రైతులకు యూరియా కష్టాలు
ఐనవోలు: మండలంలోని రైతులకు యాసంగిలో యూరియా కష్టాలు ప్రారంభమయ్యాయి. గురువారం కక్కిరాలపల్లి గ్రామంలోని ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌కు 200 యూరియా బస్తాలు వచ్చాయి. విషయం తెలుసుకున్న రైతులు తెల్లవా రక ముందే సెంటర్‌కు చేరుకుని క్యూలో నిల్చున్నారు. గ్రామ పంచాయతీ వద్ద చిట్టీలు ఇస్తామని నిర్వాహకులు చెప్పడంతో సుమారు 300 మంది రైతులు పరుగెత్తుకుంటూ వెళ్లి క్యూలో నిల్చున్నారు. నిర్వాహకులు ఒక్కరికి ఒక బస్తా యూరియా టోకెన్ రాసిచ్చారు. అందరికీ చిట్టీలు అందకపోవడంతో సుమారు వంద మంది రైతులు నిరాశతో వెనుతిరిగారు. 60 టన్నులకు డబ్బులు కడితే 10 టన్నుల యూరియా మాత్రమే వచ్చిందని, రెండు రోజుల్లో మరో లోడ్ యూరియా వస్తుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి యూరియా పంపిణీని ప్రారంభించి పూర్తి చేశారు. యూరియాతోపాటు ఇతర మందులు బలవంతంగా అంటగడుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక బస్తా యూరియా రూ.280కి రావాల్సి ఉండగా.. రూ.410 పెట్టి కొనుక్కోవాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.


