
మాటల మంటలు!
సాక్షి, వరంగల్: మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాటలు అధికార పార్టీ కాంగ్రెస్‌లో కల్లోలం రేపుతున్నాయి. విపక్షాలైన బీఆర్‌ఎస్, బీజేపీకి కూడా అస్త్రశస్త్రాలు దొరకడంతో రాజకీయం రసకందాయంగా మారింది. ఓవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలే ‘కొండ’పై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా పోటీచేసిన కొండా సురేఖ ఎన్నికల్లో రూ.70 కోట్లు ఖర్చు చేశారని స్వయంగా ఆమె భర్త కొండా మురళి బహిరంగంగా ప్రకటించారు.. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని ఆమె శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మరోవైపు బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా చెలామణి అవుతున్న కొండా మురళి మాటలతో అందరికీ కార్నర్ అయ్యారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్నిరోజుల క్రితం ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరిపై పరోక్షంగా ఘాటైన పదజాలాన్ని ఉపయోగించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.. ఇప్పుడు ఓరుగల్లు రాజకీయాల్లో ఎర్రబెల్లి కుటుంబంలో పుట్టినవారు ఎర్రబల్లులేనని విమర్శించడంతో మాటల మంటలకు ఆజ్యం పోసినట్లయ్యింది. దీనికి బదులుగా కొండా మురళిని పిచ్చాస్పత్రిలో చేర్పించాలన్న బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు.. నాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, నేడు రేవంత్‌రెడ్డి సహకారంతో పదవులు పొందింది నిజం కాదా అని ప్రశ్నించారు. బీసీలు, సొంత పార్టీ నేతలు, వరంగల్ తూర్పు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఇలా కొన్నిరోజుల నుంచే వరంగల్ రాజకీయం అంతా కొండా చుట్టూనే తిరుగుతుండడం గమనార్హం. ఇంకోవైపు పరకాల ఎమ్మెల్యేగా కొండా సుష్మితాపటేల్ పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలోనే రెండు గ్రూపులవడం, సొంత పార్టీకే పెద్ద తలనొప్పిగా మారిందనే అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
స్వపక్షంతోపాటు బీఆర్‌ఎస్, బీజేపీకి కార్నరైన కొండా మురళి వ్యాఖ్యలు
మాజీ ఎమ్మెల్సీ తీరుతో
కాంగ్రెస్ కేడర్‌లో అయోమయం
ముఖ్యంగా పరకాల నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు
స్థానిక ఎన్నికల ముందు హస్తం
పార్టీకి పెద్ద తలనొప్పి
కాంగ్రెస్ నిర్ణయం ఎలా ఉంటుందో..?
స్థానిక ఎన్నికలకు అన్ని విధాలుగా సిద్ధమవుతున్న కాంగ్రెస్ స్థానిక ఎన్నికలకు అన్ని విధాలుగా సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీకి వరంగల్‌లోని రాజకీయం మాత్రం చికాకుపరుస్తోంది. ఇప్పటికే రైతు భరోసా నిధులు విడుదల చేసి గ్రామాల్లో రైతులనుంచి మద్దతు కూడగట్టుకుంటామనుకుంటున్న కాంగ్రెస్‌కు మాత్రం ఇక్కడి ముఖ్య ప్రజాప్రతినిధుల మధ్య వైరుధ్యం తలనొప్పిగా మారిందనే టాక్ ఉంది. అందుకే నష్టనివారణ చర్యల్లో భాగంగా ఇరువైపుల నుంచి వివరణ తీసుకుందని, అయితే ఏ నిర్ణయం ఉంటుందో చూడాలని కిందిస్థాయి కార్యకర్తలు అంటున్నారు. ముఖ్యనేతల మధ్య ఇలానే వైరుధ్యం కొనసాగితే పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం లేకపోలేదన్న చర్చ కూడా నడుస్తోంది. కిందిస్థాయి కేడర్‌లో మాత్రం అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకుండా కాంగ్రెస్ పార్టీలో ఇదేం రాజకీయమని మదనపడుతున్నారు. కొండా ఎపిసోడ్ సీరియల్‌గా నడుస్తుండడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కార్యకర్తల్లో నెలకొంది. సాధ్యమైనంత తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప దీనికి చెక్‌పడేలా కనిపించడం లేదు.