నాడు తండ్రి.. నేడు కొడుకు
● ఇద్దరిని బలితీసుకుంది రోడ్డు ప్రమాదమే..
● కన్నీరుమున్నీరుగా విలపించిన తల్లి..
స్టేషన్‌ఘన్‌పూర్/ఐనవోలు : పదేళ్ల క్రితం తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోగా, శనివారం కుమారుడిని సైతం అదే రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. ఆ ఇంట్లో తీరని విషాదం నింపింది. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం రాఘవాపూర్‌లో జాతీయ రహదారిపై శనివారం రాత్రి బైక్ అదుపుతప్పి కిందపడడంతో ఐనవోలు మండలం రాంనగర్‌కు చెందిన బుర్ర సమ్మయ్య, సునీత దంపతుల కుమారుడు బుర్ర కల్యాణ్‌కుమార్ (27), బుర్ర ఉప్పలయ్య, రమ దంపతుల కుమారుడు నవీన్ (27) దుర్మరణం చెందారు. కాగా, నవీన్ తండ్రి ఉప్పలయ్య పదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అప్పటినుంచి తల్లి కుటుంబ బాధ్యతలు మీదేసుకుని కుమారుడు నవీన్‌కు మంచి చదువులు చెప్పించింది. రోడ్డు ప్రమాదం నాడు తండ్రిని, నేడు కుమారుడిని బలితీసుకుందని గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
కష్టపడి చదివి.. మంచి ఉద్యోగాలు..
బుర్ర కల్యాణ్‌కుమార్, నవీన్‌లు పాలోళ్లు. వరుసకు అన్మదమ్ములు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తున్నారు. కల్యాణ్‌కుమార్‌కు ఓ సోదరి, నవీన్‌కు సోదరి ఉన్నారు. ఇద్దరు కష్టపడి చదువుకున్నారు. నవీన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా, కల్యాణ్‌కుమార్ ఓ ప్రైవేటు కళాశాలలో వార్డెన్‌గా పనిచేస్తున్నాడు. మంచి జీతంతో సంతోషంగా ఉండేవారు. సెలవుల్లో ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో గడిపేవారు.
ఓటు వేద్దామని..
ఐనవోలు మండలం రాంనగర్ గ్రామ పంచాయతీకి రెండో విడతలో ఆదివారం పోలింగ్ జరగనుంది. దీంతోపాటు ఇద్దరి సమీప బంధువులైన బుర్ర మంజుల, బుర్ర సంతోషలక్ష్మి స్థానికంగా వార్డుసభ్యులుగా పోటీ చేస్తున్నారు. ఓటుహక్కును వినియోగించుకుందామని ఉత్సాహంగా పల్సర్‌బైక్‌పై వస్తున్నారు. పరిమితికి మించి వేగం వల్ల బైక్ అదుపుతప్పడం.. ప్రాణాలు అనంతవాయివుల్లో కలిసిపోయాయి. బుర్ర రమ, ఉప్పలయ్యలకు ఒక్క కుమారుడు, ఒక కుమార్తె కాగా సమ్మయ్య, సునీత దంపతులకు సైతం ఒక కొడుకు, ఒక బిడ్డ. ఇద్దరి కుటుంబాల్లో ఉన్న ఒక్కగానొక్క మగ సంతానం అకాలమృతి చెందటంతో ఆయా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.


