
అసలేం జరుగుతోంది!
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఒక్క మండలం. కేవలం 10,800 ఓట్లు ఉన్న ప్రాంతం. ప్రజల మాన ప్రాణాలు రక్షించేందుకు రక్తాన్నైనా చిందిస్తామని ప్రతినబూనిన పోలీసు అధికారులంతా ఉన్నారు. అయినా అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి.. వరుసగా హత్యాయత్నం ఘటనలు తెరపైకి వస్తున్నాయి. అంత చిన్న ఏరియాలో ఉప ఎన్నికలు సజావుగా నిర్వహించలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం.. పోలీస్ శాఖ ఉంది. నవ్విపోదురుగాక, నాకేటి సిగ్గు అన్నట్లుగా కొంతమంది పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న ధోరణి కారణంగా మొత్తం వ్యవస్థకే మచ్చ వస్తోంది.
● జిల్లాలో ఎస్పీ, అడిషనల్ ఎస్పీలు ఇద్దరు, 9మంది డీఎస్‌పీలు, 48మంది సీఐలు, 98 మంది ఎస్‌ఐలు, 1600మంది సివిల్ పోలీసులు, 580 మంది ఏఆర్ పోలీసులు కొలువై ఉన్నారు. సరిగ్గా 2,333 మంది విధుల్లో ఉన్నారు. కాగా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు వచ్చా యి. ఈ రెండు చోట్ల ఎన్నికలు సజావుగా జరిగేలా చూడడం పోలీసు యంత్రాంగానికి చేతకావడం లేదంటే తప్పులో కాలేసినట్టే. వ్యవస్థలో నెలకొన్న లోపభూయిష్టం కారణంగా కొంతమంది అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారడంతోనే అల్లకల్లోలాలు తెరపైకి వస్తున్నాయి. మంగళవారం హత్యాయత్నం ఘటన చోటుచేసుకోగా, కేసు నమోదుతో సరిపెట్టారు. నిందితులు పులివెందులలోనే తిష్టవేసి మరో హత్యాయత్నం ఘటనకు పాల్పడ్డారు. ఈ మొత్తం వ్యవహారానికి కొంత మంది పోలీసుల ఏకపక్ష చర్యలే అసలు కారణంగా విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
బెండోవర్ కేసులతో మొదలు....
ఎన్నికల్లో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవడం సముచితమే. కానీ..ఏకపక్ష చర్యలే అభ్యంతరకరం.ఇప్పటికీ పులివెందుల రూరల్ మండలంలో 100మందికిపైగా బైండోవర్ చేశారు. తెలుగుదేశం వారిని అసలు బైండోవర్‌కు పిలవలేదు. వైఎస్సార్‌సీపీ నేతల్ని మాత్రమే బైండోవర్ చేయిస్తున్నారు. పులివెందుల మండలంలో పోలింగ్ నిర్వహిస్తుంటే నియోజకవర్గ వ్యాప్తంగా బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. అదీ కూడా ఇరుపక్షాలను చేయడం లేదు. టార్గెట్‌గా వైఎస్సార్‌సీపీ నేతల్ని ఎంచుకున్నారు. పోలీసుల ఏకపక్ష చర్యలకు ఈవ్యవహారం మరో ఉదాహరణగా నిలుస్తోంది.
● కొరవడిన సమర్థవంత అధికారుల స్ఫూర్తి
జిల్లాలో ఎందరో నిష్టాతులైన పోలీసు అధికారులు విధులు నిర్వర్తించారు. వారిలో గుర్తుండిపోయే అధికారులు కొందరే. ఇటీవల కాలంలో ఎస్పీలుగా పనిచేసి, సమర్థవంత అధికారుల పేర్లు పరిశీలించాల్సి వస్తే, బాపూజీ అట్టాడా, పీహెచ్‌డీ రామకృష్ణ, అభిషేక్ మహంతి, హర్షవర్ధన్‌రాజు తదితర అధికారులు జిల్లా వ్యాప్తంగా ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం లేకుండా చేపట్టారు. కాగా తాజాగా పులివెందులలో ఒక జెడ్పీటీసీ ఎన్నికను సమర్థవంతంగా నడింపించలేకపోవడం ప్రజాస్వామ్యవాదులకు ఆశ్చర్యం కల్గిస్తోంది. ఇప్పటికీ జిల్లాలో ఎంతోమంది నిష్ణాతులైన అధికారులు ఉన్నప్పటికీ పులివెందులలో వరుస ఘటనలు తలెత్తుతున్నాయి. ప్రజలకు భయాందోళనలు అధికమయ్యాయి. దుండగులు పోలీసు వ్యవస్థకు సవాల్‌గా నిలుస్తు న్నా.. కట్టడి చేయడంలో స్థానిక అధికారులు, ఆపై జిల్లా పోలీసు యంత్రాంగం వైఫల్యం తేటతెల్లమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
వరుసగా హత్యాయత్న ఘటనలుజరుగుతున్నా పట్టించుకోని పోలీస్ శాఖ
ఒక్క జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలోఇంత అల్లకల్లోలమా?
ప్రజల మాన ప్రాణాలు రక్షణ పక్కనబెట్టి‘జీ..హుజూర్’ అంటున్న ఖాకీలు!