పంట పొలాల సందర్శన
ఐనవోలు: తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వరంగల్ శాస్త్రవేత్తలు ఐనవోలు మండలంలోని పలు గ్రామాల్లో వివిధ పంటలను మంగళవారం సందర్శించారు. ఈసందర్భంగా కోఆర్డినేటర్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ.విజయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. యాసంగి మొక్కజొన్న తొలి దశలో ఆశించే కత్తెర పురుగు నివారణకు వేప నూనెను పిచికారీ చేయాలని సూచించారు. కంది పంట పూత, కాయ దశలో ఉందన్నారు. మారుక మచ్చల పురుగు, శనిగ పచ్చ పురుగు నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎకరానికి 4–6 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వరి కొయ్యలను కాల్చకుండా సింగిల్ సూపర్ పాస్ఫేట్ వేసి పొలంలోనే కలియదున్నాలన్నారు. వరినారులు డిసెంబర్ 20వ తేదీ లోపల వేసుకోవాలన్నారు. చిక్కుడు పంటలో రసం పీల్చే పురుగు, ఆకుమచ్చ తెగులు గుర్తించారు. రైతులు అన్ని పంటల్లో యాజమాన్య పద్ధతులను పాటించి పెట్టుబడి తగ్గించి దిగుబడులు పెంచుకోవాలని కోరారు. డాక్టర్ రాజ్‌కుమార్, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.


