అప్పులు, నష్టాలతో సతమతమవుతున్న ఆర్టీసీ ఆదాయం కోసం కొత్త దారులు వెతుకుతోంది. ఇందులో భాగంగా పార్సిల్ సర్వీసు ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రైవేటు కొరియర్ సంస్థల తరహాలో బస్సుల్లో పార్సిల్ కవర్లు, తేలికపాటి వస్తువులను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గత జూన్‌లో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆర్టీసీ సమీక్ష సందర్భంలో సరుకు రవాణాపై దృష్టి సారించాలని ఆదేశించిన నేపథ్యంలో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో చాలాకాలంగా అక్రమంగా సరుకు రవాణా సాగుతోంది. కమీషన్ల మత్తులో ఉన్న రవాణాశాఖ అధికారులు చూసీ చూడనట్టు పోతుండటంతో వాటిల్లో ప్రైవేటు బస్సుల నిర్వాహకులు యథేచ్ఛగా కార్గో వ్యాపారం సాగిస్తున్నారు.