
కన్నకూతురిని ఉన్నత చదువుల కోసం విదేశాలకు సాగనంపి.. సంతోషంగా తిరిగి వస్తున్న దంపతులను విధి చిన్నచూపు చూసింది.
మదనపల్లె : కన్నకూతురిని ఉన్నత చదువుల కోసం విదేశాలకు సాగనంపి.. సంతోషంగా తిరిగి వస్తున్న దంపతులను విధి చిన్నచూపు చూసింది. కర్ణాటక రాష్ట్రం లక్ష్మీపురం వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లెలోని కోటవీధికి చెందిన అమీన్ స్టోన్‌క్రషర్స్ యజమాని షఫీవుల్లా, ఆయన భార్య షాహీనబేగం దుర్మరణం చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కోటవీధికి చెందిన షఫీవుల్లా(55) సివిల్ ఇంజనీర్‌గా పని చేస్తూ, పట్టణంలోని హజరత్ మస్తాన్‌వలీ కమిటీ దర్గా సభ్యులుగా కొనసాగుతున్నారు.
కర్ణాటక రాష్ట్రం కేజీఎఫ్‌కు చెందిన షాహీనాబేగం(50)కు షఫీవుల్లాతో వివాహం జరిగింది. ఈమె విద్యావంతురాలు. వివాహానికి ముందు అధ్యాపకురాలుగా పని చేశారు. వీరికి షాదు, షైమా, షిఫా అనే ముగ్గురు కుమార్తెలు. షాదు, షైమాలకు వివాహమైంది. చిన్నకూతురు షిఫా విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు దరఖాస్తు చేసుకోగా అనుమతి లభించడంతో.. గురువారం రాత్రి కారులో కుమార్తెతో కలిసి బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరి వెళ్లారు. శుక్రవారం వేకువజామున కుమార్తె షిఫాను విమానం ఎక్కించి మదనపల్లెకు తిరుగుప్రయాణమయ్యారు.
మార్గంమధ్యలో కర్నాటక రాష్ట్రం శ్రీనివాసపురం తాలూకా లక్ష్మీపురం క్రాస్ వద్ద రోడ్డు ఎగుడుదిగుడుగా ఉండటం, విశ్రాంతి లేకుండా వాహనాన్ని నడుపుతుండటంతో నిద్రముంచుకురావడంతో అదుపు తప్పి సుమారు 10 అడుగుల లోతులోకి కారు బోల్తా పడింది. కారులోనే దంపతులిద్దరూ మృతి చెందారు. ఉదయం అటుగా వచ్చిన స్థానికులు సమాచారం అందించడంతో.. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతులను మదనపల్లెకు చెందిన వారుగా నిర్ధారించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం శ్రీనివాసపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కర్ణాటకలోని రోడ్డుప్రమాదంలో పట్టణంలోని కోటవీధికి చెందిన దంపతులిద్దరూ మరణించిన వార్త తెలియడంతో.. స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.