సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం
వరంగల్: ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా పరిశీలకురాలు బాలమాయదేవి, కలెక్టర్ సత్యశారదలు అన్నారు. జీపీ ఎన్నికల్లో భాగంగా సోమవారం వరంగల్ డీఆర్డీఓ సమావేశ మందిరంలో సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూక్ష్మ పరిశీలకుల ద్వారానే ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తారన్నారు. ఓట్ల లెక్కింపు, ఉపసర్పంచ్ ఎన్నిక తదితర అంశాలను ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం జరిగేలా చూడాలన్నారు. జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. మూడు దశల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ విధులను నిర్వర్తించి నివేదికలను సకాలంలో అందజేయాలన్నారు.
ఈవీఎం గోదాముల పరిశీలన
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని జిల్లా వేర్ హౌస్ గోదాంలో భద్రపర్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎంల) కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనవు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి సోమవారం తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతీ మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపర్చిన ఈవీఎంలను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించడం జరిగిందన్నారు. రికార్డులు, భద్రత చర్యలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో తహసీల్దార్ శ్రీకాంత్, ఎన్నికల నాయబ్ తహసీల్దార్ రంజిత్, వివిధ పార్టీల ప్రతినిధులు శ్యాం, బాకం హరిశంకర్, రజనీకాంత్, ఫైజోద్దిన్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పరిశీలకురాలు బాలమాయదేవి
ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి
న్యూశాయంపేట: జీపీ ఎన్నికల పోలింగ్ సిబ్బంది కేటాయింపులో మొదటి, రెండో విడతకు ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు బాల మాయాదేవి, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సత్యశారదల సమక్షంలో సోమవారం నిర్వహించారు. కలెక్టర్ చాంబర్‌లో ఎన్నికల సంఘం నియమావళి అనుసరించి ఎన్నికల పీఓ, ఓపీఓల ర్యాండమైజేషన్ జరిగింది. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, డీఈఓ రంగయ్యనాయుడు, ఆర్‌డబ్లుఎస్ అధికారి నిర్మల తదితరులు పాల్గొన్నారు.
11, 14, 17 తేదీల్లో స్థానిక సెలవు
జిల్లాలో ఈనెల 11, 14, 17వ తేదీల్లో ఎన్నికలకు నోటిఫై చేయబడిన ప్రాంతాల్లో ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాల కోసం స్థానిక సెలవులు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఈ మేలకు సోమవారం ఆయా తేదీల్లో స్థానిక సెలవుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ జరిగే ప్రదేశాల్లో ప్రభుత్వ, ఉద్యోగులకు సాధారణ సెలవు, ప్రైవేట్ ఉద్యోగులకు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవుగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఓటర్లు తమ ఓటుహక్కును తప్పకుండా వినియోగించుకోవాలన్నారు.
సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం


