Specials
-
ఏఐదే హవా!
సాక్షి, హైదరాబాద్: టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణలకున్న ప్రాధాన్యత దృష్ట్యా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఐటీ నిపుణుల అవసరం పెరుగుతోంది. దీంతో పలు సంస్థలు నైపుణ్యం గల యువత కోసం అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా క్యాంపస్ నియామకాల కోసం కాలేజీల బాట పడుతున్నాయి. మారిన సాంకేతికత అవసరాలకు సరిపోయే నైపుణ్యం ఉన్నవారికే కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్ వంటి నేపథ్యం ఉన్న వారిని అత్యధిక వార్షిక వేతనంతో ఎంపిక చేసుకుంటున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో క్యాంపస్ నియామకాలు 20% పెరిగే వీలుందని ఇటీవల నౌకరీ డాట్ కామ్ సర్వే వెల్లడించడం గమనార్హం. పలు దేశాలు భారత్‌లో గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాల(జీసీసీ) ఏర్పాటుపై దృష్టి పెడుతున్నాయి. దీంతో నైపుణ్యం యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. వేగంగా విస్తరిస్తున్న జీసీసీలకు అత్యుత్తమ మానవ వనరులు అవసరమని నిపుణులు చెబుతున్నారు. తాజా పరిస్థితులు బీటెక్ విద్యార్థుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. దేశంలో ఏఐ నిపుణులు అంతంతే.. ఇండక్షన్ అనే సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాలు 2025 చివరి నాటికి దేశవ్యాప్తంగా 3.64 లక్షల ఉద్యోగాలు సృష్టించే వీలుంది. ప్రస్తుతం జీసీసీల్లో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 19 లక్షలు కాగా 2030 నాటికి ఇది 28 లక్షలకు చేరుతుందని అంచనా. స్కిల్ ఇండియా రిపోర్టు ప్రకారం 2026 నాటికి దేశంలో 10 లక్షల మందికి పైగా ఏఐ నిపుణుల అవసరం ఏర్పడుతుంది. 2023 ఆగస్టు లెక్కల ప్రకారం దేశంలో 4.16 లక్షల మంది ఏఐ నిపుణులు మాత్రమే ఉన్నారు. అంటే 2026 నాటికి సుమారుగా మరో 6 లక్షల మంది అవసరం కానున్నారు. ఈ నేపథ్యంలోనే అనవసర ఆందోళనలు పక్కనపెట్టి ఏఐని ఆహ్వానించాలని, ఐటీ దిగ్గజ సంస్థకు చెందిన జాకర్ తెలిపారు. ఇవన్నీ గమనంలో ఉంచుకునే విద్యా సంస్థలు ఏఐ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ లాంటి కోర్సుల్లో ప్రవేశాలు పెంచుకుంటున్నాయి. కంపెనీలు సైతం ఏఐపై పట్టున్న వారికే ప్రాంగణ నియామకాల్లోనూ మంచి అవకాశాలు ఇస్తున్నాయి. ప్రత్యేక నైపుణ్యమే ప్రధానం దేశంలో ప్రతి ఏటా 15 లక్షల మంది ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉపాధి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో కేవలం 9 శాతం మాత్రమే ఐటీ రంగంలో మంచి ఉద్యోగాలు పొందుతున్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్‌పై పట్టు వారినే కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సివిల్, మెకానికల్‌లో బీటెక్ కోర్సులు చేస్తున్న విద్యార్థులు కూడా ఏఐ, తదితర టెక్నాలజీల్లో సర్టిఫికెట్ కోర్సులు చేస్తేనే క్యాంపస్ నియామకాల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. ఏఐ, డేటా సైన్స్ రంగాల్లోని పట్టభద్రులకు క్యాంపస్ నియామకాల్లో సంప్రదాయ ఐటీ రంగాల నిపుణుల కన్నా 30 శాతం ఎక్కువ వేతనాలు లభిస్తున్నాయి. జీసీసీల్లో అత్యధిక డిమాండ్ కలిగిన టెక్నాలజీల్లో నైపుణ్యం ఉన్నవారికి మంచి ప్యాకేజీలు ఇస్తున్నారు. క్యాంపస్ నియామకాల్లో ఏఐ ఇంజనీరింగ్, జనరేటివ్ ఏఐ, డేటా ఫ్యాబ్రిక్స్, డి్రస్టిబ్యూషన్ ఎంటర్ప్రైజెస్, క్లౌడ్ నేటివ్ ప్లాట్‌ఫామ్స్, అటానమస్ సిస్టమ్స్, డెసిషన్ ఇంటెలిజెన్స్, హైపర్ ఆటోమేషన్, సైబర్ సెక్యూరిటీ మెష్ నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సైబర్ సెక్యూరిటీలో ప్రారంభ వేతనం సగటున ఏడాదికి 9.57 లక్షలుగా ఉంది. ఏఐ నైపుణ్యానికి కంపెనీల ప్రాధాన్యం రెండేళ్ళుగా జేఎన్టీయూహెచ్లో ప్రాంగణ నియామకాలు పెరుగుతున్నాయి. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఎఐఎంల్‌తో పాటు ఏఐ అనుసంధానం ఉన్న కోర్సుల విద్యార్థులకు కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. అయితే సివిల్, మెకానికల్ విద్యార్థులు కూడా ఈ ట్రెండ్‌ను అర్థం చేసుకుని, ఏఐఎంల్ మైనర్ డిగ్రీ కోర్సులు చేస్తున్నారు. వీరికి కూడా ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నాయి. – ప్రొఫెసర్ పద్మావతి విశ్వనాథ్ (వైస్ ప్రిన్సిపల్, జేఎన్టీయూహెచ్) స్థానిక వనరులపై ఐటీ సంస్థల దృష్టి ఏఐ విస్తరణకు అనుగుణంగా డేటా కేంద్రాలు, మాడ్యూల్స్ అభివృద్ధి చేయాల్సి వస్తోంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో స్థానికంగా మానవ వనరులు అభివృద్ధి పరుచుకోవడంపై సంస్థలు దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగానే నైపుణ్యం వారి కోసం క్యాంపస్ నియామకాలు పెంచాయి. – నవీన్ ప్రమోద్ (ఎంఎన్సీ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్) -
సంక్రాంతి వచ్చెనట సందడి తెచ్చెనట!
మంచుకు తడిసిన ముద్దబంతులు... ముగ్గులు... పూలు విచ్చుకున్న గుమ్మడి పాదులు... కళ్లాపిలు.... వంట గదుల్లో తీపీ కారాల ఘుమఘుమలు...కొత్త బట్టలు... కొత్త అల్లుళ్ల దర్పాలు...పిల్లల కేరింతలు... ఓపలేని తెంపరితనాలుసంక్రాంతి అంటే సందడే సందడి.మరి మేమేం తక్కువ అంటున్నారు సినిమా తారలు.మా సంక్రాంతిని వినుమా అని ముందుకొచ్చారు.రచయిత్రులు ఊసుల ముత్యాల మాలలు తెచ్చారు.‘ఫ్యామిలీ’ అంతా సరదాగా ఉండే సంబరవేళ ఇది.ప్రతిరోజూ ఇలాగే పండగలా సాగాలని కోరుకుంటూసంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం.ఇన్పుట్స్ : సాక్షి సినిమా, ఫ్యామిలీ బ్యూరోమన పండుగలను ఎన్నో అంశాలను మిళితం చేసి ప్రయోజనాత్మకంగా రూపొందించారు మన పెద్దలు. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా పండుగ విధులుగా చెప్పి వ్యక్తిగత, కుటుంబపరమైన, సామాజిక క్షేమాలని కలిగించేవిగా వాటిని రూపొందించారు. మన పండుగల్లో ఖగోళ, ఆయుర్వేద, ఆర్థిక మొదలైన శాస్త్రవిజ్ఞానాలు మిళితమై ఉంటాయి. తెలుగువారి ప్రధానమైన పండుగ సంక్రాంతిలో కూడా అంతే! ప్రధానంగా చాంద్రమానాన్ని పాటించే తెలుగువారు సౌరమానాన్ని పాటించే ముఖ్యమైన సందర్భం ఇది. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినప్పటి నుండి ధనుర్మాసం అంటారు. అది డిసెంబరు 15 కాని, 16వ తేదీ కాని అవుతుంది. అప్పటి నుండి మకర సంక్రమణం వరకు అంటే జనవరి 14 కాని, 15 వ తేదీ వరకు కాని ఉంటుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు మకర సంక్రాంతి. ఆ రోజు నుండి సూర్యుడు తన గమన దిశని దక్షిణం నుండి ఉత్తరానికి మార్చుకుంటాడు కనుక మకర సంక్రమణానికిప్రాధాన్యం. ఆ రోజు పితృదేవతలకి తర్పణాలు ఇస్తారు. బొమ్మల కొలువుపెట్టుకునే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఉంది. అసలు ప్రధానమైనది సంక్రాంతి. ఈ పుణ్యకాలంలో దానాలు, తర్పణాలుప్రాధాన్యం వహిస్తాయి. ఈ సమయంలో చేసే దానాలకి ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. దానికి కారణం ఈ మూడురోజులు పాతాళం నుండి వచ్చి భూమిని పరిపాలించమని శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తికి వరం ఇచ్చాడు. కనుక బలి తనకి ఇష్టమైన దానాలు చేస్తే సంతోషిస్తాడు. అందులోనూ గుమ్మడికాయను దానం చేయటం మరీ శ్రేష్ఠం. గుమ్మడిని దానం ఇస్తే భూగోళాన్ని దానం ఇచ్చినంత ఫలితం. మకరరాశిలో ఉండే శ్రవణానక్షత్రానికి అధిపతి అయిన శని శాంతించటానికి నువ్వుల దానం చేయటం శ్రేయస్కరం. వస్త్రదానం,పెరుగుదానంతో పాటు, ఏ దానాలు చేసినా మంచిదే. భోగినాడు ఏ కారణంగానైనా పేరంటం చేయనివారు ఈ రోజు చేస్తారు. అసలు మూడురోజులు పేరంటం చేసే వారున్నారు. సంక్రాంతి మరునాడు కనుము. కనుముని పశువుల పండగ అని కూడా అంటారు. ఈ రోజు పశువుల శాలలని శుభ్రం చేసి, పశువులని కడిగి, కొమ్ములకి రంగులు వేసి,పూలదండలని వేసి, ఊరేగిస్తారు. వాటికి పోటీలు పెడతారు. ఎడ్లకి పరుగు పందాలు, గొర్రె పొట్టేళ్ళ పోటీలు, కోడిపందాలు మొదలైనవి నిర్వహిస్తారు. నాగలి, బండి మొదలైన వాటిని కూడా పూజిస్తారు. ఇప్పుడు ట్రాక్టర్లకి పూజ చేస్తున్నారు. భూదేవికి, రైతులకి, పాలేర్లకి, పశువులకి, వ్యవసాయ పనిముట్లకి కూడా తమ కృతజ్ఞతలని తెలియచేయటం పండుగలోని ప్రతి అంశంలోనూ కనపడుతుంది. మాంసాహారులు ఈరోజు మాంసాహారాన్ని వండుకుంటారు. సాధారణంగా కోడిపందెంలో ఓడిపోయిన కోడినో, గొర్రెనో ఉపయోగించటం కనపడుతుంది. ఓడిపోయిన జంతువు పట్ల కూడా గౌరవమర్యాదలని చూపటం అనే సంస్కారం ఇక్కడ కనపడుతుంది. పంటను పాడుచేసే పురుగులని తిని సహాయం చేసినందుకు పక్షులకోసం వరికంకులను తెచ్చి కుచ్చులుగా చేసి, ఇంటి ముందు వసారాలలో కడతారు. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కనుమునాడు గుడిలో వరికంకుల గుత్తులను కట్టే సంప్రదాయం కొనసాగుతోంది. ‘కనుము నాడు కాకైనా కదలదు’,‘కనుము నాడు కాకైనా మునుగుతుంది’,‘కనుము నాడు మినుము తినాలి’ అనే సామెతలు కనుముకి పితృదేవతలకు ఉన్న సంబంధాన్ని సూచిస్తాయి. మొత్తం నెల రోజులు విస్తరించి, నాలుగు రోజుల ప్రధానంగా ఉన్న పెద్ద పండగ సంక్రాంతి తెలుగువారికి ఎంతో ఇష్టమైన వేడుక. – డా. ఎన్.అనంతలక్ష్మిముక్కనుముముక్కనుము నాడు ప్రత్యేకంగా చేయవలసినవి పెద్దగా కనిపించవు. పండగలో అలసిపోయిన వారి విశ్రాంతి కోసం కావచ్చు. కానీ, కొంతమంది కనుమునాడు కాక ఈ రోజుని మాంసాహారం తినటానికి కేటాయిస్తారు. సంక్రాంతికి అందరూ తమ గ్రామాలకి చేరుకుంటారు. అల్లుళ్లు, ముఖ్యంగా కొత్త అల్లుళ్లు తప్పనిసరి. నెల రోజులు విస్తరించి, నాలుగు రోజులు ప్రధానంగా ఉండే సంక్రాంతి పెద్దపండుగ. పెద్దల పండుగ కూడా. పెద్ద ఎత్తున చేసుకునే పండుగ కూడా.థీమ్‌తో బొమ్మల కొలువుసంక్రాంతికి ప్రతియేటా ఐదు రోజులు బొమ్మలు కొలువు పెడుతుంటాం. చిన్నప్పటి నుంచి నాకున్న సరదా ఇది. నేను, మా అమ్మాయి, మనవరాలు కలిసి రకరకాల బొమ్మలను, వాటి అలంకరణను స్వయంగా చేస్తాం. ప్రతి ఏటా ఒక థీమ్‌ను ఎంచుకుంటాం. అందకు పేపర్, క్లే, అట్టలు, పూసలు, క్లాత్స్.. ఎంచుకుంటాం. ఈ సారి ఉమెన్ పవర్ అనే థీమ్‌తో నవదుర్గలు పెట్టాం. అమ్మ వార్ల బొమ్మలు ఇప్పటికీ ఇంట్లో ఉన్నాయి. గుడిలాగా అలంకారం చేశాం. గుడికి అమ్మాయిలు వస్తున్నట్టు, పేపర్లతో అమ్మాయిల బొమ్మలను చేశాం. తిరుపతి చందనం బొమ్మల సేకరణ కూడా ఉంది. ఆ బొమ్మలతో కైలాసం అనుకుంటే శివపార్వతులుగా, తిరుపతి అనుకుంటే వెంకటేశ్వరస్వామి, పద్మావతి... ఇలా థీమ్‌కు తగ్గట్టు అలంకరణ కూడా మారుస్తాం. ఈ బొమ్మల కొలువుకు మా బంధువులను, స్నేహితులను పిలుస్తుంటాం. ఎవరైనా అడిగితే వాళ్లు వచ్చేవరకు ఉంచుతాం. – శీలా సుభద్రాదేవి, రచయిత్రిపండగ వైభోగం చూతము రారండి– రోహిణితమిళ, మలయాళ, కన్నడ సినిమాలలో ఎంతో పెద్ద పేరు తెచ్చుకున్న రోహిణి అనకాపల్లి అమ్మాయి అనే విషయం చాలామందికి తెలియదు. అయిదేళ్ల వయసులో చెన్నైకి వెళ్లిపోయినా... అనకాపల్లి ఆమెతోనే ఉంది. అనకాపల్లిలో సంక్రాంతి జ్ఞాపకాలు భద్రంగా ఉన్నాయి. నటి, స్క్రీన్ రైటర్, పాటల రచయిత్రి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోహిణి మొల్లెటి... ‘సంక్రాంతి ఇష్టమైన పండగ’ అంటుంది, ఆనాటి పండగ వైభోగాన్ని గుర్తు చేసుకుంటుంది.నా చిన్నప్పుడు .. సంక్రాంతికి స్కూల్‌కి సెలవులు ఇచ్చేవారు. అదో ఆనందం. అలాగే కొత్త బట్టలు కొనిపెట్టేవాళ్లు. ఇంట్లో చక్కగా పిండి వంటలు చేసి పెట్టేవాళ్లు. ఫుల్లుగా తినేవాళ్లం. మాది అనకాపల్లి. నాకు ఐదేళ్లప్పుడు చెన్నై వెళ్లిపోయాం. సో... నాకు ఊహ తెలిశాక జరుపుకున్న పండగలన్నీ చెన్నైకి సంబంధించినవే.సంక్రాంతికి నెల ముందే నెల గంట పడతారు. అప్పట్నుంచి రోజూ ముగ్గులు పెట్టేవాళ్లం. అయితే ఎవరి ముగ్గు వారిది అన్నట్లు కాకుండా మా ముగ్గుకి ఇంకొకరు రంగులు వేయడం, మేం వెళ్లి వాళ్ల ముగ్గులకు రంగులు వేయడం... ఫైనల్లీ ఎవరి ముగ్గు బాగుందో చూసుకోవడం... అవన్నీ బాగుండేది. నేను రథం ముగ్గు వేసేదాన్ని. ఇక సంక్రాంతి అప్పుడు గంగిరెద్దుల సందడి, హరిదాసులను చూడడం భలేగా అనిపించేది. సంక్రాంతి నాకు ఇష్టమైన పండగ. ఎందుకంటే మనకు అన్నం పెట్టే రైతుల పండగ అది. వారికి కృతజ్ఞత తెలపాలనుకుంటాను. రైతుల విలువ పిల్లలకు చెప్పాలి. ఏమీ చెప్పకుండా పండగ చేసుకుంటే ఇది కూడా ఓ వేడుక అనుకుంటారు... అంతే. అసలు ఈ పండగ ఎందుకు చేసుకుంటున్నామో పిల్లలకి చెప్పాలి. అర్థం తెలిసినప్పుడు ఇంకాస్త ఇన్ వాల్వ్ అవుతారు.ఇప్పుడు పండగలు జరుపుకునే తీరు మారింది. వీలైనంత వైభవంగా చేయాలని కొందరు అనుకుంటారు. అయితే ఎంత గ్రాండ్‌గా చేసుకుంటున్నామని కాదు... అర్థం తెలుసుకుని చేసుకుంటున్నామా? లేదా అనేది ముఖ్యం. తాహతుకి మించి ఖర్చుపెట్టి పండగ చేసుకోనక్కర్లేదన్నది నా అభిప్రాయం.సంక్రాంతి అంటే నాకు గుర్తొచ్చే మరో విషయం చెరుకులు. చాలా బాగా తినేవాళ్లం. ఇప్పుడూ తింటుంటాను. అయితే ఒకప్పటి చెరుకులు చాలా టేస్టీగా ఉండేవి. ఇప్పటి జనరేషన్ చెరుకులు తింటున్నారో లేదో తెలియడం లేదు. షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నారు. అయితే చెరుకు కొరుక్కుని తింటే పళ్లకి కూడా మంచిది. మన పాత వంటకాలు, పాత పద్ధతులన్నీ మంచివే. ఇలా పండగలప్పుడు వాటి గురించి చెప్పడం, ఆ వంటకాలు తినిపించడం చేయాలి.నెల్నాళ్లూ ఊరంతా అరిసెల వాసనపండగ మూడు రోజులు కాదు మాకు నెల రోజులూ ఉండేది. వ్యవసాయం, గోపోషణ సమృద్ధిగా ఉండటం వల్ల నెల ముందు నుంచే ధాన్యం ఇల్లు చేరుతుండేది. నెల గంటు పెట్టగానే పీట ముగ్గులు వేసేవారు. వాటిల్లో గొబ్బిళ్లు పెట్టేవారు. రోజూ గొబ్బిళ్లు పెట్టి, వాటిని పిడకలు కొట్టేవారు. ఆ గొబ్బి పిడకలన్నీ పోగేసి, భోగిరోజున కర్రలు, పిడకలతోనే భోగి మంట వేసేవాళ్లు. మామూలు పిడకల వాసన వేరు, భోగి మంట వాసన వేరు. ప్రధాన సెలబ్రేషన్ అంటే ముగ్గు. బొమ్మల కొలువు పెట్టేవాళ్లం. అందరిళ్లకు పేరంటాలకు వెళ్లేవాళ్లం. ఊరంతా అరిసెల వాసన వస్తుండేది. కొత్త అటుకులు కూడా పట్టేవారు. చెరుకు గడలు, రేగుపళ్లు, తేగలు, పిల్లల ఆటలతో సందడిగా ఉండేది. బంతిపూల కోసం అక్టోబర్‌లో మొక్కలు వేసేవాళ్లం. అవి సంక్రాంతికి పూసేవి. కనుమ నాడు గోవులను అలంకరించి, దండం పెట్టుకునే వాళ్లం. చేసుకున్న పిండి వంటలు పంచుకునేవాళ్లం. హరిదాసులకు, గంగిరెద్దుల వాళ్లకు ధాన్యాన్ని ఇచ్చేవాళ్లం. ఇప్పటికీ పండగలను పల్లెలే సజీవంగా ఉంచుతున్నాయి. పట్టణాల్లో మాత్రం కొన్నేళ్లుగా టీవీల్లోనే సంక్రాంతి సంబరాలను చూస్తున్నాం. – రమారావి, కథకురాలు, ఆధ్యాత్మికవేత్తనా జీవితంలో సంక్రాంతి చాలా స్పెషల్– మీనాక్షీ చౌదరి‘ఆరు నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారు’ అనేది మన అచ్చ తెలుగు సామెత. తెలుగుతనం ఉట్టిపడే పేరున్న మీనాక్షీ చౌదరి తెలుగు అమ్మాయి కాదు. ఉత్తరాది అమ్మాయి మీనాక్షీ చౌదరి కాస్త బాపు బొమ్మలాంటి తెలుగింటి అమ్మాయిగా మారడానికి మూడు సంవత్సరాల కాలం చాలదా! మీనాక్షీ నటి మాత్రమే కాదు స్విమ్మర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కూడా. ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ (2018) కిరీటాన్ని గెలుచుకుంది. ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమా తో తెలుగు తెరకు సైలెంట్‌గా పరిచయం అయిన చౌదరి ‘హిట్: ది సెకండ్ కేస్’తో హిట్ కొట్టింది. సూపర్‌హిట్ సినిమా ‘లక్కీభాస్కర్’ లో సుమతిగా సుపరిచితురాలైంది. కొందరికి కొన్ని పండగలు ప్రత్యేకమైనవి. సెంటిమెంట్‌తో కూడుకున్నవి. మీనాక్షీ చౌదరికి కూడా సరదాల పండగ సంక్రాంతి ప్రత్యేకమైనది. సెంటిమెంట్‌తో కూడుకున్నది. ఈ హరియాణ అందాల రాశి చెప్పిన సంక్రాంతి ముచ్చట్లు ఇవి.మాది హర్యానా రాష్ట్రంలోని పంచకుల. మూడేళ్లుగా నేను హైదరాబాద్‌లో ఉంటూ తెలుగు సినిమాల్లో పని చేస్తున్నాను కాబట్టి సంక్రాంతి పండగ గురించి నాకు తెలుసు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి జనవరిలో ఒక సెలబ్రేషన్ (సంక్రాంతి) ఉంది. సంక్రాంతి–సినిమా అనేది ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ . సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి అన్నది సినిమాల రిలీజ్‌కి, సెలబ్రేషన్స్ కి చాలా మంచి సమయం. కుటుంబమంతా కలిసి సందడిగా పూజలు చేసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. అది నాక్కూడా చాలా ఎగ్జయిటెడ్‌గా ఉంటుంది. గాలిపటాలంటే నాకు చాలా ఇష్టం. కానీ, ఎగరేయడంలో నేను చాలా బ్యాడ్ (నవ్వుతూ). అయినా, మా ఫ్రెండ్స్‌తో కలిసి మా ఊర్లోనూ, హైదరాబాద్‌లోనూ ఎగరేసేందుకు ప్రయత్నిస్తుంటాను. హైదరాబాద్‌లో ప్రతి ఏటా అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహించడం సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే గాలిపటాలు ఎగరేయడం అన్నది కూడా ఒక ఆటే. సంక్రాంతి టు సంక్రాంతి2024 నాకు చాలా సంతోషంగా, గ్రేట్‌ఫుల్‌గా గడిచింది. గత ఏడాది మంచి సినిమాలు, మంచి కథలు, పాత్రలు, మంచి టీమ్‌తో పని చేయడంతో నా కల నిజం అయినట్లు అనిపించింది. 2025 కూడా అలాగే ఉండాలని, ఉంటుందని కోరుకుంటున్నాను. చూస్తుంటే సంక్రాంతి టు సంక్రాంతి వరకు ఓ సర్కిల్లా అనిపిస్తోంది. నా జీవితం లో కూడా సంక్రాంతి చాలా స్పెషల్. ఎందుకంటే గత ఏడాది నేను నటించిన ‘గుంటూరు కారం’ వచ్చింది.. ఈ ఏడాది కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదలవుతోంది! అందుకే చాలా సంతోషంగా... ఎగ్జయిటింగ్‌గా ఉంది.ముగ్గుల లోకంలోకి– దివి వాఢత్యాదివి పదహారు అణాల తెలుగు అమ్మాయి. ఎం.టెక్ అమ్మాయి దివి మోడలింగ్‌లోకి ఆ తరువాత సినిమాల్లోకి వచ్చింది. ‘బిగ్‌బాస్4’తో లైమ్‌లైట్‌లోకి వచ్చింది. హీరోయిన్గా చేసినా, పెద్ద సినిమాలో చిన్న పాత్ర వేసినా తనదైన మార్కును సొంతం చేసుకుంది. గ్లామర్ పాత్రలలో మెరిసినా, నాన్–గ్లామరస్ పాత్రలలో కనిపించినాతనదైన గ్రామర్ ఎక్కడీకి పోదు! మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లుగానే... మహా పండగ సంక్రాంతి కోసం ఎదురు చూడడం దివికి ఇష్టం. సంక్రాంతి వస్తే చాలు... ఆమెకు రెక్కలు వస్తాయి. సరాసరి వెళ్లి విజయవాడలో వాలిపోతుంది. పండగ సంతోషాన్ని సొంతం చేసుకుంటుంది. భోగిమంటల వెలుగు నుంచి గగనసీమలో గాలిపటాల వయ్యారాల వరకు దివి చెప్పే సంక్రాంతి కబుర్లు...మాది హైదరాబాదే అయినా, నేను పుట్టింది విజయవాడలో. ఊహ తెలిసినప్పటి నుంచి సంక్రాంతి వచ్చిందంటే చాలు, విజయవాడలోని మా అమ్మమ్మగారి ఇంట్లో వాలిపోతా. వారం ముందు నుంచే మా ఇంట్లో పండుగ సందడి మొదలయ్యేది. మా మామయ్యలు, పిన్నులు, చుట్టాలందరితో కలసి గారెలు, అరిసెలు ఇలా ఇతర పిండి వంటలు చేసుకుని, ఇరుగు పొరుగు వారికి ఇచ్చుకుంటాం. పండుగ రోజు ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసుకునేవాళ్లం. తర్వాత నలుగు పెట్టుకుని స్నానం చేసి, ముగ్గులు పెడతాం. అమ్మమ్మ పూజ చే స్తే, మేమంతా పక్కనే కూర్చొని, దేవుడికి దండం పెట్టుకునేవాళ్లం. కానీ ఆ రోజుల్ని ఇప్పుడు చాలా మిస్ అవుతున్నా. ఏది ఏమైనా సంక్రాంతికి కచ్చితంగా ఊరెళతాను. ఆ మూడు రోజుల పాటు బయటి ప్రపంచాన్ని మర్చిపోయి కుటుంబ సభ్యులతో కలసి పండుగ చేసుకోవటం నాకు చాలా ఇష్టం. సాయంత్రం స్నేహితులతో కలసి సరదాగా గాలిపటాలు ఎగరేస్తా. ఇప్పుడు నటిగా ఎదుగుతున్న సమయంలో సంక్రాంతి జరుపుకోవటం మరింత ఆనందంగా ఉంది. ఊరెళితే చాలు, అందరూ ఇంటికొచ్చి మరీ పలకరిస్తుంటారు. వారందరినీ చూసినప్పుడు నాపై నాకే తెలియని విశ్వాసం వస్తుంది. చివరగా సంక్రాంతికి ప్రత్యేకించి గోల్స్ లేవు కాని, అందరినీ సంతోషంగా ఉంచుతూ, నేను సంతోషంగా ఉంటే చాలు. ఇక నన్ను బాధించే వ్యక్తులకు, విషయాలకు చాలా దూరంగా ఉంటా. ఇంటర్వ్యూ: శిరీష చల్లపల్లిమర్చిపోలేని పండుగ– అంజలి‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లో సీత ఎవరండీ? అచ్చం మన పక్కింటి అమ్మాయి. మన బంధువుల అమ్మాయి. తన సహజనటనతో ‘సీత’ పాత్రకు నిండుతనం తెచ్చిన అంజలికి... ‘మాది రాజోలండీ’ అని చెప్పుకోవడం అంటే ఇష్టం. మూలాలు మరవని వారికి జ్ఞాపకాల కొరత ఉంటుందా! కోనసీమ పల్లె ఒడిలో పెరిగిన అంజలి జ్ఞాపకాల దారిలో వెళుతుంటే....మనం కూడా ఆ దారిలో వెళుతున్నట్లుగానే, పల్లె సంక్రాంతిని ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగానే ఉంటుంది! ఒకటా ... రెండా... పండగకు సంబంధించిన ఎన్నో విషయాలను నాన్‌స్టాప్‌గా చెబుతుంది. అంజలి చెప్పే కోనసీమ సంక్రాంతి ముచ్చట్లు తెలుసుకుందాం...చిత్ర పరిశ్రమలోకి రావాలనుకునే తెలుగమ్మాయిలందరికీ నటి అంజలి ఓ స్ఫూర్తి. మనందరి అమ్మాయి.. తెలుగమ్మాయి.. ఈ పెద్ద పండుగను ఎలా జరుపుకుంటుందంటే...కోనసీమజిల్లా రాజోలు మా ఊరు. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు.. అందరికీ వారం ముందు నుంచి పండుగ మొదలయితే, మాకు నెల ముందు నుంచే ఇంకా చెప్పాలంటే పండుగయిన తర్వాతి రోజే.. వచ్చే సంక్రాంతి కోసం ఏర్పాట్లు చేస్తుంటాం. మా తాతయ్య సుబ్బారావుగారు పండుగలంటే అందరూ కలసి చేసుకోవాలని చెప్పేవారు. అందుకే, చిన్నప్పటి నుంచే నాకు అదే అలవాటు. మా ఫ్యామిలీ చాలా పెద్దది. అందరూ వస్తే ఇల్లు మొత్తం నిండిపోయేది. అయినా సరే, ఏ పండుగైనా అందరం కలసే జరుపుకుంటాం. ఇంట్లోనూ పొలాల్లోనూ ఘనంగా పూజలు నిర్వహిస్తాం. చిన్నప్పుడు కజిన్స్ అందరం కలసి ఉదయాన్నే భోగి మంటలు వేయటానికి, అందులో ఏమేం వేయాలో అనే విషయాల గురించి వారం ముందు నుంచే మాట్లాడుకునేవాళ్లం. తాతయ్య పిండివంటలన్నీ చేయించేవారు. అందుకే, ఈ పండుగ కోసం ఎంతో ఎదురు చూసేదాన్ని. కాని, సిటీకి వచ్చాక అంత ఎంజాయ్మెంట్ లేదు. చిన్నతనంలో మా పెద్దవాళ్లు ముగ్గు వేస్తే, మేము రంగులు వేసి, ఈ ముగ్గు వేసింది మేమే అని గర్వంగా చెప్పుకుని తిరిగేవాళ్లం. అందుకే, ముగ్గుల పోటీల్లో నేనెప్పుడూ పాల్గొనలేదు. గాలిపటాన్ని కూడా ఎవరైనా పైకి ఎగరేసిన తర్వాత ఆ దారాన్ని తీసుకుని నేనే ఎగరేశా అని చెప్పుకుంటా. అందుకే, సంక్రాంతి నాకు మరచిపోలేని పండుగ.నిండుగా పొంగితే అంతటా సమృద్ధిసంక్రాంతి పండగ అనగానే తెల్లవారకుండానే పెద్దలు పిల్లల్ని నిద్రలేపడం, చలికి వణుకుతూ ముసుగుతన్ని మళ్లీ పడుకోవడం ఇప్పటికీ గుర్తు వస్తుంటుంది. సందడంతా ఆడపిల్లలదే. ముగ్గులు వేయడం, వాటిల్లో గొబ్బెమ్మలు పెట్టి, నవధాన్యాలు, రేగుపళ్లు వేసేవాళ్లం. ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం, ఆవు పిడకల మీద మట్టి గురిగలు పెట్టి, పాలు పొంగించేవాళ్లం. ఎటువైపు పాలు పొంగితే అటువేపు సస్యశ్యామలం అవుతుందని నమ్మకం. నిండుగా పొంగితే అంతటా సమృద్ధి. మిగిలిన గురుగుల్లోని ప్రసాదాన్ని అలాగే తీసుకెళ్లి లోపలి గదుల్లో మూలకు పెట్టేవారు ఎలుకల కోసం. సాధారణ రోజుల్లో ఎలుకలు గింజలు, బట్టలు కొట్టేస్తున్నాయని వాటిని తరిమేవారు. అలాంటిది సంక్రాంతికి మాత్రం, బయట పక్షులతోపాటు ఇంట్లో ఎలుకలకు కూడా ఇలా ఆహారం పెట్టేవాళ్లు. ముగ్గులు పెట్టడంలో ఇప్పడూ పోటీపడే అమ్మాయిలను చూస్తున్నాను. మేం ఉండేది వనపర్తిలో. అప్పటి మాదిరిగానే ఇప్పడూ జరుపుకుంటున్నాం. – పోల్కంపల్లి శాంతాదేవి, రచయిత్రి -
ఇంటి దీపాన్ని.. ఇల్లే ఆర్పుతోందా!
సాధారణంగా పేదరికం, నిరుద్యోగం, అప్పులు, అవమానాలు, కుంగుబాటు, వైవాహిక సమస్యలు.. వంటివి ఆత్మహత్యలకు పురిగొల్పుతాయి. అయితే వాటిలో గృహహింస కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్య అనేది వ్యక్తిగత చర్య అయినప్పటికీ అది అనేక సామాజిక కారణాలతో ప్రభావితం అయ్యి ఉంటుంది. వ్యక్తిగత దుర్బలత్వం సామాజిక ఒత్తిళ్ల నుంచి వచ్చేదై ఉంటుంది. దీనిని మానసిక అనారోగ్యంగానూ అర్థం చేసుకోవచ్చు. ఇందులో కుటుంబ కలహాలు, సామాజిక అస్థిరతలు సమాన పాత్ర పోషిస్తాయి.గృహహింసలో ప్రధానంగా...గృహహింస కారణంగా 64 శాతం మంది మహిళలు ఆత్మహత్య ఆలోచనలు చేస్తున్నట్టు ‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’ జరిపిన అధ్యయనంలో గుర్తించారు. ఈ అధ్యయనం విడాకులు, వరకట్నం, ప్రేమ వ్యవహారాలు, వివాహం రద్దు లేదా వివాహం చేసుకోలేకపోవడం (భారతదేశంలో వివాహ విధానాల ప్రకారం), అవాంఛిత గర్భం, వివాహేతర సంబంధాలు, ఈ సమస్యకు సంబంధించిన విభేదాలు.. ఇలాంటివన్నీ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ‘పరువు’ అనే కారణంతో కుటుంబ ఆత్మహత్య సంఘటనలు తరచు సంభవిస్తుంటాయి.మానసిక రుగ్మతలుఆత్మహత్య కారణంగా మరణించేవారిలో దాదాపు 90 శాతం మంది మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని చాలా అధ్యయనాలు సూచిస్తున్నాయి. చెన్నైలో చేసిన అధ్యయనంలో 80 శాతం, బెంగళూరులో 43 శాతం మంది మానసిక రుగ్మతలతో బాధపడతున్నట్లు తెలిసింది. సమాజంలో/ కుటుంబంలో అణచివేతకు గురైనవారు డిప్రెషన్, ఇతర మానసిక వ్యాధి లక్షణాలను ఉన్నట్టు గుర్తించారు. వీరిలో ఎక్కువశాతం మంది డిప్రెషన్వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డారు.మద్యపానం వల్ల..ఆత్మహత్యలలో మద్యపానం కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఆత్మహత్య చేసుకునే సమయంలో 30–50 శాతం మంది పురుషులు మద్యం మత్తులో ఉండగా, స్త్రీలను వారి భర్తల మద్యపాన వ్యసనమే ఆత్మహత్యకు పురికొల్పుతున్నట్లు వెల్లడైంది. ఆత్మహత్య అనేది ఎన్నో అంశాలు కలిసిన అతి పెద్ద సమస్య. అందుకే నివారణ చర్యలు కూడా అన్ని వైపుల నుంచి జరగాలి. ఇక జాతీయ స్థాయిలో ఆత్మహత్య నివారణ ప్రణాళికలను అభివృద్ధి చేయడానికి, అమలు చేయడానికి, సహకారం, సమన్వయం, నిబద్ధత అవసరం. మానసిక ఆరోగ్య రంగంలో సామాజిక, ప్రజారోగ్యమే లక్ష్యంగా ఉండాలి. మానసిక ఆరోగ్య నిపుణులు ఆత్మహత్యల నివారణలో చురుకైన పాత్ర పోషించాలి.చేయూత అవసరం..→ గృహహింస బాధితులకు వారి చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా కారణం అవుతుంటారు. భరించడం అనే స్థాయి నుంచి తమ బతుకు తాము బతకగల ధైర్యం, స్థైర్యం పెం΄÷ందించుకోవాలి. → టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ నూతన జీవనం వైపుగా అడుగులు వేయాలి. ఇందుకు కుటుంబ సభ్యులు చేయూతను అందించాలి. → స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలలో అవగాహన తరగతులు నిర్వహించాలి. → ఉపాధ్యాయులు, పోలీసులు, నాయకులు, నమ్మకమిచ్చే అభ్యాసకులు... ఇలా అందరూ బాధ్యత గా వ్యవహరించాలి.→ ప్రాణాలతో బయటపడిన వారిని సంఘటితం చేసి, వారిని ఈ అవగాహన తరగతులలో పాలుపంచుకునేలా చేయాలి.– పి.జ్యోతిరాజ, సైకాలజిస్ట్గమనిక:ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
మీకు తెలుసా? ఈ దేశాల్లో ఈవీఎంలు వద్దు.. పేపర్ బ్యాలెటే ముద్దు
అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ఎన్నికల కోసం ఈవీఎంలను కాదు.. ఇంకా పేపర్ బ్యాలెట్‌నే వాడుతున్నాయి. ఆశ్చర్యకరంగా అనిపించినా ఇదే నిజం కూడా. సాధారణంగా ఎన్నికల నిర్వహణకు కొన్ని పద్ధతులంటూ ఉన్నాయి. పేపర్ బ్యాలెట్, ఈవీఎం వాడకం.. లేదంటే రకరకాల కాంబినేషన్లలో నిర్వహించడమూ జరుగుతోంది. మరి టెక్నాలజీ మీద తప్పనిసరిగా ఆధారపడుతున్న ఈరోజుల్లో.. ఆ దేశాలు ఈవీఎంలను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో చూద్దాం. 👉ప్రపంచంలో నిర్దిష్ట కాలపరిమితితో ప్రజాస్వామ్య దేశాలు ఎన్నికలు నిర్వహించుకుంటున్నాయి. అందులో 100 దాకా దేశాలు ఇప్పటికీ పేపర్ బ్యాలెట్ పద్దతినే అవలంభిస్తున్నాయి. 👉పిలిఫ్పైన్స్, ఆస్ట్రేలియా, కోస్టారికా, గువాటెమాలా, ఐర్లాండ్, ఇటలీ, కజకస్థాన్, నార్వే, యూకే.. ఈవీఎంలను ప్రయోగాత్మకంగా పరిశీలించాయి. వాటి ఫలితాల ఆధారంగా చివరకు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు కొనసాగిస్తున్నాయి.👉భద్రత, ఖచ్చితత్వం, విశ్వసనీయత, ఎన్నికల ధృవీకరణ.. ఇవన్నీ ఈవీఎంల వాడకంపై అనుమానాలకు కారణం అవుతున్నాయి. అందుకే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలు కొన్ని ఇప్పటికీ ఈవీఎంలను వాడడం లేదు.👉జర్మనీ, నెదర్లాండ్స్, పరాగ్వే దేశాలు ఈవీఎంల వాడాకాన్ని పూర్తిగా ఆపేశాయి. అక్కడ పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.👉2006లో నెదర్లాండ్స్ ఈవీఎంలను నిషేధించింది. 2009లో ఐర్లాండ్, అదే ఏడాది ఇటలీ సైతం ఈవీఎంలను బ్యాన్ చేశాయి. బ్యాలెట్ పేపర్‌తో పాటు రకరకాల కాంబోలో ఎన్నికలు జరుగుతున్నాయి. 👉సాంకేతికలో ఓ అడుగు ఎప్పుడూ ముందుండే జపాన్‌లో.. ఒకప్పుడు ఈవీఎంల వాడకం ఉండేది. కానీ, 2018 నుంచి అక్కడా ఈవీఎంల వాడకం నిలిపివేశారు.👉అగ్రరాజ్యం అమెరికా సహా చాలా దేశాల్లో ఈవీఎంల వాడకం పూర్తిస్థాయిలో జరగడం లేదు. విశేషం ఏంటంటే.. అక్కడ ఇప్పటికీ ఈ-ఓటింగ్‌ను ఈమెయిల్ లేదంటే ఫ్యాక్స్ ద్వారా పంపిస్తారు. అలాగే.. బెల్జియం, ఫ్రాన్స్, కెనడా, మెక్సికో, పెరూ, అర్జెంటీనాలో కొన్ని ప్రాంతాల్లో.. కొన్ని ఎన్నికలకు మాత్రమే ఈవీఎంలను వినియోగిస్తున్నారు.👉2009 మార్చిలో జర్మనీ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈవీఎంల వాడకం రాజ్యాంగ విరుద్ధమని తేల్చింది. ఈవీఎం పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఎన్నికలలో పారదర్శకత అనేది ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని జర్మనీ కోర్టు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది.👉ప్రపంచవ్యాప్తంగా భారత్, బ్రెజిల్, వెనిజులా సహా పాతిక దేశాలు మాత్రమే ఈవీఎంలను ఉపయోగిస్తున్నాయి. అందులో పూర్తి స్థాయి ఎన్నికల్లో ఈవీఎంలను వాడుతోంది సింగిల్ డిజిట్‌లోపు మాత్రమే. మిగతా దేశాలు స్థానిక ఎన్నికల్లో, కిందిస్థాయి ఎన్నికల్లో మాత్రమే వాటిని ఉపయోగిస్తున్నాయి. 👉భూటాన్, నమీబియా, నేపాల్‌లో భారత్‌లో తయారయ్యే ఈవీఎంలనే ఉపయోగిస్తున్నాయి. 👉ఈవీఎంల విశ్వసనీయతపై చర్చ జరగడం ఇప్పుడు తొలిసారి కాదు. 2009లో సుబ్రమణియన్ స్వామి(అప్పటికీ ఆయన ఇంకా బీజేపీలో చేరలేదు) ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ సరికాదని అభిప్రాయపడ్డ ఆయన.. న్యాయపోరాటానికి సైతం సిద్ధపడ్డారు. అయితే ఇప్పుడు ఈవీఎంల వద్దని, పోస్టల్ బ్యాలెట్ ముద్దు అని పోరాటాలు ఉధృతం అవుతున్న వేళ.. ఆయన మౌనంగా ఉండిపోయారు. -
నాన్న వంటబట్టించిన కళ
తన తండ్రి చిన్నప్పటి నుంచీ బజ్జీలు వగైరా తయారు చేసి బండి మీద విక్రయించేవాడని ఆయన ఆధ్వర్యంలో ఎప్పటికైనా ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ ప్రారంభించడమే తన లక్ష్యమని మాస్టర్ చెఫ్ భాషా అంటున్నారు. ఇటీవల సోనీలివ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి తెలుగు మాస్టర్ చెఫ్ పోటీలలో ఈ అనంతపురం నివాసి విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడుతూ... తన అభిప్రాయాలను పంచుకున్నారు..నాన్న ‘వంటబట్టించిన’కళ... మాది అనంతపురంలోని పుటపర్తి దగ్గర గోరంట్ల మా నాన్నకు ముగ్గురు పిల్లలం. చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గరే స్వీట్లు, కారపు సరుకులు వగైరా తినుబండారాలను తయారు చేసి వాటిని బండి మీద తీసుకెళ్లి విక్రయించేవాడు.. ఆ బండి నడుపుతూనే ఆయన మా సంసారమనే బండిని కూడా విజయవంతంగా నడిపారు. పిల్లలు అందర్నీ బాగా చదివించారు. నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాను. ఆ తర్వాత బెంగుళూర్లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. కానీ...నాకు నేనుగా ఏదైనా సృజనాత్మక రంగంలో రాణించాలనే తపన, చిన్నప్పటి నుంచీ ఇంట్లో వంటల తయారీ వల్ల వంటబట్టిన పాకశాస్త్ర కళ నన్ను నాలుగైదు నెలలకు మించి ఉద్యోగంలో ఉంచలేదు. దాంతో ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకున్నా ఉద్యోగాన్ని వదిలేసి గరిట చేతబట్టాను.కంప్యూటర్ సైన్స్ టూ కిచెన్ సెన్స్...అలా కంప్యూటర్ సైన్స్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పి కిచెన్ లో వంటలకు వెల్కమ్ చెప్పాను. చెన్నైలో నివసించే ప్రముఖ మహిళా చెఫ్ దగ్గర బేకరీ ఐటమ్స్‌లో శిక్షణ పొందాను. ఆమె సారధ్యంలో వైవిధ్యభరితమైన బేకరీ ఉత్పత్తుల తయారీని తెలుసుకున్నాను. ప్రస్తుతం రెస్టారెంట్స్‌కి మెనూ రూపొందించే సేవలు అందిస్తున్నాను. మరిన్ని వెరైటీ వంటల్లో రాణించాలని సాధన చేస్తున్నాను. అదే క్రమంలో తొలిసారి తెలుగులో సోనీ లివ్ వారు నిర్వహించిన మాస్టర్ చెఫ్ పోటీలకు దరఖాస్తు చేయడం అందులో పాల్గొని టైటిల్ గెలుపొందడం జరిగింది. టైటిల్ పోటీలో నేను రూపొందించిన గ్రేట్ ఫుల్ పిస్తాషో పేస్ట్రీలో ఒక్కో లేయర్‌ను నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులకు అంకితమిస్తూ చేయడం న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. ఈ టైటిల్ స్ఫూర్తితో పేరొందిన చెఫ్‌గా రాణించడం, నాన్న ప్రస్తుతం గోరంట్ల బస్‌స్టాండ్ దగ్గర నడుపుతున్న చికెన్ కబాబ్స్ బండిని పూర్తి స్థాయి ఫైన్ డైనింగ్ రెస్టారెంట్‌గా మార్చడం... ఇవే నా భవిష్యత్తు లక్ష్యాలు.ఫాదర్స్ డే స్పెషల్ కథనం -
Ambitio: ధైర్యం ఇస్తూ... దారి చూపుతూ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతతో విదేశీ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్‌ను సులభతరం చేసి ‘అంబిటియో’ పేరుతో ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేశారు ఐఐటీ గ్రాడ్యుయేట్స్ దీర్ఘాయు కౌశిక్, విక్రాంత్ శివాలిక్, వైభవ్ త్యాగీ. మన దేశంలోని తొలి ఏఐ అడ్మిషన్ ప్లాట్‌ఫామ్ ‘అంబిటియో’ విజయపథంలో దూసుకు΄ోతోంది.... ఐఐటీ–బీహెచ్‌యూ(వారణాసి)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కౌశిక్ ఫారిన్ యూనివర్శిటీలో ఎంబీఏ చేయడం కోసం అప్లై చేయాలనుకున్నప్పుడు స్టూడెంట్స్‌కు సహాయపడే ప్లాట్ఫామ్లాంటిదేమీ తనకు కనిపించలేదు. ‘విదేశీ యూనివర్శిటీలలో చేరే విషయంలో సహాయం అందించడానికి కౌన్సెలర్లు ఉన్నప్పటికీ ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. ఆ ఆర్థికభారం అందరికీ సాధ్యం కాదు. మరో విషయం ఏమిటంటే వారు ఒకటి రెండు కాలేజిల గురించి మాత్రమే చెబుతారు’ అంటాడు కౌశిక్. ఈ నేపథ్యంలోనే స్టూడెంట్స్‌కు సంబంధించి కాలేజి అప్లికేషన్స్, సరిౖయెన కాలేజీ ఎంపిక చేసుకోవడం, పర్సనల్ ఎస్సేస్...మొదలైన వాటి గురించి ఒక ప్లాట్‌ఫామ్‌ను క్రియేట్ చేయాలనుకున్నాడు. కాలేజీ ఫ్రెండ్స్ విక్రాంత్, వైభవ్ త్యాగీలకు తన ఆలోచన చెప్పాడు. వారికి ఐడియా నచ్చి కౌశిక్‌తో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చారు. అలా ‘అంబిటియో’ అంకురం మొలకెత్తింది. ‘అంబిటియో’ ప్లాట్‌ఫామ్ ద్వారా మొదట పాతిక మంది స్టూడెంట్స్‌కు టాప్ ఇనిస్టిట్యూట్స్‌లో అడ్మిషన్ దొరికేలా సహాయం చేశారు. స్టూడెంట్స్ ్ర΄÷ఫైల్స్‌పై ప్రధానంగా దృషి పెట్టి వాటికి మార్పులు, చేర్పులు చేశారు. కార్నెగి మెలన్ యూనివర్శిటీ, ఎన్‌వైయూ, ఇంపీరియల్ కాలేజ్, యూసీ బర్కిలి...మొదలైన ఇంటర్నేషనల్ యూనివర్శిటీలకు సంబంధించి 175 మంది స్టూడెంట్స్‌కు సహాయపడ్డారు. ‘అంబిటియో గురించి తెలియడానికి ముందు ఒక కౌన్సెలర్ సలహాలు తీసుకున్నానుగానీ అవి నాకు ఉపయోగపడలేదు. అంబిటియో ఉపయోగించడం మొదలు పెట్టిన తరువాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. సరిౖయెన దారి కనిపించింది’ అంటున్న ప్రహార్ కమల్‌కు లండన్‌లోని వార్విక్ బిజినెస్ స్కూల్లో ప్రవేశం దొరికింది. ‘అంబిటియో’ ప్లాట్ఫామ్లో ఏఐ ఎలా ఉపకరిçస్తుంది అనేదాని గురించి కో–ఫౌండర్, సీయీవో కౌశిక్ మాటల్లో... ‘రెండు ప్రైమరీ ఏరియాలలో ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మోస్ట్ సూటబుల్ ప్రోగ్రామ్ లేదా యూనివర్శిటీని ఎంపిక చేసుకోవడంలో స్టూడెంట్స్‌కు సహాయపడడం అందులో ఒకటి. తమకు అర్హత ఉన్న కోర్సులను ఫిల్టర్ చేసి చూడడానికి ప్రస్తుతం ఫిల్టరేషన్ టూల్స్ ఉన్నప్పటికీ మేము ఏఐ ద్వారా మరో అడుగు ముందుకు వేశాం’ విస్తృతస్థాయిలో సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఈ ప్లాట్‌ఫామ్ పర్సనలైజ్డ్ రికమండేషన్లను వేగంగా అందిస్తూ స్టూడెంట్స్ టైమ్‌ను సేవ్ చేస్తుంది. ‘స్టూడెంట్స్ తమకు అవసరమైన కాలేజీని ఎంపిక చేసుకున్న తరువాత, తదుపరి దశ అద్భుతమైన వ్యాసం రాయడం. వివిధ యూనివర్శిటీలకు సంబంధించి 5,000 వ్యాసాలతో మా మోడల్‌కు శిక్షణ ఇచ్చాం. సరిౖయెన కాలేజిని ఎంపిక చేసుకోవడం నుంచి స్కాలర్షిప్కు అప్లై చేసుకోవడం వరకు మా ప్లాట్‌ఫ్లామ్‌లో అన్నీ ఉచితమే’ అంటున్నాడు కౌశిక్. ఏంజెల్ ఇన్వెస్టర్ల ద్వారా కంపెనీ 1.5 కోట్ల నిధులను సమీకరించింది. ‘భారత్ మార్కెట్లో వేగంగా దూసుకు΄ోయి మరింతగా విస్తరించాలనేది మా లక్ష్యం’ అంటున్నాడు కౌశిక్. యూనివర్శిటీలలో అడ్మిషన్లకు సంబంధించి విద్యార్థులకు ఇంటెలిజెంట్ డిజిటల్ అడ్వైజర్లుగా సేవలు అందించడమే మా లక్ష్యం. – దీర్ఘాయు కౌశిక్, అంబిటియో–సీయీవో, కోఫౌండర్ -
గుంటూరు కారం కథ తెలుసా అసలు.?
బంగాళాదుంప , మొక్క జొన్న , వేరుశెనగ , పైన్ ఆపిల్ , నారింజ , పొగాకు , బాదం , బెండకాయ , సపోటా , బొప్పాయి , మిరపకాయ , జీడిపప్పు, .. ఇవి లేని జీవితాన్ని ఊహించండి ! అంటే … మసాలా దోస , మిర్చి బజ్జి , వేరుశనిగ చట్నీ , బెండకాయ పులుసు , జీడీ పప్పు ఉప్మా … ఇవన్నీ ఉండవన్న మాటే కదా ! “ అహో ఆంధ్ర భోజా ! .. శ్రీకృష్ణ దేవా రాయా ! శిలలపై శిల్పాలు చెక్కించావు .. కానీ గుంటూరు కారం రుచి చూడలేదు .. ఉడిపి మసాలా దోస రుచి తెలియదు. ఏంటి ప్రభు? అని టైం మెషిన్ లో వెనక్కు వెళ్లి అడిగితే .." నేనేమి చేసేది మా కాలానికి ఈ పంటలు లేవు అంటాడు. ఎందుకంటే ఈ పంటలను , అటు పై పోర్చుగీస్ వారు, లాటినా అమెరికా దేశాలనుంచి సేకరించి మన దేశంలో ప్రవేశపెట్టారు. మరి ఆ రోజుల్లో మనాళ్ళు మసాలా దినుసులుగా ఏమి వాడేవారు? అల్లం , పసుపు , ఆవాలు , దాల్చిన చెక్క , ఏలకులు , లవంగాలు, ధనియాలు, ఇంగువ , మెంతులు ... ఇవన్నీ మన పంటలే . వీటిని మసాలా దినుసులుగా వాడేవారు ! అదండీ గుంటూరు కారం కథ ! కేవలం నాలుగు వందల సంవత్సరాల చరిత్ర . నల్ల మిరియాలు అనాదిగా ఇండియా లో పండించేవారు. దాన్ని పోర్చుగీస్ వారు ఎగుమతి చేసుకున్నారు. ఇప్పుడు రాజ్యమేలుతున్న ఎన్నో వంటకాలు మనవి కాదు, కానీ తొందరగానే మన జీవితాలను పెనవేసుకుపోయాయి. మార్పు సహజం .. కానీ కొత్తొక వింత కాదు . పాతొక రోత కాదు. ఏది మంచి ? ఏది చెడు అని- నా వక్తిగత అభిప్రాయం కాకుండా సామజిక శాస్త్రం - మానవ శాస్త్రం - జీవ శాస్త్రం కోణం నుంచి శాస్త్రీయ విశ్లేషణలు చేస్తున్నా. వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక శాస్త్ర విశ్లేషకులు, ప్రముఖ విద్యావేత్త