మొదటి విడత ప్రచారానికి తెర.. ప్రలోభాల ఎర
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 10 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సాక్షిప్రతినిధి, వరంగల్:
పల్లెల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సంరంభం పీక్‌కు చేరింది. మొదటి విడత ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం తెరపడగా.. అభ్యర్థులకు ఒక్కరోజే సమయం మిగిలింది. దీంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు వారు పడరాని పాట్లు పడుతున్నారు. మంగళవారం రాత్రి నుంచే మద్యం, కానుకలు, నగదుతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. రెండో విడత ప్రచారానికి శుక్రవారం తెరపడనుండగా, ఆ పంచాయతీల్లోనూ పోరు తారస్థాయికి చేరింది. మూడో విడత గ్రామ పంచాయతీలకు నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియగా.. బరిలో ఉన్న అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించారు. పంచాయతీ ఎన్నికల సమరం పీక్‌కు చేరడంతో ప్రధాన పార్టీల నాయకత్వం రంగంలోకి దిగింది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.
మరో వారం హడావుడి
రాష్ట్ర ఎన్నికల సంఘం నవంబర్ 25న గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌లో ములుగు జిల్లాలోని మంగపేట మండలం మినహా.. 1,683 గ్రామ పంచాయతీలు, 14,776 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి విడత ఎన్నికలు గురువారం జరగనుండగా.. రెండో విడత 14, మూడో విడత ఎన్నికలు 17న నిర్వహించనున్నారు. కాగా, మొదటి విడత ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియగా.. గురువారం ఉమ్మడి జిల్లాలోని 555 పంచాయతీలకు ఏకగ్రీవాలను మినహాయించి 512 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి. 4,901 వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించారు. బుధవారం ఉదయం నుంచి పోలింగ్ అధికారులు, సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకుని పోలింగ్ సామగ్రితో కేంద్రాలకు తరలేలా ఏర్పాట్లు చేశారు. కాగా, హనుమకొండ జిల్లాలో మొదటి విడత భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపుర్ మండలాల్లోని 69 జీపీలు, 658 వార్డులకు ఎన్నికల ఏర్పాట్లు జరిగాయి. ఇందులో ఐదు గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, నాలుగు గ్రామాల వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. అవి మినహాయించి మిగతా చోట్ల ఎన్నికలు నిర్వహించనున్నారు.
రసవత్తరంగా రెండు, మూడు విడతలు..
మొదటి విడత ప్రచారం ముగియడంతో ప్రధాన పార్టీలు రెండు, మూడు విడతలపై దృష్టి సారించాయి. అధికార కాంగ్రెస్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు పల్లెల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, బీజేపీ నుంచి జిల్లా అధ్యక్షులు, నేతలు ఆయా పార్టీల అభ్యర్థుల కోసం శ్రమిస్తున్నారు. అవసరాన్ని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కోతీరుగా సీపీఐ, సీపీఎం, ఇతర పార్టీల మద్దతు తీసుకుంటున్నాయి. ఏకగ్రీవాలపైన దృష్టి సారించిన ప్రధాన పార్టీల నేతలు కొంత మేరకు సక్సెస్ అయ్యారు. ఒక్క ములుగు జిల్లాల్లోనే 25కు పైగా పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇదిలా ఉండగా ఎన్నికల షెడ్యూల్ ప్రకారం రెండో విడత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 564 గ్రామ పంచాయతీలు, 4,928 వార్డులు, మూడో విడత 564 గ్రామ పంచాయతీలు, 4,896 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ఇందులో రెండో విడతలో 38 జీపీలు 156 వరకు వార్డులు ఏకగ్రీవమైనట్లు అధికారవర్గాల సమాచారం. కాగా, మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ మంగళవారం ముగిసింది. గుర్తులు కేటాయించిన అధికారులు రాత్రి వరకు అధికారికంగా ఏకగ్రీవ పంచాయతీలు, వార్డుల సంఖ్య ప్రకటించలేదు. రెండు, మూడు విడతల్లో కూడా గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల నేతలు అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తున్నారు.
పోలింగ్ సామగ్రితో
నేడు పల్లెలకు అధికారులు
రెండో విడతకు శుక్రవారం
సాయంత్రం వరకే ప్రచారం
మూడో విడత ముగిసిన
‘ఉపసంహరణ’ .. గుర్తుల
కేటాయింపుతో ప్రచార హోరు
మొదటి విడత ప్రచారానికి తెర.. ప్రలోభాల ఎర
మొదటి విడత ప్రచారానికి తెర.. ప్రలోభాల ఎర


