వనపర్తి: ప్రజావాణి ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించి సమాచారాన్ని అర్జీదారుడికి పంపించడమే కాకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జరిగిన జిల్లాస్థాయి ప్రజావాణికి ఆయనతో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, జిల్లా రెవెన్యూ అధికారి సూర్యప్రకాష్, జెడ్పీ సీఈఓ యాదయ్య హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిర్యాదుకు సంబంధించిన అంశం తమశాఖ పరిధిలో లేకుంటే సంబంధిత శాఖకు లేఖ రాస్తూ పంపించాలని సూచించారు. పరిష్కరించలేని అర్జీ ఉంటే ఉన్నతాధికారులకు పంపించడం లేదా ఏ నిబంధన ప్రకారం పరిష్కారం కాదో ఫిర్యాదుదారుకి తెలియజేయాలని, పెండింగ్‌లో ఉంచవచ్చన్నారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన అర్జీలు సైతం వెంటనే పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 77 వినతులు వచ్చినట్టు కార్యాలయ సిబ్బంది తెలిపారు. అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 5 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అన్నిశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఎస్పీ ప్రజావాణికి 25 వినతులు..
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 25 వినతులు వచ్చాయి. ఎస్పీ సునీతారెడ్డి ఫిర్యాదుదారులతో అర్జీలు స్వీకరించి వారితో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును ఎస్పీ స్వయంగా పరిశీలించి సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారితో మాట్లాడి తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.


