పంచాయతీ అటెన్షన్ !
నేడు మొదటి విడతలో వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల్లో పోలింగ్
సాక్షి, వరంగల్: జిల్లాలో పంచాయతీ మొదటి విడత ఎన్నికల సంగ్రామం తుది అంకానికి చేరుకుంది. పర్వతగిరి, వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో నామినేషన్ల దగ్గరి నుంచి ప్రచార పర్వం ముగిసే వరకు అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డారు. ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం ఐదు గంటలకే ముగిసింది. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్న సర్పంచ్, వార్డు అభ్యర్థుల ప్రలోభాలకు తెరలేపినా ఓటర్ల నాడీ ఎటువైపు ఉందో తెలియక టెన్షన్ పడుతున్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు 80 సర్పంచ్ స్థానాలు, 585 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం పోలింగ్ బ్యాలెట్లను ఆయా ప్రాంతాలకు ఎన్నికల అధికారులు తరలించారు. వరంగల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని వర్ధన్నపేట మండల పరిషత్ కార్యాలయం, రాయపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పర్వతగిరి తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఎన్నికల సామగ్రిని ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ బూత్‌లకు బుధవారం సాయంత్రం పీఓ, ఓపీఓలతో కూడిన బృందం పోలీసుల బందోబస్తునడము తరలించింది. మధ్యాహ్నం రెండు గంటలకు మొదలయ్యే ఓట్ల లెక్కింపులో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆ కేంద్రాల వద్ద పోలీసు నిషేధాజ్ఞలు అమల్లో ఉండనున్నాయి. పర్వతగిరి, వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో 91 పంచాయతీలకు 11 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 80 స్థానాలకు 305 మంది సర్పంచ్ అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 800 వార్డులకు 215 ఏకగ్రీవం కాగా.. మిగిలిన 585 వార్డులకు 1,427 మంది పోటీలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో హీటెక్కించినా.. ఓటర్లకు తాయిలాలిచ్చిన అభ్యర్థులకు మాత్రం చలి భయం పట్టుకుంది. పట్టణాలు, నగరాల్లో స్థిరపడిన వలస ఓటర్లు సమయానికి చేరుకుంటారా లేదా అన్న టెన్షన్ వెంటాడుతోంది. కొందరైతే ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటుచేసి మరీ వారిని ఓటు వేసేందుకు రప్పిస్తున్నారు. 9 గంటల తర్వాతే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న అభ్యర్థులు తొందరగానే పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా చూస్తున్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం సర్పంచ్, వార్డు మెంబర్లు ఎవరు గెలుస్తారో తేలనుంది.
ఫ్లయింగ్ స్క్వాడ్ సీజ్ చేసిన నగదు
రూ.4,38,000
స్వాధీనం చేసుకున్న మద్యం విలువ
రూ.41,004
అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న 305 మంది సర్పంచ్, 1,427 మంది వార్డు అభ్యర్థులు
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.. పోలింగ్ కేంద్రాలకు సామగ్రితో చేరుకున్న సిబ్బంది
పంచాయతీ అటెన్షన్ !


