ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
దామెర: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. మండల కేంద్రం సమీపంలోని ఏఎన్‌ఆర్ గార్డెన్స్‌లో మంగళవారం పోలింగ్ సామగ్రి పంపిణీని సీపీ పరిశీలించి మాట్లాడారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా గొడవలు సృష్టించాలని చూస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పరకాల ఏసీపీ సతీశ్‌బాబు పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి
ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్, డీఆర్డీఓ మేన శ్రీను అన్నారు. పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీలు, 132 వార్డులకు 132 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దామెర, ఊరుగొండ క్లస్టర్లుగా విభజించి ఎన్నిలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట జెడ్పీ సీఈఓ రవిబాబు, మండల ప్రత్యేక అధికారి బాలరాజు, ఎంపీడీఓ గుమ్మడి కల్పన, ఎంపీఓ రంగాచారి ఉన్నారు.
శాయంపేటలో పోలింగ్ సామగ్రి
పంపిణీ కేంద్రం పరిశీలన..
శాయంపేట: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సీపీ సన్‌ప్రీత్ సింగ్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించాలని సూచించారు. అదనపు డీసీపీ బాలస్వామి, ఏఎస్పీ శుభం, ఏసీపీలు సతీశ్‌బాబు, సత్యనారాయణ, సీఐ రంజిత్‌రావు, ఎస్సై జక్కుల పరమేశ్ ఉన్నారు.


