విజయనగరం ఫోర్ట్: అంగనవాడీ కేంద్రాలకు సకాలంలో పాలు చేరకపోవడం వల్ల పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఇబ్బందిపడుతున్నారనే అంశంపై ‘అంగన్‌వాడీలకు చేరని పాలు’ అనే శీర్షికన ఈ నెల 12వ తేదీన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఐసీడీఎస్ అధికారులు స్పందించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు పాలు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు.
చెరువుల అభివద్ధికి చర్యలు
● డ్వామా పీడీ శారదాదేవి
గజపతినగరం రూరల్: జిల్లాలో చెరువుల అభివద్ధికి చర్యలు చేపడుతున్నట్టు డ్వామా పీడీ పి.శారదాదేవి తెలిపారు. మండలంలోని పిడిశిల గ్రామంలోని సింగరాయ చెరువును ఆమె గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జలధార, జలహారతి కార్యక్రమంలో భాగంగా చెరువుల అభివద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. చెరువుల్లో ఏ రకమైన పనులు చేయించాలి, గుర్తించిన పనులను ఏ విధంగా చేయాలి అనే అంశాలపై సమగ్ర ప్రణాళిక తయారుచేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బి.కళ్యాణి, ఏపీఓ కృష్ణవేణి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
రక్తం ఉచితంగా అందించాలి
విజయనగరం ఫోర్ట్: సికిల్‌సెల్ ఎనీమియా రోగులకు ఉచితంగా రక్తం అందించాలని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ కె.రాణి వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం సికిల్‌సెల్ ఎనీమియాపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సికిల్ సెల్ ఎనీమియా రోగులకు తరచూ రక్తం తగ్గిపోతూ ఉంటుందన్నారు. రక్తం తగ్గినప్పుడల్లా రక్తం ఎక్కించాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు అనిల్, విక్రాంత్ వర్మ, తదితరులు పాల్గొన్నారు.
హత్యాయత్నం కేసులో వ్యక్తి అరెస్టు
బొబ్బిలి: మండలంలోని మెట్టవలస మాజీసర్పంచ్ పువ్వల మాధవరావుపై హత్యాయత్నం చేసిన వ్యక్తిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ కె.నారాయణరావు తెలిపారు. బొబ్బిలి సర్కిల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. వచ్చేనెల 3 నుంచి మెట్టవలస గ్రామ దేవత పండగ నిర్వహణపై ఈనెల 10న గ్రామస్తులంతా సమావేశమయ్యారు. చందాల రూపంలో వచ్చే ప్రతీపైసాకు లెక్క చెప్పాలని గ్రామానికి చెందిన ఇజ్జాడ అప్పారావు కోరాడు. దీనికి గ్రామ పెద్దలు ఆంగీకారం తెలిపారు. ఇదే విషయంపై అప్పారావు పలురకాలుగా మాట్లాడుతూ ఈ నెల 14న స్థానిక బస్టాండ్‌లో గ్రామస్తులతో పాటు కూర్చొని ఉన్న మాధవరావుపై తనవెంట తెచ్చుకున్న గొడ్డలితో దాడిచేశాడు. ఆ సమయంలో మాధవరావు పక్కనే కూర్చున్న రౌతు రామకృష్ణ అడ్డుకోవడంతో అతని కాలికి గాయమైంది. ఎప్పటికై నా మాధవరావును చంపేస్తానని బెదించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిందితుడు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు బొబ్బిలి రైల్వేస్టేషన్‌లో ఉన్న సమయంలో గురువారం సాయంత్రం ఏఎస్సై డి.కొండలరావు తన సిబ్బందితో కలిసి పట్టుకుని అరెస్టు చేశారని సీఐ తెలిపారు.


