాతం అర్హత మార్కులు తప్పనిసరి చేసింది. అనంతరం టీచర్‌ అర్హత పరీక్ష (టెట్‌)లో రిజర్వుడు అభ్యర్థులకు 40 శాతం మార్కు­లే పేర్కొన్నందున డీఎస్సీ అర్హత మార్కులను 40 శాతానికి తగ్గిస్తూ అనుబంధ జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. కానీ జనరల్‌ అభ్యర్థులకు మాత్రం 50 శాతం అలాగే ఉంచింది. వాస్తవా­నికి జనరల్‌ అభ్యర్థులకు టెట్‌లో అర్హత మార్కులు 45 శాతం ఉన్నా, ఆ మేరకు అయినా తగ్గించక పో­వడం గమనార్హం. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో గతేడాది ఫిబ్ర­వరిలో విడుదల చేసిన డీఎస్సీ–­2024లో తొలుత 50 శాతం మార్కుల నిబంధన విధించగా అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దాంతో ఎన్‌సీటీఈ నిబంధనల మేరకు ఇంటర్మీడియట్, డిగ్రీలలో కనీస మార్కులు జనరల్‌ అభ్యర్థులకు 45 శాతం, రిజర్వేషన్‌ అభ్యర్థులకు 40 శాతానికి తగ్గించారు. ఈ మేరకు నియమకాలు కూడా జరిగిపోయాయి. కానీ ఏపీలో మా­త్రం ఎన్‌సీటీఈ నిబంధనల అమలు చేయలేదు. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. ఉపాధ్యాయ నియామకాలపై రాజస్థాన్, ఉత్తరఖండ్‌ రాష్ట్రాల్లో ఇదే సమస్య ఉత్పన్నమైనప్పుటు అక్కడి అభ్యర్థులు ఆయా రాష్ట్రాల హైకోర్టులను ఆశ్రయించారు. దాంతో డిగ్రీలో కనీస అర్హత మార్కులపై ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా సుప్రీంకోర్టు ఎన్‌సీటీఈకి మార్గదర్శకాలు విడుదల చేసింది. కనీస మార్కులపై తగిన నిర్ణయాన్ని ప్రకటించాలని, హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఉండేలా సూ­చ­నలు చేసింది. ఎన్‌సీటీఈ 2019 నవంబర్‌ 21న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం ‘ఉపాధ్యాయ నియామకాల్లో 2011 జూలై 29కి ముందు బీఈడీ, డీఈడీ లేదా సమానమైన కో­ర్సులో ప్రవేశం పొందిన వారికి గ్రాడ్యుయేషన్‌లో కనీస మార్కుల శాతం వర్తించదు’ అని ప్రకటించింది. 2011 ఆగస్టు 2నాటి ఎన్‌సీటీఈ గెజిట్‌ నోటిఫికేషన్‌లోనూ కనీసం 45 శాతం మార్కులతో గ్రాడ్యు­యేషన్, ఏడాది కాల పరిమితి గల బీఈడీ చేసినవారు డీఎస్సీకి అర్హులుగా పేర్కొంది. ఈ లెక్కన ఎలా చూసినా జనరల్‌ అభ్యర్థులకు డీఎస్సీ రాసేందుకు అర్హత మార్కులు 45 శాతం మించరాదు. నిబంధనల్లో వివక్షపై తీవ్ర విమర్శలు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాల కోసం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ నిబంధనలు పూర్తి వివక్షతో ఉన్నాయని అటు అభ్యర్థులు, ఇటు ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రభు­త్వం ఇచ్చిన జీవో నంబర్‌ 15లో 2007 వరకు డిప్లొ­మా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశం పొందిన వారు కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియ­ట్‌ ఉంటే ఎస్జీటీకి అర్హులుగా పేర్కొంది. కానీ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 29 జూలై 2011కు ముందు బీఈడీ లేదా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ లేదా తత్సమాన కోర్సులో ప్రవేశం పొందిన వారికి గ్రాడ్యుయేషన్‌లో కనీస మార్కుల శాతం వర్తించ­దన్న ఎన్‌సీటీఈ గెజిట్‌ నోటిఫికేషన్‌ నిబంధనలను మెగా డీఎస్సీ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. ఈ నిబంధనను తెలంగాణ డీఎస్సీ–2024 కోసం ఇ­చ్చిన సవరణ జీవో నంబర్‌ 14లో పేర్కొన్నారు. దీని ప్రకారం రిజర్వుడు అభ్యర్థులకు 40 శాతం, జనరల్‌ అభ్యర్థులకు 45 శాతం అర్హత మార్కులుగా నిర్ణయించారు. దీంతోపాటు ఎన్‌సీటీఈ గెజిట్‌ నోటిఫి­కేషన్‌ ప్రకారం 2011 జూలై 29 నాటికి బీఈడీ, డీఈడీ చేసిన వారికి అర్హత మార్కుల నిబంధన తొలగించారు. కానీ ఏపీ ప్రభుత్వం ఎన్‌సీటీఈ నిబంధనలను పట్టించుకోకపోవడంతో అర్హులైన జనరల్‌ అభ్యర్థులకు తీవ్ర అన్యా­యం జరిగినట్లయింది. దీనిపై జనరల్‌ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.సీబీఎస్‌ఈ అభ్యర్థులకు అన్యాయం పదో తరగతి వరకు సీబీఎస్‌ఈలో చదివి, డీఈడీ ఇంగ్లిష్‌ మీడియంలో పూర్తి చేసిన వారికీ ప్రభుత్వం డీఎస్సీలో అన్యాయం చేసింది. సీబీఎస్‌ఈ విద్యార్థులకు మొదటి భాష ఇంగ్లిష్‌ మాత్రమే ఉంటుంది. రెండో భాషగా తెలుగు/హిందీ/ ఉర్దూ తదితర భాషలు ఎంచుకుంటారు. అయితే, మొదటి భాష తెలుగు ఉంటేనే ఎస్జీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని నిబంధన పెట్టడంతో సీబీఎస్‌ఈ అభ్యర్థులు నష్టపోతున్నారు. ఫిబ్రవరి–2024 డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఈ సమస్య లేదని అభ్యర్థులు చెబుతున్నారు. జూలై–2024 టెట్‌లోనూ కూటమి ప్ర­భు­త్వం ఈ నిబంధన పేర్కొనలేదంటున్నారు. ఉన్న ఫళంగా నిబంధలు మార్చేసి అన్యాయం చేస్తే సహించమని, తాజా టెట్‌ అర్హత సాధించిన అందరికీ డీఎస్సీకి అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Rasi Phalalu: Daily Horoscope On 07-05-2025 In Telugu3
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. శుభవార్తలు వింటారు

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.దశమి ప.12.38 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: పుబ్బ రా.8.19 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం: తె.4.03 నుండి 5.46 వరకు (తెల్లవారితే గురువారం), దుర్ముహూర్తం: ఉ.11.31 నుండి 12.22 వరకు, అమృతఘడియలు: ప.1.34 నుండి 3.16 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 5.35, సూర్యాస్తమయం: 6.17. మేషం... సన్నిహితులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అనుకూలత. ధనవ్యయం.వృషభం.... ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. ఆలయ దర్శనాలు.మిథునం... పరిచయాలు విస్త్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.కర్కాటకం... పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.సింహం.... శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. ప్రముఖులతో పరిచయాలు. అందరిలోనూ గుర్తింపు. చిత్రమైన సంఘటనలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు.కన్య.... దూరప్రయాణాలు. ఇంటాబయటా కొన్ని సమస్యలు. ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం.. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఊరటనిస్తాయి. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు.తుల.... దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.వృశ్చికం... వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. నూతన ఉద్యోగాలు పొందుతారు. దైవదర్శనాలు. వ్యతిరేకులు అనుకూలురుగా మారతారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.ధనుస్సు... చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ధనవ్యయం. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. స్వల్ప అనారోగ్యం.. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు..మకరం.... శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో విభేదిస్తారు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు..కుంభం.... ఆప్తుల సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. అనుకున్న పనులు చక్కదిద్దడంలో ఆటంకాలు తొలగుతాయి. మీ సత్తా అందరూ గుర్తిస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు అధిగమిస్తారు.మీనం.... ప్రముఖులతో పరిచయాలు. సమాజసేవలో పాల్గొంటారు. పాతబాకీలు కొన్ని వసూలవుతాయి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ముందడుగు వేస్తారు.

CBI Special Court: Sabitha Indra Reddy Not guilty in Obulapuram mining case4
ఓబుళాపురం మైనింగ్‌ కేసు.. సబిత నిర్దోషి

సాక్షి, హైదరాబాద్‌: ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. గనుల శాఖ మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ అప్పటి కార్యదర్శి కృపానందంలను నిర్దోషులుగా ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మంగళవారం మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా తేల్చింది. ప్రధాన నిందితులైన ఓఎంసీ అప్పటి డైరెక్టర్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి, కంపెనీ ఎండీ బీవీ శ్రీనివాసరెడ్డి, గనుల శాఖ అప్పటి డైరెక్టర్‌ వీడీ రాజగోపాల్, గాలి జనార్దనరెడ్డి పీఏ మెహఫూజ్‌ అలీఖాన్‌లను దోషులుగా నిర్ధారిస్తూ.. ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల చొప్పున,ఓఎంసీకి రూ.2 లక్షల జరిమానా విధించింది. రాజగోపాల్‌కు అవినీతి నిరోధక చట్టం కింద అదనంగా నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, పరిశ్రమల శాఖ అప్పటి కార్యదర్శి ఐఏఎస్‌ అధికారి యర్రా శ్రీలక్ష్మిని ఈ కేసు నుంచి డిశ్చార్జ్‌ చేస్తూ తెలంగాణ హైకోర్టు 2022లో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. 2009లో కేసు నమోదు ఏపీ–కర్ణాటక సరిహద్దు అనంతపురం, బళ్లారి రిజర్వు ఫారెస్టులో ఓబుళాపురం గ్రామ పరిధిలోని ఇనుప గనుల తవ్వకాలను ఓఎంసీ నిర్వహించేంది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టిందని 2009 డిసెంబరు 7న సీబీఐకి ఫిర్యాదు అందింది. అనుమతి పొందిన 68.5 హెక్టార్ల ప్రాంతాన్ని దాటి ఇనుప ఖనిజాన్ని తవి్వందని అందులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ.. బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి, వీడీ రాజగోపాల్, ఓఎంసీ, కృపానందం, సబితాఇంద్రారెడ్డి, గనుల శాఖ నాటి ఏడీ లింగారెడ్డి, శ్రీలక్ష్మిలపై అభియోగాలు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లతో పాటు కొందరిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు పెట్టింది. రూ.884.13 కోట్ల మేర అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని 2011లో సీబీఐ తొలి చార్జిషీట్‌ దాఖలు చేసింది. 2014 వరకు ఇలా నాలుగు చార్జిషీట్లు వేసింది. 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేశారని, బినామీ లావాదేవీలు జరిగాయని సీబీఐ పేర్కొంది. కాగా, కేసు విచారణ ఏళ్లకు ఏళ్లు పడుతుండడంతో సుప్రీంకోర్టు విచారణను పర్యవేక్షిస్తూ.. మే నెలలోగా పూర్తి చేయాలని గడువు విధించింది. ఇక 219 మంది సాక్షులను విచారించి, 3,330 డాక్యుమెంట్లను పరిశీలించిన సీబీఐ న్యాయస్థానం గత నెలలో తీర్పు రిజర్వు చేసింది. కాగా, లింగారెడ్డి విచారణ దశలోనే మృతి చెందారు. కోర్టుకు హాజరైన నిందితులు తీర్పు వెల్లడి సందర్భంగా కేసులో నిందితులు కోర్టుకు హాజరయ్యారు. ఈ నెల 18న తన కుమారుడి పెళ్లి ఉందని అప్పటివరకు అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని శ్రీనివాసరెడ్డి కోరారు. తాను ఎన్నో ప్రజాపయోగ కార్యక్రమాలు చేశానని, పేద కుటుంబం నుంచి వచ్చి వేలాదిమందికి ఉపాధి కల్పించానని గాలి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. కోర్టు తనను బళ్లారిలో అడుగుపెట్టొద్దని ఆదేశించినా, మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచానని తెలిపారు. ఉపశమనం కల్పిస్తే ఆధ్యాత్మిక పథంలో వెళ్తానని విన్నవించారు. ప్రభుత్య ఉద్యోగులందరినీ వదిలేసి తనను శిక్షించడం అన్యాయమని రాజగోపాల్‌ నివేదించారు. తనపై ఆధారపడి తల్లిదండ్రులు, నలుగురు పిల్లలు ఉన్నారని అలీ విజ్ఞప్తి చేశారు. సబితాఇంద్రారెడ్డి, కృపానందం కూడా కోర్టుకు హాజరయ్యారు.

India And UK Seal Historic Free Trade Agreement Amid Global Tensions5
ఇక స్వేచ్ఛా వాణిజ్యం

న్యూఢిల్లీ/లండన్‌: భారత్‌–యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)తోపాటు డబుల్‌ కంట్రిబ్యూషన్‌ కన్వెన్షన్‌ ఒప్పందం కుదిరాయి. ఇరుదేశాల మధ్య మూడేళ్లుగా జరుగుతున్న చర్చలు ఫలించాయి. ఒప్పందంపై భారత్, యూకే మంగళవారం అంగీకారానికి వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విదేశీ ఉత్పత్తులపై సుంకాల మోత మోగిస్తున్న తరుణంలో ఈ ఒప్పందాలు కుదరడం వల్ల భారత్, యూకే దేశాలకు ఎనలేని లబ్ధి చేకూరుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బలపడనున్న బంధం యూకేతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని చరిత్రాత్మకమైన మైలురాయిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారత్‌–యూకే మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని, వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబ డులు, ఆర్థిక ప్రగతి, ఉద్యోగాల కల్పన, నవీన ఆవిష్కరణలు వంటి అంశాల్లో రెండు దేశాలకు ఎంతో మేలు జరుగుతుందని హర్షం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ తాజాగా యూకే ప్రధానమంత్రి కీర్‌ స్టార్మర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఎఫ్‌టీఏపై చర్చించారు. ఎఫ్‌టీఏతోపాటు డబుల్‌ కంట్రిబ్యూషన్‌ కన్వెన్షన్‌ కుదరడాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు. ప్రపంచంలో రెండు అతిపెద్ద, ఓపెన్‌–మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థలైన భారత్, యూకే మధ్య ఎఫ్‌టీఏ కుదరడంతో వ్యాపారాలకు నూతన అవకాశాలు అందుబాటులోకి రావడంతోపాటు రెండు దేశాల మధ్య ఆర్థిక బంధంతోపాటు ప్రజల మధ్య సంబంధాలు మరింత బలం పుంజుకుంటాయని మోదీ, స్టార్మర్‌ ఉద్ఘాటించారు. ఏమిటీ ఒప్పందం? ⇒ భారత్‌–యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చాలాఏళ్లుగా చర్చల్లో నలుగుతోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు చేపట్టడం, విదేశీ ఉత్పత్తులపై సుంకాల బాంబు పేల్చడంతో భారత్‌–యూకే మధ్య చర్చల్లో ఒక్కసారిగా వేగం పెరిగింది. 2022 జనవరిలో మొదలైన ఈ చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. అదే సమయంలో ప్రతిపాదిత ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందంపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ⇒ స్వేచ్ఛా వాణిప్య ఒప్పందంతో విస్కీ, అడ్వాన్స్‌డ్‌ తయారీ భాగాలు, వైద్య పరికరాలు, అడ్వాన్స్‌డ్‌ మెషినరీ, ఆహార ఉత్పత్తులపై టారిఫ్‌లు భారీగా తగ్గుతాయి. ⇒అంతర్జాతీయ మార్కెట్ల కోసం రెండు దేశాలు ఉమ్మడిగా వస్తువులు, సేవలను అభివృద్ధి చేయడానికి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ⇒యూకే ఉత్పత్తులను ఇండియా అనుమతించనుంది. అలాగే ఇండియా తమ ఉత్పత్తులను యూకేలో విక్రయించుకోవచ్చు. ⇒ భారత్‌లో బ్రిటిష్‌ స్కాచ్‌ విస్కీ, బ్రిటిష్‌ కార్ల ధరలు తగ్గిపోతాయి. అలాగే బ్రిటన్‌లో ఇండియా వస్త్రాలు, తోలు ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. ⇒ ఒప్పందం ప్రకారం... యూకే విస్కీ, జిన్‌పై సుంకాన్ని 150 నుంచి 75 శాతానికి భారత్‌ తగ్గిస్తుంది. పదేళ్లలో 40 శాతానికి తగ్గించనుంది. ⇒ బ్రిటిష్‌ ఆటోమొబైల్స్‌పై ఇండియాలో టారిఫ్‌ ప్రస్తుతం 100 శాతం ఉండగా, ఇది 10 శాతానికి తగ్గిపోనుంది. ప్రతిఫలంగా భారత్‌ నుంచి వచ్చే పలు ఉత్పత్తులపై టారిఫ్‌లను యూకే ప్రభుత్వం భారీగా తగ్గిస్తుంది. ⇒ యూకే మార్కెట్లలో 99 శాతం భారతీయ ఉత్పత్తులపై టారిఫ్‌లు సున్నాకు పడిపోతాయి. పాదరక్షలు, బంగారు అభరణాలు, రత్నాలు, రసాయనాలు, ప్లాస్టిక్, రబ్బర్, కలప, కాగితం, గాజు, సెరామిక్, బేస్‌ మెటల్స్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ మెషినరీ, ఫర్నీచర్, క్రీడా సామగ్రి, శుద్ధి చేసిన ఆహారం, పాడి ఉత్పత్తులపై సుంకాలు ఉండవు. అంతేకాకుండా భారతీయులకు యూకేలో మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ⇒ ఎఫ్‌టీఏతో ఇండియా–యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నడుమ ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి రెండు రెట్లు వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. 2040 నాటికి బ్రిటిష్‌ ఆర్థిక వ్యవస్థ ప్రతిఏటా అదనంగా 4.8 బిలియన్‌ పౌండ్ల మేర లాభపడుతుందని చెబుతున్నారు. ⇒భారత్, యూకే మద్య ద్వైపాక్షిక వాణిజ్యం ఏటా 41 బిలియన్‌ పౌండ్లుగా ఉంది. ఎఫ్‌టీఏతో ఇది 56 బిలియన్‌ పౌండ్లకు చేరుకోనుంది. ⇒ డబుల్‌ కంట్రిబ్యూషన్స్‌ కన్వెన్షన్‌(సామాజిక భద్రత ఒప్పందం) ప్రకారం.. భారత్‌ ఉద్యోగాలు యూకేలో లేదా యూకే ఉద్యోగులు భారత్‌లో పనిచేస్తే నేషనల్‌ ఇన్సూరెన్స్‌ లేదా సోషల్‌ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్స్‌ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ⇒ ఎఫ్‌టీఏకు ఇరుదేశాల పార్లమెంట్‌ ఆమోదం లభించి, సంతకాలు జరగాల్సి ఉంది. ఏడాది లోగా అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Andhra govt over corrupt Axis Energy power deal6
4 గంటల కోసం... 20 గంటలు అధిక ధర చెల్లింపు!

సాక్షి, అమరావతి: సాయంత్రం అవసరమవుతుందని.. ఉదయం నుంచి అధిక ధరకు విద్యుత్‌ కొనుగోలు చేస్తామా? వేసవిలో డిమాండ్‌ ఉంటుందని వానాకాలంలోను, శీతాకాలంలోను తక్కువ రేటుకు విద్యుత్‌ దొరికే అవకాశం ఉన్నా, దాన్ని కాదని ఎక్కువ రేటు చెల్లిస్తామా..? ఎప్పుడు అవసరమైతే అప్పుడు బహి­రంగ మార్కెట్‌లో విద్యుత్‌ దొరుకుతుంటే.. సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సెకీ) వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతోపాటు రిలయన్స్‌ వంటి బడా కంపెనీలు తక్కువ రేటుకే విద్యుత్‌ సరఫరా చేసేందుకు ముందుకొస్తుంటే విజ్ఞత ఉన్నవారెవరైనా వద్దంటారా..? యాక్సిస్‌ ఎనర్జీతో కూటమి ప్రభుత్వం ఒప్పందం గురించి తెలిసిన తర్వాత ఎవరికైనా వచ్చే సాధారణ సందేహాలివి. కానీ, దోచుకోవడమే పరమావధిగా భావించే సీఎం చంద్రబాబుకు మాత్రం ఇవేవీ పట్టవు. అందుకే దాదాపు రూ.11 వేల కోట్ల భారీ కుంభకోణానికి నిస్సిగ్గుగా తెరతీశారు. యాక్సిస్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ పార్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో పీపీఏ కుదుర్చుకున్నారు. 400 మెగావాట్ల పవన–సౌర హైబ్రీడ్‌ పైలట్‌ ప్రాజెక్టు నుంచి పునరుత్పాదక విద్యుత్‌ను 25 ఏళ్లపాటు యూనిట్‌కు ఏకంగా రూ.4.60 చెల్లించి కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. ఇదేం విడ్డూరం బాబూ వ్యవసాయానికి 30 ఏళ్లపాటు ఉచిత విద్యుత్‌ అందించడానికి, రాష్ట్రంలో భవిష్యత్తులో పెరగనున్న విద్యుత్‌ అవసరాలను తీర్చేందుకు, పవర్‌ గ్రిడ్‌ డిమాండ్‌ను సమతూకం చేసేందుకు ‘సెకీ’ నుంచి సౌర విద్యుత్‌ను తీసుకోవాలని గత ప్రభుత్వం సంకల్పించింది. అది కూడా సెకీ తనకు తానుగా ముందుకొచ్చి విద్యుత్‌ సరఫరా చేస్తామని ప్రతిపాదిస్తూ లేఖ రాయడం వల్ల జరిగింది. అందులోనూ 7వేల మెగావాట్లను కేవలం యూనిట్‌ రూ.2.49కే పాతికేళ్లపాటు అంతర్రాష్ట్ర ప్రసార చార్జీల నుంచి మినహాయింపుతో అందిస్తామని సెకీ చెప్పడంతో ఒప్పందం కుదుర్చుకుంది.గతేడాది నుంచే ఈ విద్యుత్‌ను రాష్ట్ర డిస్కంలు తీసుకోవాల్సి ఉన్నా, కూటమి అధికారంలోకి రావడంతో ఆగిపోయింది. ఇంతవరకూ తక్కువ ధరకు వచ్చే సెకీ విద్యుత్‌ను ఏపీ వినియోగించుకోలేకపోతోంది. కానీ, ఇప్పటివరకు ప్లాంటు కూడా పెట్టని యాక్సిస్‌తో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని రెండేళ్లలో నిరి్మంచి, ఆ తర్వాత యూనిట్‌ రూ.4.60కి కొనేందుకు కూటమి ఒప్పందం కుదుర్చుకుంది. పైగా ఇన్నాళ్లూ సెకీ నుంచి విద్యుత్‌ తీసుకుంటే విద్యుత్‌ వృథా అవుతుందని, ప్రజలపై భారం పడుతుందని టీడీపీ, ఎల్లో మీడియా ద్వారా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశాయి.కానీ, ఇప్పుడు సెకీ నుంచి 7 వేల మెగావాట్లు తీసుకున్నా కూడా రాష్ట్ర అవసరాలకు సరిపోదని ఏపీఈఆర్‌సీ చేత సీఎం చంద్రబాబు చెప్పించారు. పాతికేళ్లపాటు తక్కువ ధరకు సెకీ విద్యుత్‌ వస్తుంటే తీసుకోలేనివారు, రెండేళ్ల తర్వాత వస్తుందనుకుంటున్న యాక్సిస్‌ పవర్‌ను అధిక ధరకు కొంటామనడం విడ్డూరంగా ఉందని ఇంధన రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. పక్కా దోపిడీ! సహజంగా సౌర విద్యుత్‌ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు పవన విద్యుత్‌ వస్తుంది. ఏడాదిలో కొన్ని రోజులు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, డిమాండ్‌ వల్ల గ్రిడ్‌ ప్రభావితమైనప్పుడు ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు రావడం పునరుత్పాదక విద్యుత్‌లో సహజం. ఇలాంటి సమయాల్లో గ్రిడ్‌ ఫ్రీక్వెన్సీని బాలెన్స్‌ చేయడానికి బేస్‌ పవర్‌ను ఫీడ్‌ చేస్తారు. అంటే థర్మల్, హైడల్, గ్యాస్‌ వంటి విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల నుంచి విద్యుత్‌ను తీసుకుంటారు. అలా కూడా విద్యుత్‌ సరిపోలేదంటే, బహిరంగ మార్కెట్‌ (పవర్‌ ఎక్సే్చంజీ)లో కొనుగోలు చేస్తుంటారు. ఇందుకోసం ప్రతి 15 నిమిషాలకు ఒకసారి విద్యుత్‌ డిమాండ్‌ను అంచనా వేసి, కొనుగోలు చేసే సాంకేతిక పరిజ్ఞానం మన దగ్గర అందుబాటులో ఉంది.కానీ, సౌర విద్యుత్‌ రాత్రి వేళ అందుబాటులో ఉండదనే విషయాన్ని బూచిగా చూపించి ప్రజల ఖజానాను దోచేసే పయత్నం చంద్రబాబు చేస్తున్నారు. బ్యాటరీ స్టోరేజీ వ్యవస్థ వల్ల నాలుగు గంటలపాటు యాక్సిస్‌ విద్యుత్‌ బ్యాక్‌ అప్‌ వస్తుందని, అందుకే అంత రేటు పెట్టామని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడో కొద్ది రోజులు డిమాండ్‌ ఉంటుందంటూ ఆ పేరుతో యూనిట్‌కు రూ.4.60 చొప్పున పాతికేళ్ల పాటు చెల్లించేందుకు సిద్ధం కావడమంటే.. ఇంతకంటే పచ్చి దోపిడీ ఉండదు. పీక్‌ అవర్స్‌ డిమాండ్‌ 3 నుంచి 4 గంటలు మాత్రమే ఉంటుంది. దాని కోసం మిగిలిన 20 గంటలకు ఒకే ధర చెల్లించడం, పక్కా అవినీతికి నిదర్శనమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

Sakshi Guest Column On India Pakistan Issues7
ఇది ఐక్యతా సమయం

గత వారం ఓ రోజు ఉదయం 6 గంటల తర్వాత నా మొబైల్‌లో నోటిఫికేషన్‌ పింగ్‌ అయింది. నా స్నేహితుడి కొడుకు నుండి ఒక సందేశం వస్తున్నట్లు నేను చూశాను. పహల్గామ్‌లో జరిగిన సంఘటనల గురించి అతను కలత చెందాడు. సంఘటన తర్వాత వెంటనే ఎటువంటి ప్రతీకార చర్యా తీసుకోనందుకు మన ప్రభుత్వంపై అతడు అసహనం వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవడానికి తీవ్రస్థాయిలో మీడియా ప్రచారాన్ని నడపటం ద్వారా నా వంతు కృషి నేను చేస్తానని అతను ఆశించాడు. నేను షాక్‌ అయ్యాను. చిన్నప్పటి నుండి అతడు నాకు తెలుసు. దేశంలోని ఉత్తమ పాఠశాలల్లో అతను చదువుకున్నాడు. ఇంజనీరింగ్‌ డిగ్రీని సాధించాడు. ఇన్‌ స్టిట్యూట్‌ నుండి పట్టభద్రుడయ్యే ముందు, అతనికి ఓ బహుళజాతి సంస్థ ఉద్యోగం ఆఫర్‌ కూడా ఉండేది. ఉన్నత స్థాయికి ఎదిగాడు. నేడు కార్పొరేట్‌ వర్గాల ఆకర్షణీయమైన సర్కిల్‌లో ఉంటున్నాడు. తన తెలివితేటలు, జ్ఞానం వల్ల మంచి గుర్తింపు, గౌరవం పొందాడు. అందుకే తాను ప్రకటించిన విద్వేష భావానికి నేను పెద్దగా కలత చెందలేదు. తనను ప్రశాంతంగా ఉండమని సలహా ఇచ్చాను. ప్రభుత్వాన్ని విశ్వసించమని నచ్చ చెప్పాను. సరైన సమయం వచ్చినప్పుడు, ప్రపంచం భారత్‌ నుండి పూర్తి స్థాయి చర్యను వీక్షిస్తుందని చెప్పాను. 1971లోనూ భారతదేశంలో ఇలాంటి యుద్ధ సన్నద్ధతే పెరుగుతూ వచ్చిందని అతనికి గుర్తు చేశాను. తిరుగులేని వ్యూహకర్త మానెక్‌ షా!అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ శ్యామ్‌ మానెక్‌ షాను పిలిపించారు. ‘‘తూర్పు పాకిస్తాన్‌ పై భారత సైన్యం వెంటనే దాడి చేసి, దాన్ని స్వతంత్ర దేశంగా, బంగ్లాదేశ్‌గా మార్చడానికి సహాయం చేయగలదా?’’ అని ఆమె అడిగారు. అద్భు తమైన వ్యూహకర్త మానెక్‌ షా. కొన్ని నెలల్లో రుతుపవనాలు రాను న్నాయని ప్రధానితో చెప్పారు. వర్షాకాలంలో, బంగ్లాదేశ్‌లోని పొలాలు చిత్తడి నేలలుగా మారతాయి. అందువల్ల అలాంటి సమయంలో దాడి చేయడం అంటే అది పెద్ద ఎత్తున సైనికుల మరణానికి దారితీస్తుందని వివరించారు. దాంతో మానెక్‌ షా తొందరపాటు ఆదేశాలు జారీ చేయబోవడం లేదని నిర్ధారణ అయింది. అనంతరం, తొమ్మిది నెలలపాటు జాగ్రత్తగా వేసుకున్న ప్రణాళిక, సమన్వయం, కచ్చితమైన వ్యూహం తర్వాత, భారత దళాలు తూర్పు పాకిస్తాన్‌పై దాడి చేసినప్పుడు, శత్రువు ఓడిపోవడమే కాకుండా, 90,000 మందికి పైగా పాక్‌ సైనికులు భారత్‌కు లొంగిపోయారు. మానవాళి చరిత్రలో, ఇంత పెద్ద సైనిక దళం ఎప్పుడూ ప్రత్యర్థికి లొంగి పోలేదు. 1971 డిసెంబర్‌ 16న, భారత సైన్యం తన అత్యుత్తమ ఘడియను ఆస్వాదిస్తూ, మన సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యా యాన్ని లిఖిస్తున్న సమయంలో బంగ్లాదేశ్‌ ఆవిర్భవించింది.1971ని తలపిస్తున్న మంతనాలుప్రస్తుత ప్రధాని కూడా భారత సాయుధ దళాలకు పాక్‌పై తగిన చర్య తీసుకోవడానికి అధికారం ఇచ్చారు. నెంబర్‌ 7 – లోక్‌ కల్యాణ్‌ మార్గ్, నార్త్‌ బ్లాక్, సౌత్‌ బ్లాక్‌లలో వ్యూహాత్మక సమావేశాలు జరిగాయి. సైనిక చర్యలు ఆర్థిక, దౌత్యపరమైన పర్యవసానాలను కలిగి ఉంటాయి. కనీస ప్రాణనష్టంతో త్వరిత విజయాన్ని సాధించడానికి, శక్తిమంతమైన మిత్రులు మద్దతు ఇవ్వడానికి లేదా నిర్ణాయక సమయంలో కనీసం తటస్థంగా ఉండటానికి కొన్ని నిబద్ధతలు అవసరం. 1991లో మొదటి గల్ఫ్‌ యుద్ధంలో సంకీర్ణ సైన్యానికి నాయకత్వం వహించిన యు.ఎస్‌. జనరల్‌ నార్మన్‌ స్క్వార్జ్‌కోఫ్, ‘‘మీరు శాంతిలో ఎంత ఎక్కువ చెమట చిందిస్తే, యుద్ధంలో అంత తక్కువ రక్తస్రావం అవుతుంది...’’ అని అన్నారు.రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ అమెరికా సహా వివిధ దేశాలలో తమ సమ ఉజ్జీలతో ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు 1971ని గుర్తుకు తెస్తున్నాయి. ఆనాడు మానెక్‌ షా, నావికాదళ, వైమానిక దళ అధిపతులు యుద్ధా నికి సిద్ధమవుతుండగా, ఇందిరా గాంధీ కూడా నమ్మకమైన దౌత్య భాగస్వాముల కోసం వెతికే పనిలో పడ్డారు. భారతదేశం అప్పటికి కొంతకాలం క్రితం పాశ్చాత్య జోక్యానికి వ్యతిరేకంగా హామీ కోసం నాటి సోవియట్‌ యూనియన్‌తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తరువాత, యుద్ధ సమయంలో బంగాళాఖాతంలో అమెరికన్‌ సిక్స్‌త్‌ ఫ్లీట్‌ కనిపించడం, దాన్ని ఎదుర్కోవడానికి సోవి యట్‌ జలాంతర్గాములు రావడం వంటి సంఘటనలు భారతదేశపు దౌత్యపరమైన మాస్టర్‌ స్ట్రోక్‌ (పైఎత్తు)ను ధ్రువీకరించాయి. నేడు రెండూ అణ్వాయుధ శక్తులే!నేటి పరిస్థితి కూడా అంతే ప్రమాదకరమైనది. ట్రంప్‌ 2.0 యుగంలో ఇది మరింత క్లిష్టంగా మారింది. ఎటువంటి భావజాలం లేకుండా, సోషల్‌ మీడియా నిరంతర చూపు కింద నడిచే భౌగోళిక రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. 1971లో మాది రిగా కాకుండా భారతదేశం, పాకిస్తాన్‌ రెండూ ఇప్పుడు అణ్వాయుధ శక్తులు. మనకు మద్దతు ఇవ్వడానికి ఇప్పుడు సోవియట్‌ యూనియన్‌ లేదు. ఏదైనా సహాయం అందించే పరిమిత సామర్థ్యంతోనే రష్యా ఇప్పుడు ఉక్రెయిన్‌ తో పోరాడుతోంది, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి వ్యాఖ్యలు బీజింగ్‌ జాగరూకతా వైఖరిని వెల్లడిస్తున్నాయి: ‘‘సంఘర్షణ అనేది భారత్‌ లేదా పాకిస్థాన్‌ ప్రాథమిక ప్రయోజనాలకు నష్టం చేస్తుంది..’’ అని వాంగ్‌ వ్యాఖ్యానించారు. అయితే చైనా సానుభూతి పాక్‌ వైపు ఉంది. ప్రపంచంలోని ఏకైక అగ్రరాజ్యమైన అమెరికా, మిశ్రమ సంకేతాలను పంపుతోంది. ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ ప్రకటనను పరిగణించండి: ‘‘పహల్గామ్‌ దాడి పట్ల భారత్‌ విస్తృత ప్రాంతీయ సంఘర్షణకు దారితీయని విధంగా ప్రతిస్పంది స్తుందని మేము ఆశిస్తున్నాము’’ అన్నారాయన. ప్రమాదకరంగా సోషల్‌ మీడియా!ప్రభుత్వం చేతులు కట్టివేయడం, దాని ఎంపికలను పరిమితం చేయడం వంటి సంక్లిష్టతలను గ్రహించకుండా, లెక్కలేనన్ని స్వరాలు సోషల్‌ మీడియాలో ఇప్పుడు ఉగ్రదాడి పట్ల, పాక్‌ పైన నిరంతరం మండిపడుతున్నాయి. సర్జికల్‌ స్ట్రయిక్స్‌ అయినా, లేదా బాలాకోట్‌ వైమానిక దాడి అయినా సరే, తన మాటను నిలబెట్టుకోవడంలో ప్రధాని మోదీకి ఉన్న విశ్వసనీయతను వారు విస్మరిస్తున్నారు.దాంతో మన సోషల్‌ మీడియా కార్యకలాపాలు శత్రువులకు ఫిరంగి మేతగా మారాయి. ఎవరైనా సరే, ప్రభుత్వ పక్షాన నిశ్శబ్దంగా నిలబ డాల్సిన సమయం ఇది. అనవసరమైన వాగ్వాదాలకు పాల్పడకుండా ఉండాల్సిన సమయం ఇది. మతతత్వపు విష బీజాలు నాటడానికి కొందరు ఈ పరిస్థితిని మలచుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం బృందావన్‌లో ఆలయ సేవలో పాల్గొన్న ముస్లింలను బహిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బాంకే బిహారీ ఆలయం ముందు ఒక మూక నిరసన తెలిపింది. అయితే ఆలయ ట్రస్ట్‌... స్పష్టంగా ప్రతిస్పందించింది. ఆ ముస్లింలు శతాబ్దాలుగా శ్రీకృష్ణుని దుస్తులను తయారు చేస్తున్నారని ట్రస్ట్‌ నిర్వాహకులు నొక్కి చెప్పారు.ఐక్యంగా ముందుకు సాగాలిఉగ్రవాద దాడిని జమ్మూ – కశ్మీర్‌ అసెంబ్లీ ఏప్రిల్‌ 29న ఏకగ్రీవంగా ఖండించింది. దేశంలోని మిగిలిన ప్రాంతాలకు సంఘీభావం తెలిపింది. లోయలో ఉగ్రవాదం అంతం ప్రారంభమైందని శాసన సభ్యులు భావిస్తున్నారు. ద్వేషపూరిత వ్యక్తులు అలాంటి సంఘీభావ ప్రదర్శనను విస్మరించడమే కాకుండా, దేశవ్యాప్తంగా అనేక మసీదులు మొన్నటి ఉగ్రవాద దాడిని ఖండించడాన్ని సులువుగా మరచి పోతారు. ఇప్పుడు పాకిస్థాన్‌ను బహిరంగంగా ఖండించని ముస్లిం నాయకుడు లేడు. ద్వేషం, విభజన రాజకీయాలతో రెచ్చగొట్టడం కాకుండా, అందరూ ప్రభుత్వంతో కలిసి నిలబడి సామాజిక ఐక్యత కోసం పనిచేయాల్సిన సమయం ఇది!శశి శేఖర్‌ వ్యాసకర్త సీనియర్‌ సంపాదకులు

Closing Bell: Nifty below 24641: Sensex down 156 points8
లాభాల్లోంచి నష్టాల్లోకి..

ముంబై: భారత్‌ – పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్‌ 156 పాయింట్లు నష్టపోయి 80,641 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 82 పాయింట్లు పతనమై 24,380 వద్ద నిలిచింది. ఉదయం సూచీలు సానుకూలంగా మొదలయ్యాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ నిర్ణయాలు, యూఎస్‌–చైనా వాణిజ్య చర్చల నేపథ్యంలో పరిమిత శ్రేణిలో ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 316 పాయింట్లు క్షీణించి 80,481 వద్ద, నిఫ్టీ 130 పాయింట్లు పతనమై 24,331 వద్ద కనిష్టాన్ని తాకాయి. ఫెడ్‌ వడ్డీరేట్ల కోత ఉండకపోవచ్చనే అంచనాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ ఆటో, టెక్‌ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. బీఎస్‌ఈలో రంగాల వారీగా సూచీల్లో రియల్టీ 3.5%, విద్యుత్, సర్వీసెస్‌ 2.5%, యుటిలిటీ, ఇండస్ట్రీయల్, క్యాపిటల్‌ గూడ్స్‌ 2%, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ ఒకటిన్నర శాతం నష్టపోయాయి. మిడ్, స్మాల్‌ క్యాప్‌ సూచీలు 2%కి పైగా క్షీణించాయి.

MI vs GT IPL 2025: Gujarat Titans beat Mumbai Indians by 3 wickets9
ముంబై జోరుకు బ్రేక్‌

ముంబై: ఐపీఎల్‌–2025లో ముంబై ఇండియన్స్‌ జైత్రయాత్రకు కాస్త విరామం... వరుసగా ఆరు విజయాలతో కొనసాగించిన జోరుకు గుజరాత్‌ టైటాన్స్‌ బ్రేక్‌ వేసింది. మంగళవారం వాంఖెడే మైదానంలో జరిగిన పోరులో గుజరాత్‌ 3 వికెట్ల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం) ముంబైపై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. విల్‌ జాక్స్‌ (35 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, సూర్యకుమార్‌ యాదవ్‌ (24 బంతుల్లో 35; 5 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 43 బంతుల్లో 71 పరుగులు జోడించారు. చక్కటి బౌలింగ్‌తో ముంబైని తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో టైటాన్స్‌ సఫలమైంది. అనంతరం గుజరాత్‌ 19 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్‌ గిల్‌ (46 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్‌), జోస్‌ బట్లర్‌ (27 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్‌), రూథర్‌ఫర్డ్‌ (15 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఛేదనలో 14 ఓవర్ల తర్వాత 107/2తో గుజరాత్‌ మెరుగైన స్థితిలో నిలిచింది. చేతిలో 8 వికెట్లు ఉన్న జట్టు మరో 36 బంతుల్లో 49 పరుగులే చేయాలి. గుజరాత్‌ విజయం లాంఛనమే అనిపించింది. ఈ దశలో వానతో చాలా సేపు ఆట ఆగిపోయింది. అంతా చక్కబడి మ్యాచ్‌ మొదలైన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. బుమ్రా, బౌల్ట్‌ చెలరేగిపోవడంతో గుజరాత్‌ బ్యాటింగ్‌ తడబాటుకు లోనైంది. తర్వాతి 4 ఓవర్లలో 25 పరుగులు చేసిన జట్టు 16 బంతుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. 2 ఓవర్లలో 24 పరుగులు చేయాల్సిన ఉన్న సమయంలో మళ్లీ భారీ వర్షంతో ఆట ఆగిపోయింది. దాంతో ఆటను ఒక ఓవర్‌ కుదించి డక్‌వర్త్‌–లూయిస్‌ ప్రకారం గుజరాత్‌ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 147గా నిర్దేశించారు. దాంతో చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి. చహర్‌ వేసిన ఈ ఓవర్లో టైటాన్స్‌ 15 పరుగులు చేసి విజయాన్నందుకుంది. స్కోరు వివరాలు: ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రికెల్టన్‌ (సి) సుదర్శన్‌ (బి) సిరాజ్‌ 2; రోహిత్‌ (సి) ప్రసిధ్‌ (బి) అర్షద్‌ 7; జాక్స్‌ (సి) సుదర్శన్‌ (బి) రషీద్‌ 53; సూర్యకుమార్‌ (సి) షారుఖ్‌ (బి) సాయికిషోర్‌ 35; తిలక్‌ (సి) గిల్‌ (బి) కొయెట్జీ 7; పాండ్యా (సి) గిల్‌ (బి) సాయికిషోర్‌ 1; నమన్‌ (సి) గిల్‌ (బి) ప్రసిధ్‌ 7; బాష్‌ (రనౌట్‌) 27; చహర్‌ (నాటౌట్‌) 8; కరణ్‌ శర్మ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–2, 2–26, 3–97, 4–103, 5–106, 6–113, 7–123, 8–150. బౌలింగ్‌: సిరాజ్‌ 3–0–29–1, అర్షద్‌ 3–0–18–1, ప్రసిధ్‌ 4–0–37–1, సాయికిషోర్‌ 4–0–34–2, రషీద్‌ ఖాన్‌ 4–0–21–1, కొయెట్జీ 2–0–10–1. గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాయి సుదర్శన్‌ (సి) రికెల్టన్‌ (బి) బౌల్ట్‌ 5; గిల్‌ (బి) బుమ్రా 43; బట్లర్‌ (సి) రికెల్టన్‌ (బి) అశ్వని 30; రూథర్‌ఫర్డ్‌ (ఎల్బీ) (బి) బౌల్ట్‌ 28; షారుఖ్‌ (బి) బుమ్రా 6; తెవాటియా (నాటౌట్‌) 11; రషీద్‌ ఖాన్‌ (ఎల్బీ) (బి) అశ్వని 2; కొయెట్జీ (సి) నమన్‌ (బి) చహర్‌ 12; అర్షద్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19 ఓవర్లలో 7 వికెట్లకు) 147. వికెట్ల పతనం: 1–6, 2–78, 3–113, 4–115, 5–123, 6–126, 7–146. బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 3–0–32–1, బౌల్ట్‌ 4–0–22–2, బుమ్రా 4–0–19–2, హార్దిక్‌ పాండ్యా 1–0–18–0, కరణ్‌ శర్మ 2–0–13–0, అశ్వని కుమార్‌ 4–0–28–2, జాక్స్‌ 1–0–15–0.

