దివ్య ప్రార్థనకు అనువైన మాసం
హన్మకొండ కల్చరల్: ధనుర్మాసం దివ్య ప్రార్థనకు అనువైన మాసమని, ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేది ధనుర్మాస వ్రతమని తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ అన్నారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ నందిహిల్స్‌లోని శ్రీపంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ధనుర్మాసవ్రత మహోత్సవాలను ప్రారంభించారు. అనంతరం దేవాలయ అర్చకుడు మరుగంటి రంగనాథాచార్యులు ఆధ్వర్యంలో ధనుర్మాస పూజలు, తిరుప్పావై పాశుర విన్నపం, తీర్థగోష్టి నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ జగన్మోహన్‌రెడ్డి, సురేష్‌కుమార్, లక్ష్మారెడ్డి, సంస్కృత పండితుడు సముద్రాల శఠగోపాచార్య, మహిళలు పాల్గొన్నారు. సాయంత్రం సామూహిక విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు.
ధనుర్మాస పూజలు ప్రారంభం
నగరంలోని వైష్ణవ ఆలయాల్లో మంగళవారం ధనుర్మాస పూజలు ప్రారంభమయ్యాయి. వరంగల్ బట్టలబజార్‌లోని శ్రీబాలావేంకటేశ్వరస్వామి దేవాలయం, గోపాలస్వామిగుడి, గోపాల్‌పూర్ సదాశివ కాలనీలోని శ్రీగోదామాధవ ఆధ్యాత్మిక ప్రచార కేంద్రంలో డాక్టర్ ఆరుట్ల శ్రీనివాసాచార్యస్వామి తదియారాధన నిర్వహించారు. హనుమకొండలోని అదాలత్ వెనుకగల శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి దేవాలయం, మచిలీబజార్‌లోని దొప్ప నర్సింహస్వామి, రెవెన్యూకాలనీలోని శ్రీ సీతారామచంద్రస్వామి, హనుమకొండ రెడ్డి కాలనీలోని అభయాంజనేయస్వామి, ఎకై ్సజ్ కాలనీలోని శ్రీవేంకటేశ్వరస్వామి, కాజీపేట సిద్ధార్థనగర్ ప్రసన్నాంజనేయస్వామి తదితర దేవాలయాల్లో పాశురాలు చదువుతూ దీపాలు వెలిగించారు. తిరువారాధనం ఆరగింపు చేశారు. సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు నిర్వహించారు.


