
కోట్లు గుల్ల
నాణ్యత డొల్ల..
● ‘గ్రేటర్’లో ఇష్టారాజ్యంగా రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం
● పనుల్లో నాణ్యతకు తిలోదకాలు.. ప్రజాధనం దుర్వినియోగం
● ముసురుకే రోడ్లన్నీ గుంతలమయం...
● మహా నగరవాసులకు తప్పని తిప్పలు
సాక్షిప్రతినిధి, వరంగల్ :
వరంగల్ నగరంలో నిర్మించిన రోడ్లు, డ్రెయినేజీలు మూడ్రోజుల ముచ్చటగా మారుతున్నాయి. స్మార్ట్ సిటీ, అమృత్, మున్సిపల్ నిధులతో చేపట్టిన పనుల్లో నాణ్యత లోపించి ధ్వంసమవుతున్నాయి. ఇటీవల కురిసిన తేలికపాటి చినుకులకే వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీలోని రోడ్లు, డ్రెయినేజీలు నోళ్లు తెరిచి ఉన్నాయి. దీంతో కిందకు ప్రవహించే నీరు లోతట్టు కాలనీలకు చేరి కుంటను తలపిస్తున్నాయి. దీంతో కాలనీలకు అనుసంధానమైన రోడ్లన్నీ గుంతలమయమై నగరవాసులకు నరకప్రాయంగా మారాయి. అలాగే మురుగు, చెత్త నగరవాసులకు ఆందోళన కలిగిస్తున్నాయి.
కాంట్రాక్టర్ల సిండికేట్, అధికారుల వత్తాసు..
గ్రేటర్ వరంగల్‌లో పనులు దక్కించుకున్న కొందరు కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ అధికారులు వత్తాసు పలుకుతుండటంతో రూ.కోట్లు ఖర్చు చేసిన పనులు కొద్దిరోజుల్లోనే దెబ్బతింటున్నాయనే ఆరోపణలున్నాయి. 2015 నుంచి మున్సిపల్ కార్పొరేషన్‌లో పాతుకుపోయిన కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు నిర్వహిస్తున్నారు. 2015–2018 సంవత్సరాల్లో సాగిన కుమ్మక్కు, మాముళ్ల వ్యవహారం అప్పట్లో పెద్ద దుమారం లేపాయి.. ఐదారు నెలల క్రితం కీలక ప్రజాప్రతినిధి కనుసన్నల్లో కాంట్రాక్టర్లు మళ్లీ జట్టుకట్టి పనులు చేస్తున్నారు. ఏడాదిలో వివిధ పద్దుల (స్మార్ట్ సిటీ నిధులు కాకుండా) కింద సుమారు రూ.195 కోట్లతో నగరంలో అంతర్గత రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించారు. ఈ పనులను కొద్ది మంది కాంట్రాక్టర్లు కీలక ప్రజాప్రతినిధుల ఆదేశం, ఇంజనీరింగ్ అధికారుల మద్దతుతో పూర్తి చేశారు. ట్రైసీటిలో చేసిన పనుల్లో చాలాచోట్ల దెబ్బతినడం. తరచూ కాలనీ వాసులు ప్రజావాణిల్లో ఫిర్యాదు చేస్తుండటం వివాదస్పదంగా మారింది. తాజాగా జీడబ్ల్యూఎంసీ కీలక ప్రజాప్రతినిధి అండదండలతో బడా కాంట్రాక్టర్లు రూ.187.24 కోట్ల పనులపై కన్నేసి సిండికేట్ దక్కించుకుంది. కాగా ప్రజాప్రతినిధులు, అధికారుల మద్దతు.. ఎక్సెస్ టెండర్లు, నాసిరకం పనులతో కొందరు కాంట్రాక్టర్లు భారీగా దండుకోగా, కొద్ది రోజులకే దెబ్బతిన్న రోడ్లు, డ్రెయినేజీల ప్రభావం నగరవాసులపై పడుతోంది.
వాళ్లకు పర్సంటేజీలు..
ఇంజనీరింగ్ డీబీ సెక్షన్‌కు 0.25 శాతం, స్థానిక కార్పొరేటర్‌కు 4, ఆపై ప్రజాప్రతినిధికి 4, ఏఈకి 4, డీఈకి 3, ఈఈకి 2, ఎస్‌ఈకి 1 శాతం, అడిట్ విభాగం, అకౌంట్స్‌కు తలా 0.50 శాతం.. ఇలా పర్సంటేజీలు చెల్లించాల్సి వస్తోందని గ్రేటర్ పరిధిలో చేపట్టే రోడ్లు, డ్రెయినేజీ తదితర నిర్మాణం పనులు చేసే కాంట్రాక్టర్లు బహిరంగంగా చెబుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే కాంట్రాక్టర్లు రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాల్లో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారన్న చర్చ జరగుతోంది. మట్టి, కంకర రోడ్లు వేశాకా.. తారు వేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను విస్మరించి ఒక్కోచోట మట్టిపై నుంచి కంకర పరిచిన సంఘటనలు ఉన్నాయి. దీంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు రోడ్డుకు రెండు వైపులా ఎక్కడికక్కడ కోతకు గురై రోడ్లకు గండ్లు పడ్డాయి. ఇక సీసీ రోడ్డు నిర్మాణాలైతే అధ్వానంగా మారాయి. గతంలో ఉన్న తారురోడ్డుపైనే సీసీ రోడ్డును వేశారు. మురికి కాల్వలు నిర్మించాల్సి ఉండగా, అవి లేకుండానే సీసీరోడ్డు వేయగా బురద, మురుగు నీరు రోడ్లపైకి, కాలనీల్లోకి చేరుతోందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పై ఫొటో గ్రేటర్ వరంగల్‌లోని రహమత్‌నగర్‌లో గల సీసీ రోడ్డుది. ఈ రోడ్డు పనులు చేస్తున్నప్పుడే నాణ్యత లోపించిందంటూ సంబంధిత కాలనీలకు చెందిన కొందరు ప్రజావాణిలో ఫిర్యాదులు చేశారు. ఈ రోడ్డుతో పాటు ఐదు కాలనీల్లో పనులు పూర్తి చేసిన కొద్ది రోజులకే సీసీ రోడ్డు కూలిపోయింది.

కోట్లు గుల్ల