సమన్వయంతో ఎన్నికలు ప్రశాంతం
● సీపీ సన్‌ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం: అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించడంతో కమిషనరేట్ పరిధిలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. గురువారం డీసీపీలు అంకిత్‌కుమార్, రాజమహేంద్రనాయక్, కవిత సీపీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ సన్‌ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ డీసీపీ నుంచి మొదలుకొని హోంగార్డు స్థాయి వరకు అందరూ ప్రణాళికాబద్ధంగా పనిచేశారని తెలిపారు. పోలింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా బందోబస్తు నిర్వహించి ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేశామని పేర్కొన్నారు.
గుడిసెవాసులకు
ఇళ్ల పట్టాలివ్వాలి
ఖిలా వరంగల్: జక్కలొద్ది రామ సురేందర్‌నగర్ గుడిసె వాసులందరికీ ఇళ్ల పట్టాలివ్వాలని, లేకపోతే గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను పేదలకు పంచాలని సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. గురువారం వరంగల్ ఫోర్ట్ రోడ్డులోని ఖిలా వరంగల్ మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం జిల్లా సహయ కార్యదర్శి నలిగంటి రత్నమాల ఆధ్యక్షతన సీపీఎం నాయకుల రిలే నిరహార దీక్ష చేపట్టారు. దీక్షలో కూర్చున్న రామసందీప్ తదితరులకు నాగయ్య పూలమాలలు వేసి రిలే నిరహర దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. గుడిసె వాసుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తూర్పాటి కవిత, మైదం వినోదమ్మ, దుప్పటి రమ్య, బెజ్జూల కోటేశ్వర్, ఉసిల్లకుమార్, భవాని, జ్యోతి, కృష్ణ, సంపత్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


