నేటితో ప్రచారానికి తెర
ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు
సాక్షి, వరంగల్: పంచాయతీ ఎన్నికల తొలిదశ సంగ్రామం తుది అంకానికి చేరుకుంటోంది. ఈ నెల 11న ఎన్నికలు జరగనున్న వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల్లోని 80 పంచాయతీల్లో రాజకీయ నేతలు, అభ్యర్థుల ప్రచారం నేటి (మంగళవారం) సాయంత్రంతో మూగబోనుంది. ఇప్పటికే గ్రామాభివృద్ధికి ఏమేమి చేస్తామని హామీలు ఇచ్చిన అభ్యర్థులు, ఉదయం, రాత్రి వేళల్లో ఓటర్లను నేరుగా కలిసి తమకే ఓటు వేయాలని కోరుతున్నారు. కుల సంఘాలు, యువజన సంఘాలను కలుస్తూ వారికి కావాల్సిన సౌకర్యాలను సమకూరుస్తామంటూ హామీనిస్తున్నారు. కొందరైతే ఇప్పటికే వారి కమ్యూనిటీ హాల్స్‌కు అవసరమైన స్థలం కూడా కొనుగోలు చేసి ఇచ్చారన్న ప్రచారం ఉంది. ఇంకొందరు పల్లెలను ఇబ్బంది పెడుతున్న కోతుల నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్న హామీలు ఇస్తూ ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఊర్ల నుంచి పట్టణాలు, నగరాల్లో స్థిరపడిన వలస ఓటర్లకు ఫోన్‌కాల్స్ చేస్తూ ఎన్నికల రోజు తప్పకుండా ఊరుకు వచ్చి ఓటేయాలని, అందుకయ్యే ఖర్చులను భరిస్తామంటూ కాకా పడుతున్నారు. ఇలా తమ గెలుపునకు అవసరమయ్యే ప్రతీ విషయాన్ని చేజార్చుకోకుండా కష్టపడుతున్నారు. అయితే ఈ నెల 11న మొదటి విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లోని 80 గ్రామ పంచాయతీల్లో 214 మంది, 585 వార్డుల్లో 1,533 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నా రు. అదేరోజు ఎన్నికల ఫలితాలు తేలనున్నాయి.
ఊపందుకున్న రెండో దశ అభ్యర్థుల ప్రచారం
ఈ నెల 14న రెండో విడత ఎన్నికలు జరిగే దుగ్గొండి, నల్లబెల్లి, గీసుగొండ, సంగెం మండలాల్లో 111 గ్రామ పంచాయతీల్లో 360 మంది సర్పంచ్ అభ్యర్థులు, 906 వార్డులకు 2,142 మంది వార్డు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రచారాని కి ఈ నెల 12 వరకే సమయం ఉండడంతో తమకు కేటాయించిన గుర్తును గుర్తుంచుకోవాలంటూ ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. వాల్‌పోస్టర్లు అంటిస్తూ.. కరపత్రాలు ఇస్తున్నారు. మూడో విడత ఎన్నికలు జరిగే నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ, ఖానాపురం మండలాల్లో 109 పంచాయతీలకు 783 మంది సర్పంచ్ అభ్యర్థులు, 946 వార్డులకు 2,638 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశా రు. నేటితో (మంగళవారం) ఉపసంహరణ గడువు ముగియనుండడంతో చాలా చోట్ల అభ్యర్థులు రెబ ల్స్‌ను బుజ్జగించి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. నేడు గుర్తులు కేటాయించనుండడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని మొదలెట్టనున్నారు.
గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు
కొన్నిచోట్ల రెబల్స్ దూకుడుతో ప్రధాన పార్టీల్లో దడ
నేటి సాయంత్రం 6 గంటలతో ప్రచారం సమాప్తం
మొదటి విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
పల్లెల్లో పంచాయతీ రాజకీయం హీట్ పుట్టిస్తుండగా...సర్పంచ్, వార్డు అభ్యర్థులకు మాత్రం చలి వణికిస్తోంది. ఉదయం 8గంటల వరకు పొగమంచుతో పల్లెల్లో చల్లటి వాతావరణంతో ఓటర్లతో ముఖాముఖి ప్రచారానికి ఇబ్బందులు ఎదురువుతున్నా.. ఎన్నికలకు సమయం మించిపోతుండడంతో వణికించే చలిలోనూ ప్రసన్నం చేసుకుంటున్నారు. సాయంత్రం 5.30 గంటలకే సూర్యుడు అస్తమిస్తుండడంతో ఓటర్లను కలుసుకునేందుకు అవకాశమున్న అభ్యర్థుల చుట్టూ ఉండే మందీమార్బలం చలికి మందు కావాలంటూ అడుగుతుండడంతో అంచనాలకు మించిన ఆర్థికభారం పడుతోంది. అయినా అభ్యర్థులు వెనక్కి తగ్గకుండా తమవారికి కావాల్సిందల్లా సమకూరుస్తూ ప్రచారం హీటెక్కిస్తున్నారు. ఇలా ఓవైపు వణికిస్తున్న చలి.. ఇంకోవైపు దగ్గరపడుతున్న ఎన్నికలతో అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు. సోమవారం చెన్నారావుపేట మండలంలో 11.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, మిగిలిన మండలాల్లోనూ 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగం చెబుతోంది. ఈ నెల 11, 14, 17వ తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.


