దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక మృతి చెందినవారి కుటుంబాలను ఓదార్చేందుకు చేపట్టిన పరామర్శ యాత్ర తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని వైఎస్ షర్మిల అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం, జగనన్న కోసం చేస్తున్న యాత్రని చెప్పారు. మహబూబ్నగర్ జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర శుక్రవారం ఐదోరోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. పరామర్శ యాత్ర వైఎస్ఆర్ కుటుంబానికి, వైఎస్ఆర్ మరణం తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంబంధించిన అంశమని షర్మిల అన్నారు. ఈ విషయం గురించి మిగిలినవారు మాట్లాడాల్సిన అవసరంలేదని చెప్పారు. ఓట్ల కోసం అయితే ఎన్నికల ముందు చేసేవాళ్లమని, ఎన్నికల తర్వాత చేయాల్సిన అవసరం ఏముందని షర్మిల అన్నారు. తెలంగాణలో మిగిలిన జిల్లాల్లోనూ పరామర్శ యాత్ర చేస్తామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో ఖమ్మం జిల్లాలో యాత్ర చేపట్టగా, ఇప్పుడు ఆయన సోదరి షర్మిల మహబూబ్ నగర్లో పరామర్శించారు.