
దేవాలయ భూములను స్వాధీనం చేసుకుంటాం
ఎల్కతుర్తి: అన్యాక్రాంతమైన దేవాలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు దేవాదాయ, ధర్మాదాయ శాఖ వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, దేవాదాయ, ధర్మాదాయ శాఖ జేవీఓ (జువెల్లరీ వెరిఫికేషన్ ఆఫీసర్) అంజనాదేవి తెలిపారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయాన్ని వారు శుక్రవారం సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 1,062 దేవాలయాలుండగా, వాటిలో 46 దేవాలయాల నుంచి ఆదాయం సమకూరుతున్నట్లు వెల్లడించారు. 458 దేవాలయాలకు దీపధూప నైవేద్యం వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా 252 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని భూముల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. ప్రయోగాత్మకంగా మహబూబాబాద్ జిల్లాలోని అగస్తీశ్వర ఆలయ భూముల్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ పరిశీలకులు అనిల్‌కుమార్, ఈఓలు లలిత కుమారి, సులోచన, వెంకన్న, మారుతి, కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
దేవాదాయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత