వైభవంగా మల్లన్న దృష్టి కుంభం
ఐనవోలు: జాతరకు ముందు ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున దృష్టి కుంభం వైభవంగా జరిగింది. గర్భాలయంలో మల్లికార్జునస్వామి, అమ్మవార్లు గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మకు ఈనెల 10 నుంచి 15 వరకు సుధావళి వర్ణలేపనం పనులు పూర్తిచేశారు. శైవాగమం ప్రకారం వేద మంత్రాలతో దృష్టి కుంభం ప్రక్రియను అర్చకులు, వేద పండితులు వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆర్జిత సేవలు, దైవదర్శనాలను పునరుద్ధరించారు. ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా ధనుఃసంక్రమణ పూజలు చేశారు.
దృష్టి కుంభం ఇలా..
గర్భగుడికి ఎదుట ఉన్న మహా మండపంలో ఒక పాత్రలో మూడు క్వింటాళ్ల అన్నాన్ని కుంభాకారంలో రాశిగా పోశారు. చుట్టూ పూలతో అలంకరించి అన్నరాశిపై కుంకుమ పోసి జ్యోతులు వెలిగించి, కూష్మాండ బలి నిర్వహించారు. భక్తుల జయజయ ధ్వానాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణల నడు మ ప్రధాన ఆలయ తలుపులూ తెరుస్తూ ఉండగా మూలవరులకు రంగులు అద్దిన వ్యక్తి నేత్రాలపై ఉన్న మైనాన్ని తొలగించారు. స్వామి, అమ్మవార్ల మొదటి దృష్టి నేరుగా మానవాళిపై పడకుండా ముందుగానే కుంభాకృతిలో ఏర్పాటు చేసిన అన్నరాశి, అద్దం, మేకలపై పడేలా కుంభ హారతి ఇచ్చారు.
ముగిసిన ప్రధాన ఘట్టం..
దృష్టి కుంభం నిర్వహిస్తే భక్తుల దృష్టి దోషాలు తొలగుతాయని ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ తెలిపారు. దీంతో జాతర ముందు నిర్వహించే ప్రధాన ఘట్టం ముగిసిందని తెలిపారు. ఆలయ చైర్మన్ ప్రభాకర్‌గౌడ్, ఈఓ కందుల సుధాకర్, ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, ఐనవోలు మధుకర్, వేద పారాయణ దారు గట్టు పురుషోత్తమ శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి అర్చకులు నందనం భాను ప్రసాద్, నందనం మధు, ఉప్పుల శ్రీనివాస్, నరేష్ శర్మ, మడికొండ దేవేందర్, పోషయ్య, ధర్మకర్తలు గడ్డం రేణుక శ్రీనివాస్, మహేందర్, కీమా, ఆనందం పాల్గొన్నారు.
జాతరకు ముందు నిర్వహించిన
తొలి ఘట్టం పూర్తి
ఆలయంలో ఆర్జిత సేవలు,
దర్శనాలు ప్రారంభం
వైభవంగా మల్లన్న దృష్టి కుంభం
వైభవంగా మల్లన్న దృష్టి కుంభం


