
చైల్డ్ ట్రాఫికింగ్‌పై కఠిన చర్యలు
వరంగల్ క్రైం : చైల్డ్ ట్రాఫికింగ్, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు వివిధ శాఖలతో కలిసి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో చైల్డ్ ట్రాఫికింగ్‌పై అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్‌ను సీపీ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చైల్డ్ ట్రాఫికింగ్ అనేది సమాజాన్ని గాయపరిచే తీవ్రమైన నేరమని, ఇది అమాయక పిల్లల జీవితాలను నాశనం చేస్తుందని వివరించారు. సాధారణంగా పేద పిల్లలను లక్ష్యంగా చేసుకొని ఉద్యోగాలు, చదువు, మంచి జీవితం అనే మాయ మాటలతో నిందితులు మోసగిస్తున్నారన్నారు. తల్లిదండ్రులు పిల్లలను బాలకార్మికులుగా మారకుండా చూడాలని, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా, నాణ్యమైన విద్యను అందిస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాలలకు ఆపద వస్తే డయల్ 100 లేదా సమీప పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ రవికుమార్, యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ విభాగం ఇన్‌స్పెక్టర్ జి.శ్యామ్‌కుమార్, వరంగల్ జిల్లా చైల్డ్ రైట్స్ అడ్వయిజరీ ఫోరం కన్వీనర్ మండల పరశురాములు, ఎఫ్‌ఎంఎం సోషల్ సర్వీస్ సొసైటీ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు బత్తుల కరుణ, ఎర్ర శ్రీకాంత్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మాజీ సభ్యురాలు మంజులతో పాటు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్