ముగిసిన ఎన్నికల ప్రచారం
హన్మకొండ అర్బన్: జిల్లాలో గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ ముగియడానికి 44 గంటల ముందు నుంచి ఎన్నికలు జరిగే మండలాల్లో సైలెన్‌న్స్ పీరియడ్ అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ సమయంలో బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఏ విధమైన ప్రచారాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు, సంబంధిత గ్రామ పంచాయతీ పరిధిలో ఉండకూడదని పేర్కొన్నారు. సైలెన్‌న్స్ పీరియడ్‌లో ప్రజలు గుంపులుగా చేరరాదని సూచించారు. పోలింగ్‌కు ముందు, పోలింగ్ సమయంలో ఎన్నికల ఉల్లంఘనలు జరగకుండా అధికారులు పకడ్బందీగా పర్యవేక్షించాలని, ఏదైనా ఉల్లంఘన జరిగినట్లు గమనిస్తే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అన్ని విభాగాల నోడల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతిఒక్కరూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పాటించాలని కోరారు.
కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: జిల్లాలో ఈనెల 11న జరిగే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా ఎన్నికల పరిశీలకులు, ఇతర అధికారులతో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. హనుమకొండ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లోని 64 సర్పంచ్ స్థానాలు, వార్డు స్థానాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఎన్నికల సిబ్బందికి మూడో ర్యాండమైజేషన్ కూడా పూర్తి చేశామని పేర్కొన్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తయిందని, బుధవారం పోలింగ్ సామగ్రి పంపిణీ కోసం ఆయా మండలాల్లో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు శివకుమార్ నాయుడు, సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, డీపీఓ లక్ష్మీరమాకాంత్, ఎన్నికల వ్యయ పరిశీలకులు దేవేందర్, డీఆర్‌డీఓ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ రవి, ఎంసీసీ నోడల్ అధికారి ఆత్మారాయ్ పాల్గొన్నారు.


