
పులివెందులలో దుండగుల హల్చల్
పులివెందుల రూరల్ : పట్టణంలోని పెద్దకొండప్ప కాలనీ–2లో శుక్రవారం రాత్రి కొందరు దుండగులు హల్ చల్ చేశారు. అర్థరాత్రి వీధిలోకి ప్రవేశించిన దుండగులు ఇళ్ల ముందు పార్కు చేసి ఉన్న దాదాపు 10 ద్విచక్ర వాహనాలను కింద పడవేసి.. కొన్నింటిని పగులగొట్టి వెళ్లారు. ఉదయాన్నే కాలనీ వాసులు రాత్రి జరిగిన సంఘటనను చూసి భయభ్రాంతులయ్యారు. వీరు కాలనీలో వీధి వెంట దర్జాగా నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇటీవల ఏదో ఒక ప్రాంతంలో చిన్న చిన్న చోరీలు జరుగుతుండటంతో పట్టణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పులివెందుల పట్టణంలో చాలామంది యువత గంజాయి, మద్యానికి అలవాటుపడి డబ్బుల కోసం నేరాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ చర్యకు పాల్పడింది ఆకతాయిలా.. లేక దొంగలా అనేది తేలాల్సి ఉంది. పోలీసులు స్పందించి చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు.