
గుంతలతో గుబులు
కార్పొరేషన్, మున్సిపాలిటీల్లోని
అంతర్గత రహదారులు అధ్వానం
● వర్షపు నీరు నిండి ప్రమాదాలపాలవుతున్న వాహనదారులు
● బురదమయంగా మారడంతో పాదచారులకు ఇబ్బందులే
● అధికారులు మరమ్మతులు చేయాలని కోరుతున్న ప్రజలు
సాక్షి, వరంగల్/నర్సంపేట: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లోని అంతర్గత రహదారులు గుంతలుగా మారి ప్రజలను భయపెడుతున్నాయి. వర్షం వచ్చిందంటే చాలు ఆ గుంతల్లో నీరు నిలుస్తోంది. దీంతో అటువైపు వెళ్లే వాహనదారులు అదుపుతప్పి కిందపడి గాయాలపాలవుతున్న సందర్భాలున్నాయి. కొన్ని వార్డుల్లో అసలు సీసీ రోడ్లు లేవు. అంతా బురదమయంగా మారి ఇళ్లకు వెళ్లేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ప్రధాన రహదారులపై కూడా గుంతలు ఏర్పడడంతో వాహనాలు మరమ్మతులకు గురవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆయా ప్రాంతాల్లోని రహదారుల పరిస్థితిని ‘సాక్షి’ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించిది. బాగు చేయండి మహా ప్రభో అంటూ స్థానికులు కోరారు. సంబంధిత అధికారులు కూడా ఈ రోడ్ల పరిస్థితిపై అధ్యయనం చేసి మరమ్మతులు చేయాలని అభ్యర్థించారు. ఇప్పటికే రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ అంతర్గత రోడ్లలో చాలావరకు నాణ్యత లేమితో కంకరతేలాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గుంతలమయమైన రహదారులను మరమ్మతు చేయాలని వాహనదారులు, బాటసారులు కోరుతున్నారు.

గుంతలతో గుబులు