
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
భూదాన్‌పోచంపల్లి: ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. మంగళవారం భూదాన్‌పోచంపల్లి మండలంలోని పెద్దరావులపల్లి పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ధాన్యం కొనుగోళ్ల నిర్వహణ, రికార్డులను పరిశీలించారు. రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రక్‌షీట్లు వెంటనే ఇవ్వకపోవడంతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్న తీరును చూసి వారిని మందలించారు. రికార్డుల నిర్వహణ సరిగా ఉండాలని ఆదేశించారు. అకాల వర్షాలు వస్తాయని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో కొనుగోళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, సివిల్ సప్‌లై జిల్లా అధికారి రోజారాణి, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, ఇన్‌చార్జ్ తహసీల్దార్ నాగేశ్వర్‌రావు, ఎంఆర్‌ఐ గుత్తా వెంకట్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారిణి శైలజ, సివిల్ సప్‌లై డీటీ బాలమణి ఉన్నారు.
హనుమంతుడికి ఆకుపూజ
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా కొనసాగాయి. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం వెండి జోడు సేవ పూజలు నిర్వహించారు.
వృత్యంతర శిక్షణతో నాణ్యమైన బోధన
భువనగిరి: ఉపాధ్యాయులు పొందుతున్న వృత్యంతర శిక్షణ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందని డీఈఓ సత్యనారాయణ అన్నారు. మంగళవారం భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత, బాగాయత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలల్లో 250 సాంఘిక శాస్త్రం, బీచ్ మహల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 300 మంది గణిత, బాగాయత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 240 ఇంగ్లిష్ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అకాడమిక్ మానిటరింగ్ కో ఆర్డినేటర్ శ్రీనివాసులు, జానీ ఆఫ్గన్, కోర్స్ ఇన్‌చార్జిలు భాస్కర్, నర్సింహ, రవికుమార్, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు