
మంగళవారం కశ్మీర్‌లోని దాల్ సరస్సులో మాక్‌డ్రిల్ రిహార్సల్స్
దేశమంతటా నేడే మాక్‌డ్రిల్
సాక్షి, న్యూఢిల్లీ: మాక్‌డ్రిల్స్‌కు సర్వం సిద్ధమైంది. అనూహ్య పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేందుకు, యుద్ధ సన్నద్ధతను పూర్తిస్థాయిలో చాటేందుకు దేశమంతా ఒక్కటవుతోంది. దాదాపు 54 ఏళ్ల అనంతరం దేశవ్యాప్తంగా పౌర రక్షణ, సన్నద్ధత విన్యాసాలు జరగనున్నాయి. పట్టణాల నుంచి గ్రామస్థాయి దాకా వాటిలో ప్రజలంతా చురుగ్గా భాగస్వాములు కానున్నారు. 6.5 లక్షల మందికి పైగా వలెంటీర్లు ఈ క్రతువులో వారికి సాయపడనున్నారు. 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ (సీడీడీ) పరిధిలో బుధవారం సాయంత్రం నాలుగింటి నుంచి రాత్రి దాకా ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరిట ఈ డ్రిల్స్ జరుగుతాయి.
దేశవ్యాప్తంగా అణు విద్యుత్కేంద్రాలు, రిఫైనరీలు, కీలక కేంద్ర ప్రభుత్వ సంస్థలున్న, రక్షణపరంగా సున్నితమైన ప్రాంతాలను సీడీడీలుగా 2010లో కేంద్రం నోటిఫై చేసింది. వీటిలో చాలావరకు రాజస్తాన్, పంజాబ్, జమ్మూ కశీ్మర్, పశి్చమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో నెలకొని ఉన్నాయి. సున్నితత్వాన్ని బట్టి వాటిని మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ఢిల్లీ, చెన్నై వంటి నగరాలు అత్యంత సున్నితమైన కేటగిరీ 1లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం డ్రిల్స్‌కు వేదిక కానున్నాయి. వాటిని సున్నితమైనవిగా పేర్కొంటూ కేటగిరీ 2లో చేర్చారు.
కేంద్రం సమీక్ష
పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ దేశవ్యాప్త డ్రిల్స్ సన్నద్ధతను కేంద్ర హోం శాఖ మంగళవారం సమీక్షించింది. డ్రిల్స్ విధివిధానాలు తదితరాలపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సారథ్యంలో ఉన్నతస్థాయి సమావేశంలో లోతుగా చర్చించారు. రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు రక్షణ, పోలీసు విభాగాల అత్యున్నత స్థాయి అధికారులు భేటీలో పాల్గొన్నారు. డ్రిల్స్‌లో విద్యార్థులు, ఎన్సీసీ కాడెట్లు, యువతతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు, ఆస్పత్రుల సిబ్బంది, రైల్వే, మెట్రో ఉద్యోగులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.
ఎక్కడికక్కడ పోలీసు, సైనిక సిబ్బంది వారితో సమన్వయం చేసుకోనున్నారు. 1971 తర్వాత రక్షణపరంగా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ జరుగుతుండటం ఇదే తొలిసారి. అప్పుడు కూడా పాక్‌తో యుద్ధ నేపథ్యంలోనే ఈ కసరత్తు నిర్వహించారు. అంతకుముందు 1962, 1965ల్లో కూడా చైనా, పాక్‌తో పూర్తిస్థాయి యుద్ధం సందర్భంగా మాక్ డ్రిల్స్ జరిపారు. మంగళవారం అన్ని రాష్ట్రాల్లోనూ మాక్ డ్రిల్స్ సన్నాహక కసరత్తులు పోలీసు తదితర బృందాల పర్యవేక్షణలో ముమ్మరంగా జరిగాయి. విద్యార్థులు, యువత మొదలుకుని ప్రజలంతా పెద్ద సంఖ్యలో వాటిలో పాల్గొన్నారు.
డ్రిల్స్ ఇలా...
⇒ మాక్ డ్రిల్స్‌లో భాగంగా వైమానిక దాడుల హెచ్చరికలతో సైరన్లు విని్పస్తాయి.
⇒ వెంటనే పరిసర ప్రాంతాల పౌరులంతా క్షణాల్లో అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు తరలాలి. వీలైన చోట్ల బంకర్లు, సబ్‌వేలు, అండర్‌గ్రౌండ్ మెట్రో తదితర చోట్ల తలదాచుకోవాలి.
⇒ ఈ కసరత్తులో యువత, విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కాడెట్లు మొదలుకుని హోం గార్డుల దాకా అందరినీ భాగస్వాములను చేస్తారు.
⇒ కీలక సంస్థలు, మౌలిక సదుపాయ వ్యవస్థలను దాడుల నుంచి కాపాడుకోవడం, అవి శత్రువు కంటపడకుండా జాగ్రత్త పడటం తదితరాల్లో జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగి్నమాపక తదితర బృందాలు వారికి శిక్షణ ఇస్తాయి.
⇒ బ్లాకౌట్ వంటివి చోటుచేసుకుంటే ఎలా స్పందించాలో, స్వీయరక్షణతో పాటు పౌరులను కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తాయి.
⇒ రాత్రి 7.30 నుంచి 10 నిమిషాల పాటు క్రాష్ బ్లాకౌట్ ‘లైట్లను ఆపేయడం) కసరత్తు జరుగుతుంది.
⇒ డ్రిల్స్ కోసం హాట్‌లైన్, రేడియో కమ్యూనికేషన్ వంటివాటిని వైమానిక దళ లింకులతో అనుసంధానిస్తారు.
⇒ కంట్రోల్ రూమ్స్, షాడో కంట్రోల్ రూమ్స్ విపత్తులకు ఎలా స్పందిస్తాయో పరీక్షిస్తారు.
⇒ డ్రిల్స్ నిమిత్తం స్పందన బృందాలన్నింటికీ ఇప్పటికే కోడ్ వర్డ్స్ కేటాయించారు.
⇒ ఎప్పుడేం చేయాలో పేర్కొంటూ టైమ్‌లైన్‌ను కూడా స్పష్టంగా నిర్దేశించారు.
⇒ వైమానిక దాడుల హెచ్చరిక వ్యవస్థల సమర్థతను డ్రిల్స్ ద్వారా పరిశీలించనున్నారు.
⇒ కేంద్ర హోం శాఖ పౌర రక్షణ నిబంధనలు (1968) సెక్షన్ 19 ప్రకారం మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు.
ఇవి అందుబాటులో ఉంచుకోవాలి
⇒ మాక్ డ్రిల్స్‌కు పౌరులు పూరిస్థాయిలో సన్నద్ధం కావాలి.
⇒అత్యవసర చికిత్స నిమిత్తం మెడికల్ కిట్లు, కరెంటు కోత తదితరాల కోసం టార్చిలు, క్యాండిళ్లు వెంట ఉంచుకోవాలి. అలాగే వీలైనంత నగదు కూడా దగ్గరుంచుకోవాలి.
⇒ వీటిపై పౌరులను అప్రమత్తం చేయాల్సిందిగా అధికారులను కేంద్ర హోం శాఖ ఆదేశించింది.
⇒ ఢిల్లీ, పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో పౌర రక్షణ బృందాలు ఇప్పటికే చురుగ్గా పని చేస్తున్నాయి.
⇒ అయితే ఇవన్నీ స్వచ్ఛంద స్వభావంతో కూడిన బృందాలే.
ఎక్కడెక్కడ?
దేశవ్యాప్తంగా మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ (సీడీడీ) పరిధిలో ఎంపిక చేసిన 259 చోట్ల మాక్‌డ్రిల్స్ జరుగుతాయి.
⇒ వీటిలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి మెట్రోలు కూడా ఉన్నాయి.
⇒ 100కు పైగా సీడీడీలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించి ‘ఎ’ కేటగిరీలో చేర్చారు. వాటి పరిధిలో సూరత్, వడోదర, కాక్రపార్ (గుజరాత్), కోట (రాజస్తాన్), బులంద్‌షహర్ (యూపీ), చెన్నై, కల్పకం (తమిళనాడు), తాల్చెర్ (ఒడిశా), ముంబై, ఉరన్, తారాపూర్ (మహారాష్ట్ర), ఢిల్లీ వంటివి ఉన్నాయి.
ఈసారి తగ్గేదే లే!
⇒ ఉరి, బాలాకోట్ మాదిరిగా కాదు
⇒ త్వరలో బాహాటంగా భారీ ‘ఆపరేషన్’
⇒ ఆ రాజకీయ సందేశమే డ్రిల్స్ లక్ష్యం
2016లో సర్జికల్ స్ట్రైక్స్. 2019లో బాలాకోట్ వైమానిక దాడులు. ఉగ్రవాద దుశ్చర్యలకు గతంలో మోదీ సర్కారు ప్రతిస్పందనలు. రెండూ సైలెంట్‌గా నిర్వహించిన అండర్ కవర్ ఆపరేషన్లే. ఉరి, పుల్వామా ఉగ్ర చర్యలతో పోలిస్తే ‘పహల్గాం’ దాడి పరిస్థితి పూర్తి భిన్నం. 26 మంది అమాయక పర్యాటకులను ముష్కరులు అతి కిరాతకంగా పొట్టన పెట్టుకున్నారు. ఒక్కొక్కరినీ మతం అడిగి పిట్టల్లా కాల్చేసి పైశాచికత్వం ప్రదర్శించారు. అంతేగాక ‘పోయి మోదీకి చెప్పుకోండి’ అంటూ కేంద్రానికి సూటిగా సవాలు విసిరారు. దాడిని తలచుకుని భారతీయులంతా ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
ఈసారి కొట్టబోయే దెబ్బ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండాలని కోరుతున్నారు. అందుకే ఈసారి భారత ప్రతి చర్య పూర్తి భిన్నంగా ఉండటం ఖాయమంటున్నారు. బాహాటంగా, అత్యంత భారీ స్థాయిలో సైనిక చర్య ఉండనుందని స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధ సన్నద్ధత, పౌర అవగాహన కోసం దేశవ్యాప్త మాక్ డ్రిల్స్ నిర్ణయం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాదికి గట్టి రాజకీయ సందేశమివ్వడమే దీని లక్ష్యమని చెబుతున్నారు. ఉగ్రవాదానికి, దానికి తల్లివేరు వంటి పొరుగు దేశానికి బుద్ధి చెప్పే విషయంలో దేశమంతా ఒక్కతాటిపై ఉందని ప్రపంచానికి చాటేందుకే మోదీ సర్కారు ఈ చర్య చేపట్టినట్టు తెలుస్తోంది. భారత ‘ఆపరేషన్’కు పాక్ స్పందనను బట్టి ఒకవేళ యుద్ధం వంటి పరిస్థితులు తలెత్తినా అందుకు దేశమంతా సంసిద్ధంగా ఉందని చాటడం కూడా ఈ డ్రిల్స్ ఉద్దేశమని రక్షణ రంగ పరిశీలకులు భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్