ముగిసిన ప్రచారం..
సాక్షిప్రతినిధి, వరంగల్ : గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు అఖరి అంకానికి చేరుకుంది. జిల్లాలో రెండు విడతల్లో 11 పంచాయతీలు ఏకగ్రీవం, 131 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మూడో విడతలో మొత్తం 68 పంచాయతీలకు ఒకటి ఏకగ్రీవం కాగా, 67 పంచాయతీలకు ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మూడో విడత ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. తొలి, మలి విడతల్లో కొన్నిచోట్ల పోటాపోటీగా తలపడినా... మరికొన్ని చోట్ల అనైతిక పొత్తులతో ఫలితాలు వెలువడ్డాయి. మెజార్టీగా అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుచుకుని ‘హస్తం’హవాను చాటారు. రెండో స్థానంలో బీఆర్‌ఎస్ ఉండగా, బీజేపీ, రెబల్స్, స్వతంత్రులు గెలుపొందారు. కాగా మూడో విడత ఎన్నికల్లో ఎవరికీ ఎన్ని స్థానాలు దక్కుతాయనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
ముగిసిన ప్రచారం.. జోరుగా పంపకాలు...
ఆఖరి విడత ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. పోలింగ్‌కు ఒక్కరోజు గడువే ఉంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు పోలింగ్ జరగనుంది. ఈలోగా అత్యధిక ఓట్లను సంపాదించుకునేందుకు మద్యం డబ్బులతోపాటు గిఫ్ట్‌లను పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే పనిలో అభ్యర్థులు పడ్డారు. ఒక్కో గ్రామంలో ఓటుకు రూ.500 నుంచి రూ.1,000లు పంపిణీ చేస్తుండగా, ఆన్‌రిజర్వుడు, మేజర్ పంచాయతీల్లో రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరికొన్ని గ్రామాలలో పోలింగ్‌కు ముందురోజు ఇంటికి కిలో చికెన్, మద్యం బాటిళ్లను కూడా సరఫరా చేస్తున్నట్లు వైరల్ అవుతోంది.
67 పంచాయతీలు.. 563 వార్డులు...
మూడో దశలో మొత్తం 68 పంచాయతీలు, 634 వార్డులకు గాను ఒక గ్రామ పంచాయతీ, 71 వార్డులకు సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. దీంతో 67 గ్రామ పంచాయతీలు, 563 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ బరిలో 230 మంది, వార్డుల్లో 1424 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందుకోసం మొత్తం 626 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు వెల్లడించారు. ఆత్మకూరు, శాయంపేట, నడికూడ, దామెర మండలాల్లో జరిగే ఈ పోలింగ్‌లో మొత్తం 626 మంది ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు. బుధవారం మూడో విడత ఎన్నికలతో పంచాయతీ ఘట్టం ముగియనుంది.
రేపు తుది విడత పంచాయతీ ఎన్నికలు
జిల్లాలో 67 జీపీలు,
563 వార్డులకు ఎన్నికలు
అంతుబట్టని ఓటరు నాడి
పల్లెల్లో పంపకాల జోరు.. ప్రలోభాల హోరు
ముగిసిన ప్రచారం..


