
బాలికల భవితకు బాటలు
కడప కోటిరెడ్డిసర్కిల్: మహిళా శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో ‘కిశోర వికాసం’పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యంగా అనారోగ్య సమస్యలు, ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు కిశోరి బాలికలకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా, ఇతర శాఖలను సమన్వయం చేసుకుని సామాజిక అంశాలతోపాటు విద్య, వైద్యం, నైపుణ్యం, క్రీడలు, చట్టాలు తదితర అంశాలపై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. మే 2 నుంచి జూన్ 10వ తేది వరకు ఈ కార్యక్రమాలు రూపొందించారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులు, ఏఎన్‌ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, డీఆర్‌డీఏ, వీఆర్వో, ఎంపీహెచ్‌డబ్ల్యూఓ తదితర బృందాలతో గ్రామాల్లో కిశోర వికాసం, బాలికలకు ఆహారం, పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, ఆత్మరక్షణ, బాల్య వివాహాలకు దూరంగా ఉండడం తదితర విషయాలను వివరిస్తున్నారు.
గ్రామ స్థాయిలో కమిటీలు
కిశోరి వికాసం కోసం గ్రామ, వార్డు స్థాయిలో మహిళా సంరక్షణ కార్యదర్శి కన్వీనర్‌గా, ఐదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో అంగన్వాడీ కార్యకర్త, బహుళార్దక సాధక ఆరోగ్యకార్యకర్త, గుర్తింపు పొందిన కార్యకర్త, సచివాలయ ఆర్గనైజింగ్ అసిస్టెంట్లు ముఖ్యపాత్ర పోషిస్తారు. ఈ కమిటీ కౌమార బాలికల వివరాలను సేకరించి బృందాలుగా ఏర్పాటు చేసి వారితో సమావేశాలు నిర్వహిస్తారు. ఈ ఏర్పాట్లలో మహిళా సంరక్షణ కార్యదర్శి కీలకంగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన నలుగురు సభ్యులు కార్యక్రమానికి సహకరించడం, ఒకవేళ మహిళా సంరక్షణ కార్యదర్శి లేనిచోట అంగన్వాడీ కార్యకర్తలే పర్యవేక్షిస్తారు. పంచాయతీ కార్యదర్శి, స్థానిక పాఠశాల హెచ్‌ఎం, ఏఎన్‌ఎంలు కూడా అవసరమైతే సహకరిస్తారు. జిల్లాలోని 13 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో 2389 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడతున్నారు.
కౌమర బాలికల గ్రూపులు
ఇందులో 14–18 ఏళ్లలోపు ఉన్న బాలికలు, అలాగే బడి మానివేసిన 11–14 ఏళ్లలోపు పిల్లలను గుర్తించి వారిని గ్రూపులుగా విభజిస్తారు. వారికి ఎంపిక చేసిన అంశాలపై ఆయా ప్రాంతాల్లో బాలికలకు అనువైన సమయంలో గంటపాటు శిక్షణ ఇస్తారు. ప్రధానంగా బాలికలకు ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించి వారు ఆయా అంశాల్లో సమర్థవంతంగా ఉండేలా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు కృషి చేస్తున్నారు.
ఆత్మస్థైర్యం పెంపొందించడానికి..
కిశోరి వికాసం ద్వారా బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు ప్రణాళికలు రూపొందించాం. వేసవి సెలవులు కిశోరి బాలికలకు ఉపయోగపడేలా అంగన్వాడీ కేంద్రాల ద్వారా సామాజిక అంశాలపై చైతన్యవంతులను చేస్తున్నాం. – శోభారాణి, సీడీపీఓ, కడప
అవగాహన కల్పిస్తున్నాం
బాలికలకు ఎదురయ్యే సమస్యలపై కిశోరి వికాసం ద్వారా పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. నిర్ణీత ప్రణాళికతో వారికి అవగాహన కల్పించి అన్ని అంశాల్లో సమర్థవంతంగా ఉండేలా కృషి చేస్తున్నాం. గర్భిణులు, బాలింతలకు పౌష్ఠికాహారాన్ని అందిస్తున్నాం.
– శ్రీలక్ష్మి, పీడీ, ఐసీడీఎస్, కడప
జిల్లా అంతటా కిశోర వికాస శిబిరాలు
ఆరోగ్య పరిరక్షణ, సామాజిక అంశాలు, చట్టాలపై అవగాహన
వేసవి సెలవులు సద్వినియోగం
చేసుకునేలా ప్రణాళిక

బాలికల భవితకు బాటలు