మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తి
జిల్లా ఎన్నికల అధికారి,
కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో మూడో విడత జీపీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తయ్యింది. సోమవారం కలెక్టరేట్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను హనుమకొండ జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు శివకుమార్ నాయుడు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ సమక్షంలో అధికారులు నిర్వహించారు. ఈప్రక్రియను సాధారణ పరిశీలకులు, కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలోని ఆత్మకూరు, దామెర, నడికూడ, శాయంపేట మండలాల వారీగా ఆయా గ్రామపంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. జిల్లాలో మూడో విడతలో 68 గ్రామ పంచాయతీల సర్పంచ్, 634 వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 626 ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మేన శ్రీను, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, జెడ్పీ సీఈఓ రవి, తదితరులు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికలు జరిగే మండలాలు, గ్రామపంచాయతీల్లో 163 (బీఎన్‌ఎస్) చట్టం ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటల వరకు అమల్లో ఉంటుందని, అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. బయటినుంచి వచ్చిన వ్యక్తులు సంబంధిత గ్రామ పంచాయతీ పరిధిలో ఉండరాదని, ప్రజలు గుంపులుగా చేరకూడదని సూచించారు. ఉల్లంఘనలు జరిగితే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకోవాలని నోడల్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలంతా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పాటించాలని కలెక్టర్ కోరారు.