Chandrababu Govt Conspiracy on P4 Policy10
‘కూటమి’ కోసం నియామకాలు!

సాక్షి, అమరావతి: పేదరికాన్ని నిర్మూలిస్తానంటూ పీ–4 కార్యక్రమంతో ముందుకొచ్చిన కూటమి ప్రభుత్వం.. ఆ పేరుతో తమ వారికి మంచి జీతాలతో ఉపాధి కల్పించేందుకు మాత్రం మార్గం వెతుక్కుంది. ప్రజలు, పబ్లిక్, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది రోజున శ్రీకారం చుట్టారు. ధనికులు, ప్రైవేట్‌ సంస్థలు ముందుకు వచ్చి పేద కుటుంబాలను ఆరి్థకంగా పైకి తీసుకురావడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కేవలం సహాయకారిగా వ్యవహరిస్తుంది తప్ప రూపాయి నిధులు ఇవ్వదు.అయితే ఈ ముసుగులో కూటమి పార్టీకు చెందిన వారికి భారీ ఎత్తున ఉపాధి కల్పించేందుకు వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి నెలకు రూ.60 వేల వేతనంతో ఒక పీ–4 సమన్వయకర్త నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ లెక్కన 175 నియోజకవర్గాలకు ఏటా రూ.12.60 కోట్లు వారికి వేతనాల రూపంలో చెల్లించడం అంటే పార్టీ వారికి ఉపాధి కల్పించడమేనని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.ప్రభుత్వ ఉద్యోగులు ఆ పని చేయలేరా?ఇంతకూ పీ–4 సమన్వయ కర్తలు చేయాల్సిన పని ఏమిటంటే నియోజకవర్గ కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి.. దాతృత్వ వ్యక్తులు, ప్రైవేటు రంగ సంస్థలను ఒప్పించి సమన్వయం చేస్తూ పౌర సమాజానికి మేలు చేయడం. వాస్తవానికి ఈ పని చేసేందుకు గ్రామ, వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభు­త్వ ఉద్యోగులు ఉండనే ఉన్నారు. అయినప్పటికీ పీ–4 సమన్వయకర్తల నియామకం అంటే ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి.. సొంత వారికి ఉపాధి కల్పించడమే అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టు విధానంలో కాకుండా రెగ్యులర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి ఉంటే ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన పని లేదంటున్నారు. తద్వారా ఇది ముమ్మాటికీ ప్రజాధనం దుర్వినియోగమేననే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.పేదరిక నిర్మూలన అంటే పేద పిల్లలను చదివించేలా ప్రోత్సహించాలని, ఇందుకు తల్లి­కి వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తదితర సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రభుత్వం అమలు చేయా­లని చెబుతున్నారు. అలా కాకుండా ఊరికొకరిని ఎన్నుకుని వారికి సాయపడితే పేదరికం ఎలా పోతుందని ప్రశి్నస్తున్నారు. పేదరిక నిర్మూలన బాధ్యతలను ప్రైవేట్‌కు అప్పగించిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జన్మభూ­మి పేరుతో, ఇప్పుడు పీ–4 పేరుతో ప్రభుత్వ సొమ్మును కార్యకర్తలకు దోచిపెట్టడమే బాబు విధానమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కన్సల్టెంట్ల పేరుతో దుర్వినియోగం ⇒ ఎన్నికల్లో సామాన్య నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, లేదంటే నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీని విస్మరించి ఇప్పుడు భారీగా కూటమి పార్టీలకు చెందిన వారికి లేదా కన్సల్టెన్సీ పేరుతో కార్పొరేట్‌ సంస్థలకు భారీగా ఉపాధి కల్పిస్తున్నారనే అభిప్రాయాన్ని ఉద్యోగ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్, కన్సల్టెన్సీల రాజ్యం మళ్లీ అమల్లోకి వచ్చిందంటున్నారు. ⇒ వికసిత్‌ ఆంధ్రా విజన్‌ పేరుతో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీలో 71 పోస్టులను కన్సల్టెంట్ల రూపంలో నియమించేందుకు పరిపాలన అనుమతి మంజూరు చేసింది. మరో పక్క రాష్ట్ర ఆదాయం పెంచేందుకు 11 మంది కన్సల్టెంట్లను 8 నెలల కోసం రూ.3.28 కోట్ల చెల్లింపుతో నియమించింది. ⇒ సీఆర్‌డీఏలో ప్రోగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్లు, అమరావతి ఆరి్థకాభివృద్ధిలో ప్రైవేట్‌ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి కన్సల్టెంట్లను నియమిస్తోంది. ఇందుకోసం ఏకంగా ఒక్కో కన్సల్టెంట్‌కు నెలకు రూ.రెండు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు చెల్లిస్తోంది. 68 మంది కన్సల్టెంట్లకు రెండేళ్లలో రూ.70.64 కోట్లు చెల్లించనుంది. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌ నిర్మాణ పనుల పర్యవేక్షణ కోసం మరో కన్సల్టెన్సీ ఏజెన్సీని నియమిస్తోంది. ఇందుకోసం రెండేళ్లలో రూ.22.58 కోట్లు చెల్లించనుంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement