ప్రముఖ నటి శ్రీదేవి అకాల మరణంపై నెలకొన్న అనుమానాలన్నింటికీ తెరదించుతూ.. ప్రమాదవశాత్తునే ఆమె మరణించినట్టు దుబాయ్ ప్రాసిక్యూషన్ అధికారులు తేల్చారు. దర్యాప్తు ఇక ముగిసిందని, కేసును క్లోజ్ చేశామని, ఇక ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రాసిక్యూషన్ అధికారులు అధికారిక ప్రకటన చేశారు. భర్త బోనీ కపూర్‌కు కూడా క్లీన్ చీట్ లభించింది. కేసును క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించిన అధికారులు, ఆమె మృతదేహానికి ఎంబామింగ్ నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ రోజు రాత్రి 10 గంటలకు శ్రీదేవీ మృతదేహం ముంబైకి చేరుకోనుంది. అనిల్ అంబానీకి చెందిన ఛార్టెడ్ విమానంలో శ్రీదేవీ మృతదేహాన్ని ముంబైకి తరలిస్తున్నారు. రాత్రి 10 గంటలకు భారత్‌కు చేరుకున్న అనంతరం రేపు(బుధవారం) మధ్యాహ్నం వరకు సన్నిహితులు, అభిమానులు సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం ముంబైలోని పవర్ హన్స్ స్మశానంలో రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీదేవీ అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది.