
వరుస దాడులు అమానుషం
పులివెందుల: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మండల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులపై వరుస దాడులు, బైండోవర్ కేసుల నమోదు అమానుషమని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి బుధవారం విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించే క్రమంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీ అల్లరి మూకల దాడుల నేపథ్యంలో అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు పులివెందులలో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ పట్టణంలోని మెయిన్ రోడ్డు మీదుగా పోలీస్‌స్టేషన్ వరకు సాగింది. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ‘‘గత రెండు రోజులుగా వైఎస్సార్‌సీపీ నాయకులు, సానుభూతి పరులపై తీవ్రమైన భౌతిక దాడులు, హత్యాయత్నాలు జరుగుతున్నాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి సురేష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ కార్యకర్త అమరేష్‌లపై మంగళవారం దాడి జరిగింది. ఇవాళ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, అదేవిధంగా వేముల మండల నాయకుడు వేల్పుల రామలింగారెడ్డి, వారి అనుచరుల మీద దాడి జరిగింది. దాడి జరుగుతున్న పద్ధతి డెకాయిట్స్ బస్సు రాబరీ చేసే విధంగా ఉంది. నల్లగొండువారిపల్లె గ్రామస్తులు అడ్డుకోకపోతే రాము, రమేష్ యాదవ్ ప్రాణాలతో ఉండేవారు కాదు. వైఎస్సార్‌సీపీని వదిలి దేశం పార్టీకి మారిన పులివెందుల వైస్ ఎంపీపీ విశ్వనాథరెడ్డిని అదేమని అడిగితే ‘నరుకుతాం’ అన్నారని తప్పుడు కేసులు పెట్టించడం దారుణం. అమలు చేయలేని హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు, రానున్న ఎన్నికల్లో గెలుస్తామన్న విశ్వాసం లేకే దాడులకు పాల్పడుతూ తప్పుడు పద్దతుల్లో గెలుపు మార్గాన్ని వెతుక్కుంటున్నారు. అధిష్టానం నుంచి ఒత్తిడి రావడంతో బీటెక్ రవి అనుచరులు గెలుపుకు తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు. పార్థ, అతని తమ్ముడు, బీటెక్ రవి తమ్ముడు జయ భరత్‌ల ఆధ్వర్యంలో రాము, రమేష్‌లపై దాడి జరిగింది. వీరందరిని అరెస్టు చేస్తేనే ఈ ప్రభుత్వానికి, పోలీసులకు చిత్తశుద్ధి ఉన్నట్లు భావిస్తాం. మా సంయమనం బలహీనతగా భావించద్దు. ఇక వైఎస్సార్‌సీపీ నాయకులపై గడిచిన మూడు రోజులుగా వందల సంఖ్యలో బైండోవర్ కేసులు నమోదయ్యాయి. తమ పోరాటం పోలీసులతోనా లేక తెలుగుదేశం పార్టీతోనా అన్నది అర్థంకాని పరిస్థితి నెలకొంది’’ అని పేర్కొన్నారు. పోలీసులు, ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ ఈ దాడులపై స్పందించాల్సిన అవసరం ఉందని అవినాష్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శ
పులివెందులలో నిరసన ర్యాలీ