పెళ్లి చూడకుండానే పరలోకానికి
సంగెం: ఒక్కగానొక్క కుమారుడి పెళ్లి ఘనంగా జరిపించాలనుకుంది. చుట్టాలందరికీ ఫోన్లు చేసి చెప్పింది. పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమైంది. అంతలోనే ఆమెను మృత్యువు వెంటాడింది. ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో పెళ్లింట విషాదం నెలకొంది. ఆమె మరణం అనంతరం కుటుంబ సభ్యులు ఐదుగురికి అవయవదానం చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపూర్ శివారు గుంటూరుపల్లికి చెందిన కొమ్మారెడ్డి స్వప్నసుందరి(43), రాజారెడ్డి దంపతులకు ఏకై క కుమారుడు వికాస్‌రెడ్డి ఉన్నాడు. వికాస్‌రెడ్డికి ఈ నెల 6వ తేదీన నిశ్చితార్థం జరిగింది. ఆదివారం ఉదయం స్వప్నసుందరి ఉన్నట్టుండి కిందపడిపోయి అస్వస్థతకు గురైంది. హుటాహుటిన వరంగల్‌కు తర్వాత హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా ఆమెకు బ్రెయిన్ డెడ్ అయ్యింది. బుధవారం స్వప్నసుందరి గుండె, రెండు కిడ్నీలు, ఉపరితిత్తులు, లివర్‌ను కుటుంబ సభ్యులు దానం చేసి మరో ఐదుగురికి ప్రాణదానం చేశారు. స్వప్నసుందరి మృతితో గుంటూరుపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
● అస్వస్థతకు గురై కన్నుమూసిన మహిళ
● ఐదుగురికి అవయవదానం చేసిన కుటుంబ సభ్యులు
● సంగెం మండలం గుంటూరుపల్లిలో విషాదం


