ఎన్నికలకు సర్వం సిద్ధం
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 17 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
హన్మకొండ అర్బన్: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే రెండు విడతలుగా నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం ఆత్మకూరు, దామెర, నడికూడ, శాయంపేట మండలాల్లో జరగనున్న మూడో విడత ఎన్నికలకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 68 గ్రామ పంచాయతీల్లో ఒక గ్రామ పంచాయతీ, 634 వార్డులకు 71 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 67 గ్రామ పంచాయతీలు, 563 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచ్ స్థానాలకు 230 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 1,424 మంది బరిలో ఉన్నారు. 666 పోలింగ్ కేంద్రాలు, 897 అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 626 మంది పీఓలు, 897 మంది ఓపీఓలు మొత్తం 1,523 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. అవసరమైన సామగ్రితోపాటు సిబ్బంది మంగళవారమే సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఓటర్లు బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు పిలుపునిస్తున్నారు.
ఓటు హక్కు వినియోగించుకోనున్న 1,11,822 ఓటర్లు..
మూడో విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో భాగంగా పురుషులు 54,293, మహిళలు 57,528, ఇతరులు ఒకరు మొత్తంగా 1,11,822 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ మేరకు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
పోలింగ్ శాతం పెంపునకు చర్యలు..
మొదటి, రెండు విడతల్లో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఈసారి దానిని అధిగమించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటింగ్‌పై అవగాహన వంటి కార్యక్రమాలతో పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నారు.
ఉదయం పోలింగ్..
మధ్యాహ్నం తర్వాత ఓట్ల లెక్కింపు
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఒంటిగంట వరకు పోలింగ్ కేంద్రాల ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు వేసే విధంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయి. దీంతో మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఉన్న వారికి చీటీలు ఇచ్చి పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. భోజన విరామం ఆ తర్వాత బ్యాలెట్లు కట్టలు కట్టి, లెక్కింపు ప్రారంభిస్తారు. మొదట వార్డు మెంబర్లు, ఆ తర్వాత సర్పంచ్ ఫలితాలు వరుసగా వెల్లడిస్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్‌తో పాటు జిల్లా ఎన్నికల పరిశీలకుడు శివకుమార్ నాయుడు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ పోలింగ్ సామగ్రి పంపిణీ, పోలింగ్ కేంద్రాలను సందర్శించి సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ నారాయణ, ఆత్మకూరు ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ జగన్మోహన్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
నేడు మూడో విడత ఆత్మకూరు, దామెర, నడికూడ, శాయంపేట మండలాల్లో పోలింగ్
67 గ్రామ పంచాయతీలు,
563 వార్డులకు ఎలక్షన్స్
1,523 మంది సిబ్బంది కేటాయింపు
ఏర్పాట్లు పరిశీలించిన సీపీ,
జిల్లా ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్
ఎన్నికలకు సర్వం సిద్ధం
ఎన్నికలకు సర్వం సిద్ధం
ఎన్నికలకు సర్వం సిద్ధం
ఎన్నికలకు సర్వం సిద్ధం


