ముందస్తు ఎన్నికల్లో ప్రతి ఒక్క సీటును జాగ్రత్తగా అంచనా వేస్తున్న కాంగ్రెస్.. ఈ దిశగా మహాకూటమి పొత్తుల్లో కొత్త ట్విస్ట్ తీసుకొచ్చింది. పొత్తుల్లో భాగంగా తెలంగాణ జనసమితికి ఇచ్చే సీట్ల విషయంలో వినూత్న ప్రతిపాదన చేసింది. టీజేఎస్ అభ్యర్థులు తమ పార్టీ గుర్తు (ఇంకా రావాల్సి ఉంది)తో ఎన్నికలకు వెళ్తే ఇబ్బంది అవుతుం దని అందువల్ల.. వీరిని కాంగ్రెస్ బీఫారంపైనే పోటీ చేయించాలని ప్రతిపాదించింది. ఇందుకోసం ఆ పార్టీ కోరుకుంటున్న స్థానాలు ఇచ్చేందుకు కాస్త.. అటు, ఇటుగానైనా అంగీకారం తెలపాలని ఆదివారం గోల్కొండ హోటల్‌లో జరిగిన పార్టీ కోర్‌కమిటీ భేటీలో నిర్ణయించారు. ఈ ప్రతిపాదనపై టీజేఎస్‌ను ఒప్పించడంతోపాటు.. కూటమిలోని మిగిలిన పార్టీల మధ్య పొత్తు సమన్వయం చేసే బాధ్యతలను సీనియర్ నేత జానారెడ్డికి అప్పగించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియాతో పాటు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, మధుయాష్కీ గౌడ్, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం అహ్మద్, శ్రీనివాస కృష్ణన్‌లు పాల్గొన్నారు. సమావేశంలో కూటమిలో సీట్ల సర్దుబాటు, ఈనెల 20న రాహుల్ గాంధీ పర్యటన ఏర్పాట్లపై చర్చించారు.