ఇక కొరతలేకుండా యారియా
ఖిలా వరంగల్: రైతులకు అవసరమయ్యే యూరియాను ముందుగా బుక్ చేసి తెచ్చుకునేలా వ్యవసాయ శాఖ కొత్త యాప్‌ను అందుబాటులోకి తెస్తోంది. వానాకాలంలో యూరియా కోసం రైతులు బారులుదీరి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలోని పలు మండలాల్లో అవసరం మేరకు యూరియా లభ్యం కాకపోవడంతో అన్నదాతలు ఆందోళనలు చేశారు. పలువురు డీలర్లు అధిక ధరలకు యూరియా విక్రయించారు. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యాసంగి నుంచి అక్రమాలకు అడ్డుకట్టవేయడంతోపాటు రైతులకు సరిపడా లభించేలా కొత్త బుకింగ్ విధానం అమల్లోకి తీసుకొస్తున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. దీనిపై రాష్ట్ర స్థాయిలో శిక్షణ పూర్తికాగా, జిల్లాల వారీగా వ్యవసాయాధికారులతోపాటు డీలర్లు, రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది.
జిల్లాలో పంటల సాగు..
జిల్లాలో యాసంగి సీజన్ మొదలైంది. పంటల సాగు నెమ్మదిగా ముందుకెళ్తోంది. 2025–26 యాసంగి పంట, విత్తనాలు, ఎరువులు లభ్యత, అమ్మకాలపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మొక్కజొన్న పంట 26,510 ఎకరాలు, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటలు 6,877 ఎకరాల్లో సాగు అవుతున్నాయి. వరి పంట 1,15,200 ఎకరాల సాగు అంచనా, అందుకు అవసరమైన వరి విత్తనాలు 23,040 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. మొక్కజొన్న 1,08,500 ఎకరాల్లో సాగు అంచనా, అందుకు అవసరమైన 8,680 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. యాసంగి పంట కాలానికి సంబంధించి అక్టోబర్ 2025 నుంచి నేటి వరకు 12,719 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాలో సరఫరా చేశారు. మార్కెఫెడ్ 4,240 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల వద్ద 4,819 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. వ్యవసాయ శాఖ తీసుకొస్తున్న యాప్‌లో బుక్ చేసుకొంటే నేరుగా మీకు యూరియా అందుతుంది. ఈకొత్త సాంకేతిక వ్యవస్థను వ్యవసాయ శాఖ ఈనెల 20 నుంచి అమల్లోకి తెస్తుంది.
విడతల వారీగా సరఫరా..
రైతులు యాప్‌ను మొబైల్ ఫోన్‌లోని ప్లేస్టోర్ నుంచి డైన్‌లోడ్ చేసుకొని ఒకేసారి కాకుండా విడతల వారీగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయిదు ఎకరాల్లోపు ఉన్న రైతులు రెండు విడతల్లో 5 నుంచి 20 ఎకరాలున్న రైతులు మూడు, అంతకంటే ఎక్కువ ఉన్న రైతులు నాలుగు విడతల్లో యూరియా బుక్ చేసుకోవచ్చు.
బుకింగ్ 48 గంటలు మాత్రమే..
వ్యవసాయ శాఖ యాప్‌లో బుకింగ్ కేవలం 48 గంటలు మాత్రమే ఉంటుంది. ఆ లోగా యూరియా తీసుకోనట్లయితే తిరిగి అది స్లాట్‌లోకి వెళ్తుంది. ఈ యాప్‌లో జిల్లా మొత్తంలో పీఏసీఎస్, ఫర్టిలైజర్స్‌లో యూరియా ఎక్కడెక్కడ ఎంత అందుబాటులో ఉందనే సమాచారం అధికారులు, రైతులు తెలుసుకోవచ్చు.
పాస్ పుస్తకంతో నమోదు
యాప్‌లో పట్టాదారు పాసుపుస్తకం నంబర్ నమోదు చేయగానే లింక్ చేసిన ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఇది నమోదు చేయగానే సదరు రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉంది. ఏ పంట వేశారనే వివరాలతోపాటు పంటకు ఎంత యూరియా అవసరమనే సమాచారం బుకింగ్ ఐడీ వస్తుంది. ఏదైనా అధీకృత రీటైలర్, లేదా సహకార సంఘాల నుంచి కొనుగోలు చేసుకునే అవకాశం రైతుకు కల్పిస్తారు.
ప్రత్యేక యాప్ రూపొందించిన ప్రభుత్వం
ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే యూరియా అందజేత
ఈనెల 20 నుంచి జిల్లాలో
నూతన విధానం అమలు
ఎరువుల పంపిణీకి ప్రత్యేక యాప్
గీసుకొండ: రైతులకు సకాలంలో ఎరువులు అందేలా, విక్రయ కేంద్రాల్లో బారుల వద్ద రద్దీని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించిందని జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ తెలపారు. వ్యవసాయ శాఖ కమిషనర్ గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కొనాయమాకుల రైతు వేదిక నుంచి ఏఈ ఓలు, ఎరువుల డీలర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కా ర్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇక నుంచి ఈ ప్రత్యేక యాప్ ద్వారానే ప్రభుత్వం ఎరువులను అందిస్తుందన్నారు. పట్టాదారు పాస్‌పుస్తకం ఉన్నవారు నేరుగా పట్టా నంబర్‌తో, లేని వారు ఆధార్‌కార్డు ద్వారా యాప్‌లో లాగిన్ అవ్వాలన్నారు. ఎరువుల ను తీసుకునే క్రమంలో తప్పనిసరిగా ఆధార్ కార్డు చూపించాలని, సాగు విస్తీర్ణం ఆధారంగా యూరి యా, తదితర ఎరువులను విడతల్లో తీసుకోవాలని, ఎన్ని బస్తాలు వస్తాయో స్వయంగా యాప్ లెక్కచెబుతుందన్నారు. ఎకరం వరకు మొత్తం బస్తాలను ఒక వాయిదాలో, 5 ఎకరాల వరకు రెండు వాయిదాల్లో, 5 నుంచి 20 ఎకరాల వరకు మూడు వాయిదాల్లో, 20 ఎకరాల పైన నాలుగు వాయిదాల్లో ఎరువులను తీసుకోవచ్చన్నారు. ఒక విడత ఎరువులను తీసుకున్న తర్వాత మళ్లీ 15 రోజుల తర్వాతే యాప్ లో స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. ఇలా బుక్ చేసుకున్న 24 గంటల్లో డీలర్ల నుంచి ఎరువులను తీసుకోవచ్చన్నారు. ఆలస్యం చేస్తే బుకింగ్ రద్దు అవుతుందన్నారు.
ఇక కొరతలేకుండా యారియా
ఇక కొరతలేకుండా యారియా


