– పవన్‌కల్యాణ్‌ను విమర్శించాడంటూ ఆగ్రహం
– 50 మందికిపైగా ఇంటిపై దాడి చేసి ధ్వంసం
– దాడి చేసి అతనిపైనే పోలీసులకు ఫిర్యాదు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా జిల్లా బందరు మండలం మంగినపూడి గ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తపై జనసేన నాయకులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. దాదాపు యాభై మందికిపైగా అతని ఇంటిపై దాడి చేసి ఇంటిలోని వస్తువులతో పాటు అతని వ్యాపార దుకాణాన్ని ధ్వంసం చేశారు. ఒక్కడిని చేసి యాభై మందికిపైగా దాడి చేసిన జనసేన నాయకులు, కార్యకర్తలు తిరిగి వైఎస్సార్ సీపీ కార్యకర్తపైనే అక్రమంగా కేసు కట్టించేందుకు పూనుకున్నారు.
బందరు మండలం మంగినపూడి గ్రామానికి చెందిన గిరి అనే వ్యక్తి వైఎస్సార్ సీపీలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. గ్రామంలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో అత్యంత చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. గిరి సోషల్ మీడియాలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌పై అనుచిత వ్యాఖలు చేశాడంటూ జనసేన నాయకుడు కొరియర్ శ్రీనుతో పాటు మరి కొందరు గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో అతని ఇంటిపై మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. ఇంటిలోని సామాగ్రిని ధ్వంసం చేయటంతో పాటు అతనిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు.
అక్కడితో చాలదన్నట్టు గిరిని మోకాలిపై కూర్చోబెట్టి జనసేన నాయకులకు క్షమాపణలు చెప్పించారు. అదీ చాలదన్నట్టు దెబ్బలు తిన్న గిరిపైనే తమ నాయకుడు పవన్‌కళ్యాణ్‌ను అవమానిస్తూ వ్యాఖలు చేశాడంటూ బందరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసి అతనిపై కేసు కట్టించేందుకు పూనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ పార్టీ కార్యకర్తపై దాడి చేయటమే కాకుండా అక్రమంగా కేసు కట్టించేందుకు పాల్పడుతున్న జనసేన నాయకులపై మండిపడ్డారు.
అకారణంగా, అక్రమంగా తమ పార్టీ కార్యకర్తలపై కేసులు బనాయించాలని చూసినా, కార్యకర్తపై దాడికి పాల్పడిన జనసేన నాయకులకు పోలీసులు కొమ్ము కాయాలని చూసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బందరు డీఎస్పీ సీహెచ్ రాజాను కలిసి చెప్పారు. తమ పార్టీ కార్యకర్తకు న్యాయం జరగకుంటే ఎంత దూరమైనా వెళతానంటూ ఖరాఖండిగా తేల్చి చెప్పారు. డీఎస్పీ ఆదేశాల మేరకు రూరల్ సీఐ ఏసుబాబు, ఎస్‌ఐ సత్యనారాయణ మంగినపూడి గ్రామానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. డీఎస్పీ కార్యాలయానికి పేర్ని నాని వచ్చారని తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.