
వానా కాలం.. వ్యాధుల కాలం
భీమవరం(ప్రకాశం చౌక్): వర్షాకాలం వచ్చిందంటే వ్యాధుల సోకే ప్రమాదం పొంచి ఉంటుంది. డ్రెయినేజీల పారుదల సక్రమంగా లేక రోజుల తరబడి మురుగు నీరు నిలిచిపోవడం, పారిశుద్ధ్యం మెరుగ్గా లేని ప్రాంతాల్లో దోమలు, సూక్ష్మక్రిములు వృద్ధి చెంది వ్యాధులకు కారకాలుగా మారతాయి. దీంతో జ్వరం, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదముందని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ అధికారి జీ,గీతాభాయి సూచిస్తున్నారు. ప్రతి ఏడాది జ్వరాల వల్ల చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించడంతోపాటు జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలు వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను ఆశ్రయించాలని అంటున్నారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె వివరించారు.
సాధారణ జ్వరం, జలుబు
సీజన్ మార్పుతో పెరిగే సూక్ష్మక్రిముల వల్ల వైరల్ జ్వరాలు వ్యాప్తిచెందుతాయి. గాలి, నీటి ద్వారా మానవ శరీరంలోకి సూక్ష్మజీవులు ప్రవేశిస్తాయి. వైరస్ రకాన్ని బట్టి జ్వరం ఉంటుంది. జ్వరం మాత్రమే కాకుండా కొందరికి దగ్గు, కీళ్ల నొప్పులు ఉంటాయి. వైరల్ జ్వరం 3 నుంచి 7 రోజుల వరకు ఉంటుంది.
చికెన్ గున్యా
తీవ్రమైన జ్వరం, కీళ్ల నొప్పులు చికెన్ గున్యా లక్షణాలు. ఈ జ్వరం దోమ కాటు వల్ల వస్తుంది. చికెన్ గున్యా సోకితే మొదటి రెండు, మూడు రోజులు జ్వరం ఎక్కువగా ఉంటుంది.
మలేరియా
తీవ్రమైన తలనొప్పి, వణుకుతో కూడిన అధిక జ్వరం మలేరియా లక్షణం. జ్వరం తగ్గి మళ్లీ వస్తుంది. మలేరియా ఆడ అనాఫిలిస్ దోమ కాటుతో వ్యాప్తి చెందుతుంది. దోమ కాటు వల్ల దాని లోపల ఉన్న మలేరియా జెరమ్స్ శరీరం లోపలికి వెళ్తాయి. 14 రోజుల తర్వాత అధిక జ్వరం వస్తుంది. ఈ దోమలు నిల్వ ఉన్న వర్షపు నీటిలో వృద్ధి చెందుతాయి.
డెంగీ
ఈడిస్ ఈజిప్టు అనే దోమ కాటుతో డెంగీ వ్యాప్తి చెందుతుంది. ఈ దోమ పగటి పూట కుడుతుంది. దోమ కుట్టినప్పుడు ఒళ్లుంతా దద్దుర్లు కనిపిస్తాయి. వైరల్ జ్వరం మాదిరి అకస్మాత్తుగా జ్వరం వస్తుంది. తల నొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులతో ఎముకలు విరిగేటంత నొప్పి కలిగిస్తుంది. ఒక్కోసారి శరీరం లోపలి భాగాల్లో రక్తస్రావం జరుగుతుంది. దాని వల్ల కాళ్లు, చేతులు, ముఖం, వీపు భాగాల చర్మంపై ఎరగ్రా కందినట్లుగా చినచిన మొటిములు కనిపిస్తాయి. ఒక్కోసారి ప్లేట్లెట్స్ తగ్గిపోయి రోగి పరిస్థితి విషమంగా ఉంటుంది.
హెపటైటిస్ ఎ
వర్షాకాలంలో హెపటైటిస్ ఎ ( కామెర్లు) వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇది కాలేయకణాల్లో సంక్రమణ వల్ల కలుగుతుంది. ఈ వ్యాధి సూక్ష్మక్రిములు కలుషితమైన ఆహార పదార్థాల నుంచి, తాగునీటి నుంచి శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాలేయ వ్యాధి కారణంగా రక్తంలో బిలిరుబిన్ పరిమాణం పెరుగుతుంది. శరీర భాగాలు పసుపు రంగులో కనిపిస్తాయి.
టైఫాయిడ్
వర్షాకాలంలో టైఫాయిడ్ కేసులు పెరిగే అవకాశం ఉంది. ఇది సాల్మొనెల్లా టైఫి బాక్టీరియా వల్ల వస్తుంది. మురుగునీరు తాగడం, కలుషితమైన ఆహారం తినడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
దోమల నివారణకు చర్యలు శూన్యం
జిల్లాలోని పట్టణాల్లో గాని పల్లెల్లో గాని దోమల నివారణ చర్యలు అధికార యంత్రాంగం చేపట్టకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. పట్టణాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటుందని, పల్లెల్లో కచ్ఛా డ్రెయిన్లు తవ్వడం, డ్రెయినేజీల పూడిక పనులు నిర్వహించడం లేదని అంటున్నారు. దోమల నివారణకు ఫాంగింగ్ చేయడం లేదని, ఎక్కడా కనీసం బ్లీచింగ్ పౌడర్ జల్లడం కూడా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి దోమల నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించడంతోపాటు కలుషిత ఆహారం, కలుషిత నీరు తాగకుండా ఉండడం ద్వారా వ్యాధులు సోకకుండా రక్షణ పోందవచ్చు. జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే వైద్యులను ఆశ్రయించాలి. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి.
– జీ,గీతాభాయి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి
దోమల విజృంభణతో డెంగీ, మలేరియా సోకే ప్రమాదం
పరిసరాల, వ్యక్తిగత శుభ్రతే ప్రధానమని వైద్యుల సూచన
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి.
పెంటకుప్పులు, చెత్తాచెదారం ఇంటికి దూరంగా వేయాలి.
ఇంటి పరిసరాల్లో కొబ్బరి బొండాలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి.
ఇంటిలో అన్ని గదుల్లో దోమలు రాకుండా చూసుకోవాలి. దోమ తెరలు వాడడం శ్రేయస్కరం.
శరీరం మొత్తం కప్పేలా ఉన్న దుస్తులు ధరించాలి.
వారంలో ఒక రోజు డ్రైడే పాటించాలి.
నీళ్ల ట్యాంకులపై సరైన మూతలను అమర్చాలి.
వర్షంలో తడవరాదు. తడిచిన బట్టలలో ఎక్కువ సేపు ఉండకూడదు.
భోజనం చేసే ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలి.
కాచి చల్లార్చిన నీటిని తాగాలి.
బయట ఆహారం తినకూడదు.
నిల్వ పదార్థాలు తినరాదు. వేడి ఆహార పదార్థాలు తినడం మంచిది.
తాజా పండ్లు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి.
వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించాలి.

వానా కాలం.. వ్యాధుల కాలం

వానా కాలం.. వ్యాధుల కాలం