
సుందరీమణులు వస్తునా్నరు
రేపు పోచంపల్లిలో ఆఫ్రికా, యాదగిరిగుట్టలో కరేబియన్ అందగత్తెల పర్యటన
సాక్షి, యాదాద్రి : పోచంపల్లిలో ఆఫ్రికా ఖండానికి చెందిన అందగత్తెలు, యాదగిరిగుట్టలో కరేబియన్ దీవుల సుందరీమణులు పర్యటించనున్నారు. ఈనెల 15న వీరి రాక కోసం పాలనా యంత్రాంగం, పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. చేనేత వస్త్రాల తయారీ పరిశీలన కోసం భూదాన్ పోచంపల్లికి 25 మంది, టెంపుల్ టూరిజం టూర్ కోసం యాదగిరిగుట్టకు 10 మంది మొత్తం 35 మంది సుందరీమణులు రానున్నారు.
అందగత్తెల వెంట మహిళా పోలీసులు
భూదాన్ పోచంపల్లి, యాదగిరిగుట్టలకు వచ్చే అందగత్తెల వెంట మహిళా పోలీస్ సిబ్బందిని రక్షణగా నియమించారు. ఒక్కో అందగత్తె వెంట ఒక్కో మహిళా కానిస్టేబుల్‌కు ఉంటారు. వారితో సెల్ఫీ దిగాలని ప్రయత్నించినా మహిళా పోలీసులు అడ్డుకుంటారు. అతిగా చేస్తే కేసులు నమోదు చేస్తారు.
ప్రత్యేక వాహనంలో రాక
పోచంపల్లికి ప్రత్యేక వాహనంలో రానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు హైదారాబాద్ నుంచి బయలుదేరి ఆరు గంటలకు పోచంపల్లికి చేరుకుంటారు. స్థానిక మహిళలు తిలకం దిద్దిన తర్వాత కళాకారుల కోలాట నృత్యంతో స్వాగతం పలుకుతూ టూరిజం లోని హాల్‌లోకి తీసుకెళ్తారు. అక్కడ 8 గంటల వరకు చేనేత వస్త్రాల తయారీ గురించి అడిగి తెలుసుకుంటారు. రాష్ట్రంలోని వివిధ రకాల చేనేత ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించి అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు.
యాదగిరిగుట్టలో దర్శనం, ఫొటో షూట్
కరేబియన్ దీవులకు చెందిన అందగత్తెలు 10 మంది హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట కొండపైకి చేరుకుంటారు. కొండపైన గల దేవస్థానం గెస్ట్‌హౌజ్‌లో ఫ్రెషప్ అయిన తర్వాత ఎలక్ట్రికల్ వాహనాల్లో ఆలయ ప్రాంగణం చేరుకుంటారు. అక్కడ అఖండ దీపం వద్ద నూనె సమర్పిస్తారు. అక్కడే బంగారు తాపడంతో ఉన్న దివ్యవిమాన గోపురం కనిపించే విధంగా ఫొటో షూట్ ఉంటుంది. అనంతరం తూర్పు రాజగోపురం లోంచి ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. స్వామి వారి దర్శనం అనంతరం పడమర రాజగోపురం మీదుగా బయటకు వస్తారు. అక్కడే శ్రీస్వామి వారి ప్రసాదం, చిత్రపటాలను అందజేస్తారు. వీరి పర్యటన సందర్భంగా గుట్టపై భక్తులకు దర్శనం నిలిపివేస్తారు.
భువనగిరిలో సేదదీరనున్న అందగత్తెలు
వరంగల్, వేయి స్తంబాల గుడి, రామప్పకు వెళ్తున్న సుందరీమణుల కోసం భువనగిరిలో విడిది ఏర్పాటు చేశారు. వివేరా హోటల్‌లో విశ్రాంతి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి వోల్వో బస్సులను ఏర్పాటు చేశారు. ముందుగా రామప్పకు వెళ్లేవారు 22 మంది, వరంగల్‌కు వెళ్లే 10 మంది రెండు బ్యాచ్‌లుగా వస్తారు. తిరుగు ప్రయాణంలో కొద్దిసేపు వివేరాలో ఆగి సేదదీరుతారు.
నిరంతరం నిఘా
అందగత్తెల రాకపోకల సందర్భంగా 500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పర్యటన యావత్తు సీసీ కెమెరాల నిఘాలో సాగనుంది. పోచంపల్లిలో సుందరీమణులు పాల్గొనే టూరిజం కేంద్రం కార్యక్రమంతో పాటు వారు వచ్చే దారిలో సీసీకెమెరాలు ఏర్పాటు చేసి స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచి నేరుగా హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేశారు.
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన
రాచకొండ పోలీసులు
పర్యటన సందర్భంగా గుట్టపై
భక్తులకు దర్శనం నిలిపివేత