
60 ఏళ్లు దాటిన మహిళలతో సంఘాలు
గీసుకొండ: స్వయం సహాయక సంఘాల్లో (ఎస్‌హెచ్‌జీ) 60 ఏళ్ల పైబడిన మహిళలు ఉంటే వారితో ప్రత్యేకంగా సంఘాలు ఏర్పాటు చేయిస్తామని గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ప్) అదనపు సీఈఓ పి.కాత్యాయనీదేవి అన్నారు. ఎలుకుర్తి హవేలిలో మంగళవారం ఏర్పాటు చేసిన మహిళా సంఘాల సమావేశంలో ఆమె మాట్లాడారు. 60 ఏళ్లు దాటిన మహిళలకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం సభ్యురాలు లలిత ఆమె దృష్టికి తీసుకొచ్చారు. అలాంటి వారిని సంఘంగా ఏర్పాటు చేసి రుణాలు అందేలా చూస్తానని కాత్యాయనీదేవి హామీ ఇచ్చారు. సంఘంలో చదువురాని వారు, మధ్యలో చదువు మానేసిన వారు పదో తరగతి పాసయ్యేందుకు ఉల్లాస్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఐబీ డైరెక్టర్ నవీన్, పీఎం రవీంద్రరావు, కరుణాకర్, డీఆర్‌డీఓ కౌసల్యాదేవి, అదనపు డీఆర్‌డీఓ ఓ.రేణుకాదేవి, డీపీఎం దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
సెర్ప్ అదనపు సీఈఓ కాత్యాయనీదేవి