
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
ఏలూరు టౌన్ : దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేసి అతని నుంచి బంగారు ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. త్రీటౌన్ స్టేషన్‌లో సీఐ కోటేశ్వరరావు వివరాల ప్రకారం.. త్రీటౌన్ పరిధిలోని సౌభాగ్యలక్ష్మి అమ్మవారి గుడి, వన్‌టౌన్ పరిధిలోని రెండు దేవాలయాల్లో దొంగతనాలపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సీసీఎస్ సీఐ సీహెచ్ రాజశేఖర్, త్రీటౌన్ ఎస్‌ఐ పీ.రాంబాబుతో పాటు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలు జరిగిన తీరును పరిశీలిస్తూ... సీసీటీవీ పుటేజ్ ఆధారంగా శుక్రవారం ఏలూరు మినీబైపాస్ రోడ్డులో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చోరీలకు పాల్పడుతున్న కొత్తపేట ఈమని రాంబాబును అరెస్ట్ చేసి అతని నుంచి 30 గ్రాముల బంగారు అభరణాలు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేయాలనుకునే గుడిని ఎంచుకుని, భక్తుడిలా గుడిలోకి వెళ్తాడు. పూజారితో మాటలు కలిపి భక్తుడిలా కలరింగ్ ఇస్తాడు. పూజారి పరధ్యానంగా ఉన్న సమయంలో దేవుడికి, అమ్మవారికి అలంకరించిన బంగారు వస్తువులు చోరీ చేస్తూ పరారవుతాడని త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు తెలిపారు. రాంబాబుపై కృష్ణా, గుంటూరు జిల్లాలోను కేసులున్నాయని తెలిపారు. రాంబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా 50కిపైగా చోరీ కేసులు నమోదయినట్లు చెప్పారు.